"అదే ఇప్పుడు మనకు మిస్ స్మిత అందించాల్సిన రహస్యం ఫ్రెండ్" అన్నాడు భవానీశంకర్.
స్మితారాణి కలవరపాటుతో భవానీశంకర్ వేపు చూసింది. అతనింకా తన మాటలు నమ్మనట్లు మాట్లాడటం బాధ కలిగింది.
"నాకూ అదే అర్ధం కావడం లేదు. వాళ్ళొచ్చి "భార్గవ్" అనే అతను నాతొ ఏం చెప్పాడో చెప్పమని బెదిరించారు. భార్గవ్ అనే అతనూ నేనూ చాలా కాలం భార్యాభర్తల్లా కాపురం కూడా చేశామట. నేను అసలు ఆ పేరూ వినలేదు. ఆ వచ్చినవాళ్ళను ఇంతకుముందు చూడనూలేదు" చెప్పింది స్మితారాణి.
"తమాషాగా ఉందే" అంది అఖిలభాను.
"ఇంకేం మాట్లాడారు వాళ్ళు!" అడిగాడు శ్యామ్.
"ఇంకేమీ లేదు. భార్గవ్ ఏం చెప్పాడు?" అంటూ రెండు మూడు సార్లు అడిగారు అంతే చెప్పిందామె.
అంతా కొద్ది క్షణాలు మౌనంగా వుండిపోయారు.
ఎవరెంత ఆలోచించినా ఎవరికీ ఏమీ తట్టడం లేదు.
"ముందు మనం ఆ ఇద్దరు గాంగ్ స్టర్స్ ని తెలుసుకుంటేనే గాని వాళ్ళెందుకొచ్చిందీ వాళ్ళకేం కావలసిందీ తెలీదు" అన్నాడు శ్యాం. భవానీ శంకర్ ఉత్సాహంగా సోఫాలో ముందుకు వంగాడు.
"కరెక్టు కామ్రేడ్! మనం వెంటనే రంగంలోకి దూకితే గానీ పరిస్థితులు అదుపులో కొచ్చేట్లు లేవు. అఫెన్స్ ఈజ్ బెస్టు ఫారం ఆఫ్ డిఫెన్స్ అనే ఫార్ములా అవసరం చాలా ఉందిక్కడ."
"కానీ అసలు వాళ్ళెవరో ఎలా తెలుసుకుంటారు మీరు" అడిగింది అఖిలభాను.
"దౌజెండ్ డాలర్ కొశ్చేన్ సిస్టరిల్లా! ఎటొచ్చి కొశ్చేన్ కొంచెం ఆలోచించిన తరువాత వేసివుంటే ప్రజలు హర్షించేవాళ్ళు - వాళ్ళను కనుక్కోవటం చాలా ఈజీ ! రేపు పోలీసు స్టేషన్ కెళితే వాళ్ళ అడ్రస్ లు - వాళ్ళ ఆచార వ్యవహారాలూ అన్నీ తెలిపోతాయ్!"
"అంటే?"
6
"ఇవాళ మధ్యాహ్నమే వాళ్ళ కారు స్మితారాణిని డీ కొట్టబోయి ప్రమాదానికి గురయింది. పోలీసులు అతనిని పోలీసు స్టేషనుకు లాక్కెళ్ళరు. గనుక అక్కడ వాళ్ళ జాతకాలూ, అడ్రస్ లూ అన్నీ ఖచ్చితంగా రికార్డు చేసే వుంటారు.
'అయితే ఇప్పుడే వెళ్ళి తెల్సుకుందాం!" ఆవేశంగా అన్నాడు శ్యామ్.
"ఎలాంటి భయంకరమయిన పరిస్థితులలో ఉన్నాసరే మనం అర్ధరాత్రుళ్ళు పోలీస్ స్టేషన్ కెళ్ళాకూడదు కామ్రేడ్ శ్యామ్. నిద్రమత్తులో వున్న కానిస్టేబుల్స్, నిద్ర డిస్టర్బ్ చేసినందుకు మనల్ని లోపల పడేసి వాళ్ళు నిద్రలో మునిగిపోతారు మళ్ళీ. కనుక ప్రస్తుతానికి రెస్టు తీసుకుంటే మిగతా కార్యక్రమాలన్నీ రేపోద్దున్నే ప్రకటించవచ్చు."
