Previous Page Next Page 
ప్రియా.....ప్రియతమా పేజి 21


    అలా అతను తనకున్న చెడ్డ అలవాటు చెబుతుంటే తను 'అతని మొహమ్మీదే, తన అసహ్యాన్ని ప్రకటించేసింది.
    'హమ్మయ్య' అనుకుంది.
    వాళ్ళు వెళ్ళిపోయారు ఆ రాత్రి....
    'అబ్బాయి ఎలా వున్నాడురా' అడిగాడు తండ్రి. సమాధానాలు ముందే ప్రిపేర్ చేసుకుంది. ఆ అబ్బాయి తన మాటలతో ఖచ్చితంగా హర్ట్ అయి వుంటాడు. తను "నో అని చెప్పడంకన్నా ఎస్" అంటే సరిపోతుంది.
    అతను తనను ఎలాగూ 'నో అంటాడు కాబట్టి, తనను అతనికిచ్చి పెళ్ళిచేసే సమస్యే లేదు.
    'అతనికి సిగరెట్, విస్కీ, అమ్మాయిలతో తిరగడంలాంటి అలవాట్లున్నాయట నాన్నా...అయినా అతనికిష్టమైతే నాకూ ఇష్టమే. మీ ఇష్ట ప్రకారం చెయ్యండి' అంది.
    'ఛ.... ఛ.... నువ్వు పొరబడి వుంటావమ్మా....అతను చాలా సిన్సియర్ లా వున్నాడు. ఫ్రెండ్స్ ఉన్నాక ఏదో అప్పుడప్పుడు సిగరెట్ తాగక తప్పదు. ఈ రోజుల్లో అది కామన్. స్టయిల్ కూడా...."
    'అమ్మాయిల వీక్నెస్ కూడా....."
    'ఛ.... ఛ.... అతనలాంటివాడు కాదమ్మా...అతనికి అమ్మాయిల వీక్నెసే కాదు. నరాల వీక్నెస్ కూడా లేదు దానికి నేను పూచీ..."
    "అతనికి నేను నచ్చను." అంది తండ్రి మొహంలోకి చూస్తూ...
    ఆరోజు సాయంత్రమే శ్రీచరణ్ బామ్మ తండ్రికి ఏదో కబురు పంపించిందని తెలిసింది.
    గంభీరంగా వున్నాడు శర్మ.
    "ఖచ్చితంగా తను ఆ అబ్బాయికి నచ్చి వుండదు' టెన్షన్ గా తండ్రి మొహంలోకి చూడసాగింది ప్రనూష.
    'ఆ అబ్బాయికి నువ్వు..."
    "చెప్పండి నాన్నా....ఫర్లేదు. నేను తట్టుకోగల్ను....నేను అతనికి నచ్చలేదా?!! అంది లోలోపల సంతోషిస్తూ.
    'కాదమ్మా....చేసుకుంటే నిన్నే పెళ్ళి చేసుకుంటాడట, లేకపోతే బ్రహ్మచారిగా వుండిపోతాడట"
    షాకయింది ప్రనూష.
    'అవునమ్మా....బామ్మగారు చెప్పారు. ఆ అబ్బాయి ది కూడా అదే అభిప్రాయం మన పంతులుగారి ముందే చెప్పాడట.
    చాలా డల్ గా అయిపోయింది ప్రనూష.
    "ఇప్పుడేంటి చేయడం, తనకిష్టం లేకుండా పెళ్ళి చేసుకోవాలా? ఈ సంబంధం వద్దని చెబితే...సాంప్రదాయం అనీ, అదనీ, ఇదనీ తన గొంతు కోస్తున్నారు. వీల్లేదు. ఈ సంబంధం తనకు అక్కర్లేదని చెప్పాలనుకుంది.
    తండ్రి దగ్గరకు వచ్చింది. లోపల్నుంచి తల్లీ, తండ్రి మాటలు వినిపిస్తున్నాయి.
    "సత్యవతీ....ముహూర్తాలు దగ్గర్లోనే వున్నాయి. పెళ్ళి పనులు హడావిడిగా చేయాలి. అవసరమైతే మీ తమ్ముడ్ని రమ్మను. కాస్త తోడుగా వుంటాడు' అంటున్నాడు.
    'అది సరేనండీ.... కానీ ఆ అబ్బాయికి ఈ సంబంధం ఇష్టమేనా? కనుక్కోలేకపోయారా?" అంది.
    అంతే....తండ్రి గయ్ మంటున్నాడు.
