టైము ఏడు దాటింది. ఇంకా పురోహితుడు రాలేదు. ముహూర్తమెప్పుడు? ఇంటికెప్పుడు?" అంది ప్రతిభ.
"ముహూర్తం గురించి నీకంటే నాకే ఎక్కువ తొందరగా వుంది. గది ఎంత బాగా అలంకరించారో చూశావా?" అన్నాడతను.
"నీ దృష్టంతా గది మీదనే వుంది. నేను తొమ్మిది గంటలకల్లా వెనక్కు పోవాలి. లేకపోతే పిన్ని వూరుకోదు...."
"పెళ్ళయ్యాక నీకు పిన్ని గొడవెందుకు? అన్నిటికీ నేనున్నాను"
ప్రతిభ చల్లబడి- "మగాడివి నువ్వు ధైర్యంగా ఉన్నావు. ఆడపిల్లని అస్వతంత్రురాలివి. నా భయం నీకర్ధం కాదు" అంది.
"అన్నీ అర్ధం చేసుకున్నాను కాబట్టే ఈ సంస్థ పెట్టాను. ఈ రోజు ఒకరు కాదు. ఇద్దరు కాదు.... పదిమంది యువతులకి కట్నం లేకుండా కన్నె చెర విడిపోతుంది. ముహూర్తానికింకా నలభయ్ నిముషాల టైముంది. ఈలోగా ఎంజాయ్ ద మ్యూజిక్" అంటూ దూరంగా వెళ్ళాడతను.
ప్రతిభ భయం వేరు.
చాలా ధైర్యంగా ఆమె ఆ యింట్లో అడుగుపెట్టింది. కానీ అసలు సమయం దగ్గర పడేసరికి ఆమెలో భయంపుట్టి పెరుగుతోంది. అందులోనూ కాసేపటి క్రితమే ఆమె ఆ యింట్లో శోభనం గది చూసి వచ్చింది.
దేవేంద్రే ఉత్సాహంగా అక్కడి యేర్పాట్లు చూపించాడు. అప్పుడు ప్రతిభ మనసులో వణికిపోయింది.
ఇంతవరకూ తనవల్ల ఏ తప్పూ జరగలేదు. కానీ శోభనం గది ఆమెలో భయాన్ని కలిగించింది. అన్ని యేర్పాట్లూ చేసిన మనిషి. పెళ్ళయ్యాక తన్ను వదుల్తాడా? అంటే ఈ రోజునే తనకూ ఇంటికీ తెగతెంపులయిపోతాయి.
మానసికంగా ప్రతిభ అందుకింకా సిద్ధపడలేదు.
చెప్పాలంటే ఆ రోజంతా ఆమెకు భయంగానే వుంది. కాలేజీలో అన్యమనస్కంగా వుంది. కాలేజీ వదలగానే ఎప్పటిలా స్నేహితురాండ్రతో సమావేశానికి వెళ్ళలేదు.
ఆరున్నరకామె పచ్చమేడలో అడుగుపెట్టింది. దేవేంద్ర ఆమెను ఆహ్వానించి శోభనం గది చూపించాడు. అప్పటినుంచీ ఆమెకు బెదురు పట్టుకుంది.
పెళ్ళి కాగానే తను ఇంటికెళ్ళిపోవాలని చెప్పిందామె.
"పెళ్ళయ్యాక నీ మనసేమంటే అదే చేద్దువుగాని" అన్నాడు దేవేంద్ర.
అతడి మాటల్లో నమ్మకం స్పష్టంగా మెరుస్తోంది. ఆ నమ్మకాన్ని మించి తనపట్ల తనకేర్పడుతున్న అపనమ్మకం ప్రతిభను మరింతగా భయపెట్టింది.
దేవేంద్రలో చాలా రోజులుగా పరిచయమయింది. అతడెన్నడూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించలేదు. ఆమెతో శృంగారం మాట్లాడలేదు. రోజురోజుకీ ఆమెకతడంటే ఆరాధనా భావం పెరిగిపోయింది.
రెండురోజులక్రితం అతడామె పెళ్ళి గురించి చెప్పాడు. ఆమె ఒప్పుకుంది.
ఈ రోజు పెళ్ళిరోజు.
ఆమె భయపడుతోంది,
పెళ్ళయ్యాక అతన్ని తను కాదనగలదా?
శోభనం గది ఆమెలో వణుకు పుట్టిస్తోంది. ఈ రోజుకి తను గది నుంచి తప్పించుకోగలదా?
* * * *
టైము ఏడున్నర.
వున్నట్టుండి సంగీతం ఆగిపోయింది.
ఆ హాల్లో అడుగుపెట్టారు ఆరుగురు వ్యక్తులు.
