Previous Page Next Page 
పాదాభివందనం పేజి 21

పుట్టుకతో వచ్చిన అందానికి తోడు యవనం తెచ్చిన నిగారింపు మరింత వన్నె తెచ్చింది. అతడి కోరమిసం, రెండు పాయలుగా తీసి వెనక్కి దువ్విన తుమ్మెద రెక్కల్లాంటి శిరోజాలు ప్రతిరోజూ పొలంలో, ఇంట్లో పనిచేయడం వల్ల నిత్య వ్యాయమ కటినికృత దేహయష్టి లా కండలు తిరిగిన శరీరం, దాదాపు ఆరడుగుల బిగుతైన దవడ కండరాలు, మరీ విశాలమైన చాతి అతని నలుగురితో సమానంగా కాక పది పదుగురిలో ఒకడిగా చూపెడతాయి.

చుంగులు పోసి కుచ్చేళ్ళు తీర్చి కట్టిన నారాయణ వనం నేత పంచె, నిండు చేతుల కమిజు, కుచ్చులు విడిచిన తలపాగా, నడుముకి పట్టాతో తెలుగు యోధుడిగా కదిలిన రామన్నని అంతా కళ్ళప్పగించి చూశారు.

ఓ మనిషి దారి చూపుతుండగా రాత్రి తొలి జాములో సగం మలిగిన తర్వాత సరయూ తీరానికి చేరుకున్నాడు రామన్న. సీతమ్మ వారి ఇష్ట సఖిమణి సీతామహాలక్ష్మి ఆ వేళకే అక్కడికి వచ్చి కూర్చుంది.

జాడ తెలిసినా విలాసం తెలిసినా పదేపదే రావడానికి వీల్లేదని రాచ నగరు కట్టుబాట్ల మధ్య నాలుగేళ్ళు నిండా గడిపిన సీతకి తనవాడు, తనని మనువాడిన మనసైన వాడు, తనని వెదుక్కుంటూ తిరిగి తనని తన ఊరికి, తన ఇంటికి తోడుకొని పోవడానికి వచ్చాడని తెలియగానే తన జీవితంలో పూర్ణ చంద్రోదయకాలం వచ్చిందని తెలిసిపోయింది.

గుండె నిండా ఆనందంతో వచ్చి అతని కోసం-

అభిసారికలా వేచి వుంది.

భార్యా భర్తలయ్యాక ఎడబాటేరుగని ఆ జంట ఇన్నేళ్ళు వియోగం తర్వాత కలుసుకున్న ఆ బావా మరదళ్ళు క్షణం పాటు ఎదేమిటో తెలియని స్థితిలో ఉండిపోయారు.

సీత రామన్న గుండెలపై వాలిపోయింది.

ఇన్నేళ్ళ జీవితంలో పరిషంగ సుఖం అంటే ఏమిటో తెలియని రామన్నకి అది మన్మధుడి పూమాలలా అన్పించింది.

సేద తీరిన హృదయాలు బాసాడుకున్నాయి.

ఉసులు ముగిశాయి.

ఆ రాత్రి కబుర్లు ఆనందంతో తడిశాయి.

ఆ రాత్రి వేళ-- ఆ వెన్నెల వెలుగుల్లో రామన్న --తల్లి తనతో పదిలంగా పంపిన చింతాకు, చింతకాయలు, చిగురు చింతకాయ పచ్చడి 'కనుక' అంటూ ఇచ్చాడు.

అంతేకాక దారి భత్యంగా కట్టి ఇచ్చిన తమ సిమ జొన్న రొట్టి ఉల్లికారం కూడా ఇచ్చాడు.

కళ్ళల్లో నీళ్ళుబుకుతుండగా , నోరు మండుతున్నా ఇష్టంగా తింది సీత. మధ్య మధ్య ఓ రొట్టె ముక్క తుంచి బావకి తినిపించింది. ప్రయాణ విషయం ముచ్చటించుకున్నారు.

వైశాఖ శుద్ధ పంచమి బుధవారం ఆర్ద్ర నక్షత్రంలో సూర్యోదయానికి ముందు రెండు గడియల వేళలో వారి ప్రయాణ ముహూర్తం నిశ్చయించినట్టుగా చెప్పింది సీత.

పరిరోజుల పాటు నగరంలో ఉండడం నగర విశేషాలు చూడడం రామన్నకి ఉత్సాహంగానే ఉంది. ప్రతిరోజూ సరయూ తీరంలో కలుసుకోవచ్చని చెప్పింది సీత.

తిరిగి వెళ్ళేలోగా సీతారాముల దర్శనం కూడా ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చింది. వైకుంఠం విడిచి భూలోక వైకుంఠం అయోధ్యలో కాపురం చేస్తున్న లక్ష్మీనారాయణులని కళ్ళతో చూడడం బొందితో వైకుంఠం వెళ్లినట్టుగా భావించాడు రామన్న.

