రవీంద్ర అతడివంక చూసి "నేను నీకు దారిలో ముల్లునెందుకయ్యానో తెలుసుకోవచ్చా?" అన్నాడు.
"నా లక్ష్యం పేరు హాస. అర్ధమయిందా?" అన్నాడతను.
"ఏం చేస్తావు నీ లక్ష్యాన్ని!"
"కొందరి వేటలో ఆట వుంటుంది. నా వేటలో వుండేది మృత్యువు" ఆ మాటల అర్ధం తెలియనంత అమాయకంగా నవ్వాడతను.
ఆ నవ్వు చూస్తే రవీంద్రక్కూడా భయం వేసింది. అతడింకా ఏదో అనబోతూండగా "ఇంకేమీ అడక్కు. నీ వేట నా వేటకు అడ్డమయింది. అదెలా తొలగించుకున్నానో మున్ముందు నువ్వే తెలుసుకుంటావు. ఇక నువ్వు నా జోలికి రాకు. నా కారణంగా ఒక జర్నలిస్ట్, పోలీస్ ఇన్స్ పెక్టర్, స్థానిక ఎమ్మెల్యే నీ దురాగతాన్ని సహించి ఊరుకున్నారని గుర్తుంచుకో...." అంటూ అతడక్కణ్నించి కదిలాడు.
"నీ పేరు?" అన్నాడు రవీంద్ర.
"రమణ!" అన్నాడతను.
* * * *
ముక్కుపొడుం రంగు బాగీలో నీలం చారల పోలీస్టర్ షర్ట్ ఇన్ చేసి అద్దం ముందు నిలబడి తనివితీరా తన ప్రతిబింబాన్ని చూసుకుని "ఓ ప్రతిబింబమా! నా అందం నాకు తెలియదు. ఈ ఒక్క రోజుకూ నీ అందం నాది చెయ్యి" అనుకున్నాడు గౌతమ్.
పక్క గదిలోంచి గోడ గడియారం ఎనిమిది గంటలు కొట్టింది.
"అరే! టైము ఎనిమిదై పోయిందే!" అనుకున్నాడు గౌతమ్ కంగారుగా.
ఎనిమిదిన్నరకల్లా హాస యిల్లు చేరుకోవాలని అతడి తాపత్రయం. అయితే అతడు కలుసుకోవాలనుకుంటున్నది హాసను కాదు. హాస తండ్రిని ఆయనకతడు తన గురించి పూర్తిగా చెప్పుకుని హాసనిచ్చి పెళ్ళి చేయమని అడగాలనుకుంటున్నాడు. దానికాయనేమంటాడోనని అతడి భయం.
"ఇది కలా, నిజమా?"
ఉన్నట్లుండి అతడి చెవిలో అతి మధురమైన స్వరం వినిపించింది.
"అతడు మా యింటిముందు కార్లో దిగాడు. అందమైన రాజకుమారుడిలాగున్నాడు. నాన్నగారిని కలుసుకుని "నా పేరు రమణ. నేనొక చిన్న వ్యాపారస్థుణ్ని. నా పేరున పది లక్షల రూపాయలున్నాయి. నేను మీ అమ్మాయిని ప్రేమించాను. పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను" అన్నాడు. నాన్నగారతణ్ని కుటుంబ వివరాలడిగారు. చెప్పాడు. అన్నీ ఆయనకు నచ్చాయి...."
ఉలిక్కిపడ్డాడు గౌతమ్.
ఆ గొంతు హాసదే! ఆమె మనసులో సంతోషం చెలరేగితే ఆ కారణం తనకు వినిపిస్తోంది కానీ ఈ రమణ ఎవరు? ఉన్నట్లుండి ఎక్కణ్ణుంచి వచ్చాడు?"
"హాసా!" అన్నాడతడు.
వాళ్ళిద్దరూ ఏమి సంభాషించుకున్నప్పటికీ అతడి ప్రయాణం ఆగిపోయింది.
