"అమ్మో! ఎంత చీకటైపోయిందో" అంది కంగారుగా.
"చీకటెక్కడ? పైన చూడు.... చంద్రుడు వెండి వెలుగులు కురిపిస్తుంటే" అన్నాడు అతను.
"అదే చాలా టైమైపోయిందని...." రిస్ట్ వాచ్ వంక చూసుకుంటూ అందామె.
"ఎంతయింది టైం?" అడిగాడు అతను.
"ఏడున్నర? ఇక పోదాం."
"అప్పుడేనా?" విచారంగా ముఖంపెట్టి అన్నాడు మహదేవ్.
"అవును."
"ఇంకో అరగంట.... ప్లీజ్! పదిహీనురోజుల తర్వాత కలిశాం. మర్చిపోతున్నావా?" అన్నాడు.
"మర్చిపోలేదు ప్రభూ.... పదిహేను రోజులు, పదిహేను రోజులంటూ ఉదయం నుంచీ బుర్ర తింటున్నావ్...?
"ఇక అననులే మరో అరగంట వుంటావ్ గా..." అన్నాడు మహదేవ్.
"తప్పకుండా!"
"గుడ్ గాళ్"
ఆమె వెళ్ళిపోతాననగానే మబ్బుల మాటుకు మాయమైపోయిన చంద్రుడు ఆమె మనసు మార్చుకోగానే మబ్బుల్ని ఛేదించుకుని మళ్ళీ బయటపడ్డాడు.
"వైజాగ్ లో ఏమేం చేశావు?"
"ఏం చేస్తాను....? ప్రత్యేకించి చేయవలసిన పనులేం వున్నాయి అక్కడ?"
"ఏం చేశావంటే ఎలా గడిపావని?"
"ఓ నాలుగురోజులు శుభ్రంగా ఇంటి పట్టునే రెస్ట్ తీసుకున్నాను. తరువాత ఫ్రెండ్స్ ని కలుసుకున్నాను. మా చెల్లీ, తమ్ముళ్ళతో బీచ్ కెళ్ళాను. ఒకసారి ఇంట్లో వాళ్ళందరం కలసి భీమ్లీ వెళ్ళాం. తరువాత వచ్చేసేవరకూ రొటీనే. ఉదయం లేవడం స్నానపానాలు చేయడం, పేపర్ చూడటం, తినడం, పడుకోవటం బద్ధకంగానే రోజులు గడిచాయి.
ఇక్కడా అదే రొటీనే. ఉదయం లేవడం, ఆదరా బాదరాగా తయారవడం, బస్సుల కోసం ఉరుకులు పరుగులు, ఆఫీసు పని, సాయంత్రం మళ్ళీ బస్సుల కోసం రన్నింగ్ రేస్. కిక్కిరిసిన జనాల మధ్య ప్రయాణం చేసి రూమ్ కి చేరుకోవడం, ఫ్రెషయి కాస్సేపు ఏవయినా బుక్స్ చదవడం, తినటం, పడుకోవటం..... నిజంగా నువ్వు పరిచయం కాకపోయుంటే అమ్మా నాన్నలని, ఇంటినీ వదిలి వచ్చి ఇన్నేళ్ళు ఇక్కడ పని చేసేధాన్నే కాదు...." అందామె.
"ఇకమీదట రొటీన్ అనే మాటే వుండదు మన జీవితాల్లో" అన్నాడతను.
"ఎలా?" అడిగింది మనస్విని.
"ఇలా" అంటూ ఆమె మెడలో తాళి కడుతున్నట్టు రెండు చేతులతో సైగచేసి, "నేను వెంటనే మా అమ్మకి మన విషయం చెప్పి, పెళ్ళికి ఏర్పాట్లు చేస్తాను! ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా నిన్ను నాదాన్ని చేసుకుంటాను" అన్నాడు మహదేవ్.
* * * * *
ఆ రోజు రోజుకంటే పెందలాడే భోజనాలు ముగించి అభిరాం, వరప్రసాదం అభిరాం గదికి చేరుకున్నారు. వరప్రసాదం చెప్పబోయే విశేషాలు కోసం ఆతృతగా ఎదురుచూడసాగాడు అభిరాం.
అప్పుడు సమయం రాత్రి ఎనిమిది గంటలైంది.
