"ఎక్కడుందో మాకూ తెలీదు. ఏ విషయమైనా పూర్తిగా చెబితేగా....."
"హలో మిసెస్ కిరీటి."
ఎవరో సూట్ వాలా ఇంటరప్షన్ తో వారి చర్చ ఆగిపోయింది.
"ప్లీజ్ డు కమ్ హియర్."
చేతిలో ప్లాష్ కెమెరాతో కిరీటివైపు చూపించేసరికి అయిష్టంగా కిరీటి ప్రక్కకు వెళ్ళి నిలబడింది.
"అలాకాదు..... ఎబిట్ క్లోజర్......"
నడుం పై కిరీటి చేయి పడగానే ఉలిక్కిపడింది.
శరీరంలో ఏదో గగుర్పాటు..... సన్నని ప్రకంపన.
ఉక్రోషంతో కిరీటి కళ్ళలోకి చూసింది.
"ప్లీజ్..... కొన్ని క్షణాలపాటు నా పరువు కాపాడు" అతని పెదవులు గొణుగుతుంటే పెదవులకి చిరునవ్వు పులుముకుంది.
ప్లాష్ క్లిక్ మంది......
అంతటా చప్పట్లు.....
మరెవరిదో రిక్వెస్టు.....
ఈసారి ఆమెను పొదివిపట్టుకుని హత్తుకున్నట్టుగా నిలబడ్డాడు.
మళ్ళీ కెమెరా క్లిక్ మంది.
అతని స్పర్శ ఆమెలో అలజడిని సృష్టిస్తోంది.
అతని ప్రవర్తన ఆమెలో ఉన్మాదాన్ని రేపుతోంది.
నిస్సత్తువగా అతని గుండెలపై వాలిపోవాలని, మరింతగా అతనిలో ఐక్యమైపోవాలని....
బలంగా అతన్ని పెనవేసుకుపోయిన ఆమె చేతుల్ని మృదువుగా విడదీశాడు.
చిలిపిగా విచ్చుకున్న అతని పెదవులు పలికిన భాషకు ఆమె సిగ్గుపడిపోయింది.
ఛీఛీ.... తనింత చపలచిత్తురాలైందేమిటి.
తనెందుకిలా ఓడిపోతోంది
పార్టీ ముగిసేవరకూ గుంభనంగా ఉండిపోయింది.
అలసట లేకుండా అంతటా తానై హుషారుగా తిరుగుతున్న కిరీటివైపు తదేకంగా చూసింది.
ఏమిటి..... అతన్ని చూస్తుంటే ఏదో మైకం కలుగుతోంది. తొలి స్పర్శలోని గిలిగింతా లేక తనకు తెలియకుండానే అతనిపై ఆరాధన పెరుగుతోందా.....
అలా కానినాడు గతంలోని అతని అఫైర్ గురించి ఆరా తీయాలని ప్రయత్నించిందెందుకు.
ఇందాక అతన్ని విదిలించుకోలేక గువ్వలా ఒదిగిపోయిందెందుకు.....
నిజంగా కిరీటికి గతంలో మరేదన్న కథ ఉందా.....
సరిగ్గా ఈ ఆలోచన ముందు ఆమె అహంకారం ఘోరంగా ఓడిపోయింది.
బఫీలో ఎక్కువగా తినలేకపోయింది.
కిరీటి ఎంత బ్రతిమిలాడినా ప్రయోజనం లేకపోయింది. కారులో కూడా ముభావంగానే వుంది.
ఇంటికి వచ్చాక అలసటగా సోఫాలో వాలిపోయింది.
డ్రెస్ ఛేంజ్ చేసుకువచ్చిన కిరీటి ఆమెను తదేకంగా చూస్తూ కొంతసేపు నిలబడ్డాడు.
కళ్లు తెరిచిన శిల్ప తన గదిలోకి వెళ్ళబోతుంటే "పార్టీలో తప్పనిసరై నేను తీసుకున్న చొరవకు క్షమిస్తావనుకుంటాను" అన్నాడు మరెటో చూస్తూ.
ఆమెకింకా మగతగానే ఉంది.
"ఎవరైనా అనుచితంగా ఐమీన్ నీకు నచ్చని పద్ధతిలో ప్రవర్తించి వుంటే వాళ్ళ తరపున నేను క్షమార్పణలు చెప్పుకుంటున్నాను."
అతడు అదేపనిగా క్షమించమని ప్రాధేయపడుతుంటే ఆమెకు పట్టరానంత ఉడుకుమోత్తనం వేసింది.
"ఛీ ఛీ..... సంస్కారం లేని మనుషులు---"
ఆమె ఎవర్ని ఉద్దేశించి ఆ మాటందో అతనికి అర్థం కాలేదు---
"జయశ్రీ ఏమైనా నోటికొచ్చినట్టు మాట్లాడిందా."
"ఏం..... అంతా చెప్పేసిందని భయంగా వుందా....."
శిల్ప 'అంతా' అంటూ మరీ నొక్కి పలకడంతో అతని కనుబొమలు ముడిపడ్డాయి.
అనవసరంగా తను నాలుక జారాననిపించిందామెకు.
"ఛీఛీ...... కల్చర్ పేరిట మగాళ్ళను కొరకొరా చూడటాలూ..... సివిలైజేషన్ పేరిట చిల్లరగా ప్రవర్తించడాలూ..... అది పార్టీయా లేక ఫ్యాషన్ పెరేడా..... సిగ్గు ఎగ్గులు, వయసు తారతమ్యాలూ చూడకుండా......"