Previous Page Next Page 
ప్రేమించండి ప్లీజ్ పేజి 22


    చెవులను రిక్కించాడు. కాస్తంత ముందుకి వంగాడు.
    "మీరు నాకో పనిచేసి పెట్టాలి. మొన్న ఓ వైట్ శారీ కొన్నాను. ధానికి ఎంబ్రయిడరీ వేసుకురావాలి. చిన్నబజారు స్ట్రీట్ లో వుంది ఎంబ్రాయిడరీ షాపు అక్కడికి వెళ్ళి చీర ఇవ్వండి. అంచులలో మాత్రమే ఎంబ్రాయిడరీ చేయమని చెప్పండి."
    ఏదో నిరాశ లాంటిది కలిగింది అతనిలో కానీ దాన్ని ముఖంలో కూడా ఎక్స్ ప్రెస్ చేయలేకపోయాడు. ఎప్పుడూ దీనంగా వుండడం తప్ప మరో భావప్రకటన అతనికి చేతకాదు.
    అలానే అన్నట్టు తలవూపాడు.
    దీనికోసమే చూస్తున్నట్టు కళ్ళు ఆర్పడం కూడా మరిచిపోయిన ఆమె ఆనందంతో ఠక్కున పైకి లేచింది.
    వాళ్ళకి దూరంగా వున్న తన ఫ్రెండ్సును దగ్గరకు రమ్మన్నట్టు చేయి వూపింది.
    మరో నిముషంలో అయిదుగురు అమ్మాయిలు అక్కడికి వచ్చారు వాళ్ళంతా అతని క్లాస్ మేట్స్.
    ఓ అమ్మాయి దగ్గరున్న బ్యాగ్ ను లాక్కుని మంజుల "ఇందులో వుంది శారీ అంచులకు "మాత్రమే ఎంబ్రాయిడరీ" అంది.
    మౌనంగా అందుకున్నాడు అతను.
    అంతలో మరో అమ్మాయి రిక్వెస్ట్ చేస్తున్నట్టు ముఖంపెట్టి "ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకూ ఓ చిన్న పని చేసి పెట్టండి. ఈ బల్బులు లాండ్రీలో వేసి బిల్లు పట్టుకురండి" అంది.
    ఇక తన వంతు వచ్చినట్టు సరళ ముందుకు వచ్చింది.
    "ఎలానూ బజారుకు వెళుతున్నారు కదా నాకు కొన్ని టాయ్ లెట్ సామానులు పట్టుకురండి. లిస్ట్ డబ్బూ ఈ సంచిలో వున్నాయి అని ఓ చేతి సంచిని అందించింది.
    మిగిలిన అమ్మాయిలు కూడా తమ పనులు చేసుకురమ్మని పురమాయించారు.
    దీనికి ఆంజనేయులు బాడ్ గా రియాక్ట్ కాలేదు. ఇలా ఇతరులకు పనులు చేయడం అలవాటే అతనికి. వూర్లో కూడా అంతే. అతను అలా వీధిలో వెళుతుంటే పిలిచి పనులు చెప్పేవాళ్ళు మౌనంగా వాళ్ళు చెప్పింది విని అవి చేసేవాడు. పేదరికం వినయం కూడా నేర్పుతుంది. ఆ గుణం వల్లే ఆంజనేయులు లాంటి వాళ్ళకు ఇతరులు పనులు పురమాయిస్తారు.
    అమ్మాయిలు చెప్పిన పనులన్నే చేసుకురావడానికి అతను బయలుదేరాడు. మంజుల తనతో అంత సాన్నిహిత్యంగా ఫీలై చీరయిచ్చి ఎంబ్రాయిడరీ చేసుకురమ్మని చెప్పడం అతనికి ఆనందాన్ని కలుగచేస్తోంది.
    మంజులవైపు చూసి వెళ్ళొస్తానన్నట్టు తల వూపి బయలుదేరాడు.
    ఇక తమ మాటలు అతనికి  వినిపించని భరోసా కలిగాక మంజుల తన ఫ్రండ్ తో చెప్పింది. "మా బావ ఈ మధ్య అమెరికా నుంచి ఇండియా వచ్చారు. ఫస్ట్ నైట్ మీ యూనివర్శిటీలో జరిగిన థ్రిల్లింగ్ స్టోరీ నాకు చెప్పాలని అన్నాడు. ఏం చెబుదామని ఆలోచనలో పడ్డాను. సరిగ్గా అదే సమయంలో ఈ ఆంజనేయులు తగిలాడు. వాడి తోక పట్టుకుని లాగుదామనుకున్నాడు. లాగుతున్నాను. ఎలా కుప్పిగంతులు వేస్తున్నాడో చూస్తున్నారు కదా అప్పుడెప్పుడో ఆ ఆంజనేయుల తోకకు నిప్పు పెట్టినట్టు నేనూ ఈ ఆంజనేయులకు నిప్పు పెడతాను అందుకు మీరంతా సహకరించాలి."
    "ఓ ష్యూర్....ష్యూర్' అన్నారు మిత్రురాళ్ళు.
    ఈ మాటలు వినిపించని ఆంజనేయులు పదే పదే మంజుల చీరను గుండెలకు హత్తుకుంటూ మలుపు తిరిగాడు.