ఔత్తరాహులకి తెలియని ఆ వంటకాలు తనే చేసింది సీత! ఎండు మిరపకాయలు ఎండు చింతాకు వేయించి పొడి కొట్టింది. ఆ మిరపకాయల ఘాటు అంతపురంలో అల్లుకుంది. పచ్చి చిగురుని మిరపకయాలని వేయించి పచ్చడి చేసింది.

కందిపప్పు ఉడికించి చిగురు పెట్టి ముద్దపప్పు చేసింది. పాత చింతకాయ పచ్చడి నూరి తిరగమోత పెట్టింది. కొత్త చింతకాయలు పచ్చడి కొట్టింది.

అన్ని చేసుకున్నాక-- అవి తన పాలిదైవమైన సీతాదేవికి చూపక, రుచి చూపక అరగించేందుకు ఇష్టపడలేదామే అన్ని ఓ వెండి కంచెంలో అమర్చి, పెద్ద అరిటాకు మూత పెట్టుకుని అమ్మగారి మందిరానికి కదిలింది.

అమ్మగారి ఇష్ట సఖీ మణి కాబట్టి ఆమెకు ఏవేళ అయినా ఏకాంత దర్శనానికి అభ్యంతరం ఉండదు. అనుజ్ఞా అవసరం లేదు.

ఘుమఘుమ లాడుతున్న ఆ వంటకాలను చూసి సీతాదేవి నోరూరింది.

"సీతా! ఈరోజు ఆర్యపుత్రులు అరగింపుకి వస్తామన్నారు! మీ రాణి గారి కోసం నువు తెచ్చిన ఈ ఆంద్ర వంటకాలు ఆ మారాజుకు తినిపిస్తాను' సీతమ్మ వారి మాటలకి ఒక్క క్షణం పాటు నేవ్వేరపోయినా-- ఆ మరుక్షణం సీతామాహాలక్ష్మి గుండెలు ఆనందంతో తాండవించాయి. "నువ్వు దగ్గరుండి వడ్డన చూడు ; అందా తల్లి.

ఏనుగెక్కినంత సంబరం అయిందామెకి. సీతరాములిద్దరికీ బంగారు పళ్ళెరాల్లో వడ్డన జరిగింది. సీతాభోగాలనే ఆంధ్రదేశంలో పండిన బియ్యంతో వండిన అన్నం- ఔత్తరాహులు తినే పలుచని రొట్టెలు, వారు ఇష్టంగా తినే తీపిపదార్ధాలు, నెయ్యి, కూరలు అన్ని విడివిడిగా చిన్న చిన్న గిన్నెల్లో వడ్డించారు.

వాటి అన్నిటిని కాదన్నట్టు-- నాలుగు గిన్నెల్లో కొత్త వంటకాలు ' రామయ్య తండ్రికి ఆరగింపు పెడుతున్నందుకు సీతా మహాలక్ష్మికి జన్మ ఫలిమ్చినంత అనందం ఉంది.

కళ్ళతోనే ప్రశ్నించాడు ప్రభువు.

సీతమ్మ తల్లి స్వరం వివరించింది.

పట్టాభిషేకం ఆగిపోయి, భార్యతో తమ్ముడితో అరణ్యవాసం వెళ్ళిన రోజులు గుర్తొచ్చాయి. భరద్వాజ మహర్షి ఇచ్చిన విందులు 'ఆనాడు' భుజించిన ఆంధ్రుల శాకాపాకాలు గుర్తొచ్చాయి.

నాలుక చుర్రుమంటున్నా, కళ్ళల్లో లీలగా నీళ్ళు కదులుతున్నా ఇష్టంగా తిన్నరిద్దరూ సీతారాముల ఇష్టం కష్టం కళ్ళారా చూసి సీతామహాలక్ష్మి తరతరలాడి పోయింది.

"చింత.....అంటే తింత్రిణి వృక్ష సంపదా ఇది? రాములవారు అడిగారు భోజనానంతరం కదళఫలాలు, ద్రాక్ష ఫలాలు సేవిస్తూ చారుడు తలూపాడు.

రాముడూ తలూపాడు. "మా గురుదేవులు విశ్వామిత్రుల వారి సృష్టి ఆ మిరప పంట'

పదిరోజుల పాటు ప్రతి పూట చిగురుపొడితో ఓ ముద్ద చిగురు పచ్చడితో తిన్నారు శ్రీరామచంద్రుడు. ఆ పదిరోజులూ ఆయనగారితో అమ్మగారు ముద్దు తీరేలా తిన్నారు. అయితే ఆ పది రోజుల్లోనూ అప్పుడె కాచిన ఆవునెయ్యి భారీగా ఖర్చైపోయింది.

పదిరోజుల తర్వాత ఓ ఉదయం అంతపురంలో ఓ గోడవారన ఓ మొలక తలెత్తింది. ఎప్పుడూ చూడని ఆ మొక్క అందరికి ఆకర్షణ కేంద్రం అయ్యింది. రామన్నవారితో గర్వంగా చెప్పాడు "అది చింత మొక్క!"

 Previous Page Next Page