వరప్రసాదం డబ్బాలోంచి నశ్యం తీసి ఘాటుగా పీల్చాడు. వరుసగా నాలుగైదుసార్లు తుమ్మి ఆ తర్వాత చెప్పసాగాడు-
"హిమాలయాలలో నాలుగువేల అడుగుల ఎత్తున ఓక్, పైస్, దేవదారు చెట్లు పెరుగుతాయి. ఇంకా ఎత్తున భోజపత్తి పెరుగుతుంది. అది అక్కడి గ్రామీణులకు అవసరమైన కాగితం బెరడును ఇస్తుంది. ఇక్కడి వారికి వనమూలికల గురించి బాగా తెలుసు. వారు దీర్ఘాయుష్కులు.
పాకిస్తాన్ హిమాలయాలలో 'హున్ జా' అనే తెగ ప్రజలున్నారు వీరు మాంసాహారులు.
మన ప్రాంతం హిమాలయవాసులు హంసజాతి వారు, శాకా హారులు, హంసకు పాలు, నీరు వేరు చేసే శక్తి వున్నదని అంటారు. అలా వీరు లోకంలో మంచిని, చెడును రెంటినీ వేరుచేసి చూడగలరు.
ఈ పర్వతాల మొత్తం మీద 'శక్తి' ఆరాధన ఎక్కువ. ఇక్కడ ఋషులను ఆదరిస్తారు. వారికి ఆహారం, బస మొదలైన సౌకర్యాలను ప్రజలే కల్పిస్తారు.
ఎవరైనా, ఎక్కడివారైనా సాధువులను ఆదరించడం అనేది అక్కడివారి సంప్రదాయం.
హిమాలయాలలో పలురకాల సంస్కృతులున్నా ఎవరి పద్దతి వారిదే. ఎవరూ మరొకరికి అడ్డంరారు. సుమారు వెయ్యేళ్ళ క్రితం వేలాదిగా టిబెటన్ లు, చైనీయులు మనదేశం నుండి బౌద్దసాహిత్యం తీసుకొని వెళ్ళారు.
దాంతో వారి సంస్కృతిని సుసంపన్నం చేసుకున్నారు. మన ధ్యాస పద్దతులు జపాన్ దాకా వెళ్ళాయి. భారతీయ గురువులు కొందరు అక్కడి వారికి బోధలు చేశారు"
"అవునూ! హిమాలయాలలో యెతి వున్నదని అంటారు. నిజమేనా?" వరప్రసాదం మాటల మధ్యలో అడ్డు వస్తూ అడిగాడు అభిరాం.
"ఇది పాశ్చాత్యులు పుట్టించిన పుకారు, యెతి గురించి ఎన్నో కథలు ప్రచారంలో వున్నాయి. ఇంగ్లీషువారు 'షెర్పాల'నే కొండజాతి ప్రజల సాయంతో యెతికోసం అన్వేషణ సాగించారు.
షెర్పాలకు హిమాలయాల్లో ఎక్కడేముందో తెలుసు. అంతేతప్ప అక్కడి ఆధ్యాత్మిక సంప్రదాయం గురించి తెలియదు. నిజానికి యెతి అంటూ ఏమీలేదు. యెతి వున్నదన్న కట్టుకథకు మూలం హిమాలయాల లోని రెండు ఆశ్రమ గుహలు.
వీటిని గురించి మన పురాణ ఇతిహాసాలలో వుంది. వీటికి మంచి సంప్రదాయం, ధ్యాన పరంపర వున్నాయి. ఈ గుహలలో ఒకటి కాంచన గంగపై వుంది. ఇది పధ్నాలుగువేల అడుగుల ఎత్తున వుంది.
రెండవది టిబెట్, ఘర్ వాల్ సరిహద్దులలో పన్నెండువేల అడుగుల ఎత్తున వుంది. ఈ గుహలలో సంస్కృత, టిబెటన్, సంధ్యాభాషల రాతపత్రులు ఈనాటికీ వున్నాయంటారు.
ఈ గుహల సమీపంలోనే తెల్లని ఎలుగుబంట్లు సంచరించడం కొందరు ఆంగ్లేయులు చూసి, వాటిని సమీపించే సమయానికి అవి కనపడకుండా పోయాయట. ఏటి పాదాలు చాలా పెద్దవి. అడుగులు మనిషి అడుగుల మాదిరే వుంటాయి.