Previous Page Next Page 
ఆఖరి ఘడియలు పేజి 21

 

    మరుక్షణంలో అతని మెడమీద తన బలమంతా ఉపయోగించి పిడికిలి దెబ్బ వేశాడు.
    ఆ ఫోర్సుకి అతను వెళ్ళి దూరంగా వున్న గోడను కొట్టుకుని కిందపడ్డాడు. అతని చేతిలోని కత్తి ఎగిరి దూరంగా పడింది.
    ఆ హరాత్సంఘటనకి నిశ్చేష్టుడైన లావుపాటి వ్యక్తీ కోలుకుని భవానీశంకర్ వేపు తిరిగేసరికి అతని ముఖం మీద పిడిగుద్దు పడింది. అతనూ అరటి చెట్టులా వెనక్కి విరుచుకుపడిపోయాడు. ఈలోగా సన్నటి వ్యక్తీ తన శక్తినంతా కూడాదీసుకుని లేచి నిలబడుతూ జేబులోకి చేయి పోనిచ్చి ఓ చిన్న పిస్టల్ బయటికి తీశాడు. అది గమనిస్తూనే భవానీ శంకర్ తన పక్కనే వున్న ఫోల్దింగ్ చైర్ తీసి అతని మీదకు బలంగా విసిరాడు. కుర్చీ అతన్ని మళ్ళీ నేల కూల్చింది. భవానీశంకర్ కుర్చీ విసిరేలోగా లావుపాటి వ్యక్తీ లేచి నిలబడి నడుము చుట్టూ బిగించి వున్న చెయిన్ తీసి భవానీ శంకర్ మీదకు తిప్పాడు.
    అది మొఖానికి సమీపంగా వచ్చే సమయానికి అతని రెండు చేతులూ అడ్డం పెట్టుకోవడంతో అతని చేతుల మీద చర్మం తెగీ క్షణాల్లో రక్తం ముద్దల్లా కనిపించసాగినాయ్. చేతులూ రెండూ తెగి పడిపోయినంత బాధ అతన్ని పిండేయసాగింది. అదే అదనుగా చూచుకుని సన్నని వ్యక్తీ మళ్ళీ కిందపడిన పిస్టల్ అందుకొని భవానీ శంకర్ వేపు గుడ్డిగా కాల్చబోయాడు కాని అప్పటికే భవానీ శంకర్ మెరుపులా ఎగిరి కాలితో అతని ముఖం మీద తన్నాడు. సరిగ్గా అప్పుడే పేలిన పిస్టల్ బుల్లెట్ భవానీ శంకర్ కాలి పైనుంచి వెళ్ళి గోడకు తగిలింది. ఆ శబ్దంతో పాటు పిస్టల్ కూడా ఎగిరి స్మితా రాణి కాళ్ళ ముందు పడింది. రెండు చేతులతో ముఖం పట్టుకుని కూలబడిపోయాడు సన్నటి వ్యక్తీ బాధతో గట్టిగా అరుస్తూ.
    భవానీ శంకర్ స్మితారాణి దగ్గరకు నడిచాడు. ఆమె నేల మీద కూలబడి కళ్ళు మూసుకుంది. పిస్టల్ జేబులో వేసుకుని ఆమెను రెండు చేతులతోనూ ఎత్తుకుని లోపలి గదిలో మంచం మీదకు చేర్చాడతను.
    రెండో మంచం మీద నిద్రపోతున్న తులసి అప్పటికే ఆ శబ్దాలకు నిద్రలేచి కుర్చుని ఉంది.
    "గుడ్ మాణింగ్ అంకుల్ -" అంది నిద్రకళ్ళతోనే భవానీశంకర్ ని చూస్తూ.
    "గుడ్ మాణింగ్  మైడియర్ చైల్డ్ - అర్జంటుగా ఆ గ్లాసులోని మంచినీళ్ళు ఇటు అందివ్వమ్మా! స్మితా ఆంటీకి ఫస్ట్ ఎయిడ్ చేద్దాం"
    తులసి లేచి టేబుల్ మీదున్న మంచినీళ్ళ గ్లాసు అతనికి అందించింది. కర్చీఫ్ తడిపి మెడమీద గాయమైనచోట తుడిచాడతను. తరువాత ముఖం మీద నీళ్ళు చల్లాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచింది స్మీతారాణి.