"హలో సిస్టరిల్లా? ఓ చాపా, తలగడా ఇటు పారేస్తే నేను "హాపీ స్లీప్ ఇయర్ ఎగైన్" స్కీమ్ లో కెళ్ళిపోతాను."
అఖిలభాను చాప తలగడ తెచ్చి అతనికిచ్చింది.
"ఒకే కామ్రేడ్స్ గుడ్ నైట్ విష్ యూ స్వీట్ డ్రీమ్స్." అంటూ చాప పరిచి దాని మీద వాలిపోయాడతను.
ఉదయం మెలకువ వచ్చేసరికి టైం తోమ్మిదయిపోతోంది. అప్పటికే శ్యామ్ రడీ అయిపోయి కనిపించాడు.
"నువ్వెప్పుడు లేస్తావా అని చూస్తున్నాను. మనము పోలీస్ స్టేషన్ కెళ్ళాలి కదా." అన్నాడు చిరునవ్వుతో.
భవానీ శంకర్ ఒక్క వుదుటున లేచి కూర్చున్నాడు.
"సారీ కామ్రేడ్! శరీరానికి నిన్న కొంచెం ఎక్సర్సయిజ్ ఎక్కువ అవటం వల్ల నిద్ర కోటా పెరిగిపోయింది. పది నిమిషాలలో రడీ అయిపోతాను. ఈలోగా సిస్టరిల్లాను వేడివేడి కాఫీ ఫలహారాలు సిద్దంగా వుంచమని చెప్పు." అంటూ లేచి బాత్ రూమ్ వేపు పరుగెత్తాడతను.
ఇద్దరూ పోలీస్ స్టేషన్ చేరుకునే సరికి మధ్యాహ్నమయి పోయింది.
ఇన్ స్పెక్టర్ వాళ్ళను చూస్తూనే చిరాకు పడ్డాడు.
"యస్ - ఏం కావాలి మీకు?" మాములుగానే విసుగ్గా అడిగాడు.
"నిన్న మా సిస్టర్ ని ఓ కారు డాష్ ఇవ్వబొయింది ఇన్ స్పెక్టర్ గారూ! ఆ కేసు మీరే రిజిస్టర్ చేసి ఉంటారు బహుశా!" అన్నాడు శ్యామ్.
"ఇప్పుడెం కావాలి మీకు?" మళ్ళీ చిరాకుగా అడిగాడతను.
"ఆ కారు ఎవరిదో అతని అడ్రస్సేమిటో కొంచెం మాకు చెపితే"
"ఎందుకు మీకది?" శ్యామ్ ఆ ప్రశ్నతో ఉక్కిరి బిక్కిరయ్యాడు.
భవానీ శంకర్ చప్పున అందుకున్నాడు.
"ఆ కారు డాష్ ఇవ్వడం వలన మా స్మితారాణికి గాయాలు తగిలాయ్ కామ్రేడ్! మరి ఆ గాయం తాలుకూ మందులకూ, డాక్టర్ ఫీజులకూ కారు ఓనరులే డబ్బు కట్టడం మన దేశపు ఆనవాయితీ గనుక" ఇన్ స్పెక్టర్ ప్రవర్తనలో సడెన్ గా మార్పు వచ్చేసింది.
"అల్ రైట్ ఇప్పుడే ఇస్తాను" అనేసి ఎవర్నో పిలవబోయి మళ్ళీ ఏదో గుర్తుకొచ్చినట్లు అనుమానంగా భవానీశంకర్ వేపు చూశాడు . "మీరు ఇప్పుడా కారు వాళ్ళమీద కంప్లయింటేమీ ఇవ్వటం లేదు కదా?"
భవానీశంకర్ చిరునవ్వు నవ్వాడు.
"అలాంటి ఆలోచనలేమీ ప్రస్తుతానేకీ లేవు కామ్రేడ్! ఇన్ ఫాక్టు జనాభాను పెరగకుండా అదుపులో పెట్టేందుకూ కృషి చేస్తోన్న ఆ కారు డ్రయివరుకీ, యజమానులకూ సన్మానం చేయాలని చాలా కోరికగా ఉంది మాకు."
ఇన్ స్పెక్టర్ భవానీశంకర్ వేపు కోపంగా చూశాడు.