Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 22


    "ఇంతకీ దానితో ఎలా వేగుతున్నారండీ శ్రీశ్రీగారూ!" అని అన్నయ్య అడిగేరు.
    "వేగాడానికేముంది! హడావుడి దానయినా అనుకున్న పని సాధిస్తేనే కానీ వూరుకోదు. నాకే పట్టుదల అనుకుంటే అక్కడ రెండు పల్లు ఎక్కువే వున్నాయి. నేనే మొండిననుకుంటే ఈవిడ జగమొండిలాగుంది.
    మొన్న మైసూరులో.....మైసూరు దాకా ఎందుకు, ఇక్కడే 'మధురై వీరన్' స్క్రిప్ట్ రాత్రీ పగలూ తిండీ తిప్పలూ మానేసి ఎవర్ని ఉద్దరించడానికో పూర్తి చేసింది. ఆ స్పీచే కాస్త తగ్గించమంటే వినదు" - అని శ్రీశ్రీ గారనగానే -
    "అదిగో, అక్కడే అన్నయ్యా! నాకు చెర్రెక్కేది. ఒప్పుకున్నా తర్వాతః మన పని మనం చెయ్యాలా, వద్దా? ఏవేవో మాట్లాడతారు కానీ అసలు పని చెయ్యరు" - అన్నాను.
    "మీ ఇద్దరి పేచీ బాగానే వుంది. శ్రీశ్రీగారూ! మిమ్మల్నిక నిద్రపోనివ్వదు. పంయ్యేదాకా కాల్చుకు తింటుంది. మీకు తగిన అసిస్టెంట్ దొరికింది." అంటూ నన్ను చూసి -
    "సరోజా! శ్రీశ్రీ గారిని మరీ నసపెట్టకు. నీ భయం కానీ, తలచుకుంటే నిముషాలలో రాసి పారేస్తారు. అంచేత ఆయన మాటని అనుసరించుకుని పోవడం ఉభయులకీ శ్రేయస్కరం" - అన్నారు చలపతిరావుగారు.
    "ఏమైనా అనండయ్యా! ఆయన చెప్పినట్టు వింటాను కానీ, పని విషయంలో మాత్రం నేను చెప్పినట్టు ఆయన వింటే....ఛాలెంజ్ చేస్తాను. మాకెన్ని పిక్చర్లు వస్తాయో చూడండి. రికార్డ్ బ్రేక్ చేస్తాం.
    వెనకాల నుండి పొడుస్తూ వుంటే కానీ ఏ పనీ చేసేటట్టు లేరు. అదీ వీరి సంగతి" - అన్నాను.
    శ్రీశ్రీగారు నా కళ్ళలోకి అదోలా చూశారు.
    "సరే నాకు ఆకలౌతోంది. నే వెళ్ళి భోంచేస్తా"నని కిందికి వచ్చేశాను.
    "చాలా తెలివైన అమ్మాయండీ, సిన్సియార్టీ ఎక్కువ. పనయ్యేదాకా తను నిద్రపోదు సదికదా, మన ప్రాణాలు కూడా తీసేస్తుంది. ఐ లైక్ హర్" - అని శ్రీశ్రీ గారు తనతో అన్నారని అన్నయ్య నాతో చెప్పారు.
    "ఇక మీరొక అడ్రస్సుతో పాటు స్థిరపడతారు. సరోజకి కొంచెం దూకుడుతనం ఎక్కువ. భయానికి అర్ధం తెలీదు. కానీ మిమ్మల్నొక దారికి తేవడానికి మా సరోజ ఒక్కర్తే సమర్దురాలు.
    రండికీ మొండికీ ఓర్చుకొనే స్వభావం ఆమెది. మరి మీ ఇద్దరి పోట్లాట చూస్తే, ఎంతవరకూ నిలుస్తారో చెప్పలేం గానీ, నిలిస్తే మాత్రం ఉభయులకీ మంచి రోజులే" - అని శ్రీశ్రీగారితో అన్నానని కూడా నాతో చెప్పారు. తరువాత చలపతిరావుగారు చాలా బోధపరచారు. "శ్రీశ్రీగారు సినిమా కవి అనుకోకు. ఆయన చాలా గొప్పవారు. తాగుడికి లొంగినమాట నిజమే అయినా, ఆయన్ని అదుపులో పెట్టే వాళ్ళు లేకపోవడం వల్ల అలా తిరుగుతున్నారు."
    అయితే 'శ్రీశ్రీ గారికి భార్యా పిల్లలు లేరా' అని అడగాలనిపించలేదు. 'లేకేం భార్య ఉండే వుంటుంది. ఏదో ఒకనాడు తెలీకుండా పోతుందా?' - అనుకున్నాను.
    