అందులో ఒకడు పురోహితుడు. ఒకడు స్థానిక ఎమ్మెల్యే మరొకడు జర్నలిస్టు.
ఒకడు పోలీస్ ఇన్ స్పెక్టరు, ఒకడు పూలదండల పెట్టె మోస్తున్నాడు.
ఆరోవాడు అమాయకంగా కనబడుతున్న అందమయిన యువకుడు.
దేవేంద్ర వాళ్ళను చూసి కంగారుపడ్డాడు. అతడేదో అనాలనుకునేలోగా ఎక్కడినుంచో ఆ హాల్లోకి వచ్చారు రాజేంద్ర, రవీంద్ర.
రవీంద్ర ఆ ఆరుగుర్నీ సమీపించి- మీరు మా మనుషులు కాదు" అన్నాడు.
"మీ మనుషులం కాకపోయినా మీక్కావలసిన మనుషులమే" అంటూ అమాయకంగా కనిపిస్తున్న యువకుడు తనతో వచ్చిన వారందరినీ పరిచయం చేశాడు.
"మీరంతా ఎందుకొచ్చారు?" అడిగాడు దేవేంద్ర.
"ఈ మేడలో మహిళా సంక్షేమసంఘం ప్రారంభించబడి ఒకే రాత్రి పది పెళ్ళిళ్ళు కట్నం లేకుండా మూకుమ్మడిగా జరగబోతున్నట్లు తెలిసింది. అటువంటి సత్కార్యానికి రాజకీయ నాయకుల మద్దతు కావాలి. అందుకే స్థానిక ఎమ్మెల్యేగారొచ్చారు. వేదమంత్రాలు క్షుణ్నంగా వచ్చిన ఉద్దండ పండితుడ్ని పురోహితుడిగా తీసుకొచ్చాను- తంతులో లోపముండకూడదని. జరిగే తంతుని చక్కగా ఫోటోలు తీసి పత్రికలో ప్రచురించడానికి ప్రముఖ జర్నలిష్టును వెంటబెట్టుకొచ్చాను. ప్రచారాభిలాష మీకు లేకపోవచ్చు. కానీ నా కళ్ళముందు జరిగే ఘనకార్యాలు చూస్తూ ప్రశంసించకుండా ఊరుకోలేను. వాటికి గుర్తింపు తీసుకురాకుండా వుండలేదు" అన్నాడా యువకుడు.
రవీంద్ర యిబ్బందిగా "మాదంతా గుప్తా వ్యవహారం. మీరు బట్టబయలు చేశారు అన్నాడు.
"మంచి పని నిప్పు లాంటిది. దాన్ని గుప్పెట్లో వుంచుకుంటే చేతులు కాలాయి. అప్పుడు ఆకులు పట్టుకుని లాభముండదు.... వెంటనే తంతు ప్రారంభించండి...." అన్నాడు యువకుడు.
రవీంద్ర ఏదో అనబోయి అతడి పక్కనే వున్న పోలీస్ ఇన్స్ పెక్టర్ని చూసి ఆగిపోయాడు. అతన్నెందుకు తీసుకొచ్చాడో ఆ యువకుడు చెప్పలేదు. బహుశా అవసరం లేదనుకుని వుంటాడు.
ఇది చూసి ప్రతిభకు ఒక రకమైన సంతోషం. భయం కలిగాయి. తన వివాహం గురించి వెంటనే బయటి ప్రపంచానికి తెలిసిపోతుందన్న కారణమే ఆమెకు సంతోషాన్నీ, భయాన్నీ కూడా కలిగిస్తోంది.
అయితే అక్కడున్న యువకుల్లో కలకలం ప్రారంభమయింది. వారిలో కొందరు పేరున్న వారి బిడ్డలు, కొందరు డబ్బున్నవారి బిడ్డలు. మరికొందరు.... ఏమో!
"ఏమిటి ఆలస్యం?" అన్నాడా యువకుడు.
ఆలస్యానిక్కారణం తెలియడానికి అయిదు నిమిషాలు పట్టింది.
అక్కడ చేరిన యువకుల్లో దేవేంద్ర తప్ప మిగతా వాళ్ళెవరూ వివాహానికి సుముఖంగా లేరు.
"ఇంతలో ఏమయింది?" గద్దించాడా యువకుడు.
"ఏమైతే నీకెందుకు?" అని అక్కడున్న వారిలో చాలామందికి వుంది. కానీ ఆ యువకుడి పక్క పోలీసినస్పెక్టర్ని చూసి వాళ్ళేం మాట్లాడలేకపోతున్నారు.
ఏమయిందో తెలుసుకుందుకు ఎంతోసేపు పట్టలేదు.