    ఇక ఆ రోజు నుంచి ఆంజనేయులు వాళ్ళ పనిమనిషైపోయాడు. సాయంకాలమైతే అతన్ని హాస్టల్ కు రమ్మని చెప్పడం అతను వచ్చాక బజారుకు తరిమి తమ పనులు చేయించుకు రమ్మనడం అతను రెండు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళిరావడం మంజుల తనను ప్రేమిస్తున్నట్టు జోక్ లు వేయడం అప్పుడప్పుడు వయ్యారాలు పోవడం దీంతో మరో మూడునెలలు గడిచిపోయాయి.
    చివరికి అతని చేత చెప్పులు కూడా కుట్టించుకు తెచ్చుకుంది మంజుల. మరో అమ్మాయి అయితే జాకెట్లు కుట్టించుకుంది. లంగాలకు సైతం గుడ్డలు తెప్పించుకున్నారు.
    ఇవన్నీ మంజుల మీదున్న ఆరాధనతో చేశాడు. బస్సు ఛార్జీలు లేవుకనుక అతను దాదాపు అయిదు కిలోమీటర్లు నడిచి బజారుకెళ్ళి వాళ్ళ పనులు చేశాడు.
    ఓ రోజు క్లాసంతా ఎక్స్ కర్షన్ వెళ్ళడానికి నిర్ణయించారు, లీజర్ టైంలో విద్యార్ధి నాయకుడు ఈ ప్రపోజల్ పెట్టాడు. విద్యార్దులంతా ఒప్పుకున్నారు. చంద్రగిరి కోటకు వెళ్ళడానికి నిర్ణయించారు. ఉదయం బయలుదేరి వెళ్ళి సాయంకాలానికి తిరిగి వచ్చేయాలన్నది ప్రోగ్రాం.
    టూర్ విషయాలు క్లాస్ లీడర్ చెబుతుంటే ఆంజనేయులు, శెట్టి శ్రద్దగా వింటున్నారు. మధ్యలో వాళ్ళిద్దరికీ ఒకే డౌట్ వచ్చింది. దాంతో ఇద్దరూ లేచి అడిగారు. "మరి మధ్యాహ్నం భోజనం ఎలాగా?"
    దానికి క్లాస్ లీడర్ చాలా విసుక్కున్నాడు. "మనం వెళ్ళేది చంద్రగిరి కోటకు అడవికి కాదు, అక్కడ చాలా హోటళ్ళున్నాయి." అని కోపాన్ని వ్యంగ్యంగా మార్చి చెప్పాడు.
    భోజనం కోసం వాళ్ళిద్దరూ పడిన ఆరాటాన్ని చూసి మిగిలిన వాళ్ళంతా నవ్వుకున్నారు. ఆంజనేయులులు, శెట్టిలాంటి వాళ్ళకు తెలిసిన సమస్య అదొక్కటేన్న వాళ్ళ ద్యాసంతా పూట ఎలా గడుస్తుంది అనే దాని మీదే వుంటుందని అక్కడున్న చాలా మంది విద్యార్ధులకు తెలీదు. కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ కూతురైన మంజులకు అసలే తెలీదు. అందుకే ఆమె కూడా ఫక్కున నవ్వింది.
    ఎక్స్ కర్షన్ లో అంతా ఆంజనేయులును ఓ ఆటపట్టించింది ఆమె. సర్కస్ లో బఫూన్లా అతడిని ఆడించింది.
    తన బావ మెచ్చుకునేట్టు ఈ ప్రహసనాన్ని ఎలా ముగించాలో కూడా ఆమె ఆలోచించింది. ఆ సాయంకాలానికి చివరగా ఆమెకు ఓ ఐడియా తట్టింది.
    ఎక్స్ కర్షన్ అయిపోయాక తిరిగి హాస్టల్ కి వచ్చి కూడా రేపు జరగబోయే విషయం గురించి ఆలోచించింది. ఆంజనేయులు జీవితంలో కోలుకోలేనంత షాక్ ఇవ్వడానికి ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూసింది. దీంతో ఆ రాత్రి ఆమెకు నిద్ర కరువైంది.
    ఉదయం లేస్తూనే తన పధకాన్ని గురించి స్నేహితురాళ్ళకు చెప్పింది. వాళ్ళు మొత్తం విని బ్రహ్మాండం అన్నారు.
    ఆ రోజు తన జీవితంలో అతి భయంకరమైన రోజని తెలీని ఆంజనేయులు యధాప్రకారం నిద్రలేచాడు. కళ్ళు తెరవగానే మంజుల గుర్తుకొచ్చింది. అంతకుముందు చంద్రగిరి కోటలో తనతో మాట్లాడిన మాటలను మననం చేసుకున్నాడు. ఏదో తెలియని ఉత్సాహం ఉరకలేస్తుంటే కాలకృత్యాలు తీర్చుకోడానికి మంచంమీదనుంచి దిగాడు.
    పదిగంటలకల్లా క్లాసులో అడుగుపెట్టాడు. మరో పదినిముషాలకు మంజుల రాగానే కళ్ళు ఆర్పకుండా చూశాడు. ఆమె ఎంతో అభిమానాన్ని కళ్ళలో కురిపిస్తూ నవ్వింది. ఐస్ లా కరిగిపోయాడు.
    ఉదయం పూట జరిగే మూడు క్లాసులు అయిపోయాయి.
    అబ్బాయిలంతా లంచ్ కి బయల్దేరారు. ఆశ్చర్యం-అమ్మాయిలంతా అలానే కూర్చుని వున్నారు. మంజుల వెళ్ళిన తరువాతే క్లాసునుంచి బయటపడే అలవాటున్న ఆంజనేయులు అలానే సీటుకు అతుక్కుపోయాడు.

 Previous Page Next Page