Previous Page Next Page 
క్లైమాక్స్ పేజి 22

అది వినగానే గుండెలో గునపం దిగేసినట్లయింది విశ్వనాధానికి. ఈ ;లెక్కన , తన చావుకోసం గోతికాడ నక్కలా కూర్చుని వున్నారన్నమాట వీళ్ళు. లేకపోతే తన ఆస్తుల వివరాలు ఇప్పుడెందుకు వీళ్ళకి.
అతనికి తెలియకుండానే అతని మొహం కఠినంగా మారిపోయింది.
"నాకు ఇప్పుడు కావలసింది డాక్టరు ప్రియంవదా.......లాయరు కాదు" అన్నాడు.
అతని మోహంలో కాఠిన్యం కనబడుతున్నా అతని కంఠంలో మాత్రం దైన్యం ధ్వనిస్తోంది.
వెంటనే ఆక్రోశంగా అంది ప్రియంవద. "అంటే ఏమిటి మీ ఉద్దేశ్యం? నేను మీ చావు కోరుకుంటున్నాననుకుంటున్నారా ఏమిటి? అంతేనండీ అంతే.......లోకం అంటే ఇట్లాగే వుంటుంది. మీరెందుకోగానీ మీ ఊరు వదిలేసి హటాత్తుగా మా ఊరుకొచ్చి అక్కడే సెటిలయిపోయారు. వ్యాపారం పెట్టారు. అన్నెం పున్నెం ఎరగని వయసులో మీ దగ్గర సెక్రటరిగా చేరాను. వళ్ళు దాచుకుకుండా మీకు సేవలు చేశాను. పెళ్ళీ పెటాకులు అని పెట్టుకోకుండా మిమ్మల్ని కనిపెట్టుకుని వుండి, మీ వ్యాపారాన్ని మూడు పువ్వులూ, ఆరుకాయలుగా మార్చాను. ఒక వ్యాపారాన్ని పది వ్యాపారాలుగా పెంచాను. మీరు క్లబ్బులకి, విలాసాలకి డబ్బు తగలేస్తుంటే, కొద్దో గొప్పో దాచి నగలు, నాణ్యాలు , భూమీ పుట్రా కొన్నదేవరు..........నేను కాదూ? లేకపోతే మీ దుబారా ఖర్చుకి దమ్మిడి మిగిలి వుండేదికాదు."
విశ్వనాధం మనసు విరిగిపోవడం మొదలెట్టింది -
'అసలు నాకు తాగుడు అలవాటు చేసింది ఎవరు..........నువ్వు కాదూ? పగలంతా శ్రమపడ్డాక కాస్త రిలాక్సేషన్ వుండాలని నచ్చచెప్పి, నన్ను క్లబ్బుల చుట్టూ తిప్పింది ఎవరు.......నువ్వు కాదూ? ధైర్యే సాహసే లక్ష్మీ' అని నూరిపోసి నాకు జూదం అలవాటు చేసింది ఎవరు.......నువ్వు కాదూ? నేను ఈ విలాసాల్లో మునిగితేలుతున్నప్పుడు నీ జాగ్రత్తలో నువ్వు వుండి అందినంత దాచుకున్నావు. నా పేరుతో మిగిలింది కాస్తా ఇప్పుడు లాగేసుకుని నన్ను నామరూపాలు లేకుండా చేద్దామనుకుంటున్నావు. ప్రియంవదా.........నువ్వు తేనెపూసిన కత్తివి ' అనుకున్నాడు విశ్వనాధం. కానీ ఆ మాటలని పైకి అనడానికి అతనికి ధైర్యం చాలలేదు. ప్రియంవద నోరు చెడ్డది. పక్కన ఎవరున్నారని ఆలోచించకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడగలదు ఆమె.
కళ్ళలో ఉబుకుతున్న నీళ్ళు కనబడకుండా వుండాలని కనురెప్పలు మూసుకున్నాడు విశ్వనాధం. దానితో అంతా అంధకారం అవరించుకున్నట్లు అనిపించింది అతనికి.
ఆ చీకట్లో గొంతులు వినబడుతున్నట్లు భ్రమ.
"ఏమండీ .........ఏమండీ" అని వరలక్ష్మి గొంతు - తన మొదటి భార్య వరలక్ష్గ్మి.
"నాన్నా.........నాన్నా" అని హరీన్ పిలుస్తున్నాడు.
వాళ్ళని అలక్ష్యం చేసి, నైట్ క్లబ్బులో ప్రియంవదతో ఖుషి చేస్తున్నాడు తను. ఒక చేతిలో వైన్ గ్లాసు, ఒక చేతిలో ప్రియంవద.