ఆ యువకుల్లో ముగ్గురు వివాహితులు కూడా వున్నారు. మిగతా ఏడుగురితోనూ కలిసి వాళ్ళు పెళ్ళికెందుకొప్పుకున్నారంటే__ ఆ పెళ్ళి నిజం పెళ్ళి కాదు కాబట్టి! అది రహస్యంగా వుండిపోతుంది కాబట్టి.
పెళ్ళి చేసుకుందుకు వచ్చిన ఆడపిల్లల్లో ప్రతిభ తప్ప మిగతా తొమ్మండుగురూ కాల్ గర్ల్స్ గా హోటళ్ళలో రిజిస్టరైన వాళ్ళు. వాళ్ళకు శాశ్వతంగా పెళ్ళి చేసుకోవడం ఎవరికీ యిష్టం లేదు. తాత్కాలికంగా పెళ్ళి చేసుకోవడం ఎందుకిష్టమంటే__
ప్రతిభను ట్రాప్ చెయ్యడానికి!
పెళ్ళయిన మొదటిరోజు మాత్రమే ఆమెకు దేవేంద్ర భర్త! తర్వాత నుంచి ఆమె ఆ మిగతా యువకులకి భార్య అవుతుంది. అందుకామె అభ్యంతరం చెబితే వారం రోజుల గడువులో మరో యువతికి పచ్చ మేడలో పెళ్ళి జరిపించే బాధ్యత తీసుకోవాలి. అలా తీసుకురాలేకపోతే ఆమెకు భర్త మారక తప్పదు.
"అమానుషం!" అన్నాడా యువకుడు.
జరిగేది ప్రతిభ చూస్తోంది. నిజం తెలియగానే ఆమెకు స్పృహ తప్పినట్లయింది. వున్న మనిషి వున్నట్లుగా నేలమీద చతికిలబడి పోయింది.
ఆమెకక్కడి మాటలు వినబడుతూనే వున్నాయి.
ఆ యువకుడెవరో కానీ సమయానికి ఆపద్భాంధవుడిలా వచ్చి తన్ను రక్షించాడు.
ఓ భయంకర ముఠాలో అవమానకరమైన జీవితం గడుపుతూండేది తను- ఆ యువకుడే వచ్చి వుండకపోతే!
హాస చెప్పింది వినలేదు. స్నేహితురాండ్రు చెప్పారు. వినలేదు.
ఈ ప్రపంచంలో మగాడు ఆడదాన్ని ప్రేమిస్తాడనుకుని మోసపోయింది. కానీ ప్రేమ కూడా ఒక వేట!
* * * *
రవీంద్ర ఆ యువకుణ్ని పక్క గదిలోకి తీసుకుని వెళ్ళి "ఎవరు నువ్వు? నీకేం కావాలి?" అన్నాడు.
"నేనొక వేటగాణ్ని!" అన్నాడతను.
"నీ వేటకు నేనే కావలసొచ్చానా?" అన్నాడు రవీంద్ర.
"నా వేటకు లక్ష్యం నువ్వు కాదు...."
"అయితే నేనెవరిని?"
"నా దారిలో ముల్లువి. ఏరి పారేయడానికొచ్చాను...."
"ఇందుకు ప్రతిఫలం అనుభవిస్తావు...."
ఆ యువకుడు చాలా అమాయకంగా నవ్వి "నేనిక్కడికి పోలీసు ఇన్ స్పెక్టర్ని, పత్రికా విలేఖరిని, రాజకీయ నాయకుణ్ణి తీసుకొచ్చాను. వాళ్ళలో ఒక్కరైనా నోరు విప్పి మాట్లాడేరా? ఇదేమని అడిగారా? జరుగుతున్నది కళ్ళప్పగించి చూశారు. ఇప్పుడు నేను వెనక్కు వెళ్ళిపోతాను నీ గురించి ఎవరికీ తెలియదు. మళ్ళీ కొత్తగా మరోచోట నీ పథకం ప్రారంభించుకోవచ్చు. ప్రతిఫలం గురించి మాట్లాడుతున్నావు. నాకు భయమేస్తోంది నువ్వేమైపోతావోనని...." అన్నాడు.
రవీంద్ర దెబ్బ తిన్నవాడిలా అతడివంక చూసి "అసలు నువ్విక్కడికెందుకొచ్చావు?" అన్నాడు.
"నా పనిమీద ఇక్కడికొచ్చాను. పని పూర్తయింది. ఎవరెవరు నా ముందు నోరు మెదుపుతారో నీకు తెలియాలని కూడా వాళ్ళని తీసుకొచ్చాను. నా బలం నీకు తెలిసింది. నా సామర్ధ్యం నీకు అర్ధమయింది. ఇంకా తెలుసుకోవాలనీ అర్ధం చేసుకోవాలనీ ప్రయత్నిస్తే దురదృష్టం నా రూపంలో నిన్ను వెంటాడుతుంది."