పంచరత్నాలు
ఉగాది పచ్చడి
తయారు చేయాలని
బెల్లం వేపమొగ్గలూ
పెట్టుకు కూర్చున్నాను.
"నీకేం కావాలి
తీయని అబద్ధాలా?
చేదు నిజాలా?"
అని అడిగాను. నా
మనసులోని మనసుని!
తీయని నిజాలు
కావాలంది నా
మదిలో నెమ్మది.
నేనడిగిందేమిటీ
నువ్వు కోరిందేమిటన్నాను నేను
"అసలు నువ్వడిగిందే తప్పు
జీవితంలో చేదూ తీపీ కలిసే వుంటాయి.
ఏదో ఒకటే
కోరుకొమ్మని ఎలాగడిగావ్?"
స్ఖాలిత్యం చూపించినందుకు
సంతోషించాను.
నా మనసులోని మనసు కోరిన
తీయని నిజాల కోసం
తెగ వెదుకుతున్నాను.
కానీ, అవి ఎక్కడా కనిపించలేదు.
ఎప్పుడో ఒకప్పుడవి
కనిపించక తప్పదని మాత్రం
నాకు తెలుసు.
ఈ లోగా నేను
మధురమైనా అసత్యాలు చెప్పలేను.
అంతటా నాకగుపించుతూన్న
చేదునిజాలే యిప్పుడు
నా కవితా వస్తువు!
2
ఉగాది పాటకు ఒకటే పల్లవి
బాధ బాధ బాధ - అది
జగాన మెసలే జనాల జీవిత
గాధ గాధ గాధ.
అదుగో అదుగో రిక్షావాడు
కదిలే ఎముకల గూడు
ఆకలినె తింటున్నాడు
అలో లక్ష్మనా అంటున్నాడు.
అదుగో చూడు చిన్నమ్మి
బదుకుతోంది తన ఒళ్ళమ్మి.
ఆమె యింకిన సెలయేరు.
ఇంకి పోదామె కన్నీరు.
ఆదిగో చితిపై కలవాడు
అదీ తన సొంతం అంటాడు!
మనిషికి మనిషే పగవాడు.
గతమే అతనికి ఉరిత్రాడు!
3
ఉగాది కోసం పఠించి దేశం
తదేక దీక్షగ చూస్తున్నాన్.
ఇలాగ రాస్తున్నాన్
సవాలు చేస్తున్నాన్!
ఆశయాలు మనకెన్నో ఉన్నాయ్.
ఆకాశంలో విహరిస్తున్నాయ్.
ఎగరాలంటే రెక్కలు విరిగే
ఏం ఫాయిదా భాయీ "జాన్!"
ధరలూ జనాభా, నిరుద్యోగమూ,
కరువూ, బరువూ, కష్టం- పెరిగాయ్!
అబ్బో, ఎంతటి అభివృద్ధో- అని
జబ్బచరచరా జంగిజ్ ఖాన్!
నడి బజారులో నలుగురి ముందు
హత్య జరిగినా సాక్ష్యం బందు -
న్యాయం గుడ్డిది మాత్రమే కాదు
కుంటి, మూగని ఘోషిస్తాన్!
కాలే గుడిసెలు కాలుతు ఉంటే
లేచే మేడలులేస్తూ వున్నాయ్.
ఒకరిది దండుగ ఒకరిది పండగ!
ఫికరెందుకులే చీచీ జాన్?
కళాశాలల్లో జ్ఞానం వెలగదు.
దుకాణాలలో సరుకులు దొరకవు.
గుడిలో దేవుడు గైరు హాజరని,
దిగులేలా? ఇది హిందుస్థాన్!
4
ఉగాది వచ్చింది,
అయినా
శుభాది వచ్చిందీ?
చైత్రం విరిసింది,
అయినా
ఆత్రం కరిగిందీ?
పాతది పోయింది
అయినా
కొత్తది రానంది!
దేశం ముందడుగు వెయ్యలే
దేమని నన్నడుగు!
లోపం నేతృత్వం
ఎవరం
చూపం భ్రాతృత్వం!
ఉగాది సుడిగాలి
వీచి,
జగాలు వడకాలి
పునాది కదలాలి
చచ్చిన
శవాలు నడవాలి
5
ఉగాదికి స్వాగతం
అఖండ భారతం
(అదే జిన్నాగారు తన్నుకు పోగా మిగలిన
అతుకు బొంత భారతం)
చెబుతోంది స్వాగతం!
క్షమించాలి పొరపాటు.
ఇది అఖిల భారత మహోత్సవం కాదు.
కేవలం తెలుగు వారి పండుగ.
ఇంటింటా వాళ్ళు జరుపుకునే పండుగ
(అదే ఓ యిల్లంటూ
ఉన్నవాళ్ళ మాటే నేననే చెప్పేది).
మనకాలమానం చాంద్రమానం
ఇలా ఏన్నో ఏడాదులు గడచిపోయాయ్
విచిత్రమైనది కాలం
దానికి బానిసవై పోయావంటే
అది నిన్ను అధః పాతాళాని
కణిచేస్తుంది.
నీ అదుపులో దాన్ని పెట్టుకుంటే
నిక్షేపంలాగా అదీ నీ క్షేమం కోసం
పని చేస్తుంది.
కొండమీది కోటినైనా
తెచ్చుకోవచ్చు గానీ
గతించిన కాలాన్ని మళ్ళీ
కళ్ళజూడగలగడం కల్ల!
నెమరు వేసుకోవడం పశువుల లక్షణం
ముందుకు చూస్తూ సాగడం మనుషుల లక్షణం
అంటే నిన్నటి మాట
మరచిపొమ్మని కాదు నేననేది.
నిన్నటిలో జీవించడం మానేసి
రేపటి కార్యాల గురించి
ఆలోచించమనే నేననేది.
కాగల కార్యాలను
ఏ గంధర్వులూ తీర్చరు.
మనమే మన కాలాన్ని
మధురాతి మధురంగా తీర్చిదిద్దుకోవాలి.
ఇదీ నా ఉగాది అభిజ్ఞత.
ఇదంతా ఓపిగ్గా విన్నందుకు
మీ అందరికీ నా కృతజ్ఞత.
ఆకాశవాణి ప్రసారితం
ముద్రణ: నివేదిత మాస పత్రిక -సెప్టెంబరు, 1976
పునర్ముద్రణ: మరో ప్రస్థానం విరసం ప్రచురణ - మే, 1980