Previous Page Next Page 
ఆత్మజ్యోతి పేజి 21

   

    డిసెంబరు వచ్చింది. న్యూజిలాండ్ నుంచి క్రికెట్ టీం ఇండియాకు వచ్చింది. మొదటి టెస్ట్ హైదరాబాద్ లో ఏర్పాటయింది. చంద్రానికి సెలక్షన్ లో పాల్గొనమని క్రికెట్ బోర్డునుండి ఆహ్వానం వచ్చింది. అతను వెళ్ళివచ్చాడు. బ్యాటింగ్కోసం కాకపోయినా, బౌలింగ్ అయినా తనకు ఛాన్సు వస్తుందని కొండంత ఆశ పెట్టుకున్నాడు. కానీ అతను సెలక్టు కాలేదు. హతాశుడై ఇక క్రికెట్ ఊసు ఎత్తకూడదనుకున్నాడు. కానీ టెస్టు వివరాలు పేపర్లో చూడగానే ఉత్సాహం చంపుకోలేకపోయాడు. శివనాథరావుకి వైర్ యిచ్చి బయల్దేరాడు.
        
    స్నేహితుడు స్టేషన్కొచ్చి కలిశాడు. చంద్రం అతన్ని కావలించుకున్నంత పనిచేసి 'ఏరా బ్రదర్ చిక్కిపోయావేం?' అన్నాడు.
    
      "మరి ఎమ్.బి.బి.యస్. చదువు..." అంటూ నసిగాడు శివనాథరావు.
    
    "బాబోయ్! నువ్వు కాబట్టి చదువుతున్నావు కానీ- నేనైతే నా ఎత్తు దానం పోసినా చదవను. నాకు లైఫ్ లో రెండే యాంబిషన్స్ క్రికెట్, లగ్జరీ."
    
    ఇద్దరూ యూనివర్శిటీ హాస్టల్ కి వచ్చారు "ఏరా? ఈ సమాధిలో జీవితం బాగుందా?" అన్నాడు చంద్రం యూనివర్సిటీ బిల్డింగ్ చూస్తూ.
    
    భోజనం చేస్తూ 'ఎందుకు తీసుకున్నావురా భాయి ఈ కోర్సు? నువ్వు ఫస్టు ఆర్టిస్టువి, కళారాధకుడివి ఆల్ రౌండ్ డెవలప్ మెంట్ కోసమా? అంతగా దేశాన్ని చెండుకు తినకూడదు!"
    
    శివనాథరావు నవ్వి ఊరుకున్నాడు.
    
                                                                *    *    *
    
    మరునాడు సాయంత్రం సికింద్రాబాదులో ఓ నాటకం వుంది. నాటకం పేరు రాగదీపం. మొదటిసారిగా పేరుకెక్కిన సరళ ఆర్ట్ థియేటర్ వాళ్ళు దాన్ని ప్రదర్శిస్తున్నారు. నాటకాన్ని రాసిందీ, డైరెక్టు చేసిందీ కళాసమితి యజమాని జానకిరామే. జానకిరామ్ గురించి చంద్రం యిదివరకు చాలాసార్లు విన్నాడు. అందుకని ఆ నాటకానికి పోదామంటే పోదామని పట్టుబట్టాడు. సరే-మిత్రులిద్దరూ బయల్దేరి వెళ్ళారు.
    
    స్నేహితులిద్దరూ ముందు సోఫాలలో కూర్చున్నారు. నాటకం మొదలైంది.
    
    చంద్రం స్నేహితుడిని గిచ్చి 'చూడు ఎంత బాగుందో ఆ ఆమ్మాయి. ఆ అమ్మాయేనా సుజాత?' అన్నాడు.
    
    'అవునండీ! ఇదే మొదటిసారి నటించటం. జానకిరాం ఫ్రెండ్" అన్నాడు. ప్రక్కనున్న పెద్దమనిషి.
    
    రంగురంగుల దీపాలకాంతిలో నిజంగానే మెరిసిపోతోందిఆ నటీమణి. ఒక్క అందమేకాదు, అంతకన్నా నటనకూడా అద్భుతంగా వుంది. చంద్రం కళ్ళప్పగించి చూడసాగాడు.
    
