Previous Page Next Page 
అర్ధచంద్ర పేజి 22


    "దాన్ని గురించి అంత ఆలోచన దేనికి? మన పెళ్ళి ఫోటోలు తీసుకొస్తా నుండండి" అంటూ లోపలికెళ్ళి ఓ నిమిషం గడిచాక ఆల్బంతో తిరిగి వచ్చింది.
    
    ఇరవై రెండేళ్ళ క్రితం నేనెలా ఉన్నానో చూడాలని మనసయింది కదూ. కరువుతీరా చూడండి" అంటూ ఆల్బమ్ అతని చేతికందించింది.
    
    రాజాచంద్ర ఆల్బమ్ లోని ఒక్కొక్క పేజీ తిరగేస్తున్నాడు విశారద ఆ రోజుల్లో ఇప్పుడు విజ్ఞత ఎలా ఉన్నదో అచ్చం అలాగే ఉంది. కళ్ళు, ముక్కు, భుజాల దగ్గర చిన్న ఒంపు.... మనిషిని పోలిన మనుషులు ఉంటే ఉండవచ్చు. కాని ఇంత ప్రింట్ తీసినట్టు...
    
    విశారద అతనివంక విస్మయంగా చూస్తోంది. అతనలా ముగ్ధుడైపోయినట్లు ఆ ఫోటోల్లో లీనమై తిలకిస్తుంటే.... ఓ పసివాడిలా, అమాయకుడైన బాలుడిలా కనిపించి అతని తలని గుండెకి అదుముకోవాలనిపించింది. అతన్ని దగ్గరగా పొదుపుకోవాలని ఆమె మనసు ఉవ్విళ్ళూరినట్లయింది.
    
    రాజాచంద్ర మనసులో వేరే ఆలోచనలు ఉత్పన్నమౌతున్నాయి. ఇది....ఇది.... ఇది... ఎలా సాధ్యం?
    
    విజ్ఞత గురించి చెప్పేద్దామా అనుకున్నాడు.
    
    తలఎత్తి మళ్ళీ ఆమె ముఖంలోకి చూశాడు. అమాయకంగా, నిష్కల్మషంగా, నిర్మలంగా వెలిగే ఈ ముఖబింబం...
    
    దీని వెనక చరిత్ర ఏదయినా ఉందా?
    
    ఇన్ని సంవత్సరాల కాపురంలో మొట్టమొదటిసారిగా వచ్చిన దురాలోచన అలాంటి ఆలోచన వచ్చినందుకు తనమీద తనకే అసహ్యమేసింది. అయినా మనసును అదుపులో బెట్టుకోలేకపోతున్నాడు.
    
    అతని కళ్ళు, వాటిలోని భావాల వెలుగు ఆమెకు ఇంకోరకంగా గోచరిస్తున్నాయి. ఎంత పిచ్చివాడు! ఏభై ఏళ్ళు... పోనీ అతని లెక్కప్రకారం నలభై ఎనిమిది...
    
    'మీకు ఏభై ఏళ్ళున్నాయి' అంటే ఎంత కోపమో అతనికి. "ఐయామ్ ఫార్టీ ఎయిట్" అంటూ సీరియస్ గా వాదిస్తాడు. అతనికి ఏభయ్యో వడిలో పడ్డాననుకోవటం సుతరామూ ఇష్టం లేదు.
    
    ఏమనుకుంటున్నాడో! ఎంత పిచ్చివాడు! ఈ పిచ్చినాన్న ఎంత మంచి బంగారుబాబు? కొంతమంది ఈ వయసువాళ్ళు ఎంతో వంగిపోయినట్లు, ఎదిగిపోయినట్లు- ఏమిబోలాగా కనిపిస్తారు. ఇతను.... ఇరవై ఏళ్ల వయసొచ్చిన ముగ్గురు పిల్లల తండ్రి అంటే నమ్మశక్యంగా ఉండదు. వాళ్ళ పక్కన నిలబెడితే ఓ అన్నలా ఉంటాడుగాని, తండ్రిలా కనిపించడు.
    
    అతని రూపమే కాదు. ప్రవర్తనా, భావాలూ అంత పసిగా, నిర్మలంగా ఉంటాయి.
    
    ఎంత పసిమనసు కాకపోతే, ఎంతటి పసిమనసు కాకపోతే..... తన పిల్లలలో ఏవేవో మార్పులు వస్తున్నా, వాళ్ళు చెయ్యిదాటిపోతున్నట్లు కనబడుతున్నా వాళ్ళని ఒక్కమాట అనలేక తనలో తను మధనపడుతూ, మళ్ళీ అలా మధనపడటం తప్పేమో అని కుచించుకుపోతూ ఉంటాడు!
    
