Previous Page Next Page 
ఆత్మజ్యోతి పేజి 20

 

    "నన్నేం చెయ్యమంటావు చెప్పు? అది చేస్తాను."
    
    "నువ్వు పాలుత్రాగే పసిపాపవు కాదే! ఏమిటీ ప్రశ్న?"
    
    "అదికాదు సరోజినీ నా ఘోషవిను. నేను భయపడుతున్నాననీ, అసమర్ధుడననీ అనుకోవద్దు. ఎప్పుడో ఎప్పుడో అనుకుంటోన్న యీ ఘట్టం చివరకు వచ్చేసరికి అంతా అయోమయంగా వుంది."
        
    "కొంచెం విశ్రాంతి తీసుకో తరువాత ప్రయత్నించు."
    
    ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు - మూడంటే మూడే నిముషాలు.
    
    "నువ్వు నన్ను అనుమానిస్తున్నావా?"
    
    "ఛ ఛ అలా ఎప్పటికీ అనుకోకు బావా!" అని హఠాత్తుగా త్రుళ్ళిన ఓ కన్నీటిబొట్టును తుడిచేసుకుని "నిన్నాట్టె ప్రశ్నలువేసి విసిగించను. నా మనసు నాకే తెలియటంలేదు. ఏమైనా ఇవాళ చాలా చెడురోజు. ఇద్దరం ఒకేదారిన నడుస్తున్నాం. ఏదో ఒకటి జరగనియ్యి అని వ్యదగా నిట్టూర్చి "వెళ్ళిపో బావా! మనం కావాలని కష్టాలను సమీపిస్తున్నట్లుగా వుంది. నీకూ నాకూ అర్ధంకాని ఓ నాటకాన్ని ఎవరో బలవంతంగా మనతో ఆడిస్తున్నారు. ఇంతకీ మనవి సగంసగం హృదయాలు. నీ కాళ్ళమీద పడతాను, చప్పున యిక్కడినుండి వెళ్ళిపో బావా!"
    
    అతనికేమీ పాలుపోలేదు. ఇలా సంభాషణ పరిణమిస్తుందని అతనికి తెలియదు. తలుపులు తెరచుకుని గబగబా బయటకు వచ్చేశాడు. ఎవరిదో తెలియని ఓ నీడచేతులు గొంతు పిసికినట్లయింది. కానీ ఆ నీడ ప్రేమమూర్తి కావచ్చు, ప్రేమ భయంకరమైనది కావడమే దానికి కారణం కావచ్చు.
    
    పైకి వెళ్ళాడు. మధ్యాహ్నం వాయించుకుని అలాగే ఒదిలేసిన వయొలిన్ మంచంమీద పడివుంది-తీగలు కుయ్యోమని మూలిగినట్లయింది. క్షణంపాటు సంగీతంమీద విరక్తి కలిగింది. సరోజిని అసలు లేకుండా, తను ప్రపంచానికి దూరంగా వుంటే బాగుండును. అసలు ప్రపంచం అనేది లేకుండా వున్నప్పుడు తను ఒక్కడూ ఓమూల నిల్చుని చూసే దృశ్యం మనసులో ఊహించుకుని, చిన్న ఆర్తనాదం చేశాడు.
    
    లైటు వెలిగించి, బల్లముందు కూర్చున్నాడు.
    
    "పిన్నీ!" అని రాశాడు, కొట్టేశాడు. 'మాతృశ్రీ పాద సన్నిధికి'-కృత్రిమంగా వుంది. ఏదీ బాగుండదు. అసలు పిన్నికి ఉత్తరం రాయటంఏమిటి? మనశ్శాంతి...అది కావాలి. భగభగ మండే మంటల్ని చల్లార్చే పన్నీరు కావాలి. 'అమ్మో...' అనుకున్నాడు. పన్నీరుకూ, కన్నీరుకూ అట్టే భేదం లేదు. చివరకు ఉత్తరం రాయలేదు.
    
    ఎనిమిదింటికి భోజనానికి పిలుపు వచ్చింది. ఆకలిలేదని కబురుచేశాడు. తండ్రివచ్చి వందప్రశ్నలు వేశాడు. ఏదో సమాధానం చెప్పి సర్దిపంపించేశాడు. గోవిందు పాలు తీసుకువచ్చాడు. మాట్లాడకుండా త్రాగి పడుకున్నాడు. ఓ గంట గడిచాక చల్లని చెయ్యి ఒకటి భుజంమీద పడేసరికి ఉలికిపడి చూశాడు. 'పిన్నీ' అన్నాడు కంపిత స్వరంతో.
    