    "ఆమెను ఎవరు లవ్ చెయ్యరు?" అన్నాడు చంద్రం స్నేహితుడి చెవిలో.
    
    "కొంపతీసి...నువ్వుగానీ.....ఆఁ" అన్నాడు శివనాథరావు.
    
    "అబ్బే లేదు. ఆ మెరుపుతీగె నాటకాల్లోకి ఎలా వచ్చిందా? అని" అన్నాడు చంద్రం పరధ్యానంగా.
    
    దాదాపు రెండున్నర గంటలు గడిచి నాటకం ముగిసింది. శివనాథరావు లేచి బయటకు పోవటానికి ఉద్యుక్తుడవుతున్నాడు. "అటుకాదు యిటు" అని చంద్రం స్నేహితుడి చెయ్యిపుచ్చుకుని గబగబా గ్రీన్ రూమ్ లోకి లాక్కుపోయాడు.
    
    చివరి దృశ్యంలో రాగలత (సుజాత ధరించిన పాత్ర) చనిపోతుంది. వీళ్ళు లోపలకు వెళ్ళేసరికి సుజతః యింకా అదే మూడ్ లో నేలమీద పడివుంది.
    
    నాటకంలో కథానాయకుడి వేషం వేసిన యువకుడు ఆమెను సమీపించి చెవిలో "సుజాతా లే, నాటకం అయిపోయింది" అన్నాడు మృదువుగా అతను మంచి అందగాడు, పేరు ప్రభాకరం.
    
    ఆమె ఉలికిపడి సిగ్గుపడుతూ "నేను నిజంగా పడిపోయానా?" అని ప్రశ్నించింది.
    
    "ఎంత అపూర్వంగా నటించావనుకున్నావ్?" అన్నాడు ప్రభాకరం.
    
    ఆమె సిగ్గుపడి నవ్వింది. కపోలాలు ఎర్రబారి దీపకాంతికి మిలమిలా మెరిశాయి.
    
    చంద్రం చప్పున ఆమెకు చేరువగాపోయి "కంగ్రాచ్యులేషన్స్ నేను పుట్టాక యింత గొప్పరూపం, నటన ఎప్పుడూ చూడలేదు మిస్ సుజాతాదేవీ" అన్నాడు.
    
    ప్రభాకరం ఈ నూతన అగంతకునివంక కాస్త ఎర్రగా చూశాడు. ఆమె కంపిస్తూన్న తెల్లని చేతుల్తో నమస్కారం పెట్టింది.
    
    "నిజంగా యివాళ డ్రామాకు నేను మిస్ అయివుంటే ఆ విచారం జన్మ జన్మలకూ పోయేది కాదు. ఇవాళ చాలా సుదినం మిస్ సుజాతా దేవి!"
    
    ఆమె ఫక్కున నవ్వింది. క్రింద వెయ్యి ముత్యాలు రాలిపడినట్లయింది. శివనాథరావు వెనకనుంచి వచ్చి ఇహ పోదామన్నట్లు స్నేహితుడి చెయ్యి పట్టుకుని లాగాడు.
        
    "నా పేరు రామచంద్రరావు, ఇతను నా స్నేహితుడు శివనాథరావు గొప్ప ఆర్టిస్టు..."
    
    ఆమె మళ్ళీ నమస్కారం పెట్టింది నవ్వుతూ.
    
    గ్రీన్ రూం అంతా హడావుడిగా వుంది. వేషదారులంతా వేషాలు తీసేసే హడావుడిలో వున్నారు. వీళ్ళగురించి కూడా అక్కడ ఎవరూ పట్టించుకోవటం లేదు. సుజాత వెళ్ళిపోదామంటే యిక్కడ యీ రసిక హృదయుడు అడ్డు నిలిచి అందలం ఎక్కిస్తున్నాడాయె.
    