                                        * * *

    ఆ రాత్రి..."ఎందుకలా ముభావంగా ఉన్నారు?" అనడిగింది.
    
    "ఉహు. ఏమీ లేదు."
    
    "లేకపోవటమేం? అదేమిటలా దూరంగా.... ఇటు తిరగండి."
    
    అతను చలనం లేకుండా అలాగే ఉండిపోయాడు.
    
    "ఏమిటిది? తిరుగమంటుంటే....?" అంటూ భుజాలచుట్టూ చేతులు వేసి తనవైపు తిప్పుకుంది.
    
    బెడ్ లైట్ వెలుగులో....ఆమెను పరిశీలిస్తున్నాడు.
    
    చాలీచాలని ఆ కాంతిలో ఆమె తలారా- స్నానం చేసి విరబోసుకుని ఉన్న జుట్టుతో, తెల్లచీరలో మెరిసిపోతూ వింత పరిమళాలను వెదజల్లుతున్న విశారద ఎన్నో సంవత్సరాల వయసు తగ్గి విజ్ఞతలా కనబడుతుంది.
    
    విశారద నవ్వింది- వెన్నెల కరిగినట్లు- "నేను చెప్పనా నీ మనసులో ఏమి తిరుగుతున్నదో!"
    
    "ఊ" అన్నాడు బలవంతంగా.
    
    "ఒక్కసారిగా నేను చిన్నదాన్ని... ఇరవై- ఇరవై రెండేళ్ళ యువతిని అయిపోవాలని ఉంది కదూ."
    
    అతనలాగే మెదలకుండా చూస్తున్నాడు. అతనికి ఇంకా దగ్గరగా జరిగి "రండి ఐయామ్ ఓన్లీ ట్వెంటీటూ టుడే" అన్నది.
    
    అతని కళ్ళలోకి విజ్ఞాతే కనబడుతుంది.
    
    రెస్పాన్స్ ఇవ్వలేకపోయాడు. అణువణువునూ ఏదో మంచుపొరఅడ్డు వేస్తున్నది.
    
    ఒక్క క్షణం మెత్తటి నిశ్శబ్దం.
    
    "పిల్లలు అవతలి గదుల్లో..."
    
    "అయితే ఏమయింది? పక్కవీధిలో చిన్నారావుగారు ఏభై నాలుగోఏట పిల్లాడ్ని కన్నాడు. పైగా వాళ్ళు బారసాల కూడా చేసుకుంటున్నారు. ఏం? పిల్లలు పెద్దవాళ్ళయితే మనం వయసులో ఉండి కూడా అన్నీ వదులుకోవాలని ఉందా?" అంటూ ఇంకా దగ్గరగా అతని మొహం మీదకు ఒరిగింది.
    
    అతను కఠినంగా- "ఏమిటిది అసహ్యంగా ఈ వయసులో అనాలనుకున్నాడు. కాని అతన్లోని సున్నితత్వం ఒప్పుకోలేదు. ఆమె మనసు నొచ్చుకుంటుందేమో నొప్పించాలనుకుని నొప్పించలేకపోతున్నాడు.
    
    "ఉహుఁ. మూడ్ లో లేను" అంటూ ఆమె నుంచి విడిపించుకుని అటు తిరిగి పడుకున్నాడు.
    
    ఒక్కసారిగా అవమానంతో, బాధతో షాక్ తిన్నట్లయింది ఒక్క క్షణం... విశారదలోని విజ్ఞత తిరిగి మేలుకునేటట్లు చేసింది.
    
                                          7
    
    అర్ధనారీశ్వరరావు నిద్ర లేచాడు. అతను నిద్ర లేవగానే మొట్టమొదట దేవుడి ఫోటో చూడడు. హాల్లో గోడకు వేలాడుతున్న కొరడా వంక చూస్తాడు. అతనికా కొరడా అంటే ప్రాణంతో సమానం. అదంటే భక్తీ, గౌరవమూనూ వ్యక్తి స్వాతంత్ర్యం అంటే అతనికి నమ్మకం లేదు. ఈ దేశం, ముఖ్యంగా యువతరం భ్రష్టుపట్టిపోవడానికి కారణం ప్రజాస్వామ్యమే అని అతని ప్రగాఢ విశ్వాసం.

 Previous Page Next Page