Previous Page Next Page 
నెత్తుటిబొట్టు పేజి 20

    "దయా!" అని వినవచ్చింది ప్రక్క గదిలోంచి ఓ బలహీనమైన కంఠం.

    "వస్తున్నానమ్మా!" అంటూ దయాకర్ లేచి నిలబడ్డాడు. చేతిలోని జర్నల్ టేబుల్ మీద పెట్టి నెమ్మదిగా నడుస్తూ ప్రక్క గదిలోకి వెళ్ళాడు.

    ఆ గదిలో మంచంమీద అరవై ఏళ్ళ వృద్దురాలు పడుకుని ఉంది. ఆమె శరీరం శుష్కించి, కళ్ళు కాంతి నశించి ఉన్నాయి.

    "అమ్మా! ఏమయినా కావాలా?" అన్నాడామెను  సమీపిస్తూ చాలా ఆదరంగా.

    "యోగి ఇంకా ఇంటికి రాలేదా?" అనడిగిందామె వేదన పుట్టిస్తున్న కంఠంతో.

    "వస్తాడమ్మా. ఇంకా ఎంత టైమయిందనీ ..."

    "ఎంతా? పదకొండు దాటిపోయింది కదూ ?"

    "లేదమ్మా. ఇంకా పదన్నా కాలేదు."

    "దయా, ఎందుకురా వాడ్ని కప్పిపుచ్చుతూ అబద్ధం చెబుతావు ? నేనెంత రోగ తీవ్రతలో ఉన్నా నిజాన్ని గ్రహించే శక్తి ఇంకా  కోల్పోలేదురా"

    దయాకర్ ఏమీ జవాబివ్వలేదు. తల్లివంక ఓ సారి చూసి కళ్ళు క్రిందకు  వాల్చుకున్నాడు.

    తల్లంటే అతనికి పంచప్రాణాలు. ఏడాది, రెండేళ్ళ క్రితం వరకూ ఆమె మామూలుగానే తిరిగింది. ఇంట్లో తోచనప్పుడల్లా హాస్పటల్ కు వచ్చి రోగుల్ని పరామర్శిస్తూ ఉండేది.

    "చూడండమ్మా. మీకేమన్నా కావాలంటే మొహమాటం లేకుండా అడగండి. అర్ధరాత్రప్పుడయినా సరే ఏదన్నా బాధగా ఉంటే సిస్టర్ కి చెప్పి వెంటనే ఫోన్ చేయించండి. వాడేమన్నా మీకు వూరికే ట్రీట్ మెంట్ ఇస్తున్నాడా? డబ్బు తీసుకుంటున్నాడు. చేస్తున్నాడు. వాడిని అడిగే హక్కు మీకుంది" అనేది.

    "అబ్బాయిగారు మా దగ్గర డబ్బు కూడా పూర్తిగా తీసుకోవడం లేదండీ" అని ఎవరయినా అంటే _

    "ఏమీ ఫర్వాలేదు తీసుకున్నా తీసుకోకపోయినా కేసు చేపట్టాక పేషెంట్ ని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత వాడికుంది" అనేది.

    అలా _ కొడుకు మీద ఎంత ప్రేమ ఉన్నా _ రోగుల్ని వెనకేసుకొస్తూ హాస్పటల్ ని ప్రాణ ప్రదంగా చూసుకునేది సుశీలమ్మగారు.

    "అసలింత   రాత్రి  వరకూ వాడు ఎక్కడ తిరుగుతుంటాడురా ?" అనడిగింది సుశీలమ్మగారు.

    "ఎక్కడకూ తిరగడమ్మా. ఇంకా బాగా చిన్న వయసు కదా. సరదాగా ఫ్రెండ్స్ ఇళ్ళలో కూర్చుని కాలక్షేపం చేసి వస్తాడు."

    "ఎందుకురా వాడ్ని వెనకేసుకొస్తావు ? నువ్వేమో బాగా చదువుకుని పైకి వచ్చావు వాడు కూడా గొప్ప డాక్టరో, ఇంజనీరో కావాలని ఎన్నో కలలు కన్నాను, కాని ..."