    ఇంతలో గుమ్మందగ్గర చిన్న చప్పుడయింది. సుజాత తలెత్తి సంతోషంగా 'మాస్టర్' అని అటుకేసిపోయింది. స్నేహితులిద్దరుకూడా అటు తలలు త్రిప్పి చూశారు.
    
    గుమ్మానికి ఇవతల ఓ సన్నని, పొడుగాటి వ్యక్తి నిలబడి వున్నాడు. నలభయి అయిదేళ్ళ పైచిలుకు వుంటుంది వయసు. మనిషి కఠినంగా, చికాగ్గా కనిపిస్తున్నాడు. అతనికి ఎడమకన్ను గుడ్డి ఎడమకాలు కుంటి.
    
    "మాస్టర్" అంది సుజాత నవ్వుతూ.
    
    అతనామె భుజాలమీద లాలనగా చెయ్యివేసి ఆదరణగా నవ్వాడు. "ఇంకా చాలదు, ఇంకా చాలదు" అన్నాడు.
    
    సుజాత ముఖం క్షణంలో పాలిపోయింది.
    
    "బాగా చెయ్యలేదా?" అన్నది బలహీన స్వరంతో.
    
    అతను ప్రేమగా ఆమె చెక్కిలిమీద కొట్టి "నా విషయం తెలుసుగా నీకు? నా కొలత వేరని? ప్రపంచమంతా ఎలుగెత్తి చాటినా నాకన్నా నిజంఎవడూ చెప్పలేడు. సుజాతా, నేను చెప్పినవన్నీ ఎందుకు మరిచిపోయావు?"
    
    ఆమె కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి. "అంతేనా?" అంది నిరాశగా.
    
    అతనేదో చెప్పబోతూ యి యిద్దరు యువకుల్నీ చూసి "వీళ్ళెవరు?" అన్నాడు.
    
    చంద్రం ముందుకు వెళ్ళి "మీరేనా జానకిరాంగారు? నాపేరు రామచంద్రరావు" అన్నాడు.
    
    అది సరే, నా పర్మిషన్ లేకుండా లోపలికి ఎలా వచ్చారు?
    
    ఈ గొంతులోని కాఠిన్యం విని చంద్రం దెబ్బతిని "మిమ్మల్ని కంగ్రాచ్యులేట్..."
    
    "అదిసరే, అడక్కుండా లోపలికి ఎందుకు వచ్చారు?"
    
    చంద్రం కోపంతో "అడగటానికేముంది యిందులో? నువ్వేం మినిష్టరువా?" అన్నాడు.
    
    ఆ వ్యక్తి ముఖంలో ఏమీ మార్పులేదు. 'మీ యిద్దరూ బయటకు దయచేయండి' అన్నాడు మామూలుగా.
    
    "వారెవ్వా, ఏమి జబర్దస్తీ?"
    
    "మిస్టర్, ప్లీజ్ గెటౌట్."
    
    చంద్రం వల్లమాలిన కోపంతో యింకేదో అనబోతున్నాడు. కానీ శివనాథరావు అతని రెక్క పుచ్చుకుని 'డ్రామా అంటే తెలిసిందా?' అని బలవంతంగా లాక్కుపోయాడు.
    
    అంతా నిశ్శబ్దంగా వుండిపోయారు. ప్రభాకరం పాలిపోయిన ముఖంతో నిలబడిపోయాడు. సుజాత నివ్వెరపోతూ నిల్చుంది. జానకిరామ్ మామూలుగా "పద సుజాతా! మేకప్ తీసేసుకో" అన్నాడు.
    
                                              7

    సంక్రాంతి సెలవులు. హైదరాబాద్ నుంచి శివనాథరావూ, వాల్తేరునుంచి మోహనరావూ బెజవాడ వచ్చారు. శివనాథరావుకు ఆ ఇంట్లో వుండబుద్ది పుట్టలా. ఏమూలకి పోయినా ఏవో జ్ఞాపకాలు తండ్రికి తెలుసు, తెలియనట్లు ఊరుకున్నాడు. సావిత్రి మామూలు పిన్నే! అతను ఆశ్చర్యపడ్డాడు.

 Previous Page Next Page