    "మనసులో బాగుండలేదా?"
    
    కుచించుకుపోయాడు. ఆమె సమస్తమూ గ్రహించింది. ఇహ దాసోహమనడం కంటే శరణ్యం లేదు.
    
    "ఊ" అన్నాడు.
    
    "నీకీ మధ్య రోజూ అంతగా బాగుండనట్లుంది?"
    
    "పిన్నీ!" అన్నాడు వేదనతో.
    
    "డాక్టర్ని పిలిపించనా?"
    
    "వద్దు."
    
    "మరేం కావాలి?"
    
    "మరి ఏదీవద్దు."
    
    ఆమె నవ్వకుండా మామూలుగా "నేను నీకో విషయం చెబుదామని వచ్చాను శివా."
    
    ఎటువంటి సన్నివేశం అల్లుకురాబోతుందో అని కళ్ళప్పగించి చూస్తూ ఊరుకున్నాడు.
    
    "రేపు మీ అక్కయ్యని తీసుకురావాలి."
    
    అతన్లో ఉత్సాహం చచ్చిపోయింది. "ఎందుకూ?" అన్నాడు తాపీగా.
    
    "రావాలిలే యిక్కడికి. ఇప్పటికే ఆలస్యమైంది. కార్లో వెడతావా? రైల్లో వెడతావా?"
    
    "రైల్లోనే వెడతాను."
    
    "సరే. రేప్రొద్దున ఎనిమిది గంటలబండికి వెళ్ళు" అని మెల్లిగా బయటకు వెళ్ళిపోయింది. అతను గాయపడిన హృదయంతో నీరసంగా పడుకుని ఎప్పటికో నిద్రపోయాడు.
    
    తెల్లవారుఝామున ఐదింటికిగానీ లేచే అలవాటు లేదు. సావిత్రికూడా యింకా లేవలేదు. చిన్నగా సరోజినీ వాళ్ళు పడుకున్న గదిలోకి తొంగిచూశాడు. వాసూ, ఆమె ప్రక్క ప్రక్క మంచాలమీద పడుకుని నిద్రపోతున్నారు. ఓసారి అటూయిటూ చూచి, ధైర్యంచేసి, లోపలకు అడుగుపెట్టి ఆమెని సమీపించాడు.
    
    "ఏయ్!"
    
    సరోజినిది మొద్దునిద్దరే మెలకువ రాలా.
    
    ఏదో తీయని మగత అతని హృదయాన్ని చుంబిస్తోంది. ఆమె చెంపమీద సున్నితంగా వ్రేళ్ళతో తట్టి 'సరోజినీ!' అని మార్దవంగా పిలిచాడు. నేను వెళుతున్నాను.
    
    ఆమె ఉలిక్కిపడి కళ్ళువిప్పింది. ఓ నిముషంపాటు తెల్లబోయి చూసి, వెంటనే వెక్కివెక్కి ఏడుస్తూ అతనిచేతిని హృదయంమీదకు లాక్కుని "నన్ను విడిచి ఎక్కడకూ పోవద్దు" అంది.
    
    అతను నిర్దాంతపోయి "ఎక్కడికనుకుంటున్నావు? పిన్ని నీకు చెప్పలేదా? అక్కయ్యను తీసుకురావటానికి" అన్నాడు రెండోచేత్తో ప్రేమగా ఆమె జుట్టు నిమురుతూ.
    
    ఆమె బదులు పలకలా, బలహీనంగా కళ్ళు మూసుకుంది. అతడు ఆమె ముఖంమీదకు వంగి, చెవిలో "ఈసారి ఊరునుంచి వచ్చాక నువ్వు కొత్త వ్యక్తిని చూస్తావు" అన్నాడు.
    
    ఆమె కళ్ళు మూసుకునే 'అంటే?' అన్నది.
    
    "అంటే ఏమిటో నాకు తెలియదు కానీ....కథ ముగింపుకు వచ్చింది."
    
    ఆమె మళ్ళీ మౌనం వహించింది.
    
    "పలకవేం?"
    
    "నేను ఈ విషయాన్ని గురించి ఏమీ మాట్లాడదలచుకోలేదని నిన్ననే చెప్పాను."
    