                       *    *    *
    
                              శ్రీశ్రీ బృందావన యాత్ర
    
    "శ్రీశ్రీ గారు చాలా ఇబ్బందుల్లో వున్నారు. కీర్తికి ఏ మాత్రం లోటులేదు. అది ఏనాడో సంపాదించేశారు. కానీ ఆర్ధికంగానే బాగా ఇబ్బందులు పడుతున్నా"రని కూడా చలపతిరావుగారు చెప్పారు.
    "ఇక చూడండన్నయ్యా? నేను వచ్చాను కదా శ్రీశ్రీగారు ఎంత ధనవంతులౌతారో చూడండి. నేను ఎక్కడ అడుగుపెడితే అక్కడ అదృష్టమేకానీ దురదృష్టం వుండదు....." అంటూ  గలగలా నోటికొచ్చింది వాగేశాను. అందరూ భోజనాలు చేశాక చలపతిరవుగారు కార్లో ఇళ్ళకి దిగబెట్టారు.
    మర్నాడు ఆఫీసులో రాయాలని కూర్చున్నాం.
    ఇంతలో - చమ్రియావాళ్ళు బాయ్ చేతికిచ్చి టెలిగ్రాం పంపారు.
    వెంటనే బయలుదేరి రమ్మని, కారణాంతరాలవల్ల తను రాలేకపోయానని శంకర్ సింగ్ గారిచ్చిన టెలిగ్రాం అది.
    శ్రీశ్రీగారు చూడగానే ఏమనుకున్నారో తెలీదుకానీ "వెరీ గుడ్" అన్నారు.
    పిళ్ళైగారిని పిలిచి "మేం వెంటనే మైసూరు వెళ్ళాలి. ఈ రోజే వెళతాం. పదిహేను రోజులవరకూ రాలేం. వచ్చేటప్పుడు మీ పిక్చర్ మాటలు, పాటలతో సహా వస్తాం. మాకు తమిళ వెర్షన్ మాటలు, రికార్డులు మాత్రం ఇచ్చేయం"డని చెప్పి, మూడు టిక్కెట్లు రిజర్వ్ చేయించమని కూడా చెప్పారు.
    "మీరు పాటలు చెక్ చేసుకోరా?" అని ప్రొడ్యూసర్ అడిగారు.
    "మాటలు, పాటలు రెండూ కూడా చెక్ చెయ్యాలి. వచ్చిన తరువాత రెండు రోజుల పని, డోంట్ వర్రీ -"అన్నారు శ్రీశ్రీగారు.
    పిళ్ళైగారు రెండోమాట అనడమే! "ఓకే సార్! మీ యిష్టం" అని ఊరుకున్నారు.
    త్రిమూర్తుల గ్రూపు - అమ్మా నేను, మహాకవిగారు - అనుకున్న ప్రకారం ఆ రోజే మైసూరుకి బయలుదేరిపోయాం.
    శంకర్ సింగ్ గారొచ్చి, "పాటలు రడీగా వున్నాయి. మాటలు కూడా త్వరగా పూర్తిచెయ్యండి. బృందావన్ గార్డెన్స్ లో రూం బుక్ చేశా"నని చెప్పి మమ్మల్ని అక్కడికి పంపించేశారు.
    బృందావన్ గార్డెన్స్ అంటే నాకెంత ఇష్టమో చెప్పడానికి లేదు. 1956లో బృందావన్ గార్డెన్స్ చూసే అంత మురిసిపోయానన్నమాట.
    ఒక పూటంతా ఏ పనీ చెయ్యకుండా గార్డెన్ అంతా తిరిగి సరదా తీర్చుకున్నాను.
    "అయిందా నీ బృందావన యాత్ర! స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేద్దామా?" అన్నారాయన.
    "రాద్దామా అని మీరా అడుగుతున్నారు?" అన్నా నవ్వుతూ.
    ఆయన అడగదలుచుకున్నది అడిగేస్తారు కానీ, మనం అన్న దానికి రిప్లయ్ ఇవ్వరు. భోజనాలయ్యాయి. గార్డెన్ లోకి వచ్చి లైట్ కింద పచ్చగడ్డి మీద కూర్చున్నాం.
