అమ్మవారి దర్శనం చేసుకుని క్రిందకు దిగివచ్చేసరికి ఏడు దాటింది. బస్సులో వెళదామా అనుకుంటే చేతిలో చిల్లిగవ్వ లేదు. వేసవికాలం ప్రవేశిస్తూ ఉండడంవల్ల అప్పటికే ఎండ తీక్షణమౌతోంది. ఒక్కక్షణం అలసటగా నిలబడి అడుగు ముందుకు వేసేసరికి ప్రక్కనే స్కూటరాగినట్టయి ఉలిక్కిపడిచూసింది.
యోగి !
అతన్ని చూడగానే ఆమె పై ప్రాణం పైనే ఎగిరిపోయినట్టయింది. నరాల్లోంచి వొణుకు బయలుదేరింది.
"ఏం ప్రజ్ఞా ప్రొద్దుటే ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? గుడికా ? నాకు చెబితే నేనుకూడా వచ్చేవాణ్నిగా. నాక్కూడా దేవుడూ, గీవుడూ అంటే పిచ్చిభక్తి" అన్నాడు యోగి నవ్వుతూ.
"ఉండు. మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేం ? నువ్వు వెడితే నీ వెంట నేనూ రావాల్సివస్తుంది. అంతకన్న ఎంచక్కా ఇక్కడే నిలబడి కబుర్లు చెప్పుకుంటే బావుంటుంది. ఏం ?"
ప్రజ్ఞ మాట్లాడలేదు.
"నేనిన్న మాటలు చెబుతుంటే ఒక్కదానికి జవాబు చెప్పవేం ? ఒక్కసారి నువ్వు పెదవి కదిపితే నీ మధురమైన గొంతు వినాలని వుంది."
తమ ఇంటి దగ్గరవాళ్ళెవరైనా దగ్గర్లో వున్నారేమోనని ప్రజ్ఞ అటూ యిటూ బిత్తరచూపులు చూసి తల ప్రక్కకు త్రిప్పుకుంది.
"ఏమిటలా చూస్తున్నావు? మనిద్దరం ఇలా దగ్గర దగ్గరగా నిలబడి వుంటే ఎవరన్నా గమనిస్తున్నారేమోననా?"
ప్రజ్ఞ మళ్ళీ మౌనంగానే వుండిపోయింది.
"నీకు మాటలు రావా ?"
... ... ... ... ... ?
"ప్రజ్ఞా నిన్నే !"
ఉన్నట్టుండి ప్రజ్ఞ పెదవులు కదిలాయి. "మీకు దణ్ణం పెడతాను. నా వెంట పడడం మానెయ్యండి" అంది రెండు చేతులూ జోడించి.
ఆమె కళ్ళలో కనిపించీ కనిపించనట్టు నీళ్ళు కూడా తిరుగుతున్నాయి.
యోగి నవ్వాడు. "నీలాంటి అందమైన అమ్మాయి ఇలా చేతులు జోడించి అర్దిస్తోంటే _ మరింత అందంగా వుంది సుమా. ప్రజ్ఞా! ఒకసారి యోగి ఒకమ్మాయి యిష్టపడ్డాడు అంటే అటు సూర్యుడు ఇటు పొడిచినా విడిచిపెట్టేది లేదని నీకు తెలియదులావుంది."
ప్రజ్ఞ ఒళ్ళు జలదరించింది.
తానేం నేరం చేసిందని ఈ శిక్ష? తన దార్న తాను బ్రతుకుతుంటే ఇతనెందుకు చొచ్చుకు వచ్చి వేధించడానికి ప్రయత్నిస్తాడు? అసలు ఒక మనిషి జీవితంలోకి ఇంకొక మనిషి దౌర్జన్యంగా, అర్ధంలేకుండా ప్రవేశిస్తాడు ఏ హక్కువల్ల? ఏ అధికారంవల్ల? ఏ అర్హతా లేనివారు కొంతమంది శక్తిమంతులవుతున్నారు.
"ఏమిటి ఆలోచిస్తున్నావు? నా శక్తిమీద నమ్మకం లేదా?" అన్నాడు యోగి మళ్ళీ.
యోగి మళ్ళీ నవ్వాడు. "నువ్వు నన్నాకర్షించడమే నువ్వు చేసిన నేరం."
"అది నా తప్పెలా అవుతుంది ?"
"కొన్ని తప్పులు చెయ్యకుండానే తప్పులవుతాయి."
అతన్తో వాదన పెంచుకోవడం వ్యర్ధమని తెలిసిపోయింది.
"పాపం. చాలా దూరం నడవాలి. రా! స్కూటర్ మీద తీసుకెడతాను."
ఎంత ధైర్యమతనికి ? ఆమెలో కోపం కట్టలుతెగి ప్రవహించింది. కాని ఈ కోపాన్ని ఎలా వ్యక్తం చెయ్యగలదు?
ఇంతలో "అమ్మాయ్! ఇక్కడ వున్నావేమిటి?" అన్న కంఠం వినిపించింది.
ప్రజ్ఞ ఉలికిపడి తల త్రిప్పి చూసింది.
తమ ప్రక్కవీధిలో వున్న వకుళాంబగారు. ఆవిడతో ఎక్కువ పరిచయం లేకపోయినా ఎక్కడ కనిపించినా చనువుగా పలుకరిస్తూ వుంటుంది.
"గుడికివచ్చి వెడుతున్నానండీ..."
"నేనూ గుడినుంచేలే. మరి ఇంటికి పోకుండా యిక్కడే..." అంటూ ఆవిడ ప్రక్కనే నిలబడివున్న యోగివంక అనుమానంగా చూసింది.
"ఏం లేదులేండి. వస్తున్నా" అంటూ ప్రజ్ఞ ఆవిడకూడా బయల్దేరింది.
వకుళాంబగారు దారిలో "చూడమ్మాయ్ ! ఆ ఆబ్బాయి ఎవరూ?" అనడిగింది.
ప్రజ్ఞ మాట్లాడలేదు.
దానిలో ఆవిడ చాలా విషయాలు కనిపెట్టేసినట్టు చిన్న ఉపన్యాసమిచ్చింది. ఆ వయస్సులో వున్న ఆడపిల్లలు ఎలాంటి ఆకర్షణలకు లోనవుతుంటారో, ఎలా జాగ్రత్తగా మసలుకోవాలో, అలా లేకపోతే ఎన్ని అనర్ధాలున్నాయో ఏకరువు పెట్టసాగింది _ "పెద్దదాన్ని చెబుతున్నా" నంటూ.