    "అంటీకి ఏమయిందంకుల్? మెడ మీద రక్తం ఎలా వచ్చింది?" అడిగింది తులసి ఆశ్చర్యంగా.
    "విలన్స్ వచ్చి ఫైటింగ్ చేశారు డియర్! మీ ఆంటీని చంపబోతే నేను కరాటే , బాక్సింగ్ , కుంగ్ పూ చేసి వాళ్ళను చావగొట్టి ఆంటీని రక్షించాను."
    తులసి ఆనందంతో పొంగిపోయింది! "అబ్బ!  చాణక్య శపదంలో ఫైట్స్ అంకుల్?"
    "కొంచెం తేడా వుంది డియర్! దొంగ మొగుడులో ఫైట్స్ అనుకో......."
    'అబ్బ! వండర్ ఫుల్ అంకుల్! చిరంజీవిలా ఫైట్ చేశావా అంకుల్."
    "చిరంజీవి గ్రాండ్ ఫాదర్ లా చేశాను డియర్!"
    "అయ్యో! నన్ను నిద్రలేపి ఫైటింగ్ చేయాల్సిందంకుల్."
    సరిగ్గా అప్పుడే బయట కారు స్టార్టయిన శబ్దం వినిపించింది. భవానీ శంకర్ ఒక్క ఉదుటున లేచి బయటకు పరుగెత్తాడు. హల్లో ఆ యిద్దరూ వ్యక్తులూ లేరు. అప్పటికి దూరంగా వెళ్ళిపోతున్న కారు ఎర్రదీపం కనబడుతోంది.
    అతని వెనుకే స్మితారాణి కూడా వచ్చి హాల్లో నిలబడింది.
    "స్పృహ తప్పి పడ్డారనుకున్నాను - రాస్కెల్స్ ! పారిపోయారు" అన్నాడు భవానీ శంకర్. స్మిత మాట్లాడలేదు. వెక్కి వెక్కి ఏడ్చేయసాగింది హటాత్తుగా.
    భవానీశంకర్ ఆశ్చర్యంగా ఆమె దగ్గరకు నడిచాడు.
    "అరె! ఏడుస్తున్నారా? ఎందుకు? ఇప్పుడింక భయమేమీ లేదు స్మితాజీ! అల్ ఈజ్ వెల్!" తులసి ఆశ్చర్యంగా చూస్తుంది స్మిత వేపు.
    స్మిత చప్పున కన్నీరు తుడిచేసుకుంది.
    "మీరు చెపితే నేను నమ్మలేదు. అయాం రియల్లీ సారీ -" అంది పశ్చాత్తాపంతో.
    "ఇప్పుడు కావలసింది పశ్చాత్తాపం కాదు మై డియర్ ఫ్రెండ్! రెండు కప్పుల వేడి "టీ"! మనిద్దరికీ అది చాలా అవసరం అనిపిస్తోంది."
    "ఇప్పుడే చేసుకోస్తాను."
    "ఈలోగా నేను ఈ హితులకు తగిలిన గాయాలను మా స్టూడెంట్ సహాయంతో రిపోర్టు చేసేస్తాను. " అంటూ బాత్ రూం వేపు నడిచాడతను.
    "నా మూలానే మీకీ గాయాలు - నాకు చాలా సిగ్గుగా వుంది " అంది స్మితా రాణి బాధగా.
    "నో నో - నాకు చాలా ఆనందంగా వుంది మిస్! ఎచ్చట గాయాలు ఉండునో అచ్చట వసంతము వచ్చును. ఎచ్చట వసంతము వచ్చునో అచ్చట హృదయములు వికసించును -ఎచ్చట హృదయములు వికసించునో -"
    స్మిత సిగ్గుపడి వంటింటి వేపు వెళ్ళిపోయింది.
    "డైలాగ్ ఏ సినిమాలోదంకుల్ - ఎక్కడా విన్నట్లు గుర్తులేదే"
    "ఈ పిక్చర్ ఇంకా రాలేదు డియర్ స్టూడెంట్! ఏ క్షణంలోనయినా రిలీజ్ కావచ్చు. వేచి యుండుము."
    రక్తం అంటిన మోచేతిని నీళ్ళతో కడిగి డ్రెస్సింగ్ టేబుల్ మీదున్న ఫేస్ పౌడర్ ని గాయాలకు అద్దాడు భవానీశంకర్.

 Previous Page Next Page