    రాత ప్ర్రారంభించాం. తొమ్మిది గంటలదాకా వారు చెప్పడం, నేను రాయడం.
    నాకు సరిగ్గా రాతమీద బుద్దిపోవడం లేదు.
    మొట్టమొదటిసారి బృందావన్ గార్డెన్స్ లో అడుగుపెట్టాను. రాత్రి లైట్ల దగ్గర కూర్చున్నాను. ప్రకృతి సౌందర్యాన్ని తిలకించి అనుభవించటంతోనే నాకు టైం సరిపోయింది కానీ పని మీద ఎక్కువ శ్రద్ద చూపలేక పోయాను.
    అది గ్రహించేకాబోలు వారు కూడా నన్నేమీ అనలేదు.
    ఇలాగైతే లాభం లేదనుకున్నాను. మరుసటి రోజునుండి పగలంతా హోటల్లో మా రూముకి బయట వరండాలో రౌండ్ టేబులూ, కుర్చీలూ వేయించేదాన్ని.
    ఉదయం తొమ్మిది గంటలనుండి ఒంటిగంట వరకూ, మధ్యాహ్నం మూడు గంటలనుండి ఎనిమిది గంటల వరకూ కూర్చొని కన్నడం పిక్చర్ డైలాగ్స్ అన్నీ తెలుగులో రాసేశాం.
    ఒకటిన్నర రోజులో 'గంధర్వకన్య' తెలుగు పిక్చర్ మాటలు రెడీ!
    ఇద్దరం ఒకరి ముఖాలొకరు చూసుకున్నాం. కానీ పిక్చర్ పూర్తి చేశామన్న భావం మాత్రం ఎవ్వరం బైటకి రానివ్వలేదు.
    "రేపట్నుండి రెండో పిక్చర్ డైలాగ్స్ కూడా చూద్దామా" - అని శ్రీశ్రీ గారు అడగ్గానే.
    "ఓకే సార్!" అన్నాను.
    "అదిగో - 'సార్' అనవద్దని ఎన్నిసార్లు చెప్పాను?".
    'సార్' అని పిలిస్తే వారికేందుకింత కోపం! - అనుకున్నాను.
    "ఈరోజు పని అయిపోయింది కదా అలా గార్డెన్లోకి వెళ్ళి వస్తామండి" - అన్నాను.
    "పదండి - నేనూ వస్తాను" అన్నారాయన.
    వెంటనే స్క్రిప్ట్ కాగితాలన్నీ రూములో పడేసి తాళాలు వేసుకొని వెళ్ళాం.
    ఓ రౌండ్ తిరిగొచ్చి, కోడిగుడ్డు ఆకారపు ఆకుపచ్చని చెట్టుకింద, పచ్చ గడ్డి మీద కూర్చున్నాం.
    శ్రీశ్రీగారు రెండు చేతులూ తలక్రింద పెట్టుకుని తిన్నగా పడుకొని ఆకాశంలోకి చూస్తున్నారు.
    నేను, మా అమ్మా కాస్త దూరంగా కూర్చుని మాట్లాడుకుంటున్నాం.
    "సరోజా!" అని పిలిచి.
    "నువ్వెంతవరకు చదువుకున్నావు" అని అడిగేరు.
    "స్కూలు చదువైతే, ఎనిమిదవ తరగతి మూడు సంవత్సరాలు. మూడు సార్లూ ఫస్టుక్లాసు మార్కులతోనే పాసయ్యానండి" - అన్నాను.
    చిరునవ్వు నవ్వుతూ, "ఎందుకలా చేశావు?".
    "మా నాన్నగారి చాదస్తం" వల్ల అని సమాధానం చెప్పాను.
    "నువ్వు బాగా పాడతావు కదూ!".
    "విన్నారుగా!".
    "అదిగో మళ్ళీ ఎదురు ప్రశ్న! సూటిగా సమాధానం చెప్పడం చేతకాదా-" అని, "శంకర్ సింగ్ గారి పిక్చర్లో పాడడానికి ఛాన్స్ ఇప్పించనా?".
    "మీ యిష్టం" - అని ఊరుకున్నాను.
    "కొత్త పిక్చర్ స్క్రిప్ట్ తెచ్చావా? వదిలేశావా?".

 Previous Page Next Page