    "కేవలం చదువుకుంటేనే పైకి రావాలని  ఏముందమ్మా ? పెద్ద బిజినెస్ మేగ్నేట్ అయి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించవచ్చు. నీ చేతి చలవ వల్ల ఎంతమంది పైకి రాలేదమ్మా ? నీ ఆశీర్వాద బలం వల్ల వాకు తప్పకుండా అభివృద్ధిలోకి వస్తాడమ్మా. అదిగో స్కూటర్ చెప్పుడవుతోంది. యోగి వచ్చేసినట్టున్నాడు" అంటూ దయాకర్ గదిలోంచి బయటకు వెళ్ళాడు.

    అయిదు నిమిషాలు గడిచాక యోగి తలుపులు తీసుకుని లోపలికి వచ్చాడు. హాల్లో నిలబడి ఉన్న అన్నగారివంక చూసి చూడనట్లు  తన గదిలోకి విసురుగా వెళ్ళిపోతూంటే, అతను వెనకనుండి "యోగీ!" అని పిలిచాడు.

    తల త్రిప్పి, "ఏమిటి?" అని విసుగ్గా ఆగాడు.

    "అమ్మ నీ కోసం నిద్ర పోకుండా ఎదురు చూస్తోంది. ఒకసారి కనిపించి వస్తే బావుంటుందేమో."

    "నా కోసం ఎదురుచూడడం దేనికి? నాకిలాంటివి నచ్చవు."

    "నువ్వు ఇంటికి వచ్చేదాకా ఆమెకు నిద్ర పట్టదురా."

    "నిద్ర పట్టకపోతే స్లీపింగు టాబ్లెట్స్ ఇవ్వకపోయావా?"

    దయాకర్  ఏదో   అనబోయి, తమాయించుకుని _ "పోనీలే, త్వరగా డ్రెస్ చేంజ్  చేసుకుని రా. నీ కోసం  అన్నం తినకుండా వెయిట్ చేస్తున్నాను.  ఇద్దరం కలిసి భోజనం చేద్దాం. నాకు ఆకలేస్తుంది కూడా" అన్నాడు.

    "నా కోసం అన్నం తినకుండా వెయిట్ చెయ్యడం _ ఇలాంటి ఫార్మాలిటీస్ నాకు నచ్చవని లక్షసార్లు చెప్పాను. ఫ్రీగా తిరగనియ్యకుండా ఏమిటి న్యూసెన్స్. నేను బయట తినేసి వచ్చాను. నన్ను డిస్టర్బ్ చెయ్యకు" అని యోగి విసురుగా తన గదిలోకి వెళ్ళి తలుపు భడాలున మూసేసుకున్నాడు.

   
                                         8


    జానకిరామయ్యగారిని  ఆస్పత్రిలోనుంచి  ఇంటికి  తీసుకొచ్చేశారు. పెద్దకూతురు పుట్టింటికి వచ్చి రెండు రోజులుండి వెళ్ళిపోయింది. 'మా ఆయన కిబ్బండిగా ఉంటుందం'టూ.

    హాస్పటల్ నుంచి తండ్రిని డిశ్చార్జి చేశాక నాలుగయిదు రోజులు గడిచాక శుక్రవారం రోజున ప్రజ్ఞ యథాప్రకారం తెల్లవారుఝామునే నిద్రలేచి కనకదుర్గగుడికి వెళ్ళింది ఈ మధ్య తండ్రి అస్వస్థతమూలంగా హాస్పటల్ చుట్టూ తిరుగుతూ ఉండడంవల్ల పూజలూ, పునస్కారాలూ సరిగా చెయ్యలేకపోతోంది. ఏకాగ్రత కుదరడంలేదు. టైమూ ఉండడంలేదు. సరిగా చెయ్యలేకపోతోంది. సరిగా చెయ్యలేకపోతున్నాననే అనే బాధవల్ల మనస్సు కుదురుగా ఉండడంలేదు.
 

 Previous Page Next Page