మనోఫలకం మీద నుంచి ఆ దృశ్యాలని తుడిపివెయ్యడానికి ఎంతో ప్రయత్నించాడు విశ్వనాధం. కానీ మర్చిపోదామన్నా మరుపుకు రావడం లేదు అవి.
కుప్పలు తెప్పలుగా డబ్బోస్తే సుఖపడగలననే భ్రాంతిలో గడిపాడు తను సగం జీవితం.
కానీ, ఏ క్షణాన తను నారాయణమూర్తిని చంపి, డబ్బెత్తుకుపారిపోయాడో, ఆ క్షణం నుంచే తనకు శాంతి దూరమై పోయింది.
నారాయణమూర్తి డబ్బు తీసుకుని వెంటనే ఉన్న ఊరువదిలి పెట్టేశాడు తను. వేరే ఉళ్ళో నివాసం ఏర్పరచుకున్నాడు. అక్కడ ఆస్తులు కొన్నాడు. వ్యాపారాలు చేశాడు. కోరుకున్నట్లే కుప్పలుతెప్పలుగా డబ్బు సంపాదించాడు. ప్రియంవదని సెక్రటరీగా పెట్టుకున్నాడు. వ్యసనాలకు బానిస అయ్యాడు.
తన భార్య వరలక్ష్మికి మొదటినుంచి తనమీద అనుమానమే. తనకి తను సజావైన పద్దతిలో అంత డబ్బు సంపాదించలేదని దృడనమ్మకం కలిగాక, తనకి ఎన్నోవిదాల నచ్చచెప్పాలని చూసింది. అలాంటి పాపిష్టి డబ్బు అచ్చిరాదనీ , ఆ డబ్బు ఎవరిదో వాళ్ళకి తిరిగి ఇచ్చేయ్యమనీ - అదీ ఇదీ.
కానీ ఆమె హితభోదని తను పెడచెవిన పెట్టాడు.
అప్పటినుంచీ తనతో ఎడమొహం పెడమొహంగా వుంటే వచ్చింది తన భార్య వరలక్ష్మి. సంసారంలో సుఖం అంటూ లేకుండా పోయింది తనకి.
దానికి తోడు హరీన్ ప్రవర్తన.
హరీన్ ది చిన్నప్పటి నుంచి కూడా కుశాగ్రబుద్ది ఏ విషయాన్ని పదిసార్లు తరచి తరచి అడిగి తెలుసుకునేదాకా నమ్మేవాడు కాదు అతను.
హరీన్ తనని ఎప్పుడూ నిలదీసి అడగలేదు కానీ, హరీన్ కళ్ళలో సూటిగా ఒక ప్రశ్న కనబడుతూ వుండేది తనకి.
"నాన్నా నిన్నటిదాకా బాల్ పాయింట్ పెన్ను కొనివ్వమని అడిగినా డబ్బుల్లేవని తిట్టేవాడివి , ఇవాళ ఇంత పెద్ద పెద్ద ఖర్చులు పెట్టడానికి నీకు డబ్బేక్కడిదీ?" అని.
ఒక్కమాటలో చెప్పాలంటే -
దొరికిపోయిన దొంగని చూసినట్లు చూసేవాడు హరీన్ తనవైపు.
ఆ చూపులు ఒక్కోసారి సూదుల్లా చురుక్కుమనేవి. ఇంకోసారి కత్తుల్ల్లా కోసేసేవి. మరోసారి ఈటేల్లా తన గుండెల్లో దిగబడేవి.
"నా తండ్రి నేరస్తుడు" అన్న భావం హరీన్ పసి గుండెలో బాగా నాటుకుపోయింది. అప్పటినుంచి చాలా చిత్రంగా తయారయిపోయింది అతని స్వభావం.
తను ఏం చెబితే దానికి వ్యతిరేకంగా చేసేవాడు. తను చేయ్యోద్దన్న పనిని చేసి తీరేవాడు. చెయ్యమన్న పని ఎప్పుడూ చేసేవాడు కాదు.
ఆ విధంగా తన కొడుకే తన ప్రధమ శత్రువు అయిపోయాడు. తన అర్ధాంగి ముభావంగా వుండిపోవడంతో తన శరీరంలో సగభాగం చచ్చుబడిపోయినట్లయిపోయింది.
ఆ వ్యధని మర్చిపోవడానికి మరింత ధనం సంపాదించాలనుకున్నాడు తను. మరికొన్ని కొత్త వ్యాపారాలు పెట్టాడు. మరెంత మందినో ముంచేశాడు. ఇంకా ఇంకా డబ్బు సంపాదించాడు.
కానీ -
ధనం ఎంతగా వస్తుందో, సుఖం అంతగా తగ్గడం మొదలెట్టింది. భార్యా బిడ్డలు క్రమంగా దూరమైపోయారు.