    "సరే" అని చెయ్యి విడిపించుకోవటానికి ప్రయత్నం చేస్తూ "నువ్వు పడుకో నేను యిల్లు విడిచి పోయేదాకా నువ్వు నిద్ర లేవద్దు. వెళ్ళనా?" అని ఒక అడుగు వేశాడు.
    
    ఆమె అతని చెయ్యి ఒదలకుండా పట్టుకులాగి 'అలా ఎందుకన్నావూ?" అంది.
    
    అతను నవ్వటానికి విఫలప్రయత్నం చేసి 'అదో తమాషాలే' అంటూ మృదువుగా ఆమెనుంచి విడిపించుకుని గది బయటకు వచ్చేశాడు.
    
    గుమ్మం దగ్గర సావిత్రి నిలబడి తన పెద్ద పెద్ద కళ్ళతో చూస్తోంది.
    
                                                              *    *    *
    
    అక్కగార్ని తీసుకురావటం ఓరోజు ఆలస్యమైంది అనుకున్నదానికి అతను వెళ్ళేసరికి అతని బావగారు ఊళ్ళోలేరు. ఆరోజంతా మేనల్లుడు బాబితో ఆడుకుంటూ గడిపాడు. 'అట్లా వున్నావేంరా?' అని అక్క శ్యామల అడుగుతోంది. ఎదలోని వ్యధ ముఖంమీద అంత గట్టిగా ముద్రవేసుకు కూర్చుంది  కాబోలు. అంతా చెప్పాలనుకున్నాడు కానీ "ఈసారి అడిగితే..." అనుకుంటూ వాయిదాలు వేసుకుని, చివరకు ఏమీ చెప్పనేలేదు.
    
    మరునాడు ఆమెను తీఉస్కుని బెజవాడ వచ్చేశాడు. రైల్లో కూర్చుని "ఇలా చేస్తాను, అలా చేస్తాను" అనుకున్నాడు.
    
    అతనికి సరోజిని ఎదురుగా కనబడలేదు.
    
    "సరోజినీ, సరోజినీ!" అని మనసులో పిలుచుకుంటూ యిల్లంతా కలియ తిరిగాడు. "ఇక్కడలేదు, ఇక్కడలేదు" అంటుంది ప్రతి గదీ.
    
    చివరకు కళ్ళు తిరుగుతున్నట్లుగా తోచి, గోడకు ఆనుకుని సేద తీర్చుకుంటుండగా ఎదురుగా సావిత్రి వస్తోంది.
    
    "పిన్నీ, సరోజిని ఏదీ?" అనడిగాడు నీరసంగా.
    
    "వెళ్ళిపోయింది."
    
    "ఏం?"
    
    "వెళ్ళిపోవాలి కాబట్టి."
    
    చూశాడలా సూటిగా ఆ కళ్ళు....అతనికి అర్ధమైంది.
    
                                                6
    
    రెండు నెలలు గడిచిపోయాయి. వేసవి సెలవులు అయిపోగానే శివనాథరావు నాలుగోఏడు చదవటానికి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అతనికి యిదివరకు విశాఖపట్నంలో సీటురాలేదు. మాధవరావు పలుకుబడి ఉపయోగించి హైదరాబాద్ లో సీటు తెప్పించగలిగారు. ఇప్పుడు అక్కడినుంచి విశాఖపట్నానికి మార్పించుకోవచ్చు గానీ, శివనాథరావుకు ఆ వాతావరణమే నచ్చి అక్కడే వుండిపోయాడు. రాధాకృష్ణ ఈ ఏడుకూడా బి.ఏ. తప్పాడు. అందుకని బెజవాడలోనే వుండిపోయి సెప్టెంబరుకు హడావుడి చేస్తున్నాడు. చంద్రం చదువు మానేసి తండ్రిలా వ్యాపారంలో ప్రవేశించాడు. అతనికిప్పుడు కావలసినంత పని, కానీ యూనివర్శిటీలో వుంటే క్రికెట్ తో హాయిగా గడపవచ్చని కొంచెం విచారం వుండేది. అయినా స్టేట్ తరపున అతన్ని ఎలాగూ పిలుస్తారు. కానీ దేశంతరపున ఆడి తన తడాఖా చూపించాలని అతని అభిలాష. మోహనరావు వాల్తేరు పోయి లాలో చేరాడు.

 Previous Page Next Page