20
ఆఫీసులో చరిత అదోలాగుండడం గమనించి వెంకట్రత్నం పలకరించి కారణమడిగాడు.
"నిన్న అతణ్ని పలకరించాలని చాలా ప్రయత్నం చేశాను. అతడు నన్ను గమనించనేలేదు" అంది చరిత.
"అతడు సందిగ్ధంలో వున్నాడు. నీ ప్రయత్నం నువ్వు చేయి...."
చరిత నమ్మకం లేనట్లు నవ్వింది.
"అతడు నిన్న ఆఫీసులో ఉండిపోయాడు....అవసరం లేకపోయినా కాని నువ్వు తటపటాయించావు. ఈ ఒక్కరోజుకీ అతడితో పాటే ఆఫీసు వదలడానికి ప్రయత్నించిచూడు."
"ఎలా?" అందామె ఇబ్బందిగా.
"నేను నీకు కొన్ని కాగితాలిస్తాను. వాటిమీద మేటర్ అతడి గదిలో ఎలక్ట్రానిక్ టైపు రైటరు మీద ఆఫీసయ్యాక టైపు చేయాలి నువ్వు...."
"అతడుండకపోతే?"
"ఉంటాడు...." నమ్మకంగా అన్నాడు వెంకట్రత్నం.
"అసలు మనమిదంతా ఎందుకు చేయాలి?"
వెంకట్రత్నం వచ్చి, చిన్నప్పుడు కలిపిన అన్నం తినిపించడానికి తల్లి ఎన్ని నాటకాలాడుతుంది? ఎంత శ్రమ పడుతుంది? కొందరాకలికి పసిబిడ్డలైతే కొందరు ప్రేమకు పసిబిడ్డలు" అన్నాడు.
* * * *
"ఈ రోజు నేనొక చిత్రమైన విశేషం చెబుతాను."
పార్కులో మల్లె పందిరి కింద ఈ మాటను ఒకేసారి అన్నవారొక్కరు కాదు. ఇద్దరు ప్రతిభ.... హాస....
స్నేహితురాండ్రు వారి వంక ఆశ్చర్యంగా చూశారు.
అప్పుడు ప్రతిభ, హాస ఒకరివంక ఒకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు.
కాసేపక్కడ మౌనం రాజ్యమేలింది.
"ప్రతిభా! నువ్వే ముందు చెప్పు...." అంది హాస.
"దేవేంద్ర పరమ దుర్మార్గుడు. నేను వాడి వల్ల మోసపోవలసిందే కానీ....ఓ మహానుభావుడు నన్ను కాపాడాడు...." అంటూ ప్రతిభ తన అనుమానం వివరించింది.
"ఎవడో షహెన్ షాలాగున్నాడే!" అంది లలిత.
"వినడానికే కాదు, చుడ్డానికీ అంతే!" అంది ప్రతిభ.
"మా ఇంటికీ ఓ షహెన్ షా వచ్చాడు. ఇదివరలో మనం అనుకున్నట్లు అతను నాకోసం నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. అతడికి కారుంది, డబ్బుంది. సంస్కారముంది. నన్ను ప్రేమించి నాతో మాట్లాడకుండా మా నాన్నగారినడిగాడు...." అంది హాస.
"అయితే అది సంస్కారం కాదు. అహంకారం....ముందుగా నీ అనుమతి తీసుకోవద్దూ? నువ్వు కాదనవని అంత నమ్మకమేమిటి?" అంది ప్రతిభ.
"నేను సంప్రదాయంలో పుట్టి పెరిగాను. తల్లిదండ్రుల మాట కాదనను. మా యింట్లో నా యిష్టానికి వ్యతిరేకంగా ఏమీ జరగదు. మా నాన్నగారు నన్నూ సంప్రదిస్తారు. అతను మా సాంప్రదాయాన్నర్ధం చేసుకున్నాడు. సంస్కారాన్ని నమ్మాడు. మమ్మల్ని గౌరవించాడు."