ఆ తర్వాత వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేశాడు తను. సెక్రటరీ తన సెకండ్ లవ్ అయింది.
"మీ కోసం నేను ఆహొరాత్రులూ కష్టపడ్డాను. రేపు ఏది ఎట్లా అవుతుందో ఎవరికి తెలుసు? నా కడుపులో పెరుగుతున్న నలుసు గతి ఏమిటి? వాదికింత ఆధారం చూపించొద్దా. అందుకే లాయరుగారు చెబుతున్నారు - వీలుగా వున్నప్పుడే విల్లు రాసెయ్యాలని. రేపు కర్మంజాలక ఏ కాలో చెయ్యో పడిపోతే......." అంటోంది ప్రియంవద.
ఈసారి విశ్వనాధానికి కళ్ళెంబడి నీళ్ళు ఆగలేదు. వాటిని అపుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదు అతను.
తనకు కాలూ చెయ్యి పడిపోకపోయినా, పడిపోయేటట్లు తంత్రం చెయ్యగలరు వీళ్ళందరూ కలిసి.
కన్నీటి మసకలో అతనికి ప్రియంవద ఒళ్ళంతా రూపాయినాణాలు పొలుసులు పొలుసులుగా అతుక్కుని వున్న ధన పిశాచిలాగా కనబడింది.
ఈ చౌకబారు స్త్రీ కోసమేనా తను జీవితమంతా నాశనం చేసుకుంది ఛీ ఛీ.
అసలు ప్రియంవద కడుపులో వున్నది తన కొడుకేనా? ఏమో అదీ తెలియదు.
తన కొడుకు హరీన్ ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? వరలక్ష్మి ఎలా వుంది? - మగత కమ్ముతున్నట్లయింది.
లాయరు భుజంగరావు ప్రియంవదని కొంచెం పక్కకి తీసుకెళ్ళి నెమ్మదిగా అన్నాడు -
"సరిగ్గా ఈ టైంలో ఈయన అసలు భార్యా కొడుకూ వచ్చి అల్లరి చెయ్యరు కదా, ఆస్తిలో భాగాలు కావాలని?"
హేళనగా నవ్వింది ప్రియంవద.
"ఆ మొదటి పెళ్ళాం గేటుదాటి రాకుండా చూడామని వాచ్ మేన్ తో చెప్పాను. దానికితోడు కాలభైరవుడిలాంటి కుక్క ఒకటి కాపలా వుంది అక్కడ. ఆ వరలక్ష్మి గదిలోంచి బయటికి వచ్చిందా, ఏ కండకి ఆ కండగా పీకేస్తుంది అది."
"అయితే అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారన్నమాట" అన్నాడు భుజంగరావు.
"ఆ.....తీసుకున్నాను. కానీ మరో ముఖ్యమైన జాగ్రత్త కూడా తీసుకోవాలి." అంది ప్రియంవద - భావగర్భితంగా విశ్వనాధంవైపు చూస్తూ.

                                               19

అక్కడ ......కొండ కొమ్ము మీద.
"ఇది ఏదో శ్మశాన ప్రాంతంలాగా వుంది" అన్నాడు డైరెక్టర్ రఘుకుల తిలక్. చుట్టూ గుట్టలుగా పడివున్న ఎముకలవైపు చూస్తూ.
ఆస్థిపంజారాన్ని తొక్కిన షాక్ వల్ల చాలాసేపటిదాకా హీరో కిశోర్ నోటేంబడి మాటరాలేదు. ఎవరో టీ తెచ్చి ఇచ్చారు అతనికి. తాగాడు.
పావుగంట గడిచాక కొద్దిగా తేరుకున్నాడు కిశోర్ -
"ఇప్పుడింకో షాట్ చేద్దామా?" అన్నాడు డైరెక్టర్ రఘుకుల తిలక్.
కొద్దిగా సంకోచించి అన్నాడు కిశోర్ -
"డూప్ వుంటే బాగుంటుందేమో?" అని గొంతు కంపిస్తోంది.
కిశోర్ వైపు పరిశీలనగా చూశాడు రఘుకుల తిలక్. బెదిరిపోయాడు కిశోర్. ఇలా అయితే కష్టమే.
"అల్ రైట్ ........నువ్వు కాసేపు రెస్టు తీసుకో. డూప్ ని పెట్టి షాట్స్ తీసేస్తాను నేను" అన్నాడు - తన భావాలని  పైకి వ్యక్తం చెయ్యకుండా.
రిలీఫ్ ఫీలవుతూ చూశాడు కిశోర్.

 Previous Page Next Page