    'నీ కసలు బుద్ది ఉందా? ఒకవైపు ముహూర్తాలు పెట్టిస్తోంటే మరో పక్క నీ వెధవ అనుమానాలతో చంపుతావు. అది నా కూతురు. మనింటికో పద్దతి వుంది. మా తాత ముత్తాతలనుంచేకాదు. వాళ్ళ తాత ముత్తాతలనుంచి ఈ సాంప్రదాయం  వుంది.
    పెద్దలు కుదిర్చిన సంబంధాలు చేసుకోవల్సిందే. మా నాన్న నిన్ను చూపించి పెళ్ళి చేసుకోమనగానే! నీ మెళ్ళో  తాళి కట్టలేదూ....అనవసరంగా దానికి లేనిపోనివి నేర్పకు. అదే జరిగితే నట్టింట్లో నా శవం వేలాడుతుంది." కోపంగా అంటున్నాడు తండ్రి.
    "ఛ.....ఛ.....శుక్రవారంపూట అవేం మాటలండీ..." అంటోంది తల్లి.
    "ఈ సంబంధం తనకిష్టం లేదని తండ్రితో చెప్పాలనుకున్న ప్రనూషకు ఇక తనకా అవకాశం లేదని అర్ధమైంది.
    కళ్ళు మూసుకుంటే, తండ్రి సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకున్న దృశ్యం కనిపించింది.
    తప్పనిసరిగా  పెళ్ళికి ఒప్పుకుంది.
    శ్రీచరణ్ తన మెడలో తాళి కడుతున్నప్పుడు కోపంగా చూపింది.
    అతనూ కోపంగానే చూసినట్టనిపించింది.
    అతను తన మెడలో తాళి కడుతున్నప్పుడు కావాలనే ఎవరూ చూడకుండా అతని పాదాన్ని గట్టిగా గిచ్చింది.
    అతను తలంబ్రాల పళ్ళెం ఎత్తి తన తలమీద గుమ్మరిస్తూ అన్నమాటలే చెవుల్లో గింగురుమన్నాయి మరోసారి.
    "ఈ ఇత్తడిపళ్ళెంతో నెత్తిన బాదితేగాని నీకు బుద్దిరాదు' అన్నప్పుడు తనూ వూరుకోకుండా మరో పళ్ళెం లేపి విసురుగా అతని మీద పోసింది.
    అంతా తలంబ్రాల సరదాలనుకున్నారు.
    కానీ తామిద్దరికే తెలుసు అసలు సంగతి.
    పెళ్ళి రెండు క్రూర జంతువులకు జరిగినట్టుగా జరిగింది.
    అలక పాన్పుమీద అల్లుడు అలిగాడని అందరూ అంటుంటే మెల్లగా తండ్రి చెవిలో వెళ్ళి తను గొణిగింది.
    "చూశారా నాన్నా ఎంత చదువుకున్నా ఎలా అలుగుతున్నాడో, అతను మంచివాడు కాదని చెప్తుంటే నువ్వే వినిపించుకోలేదు..." అని తను అంటే తండ్రి నవ్వేస్తూ....
    "అలకపాన్పు మీద ఏ అల్లుడైనా అలగాకపోతే అసలు తను మగాడేకాదు..." అని తను మాటల్ని తిప్పిపారేశాడు.
    బిక్కచచ్చిపోయింది తను.
    ఎంత పొగరు. ఎంత అహంకారం. మనుగుడుపులపుడు, అప్పగింతలప్పుడు ఏదో ఒకటి అని తనని ఏడిపిస్తూనే వున్నాడు.
    బిందెలో వుంగరాన్ని ఇద్దర్నీ తియ్యమన్నప్పుడు లోపల తన చేతిని గిచ్చి మరీ నీళ్ళ బిందెలో వున్న వుంగరాన్ని తీసి పంతులుగారికి అందించాడు.
    కోపంగా చూసిన తననే మాత్రం లెక్కచెయ్యలేదు. మట్టెలు కాలికి తొడుగుతూ తనవంక చూసిన వంకర చూపు జన్మలో తెను మార్చి పోగలదా?
    చిటికిన వేలు పట్టుకుని సప్తపదిగా ఏడడుగులు నడవమన్నప్పుడు వేలిని గట్టిగా మడిచి నొక్కిపెట్టాడు. బాధని బలవంతాన అణుచుకుంది.
    పెళ్ళి బంతిలో భోజనానికి వెండి కంచాలు వేసి ఇద్దరికీ వడ్డించి, పెద్దలు, ఫ్రెండ్సూ నోట్లోపెట్టి తినిపించుకోమంటే..అక్కడికి తనేదో తిండికి మొహం వాచి వున్నట్టు జాంగ్రీ మొత్తం నోట్లో కుక్కాడు.

 Previous Page Next Page