"అయితే నువ్వు త్వరలో పెళ్ళికూతురివన్న మాట...." అంది కోమలి.
"పరీక్షల ముందైతే పెళ్ళి కూడా ఓ పరీక్షలాగుంటుంది. పరీక్షల తర్వాతే అదొక వినోదంగా వుంటుంది...." అంది హాస.
"అమ్మో, పరీక్షలయితే ఇంకా నాలుగు నెల్లాగాలి........" అంది మాలతి.
"ఆగాల్సింది నేను కదా!" అని నవ్వింది హాస.
"అది సరే, అతడెవరో అలావస్తే నువ్వాశ్చర్యపోయావా?" అంది లలిత.
"లేదు. అలా జరుగుతుందని నాకు ముందుగా తెలుసు."
"ఎలా?"
"ఓ ఆకాశవాణి నాతో సంభాషిస్తాడు."
"ఏడిసినట్లుంది నీ తెలుగు....వాణి సంభాషిస్తుందనాలి...." అంది కోమలి.
"ఏం చేయనే? మనిషి కనపడకుండా చెవుల్లో మాటలు వినబడతాయి కాబట్టి అశరీరవాణి అన్నాను. గొంతు మగ....సంభాషిస్తాడనక ఏమనను?
అందరూ నవ్వారు.
"అలా నవ్వుతారేం? అశరీరవాణి గురించి ఇంకేం ప్రశ్నలడగరా?"
"నీ ఊహశక్తి నిబ్బంది పెట్టడం మాకిష్టంలేదు........" అంది సుగుణ.
"నా తమ్ముడూ యిలాగే అనుకున్నాడు" అంటూ గిరిధర్ వృత్తాంతం చెప్పింది హాస.
"అయితే యిక్కడికి సరిగ్గా అరగంటలోగా నా కోసం పకోడీల పొట్లం పంపించమని నీ అశరీరవాణికి చెబుతావా?" అంది కమల.
"ఏమో, మీ యిద్దరూ కుమ్మక్కయ్యారేమో, నాకేం తెలుస్తుంది! నాకు పకోడీలు వద్దు. మిరపకాయ బజ్జీలు కావాలి అంది లలిత.
అప్పుడు సుగుణ మిఠాయి కొమ్ము అంది. మాలతి బందరు లడ్డంది. ప్రతిభ పెసర పుణుగులంది. కోమలి కారబ్బూంది అంది.
"మీలో ఒకరు చుట్టూ పరీక్షించి రండి" అంది హాస.
"ఎందుకు?"
అశరీరవాణికి ఫోన్ చేసి ఇవన్నీ రప్పిస్తాను. చుట్టుపక్కలెవరూ మన మాటలు వినడం లేదని మీకు నమ్మకం కుదరాలిగా!"
ఒక్కసారి నలుగురమ్మాయిలు లేచి నిలబడ్డారు. "నువ్వు నెమ్మదిగా మాట్లాడు. మేము చుట్టూ దూరంగా నిలబడతాం. నీ మాట మాక్కూడా వినపడకూడదు" అంది వాళ్ళతో సుగుణ.
అక్కడ హాస, ప్రతిభ ఉన్నారు.
"హలో!" అంది హాస నెమ్మదిగా గుసగుసలాడుతున్నట్టుగా.
ప్రతిభ ఆమె వంకే ఆశ్చర్యంగా చూస్తోంది.
* * * *
చరిత టైపింగు సీట్లో కూర్చుంది. కాగితాలు సరిచేసుకుంది తటపటాయిస్తూనే గౌతమ్ వంక చూసింది.
గౌతమ్ ఆమెవేపే తదేక దీక్షతో చూస్తున్నాడు.
అతడి చూపులు చరితలో సిగ్గును పుట్టించాయి. ఆమె తలవంచుకుని మళ్ళీ తలెత్తింది.
గౌతమ్ లో ఏ మార్పూలేదు.