Previous Page Next Page 
ఇట్లు....నీ చిలక పేజి 20


    ఏదైతే ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తుందే దాని పట్ల మన జాగ్రత్త పెరుగుతుంది.

    జామచెట్టు వుందనుకుందాం. అది పళ్ళు కాయడం ప్రారంభించగానే ఆటోమేటిక్ గా దానిపట్ల పలుజాగ్రత్తలు తీసుకుంటాం. దానికి చుట్టూ కంచె కడతాం. చక్కగా పాదుచేసి నీళ్ళు పోస్తాం.

    అలానే నా అందం నాకు 'పే' చేయడం ప్రారంభమైందని తెలియగానే మరింత అందంగా కనిపించాలన్న తాపత్రయం పెరిగింది.

    అమ్మను ఇబ్బందిపెట్టి నెల్లూరుకు వెళ్ళాను. ఓ బ్యూటీపార్లర్ కు వెళ్ళి నాకు తెలిసిన మెరుగులు దిద్దుకున్నాను. ఐబ్రోస్ సన్నగా తీర్చిదిద్దుకున్నాను వేసవిలో ఏం క్రీములు వాడాలో, వింటర్ లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాను. కొత్తబట్టలు చాలానే కొనుక్కున్నాను.

    దాదాపు రెండువందలమంది గాళ్స్ వున్న ఆ స్కూల్లో చుడీదార్ వేసుకునేది నేనొక్కదాన్నే.

    కొంతమంది కుర్రమాస్టార్లు కూడా దొంగచాటుగా నావేపు చూడడం మొదలు పెట్టినట్టు నేను గుర్తించాను. ఎదుటి మగవాడిచేత నైతిక విలువల్ని సైతం మరిచిపోయేంతగా నా అందం ఉందన్న విషయం నేను కనిపెట్టాను.

    మా ఊళ్ళో నాతో చదువుకునే మగపిల్లల్లో ప్రకాష్ ఒక్కడే కాస్తంత పెద్దవాడు. మిగిలినవాళ్ళకి ఇంకా ఆ స్పృహ రాలేదు. ప్రకాష్ నాతో చనువుగా మాట్లాడడానికి ప్రయత్నం చేసేవాడు.

    స్కూలుకు వెళ్ళేదారిలో నా క్యారియర్ తీసుకునేవాడు. ఎప్పుడైనా ఇడ్లీలు తీసుకువెళుతుంటే దాన్ని తను ఉంచుకుని వాడి క్యారియర్ నాకిచ్చేవాడు.

    'మధ్యాహ్నానికి ఇడ్లీలు మరీ బిరుసెక్కి రాళ్ళలా తయారవుతాయి. తినలేవు. అందుకే నా క్యారియర్ నువ్వు తిను' అనేవాడు.

    అయితే నేనతన్ని పెద్దగా కేర్ చేసేదాన్ని కాను. అయ్యవార్లే నన్ను ఆరాధనగా చూస్తుంటే కుర్రకుంక ప్రకాష్ అభిమానం నన్నుతాకేది కాదు.

    ఆరోజు శనివారం. వెంకటగిరిలో సంత.

    ఆ రోజు ఏ లారీ ఆపలేదు. అలాంటప్పుడు నా అహం దెబ్బతినేది. ఇంట్లోనూ, బయటా నామాట వేదంలా చెల్లుబాటయ్యేది. నాకు ఎవరూ ఎందులోనూ అభ్యంతరం చెప్పేవాళ్ళు కారు.

    అందుకే నన్ను ఎవరయినా పట్టించుకోలేదంటే వాళ్ళమీద ఓ కసిలాంటిది ప్రారంభమయ్యేది. వాళ్ళని ఏదోవిధంగా హర్ట్ చేసేవరకు మనసు శాంతించేదికాదు.

    లారీ ఆపకపోతే డ్రయివర్ ను మనసులోనే తిట్టుకునేదాన్ని.

    నా మూడ్ బాగాలేదని మిగిలిన పిల్లలు గ్రహించినట్టున్నారు. నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళుతున్నారు.

    ప్రకాష్ ఒక్కడే నా మూడ్ ను పోగొట్టడానికి ఏవేవో మాట్లాడుతున్నాడు.

    'హిందీ మేడమ్ కి సోషల్ అయ్యవారికి కనెక్షన్ ఉంది తెలుసా?' అని అడిగాడు.

    'నాకు తెలియదే. అయినా హిందీ మేడమ్ కి పెళ్ళయింది కదా' అన్నాను అమాయకంగా ముఖంపెట్టి.

    'పెళ్ళయిందిగానీ మొగుడు వదిలేశాడట'

    'నీకెలా తెలుసు?'

    'మొన్న రమేష్ కి హిందీలో పదిమార్కులే వేసింది కదా. ఆ కసి కొద్దీ ఇవన్నీ వాడే చెప్పాడు'

    'నిజమే అయ్యుంటుందిలే. హిందీ మేడమ్ లంబాకార త్రిభుజంలా గుంటుంది. ఎవరుమాత్రం ఆమెతో కాపురం చేస్తారు!'

    ఆడది అందంగా లేకపోతే శుద్ధ వేస్టు అనీ, అందమే పరమావధి అనీ నేనెంత భ్రమలో ఉన్నానో ఆ స్టేట్ మెంట్ తో అర్ధమవుతుంది.

    'ఈరోజు మాకు హిందీ ఉంది ఫస్టు అవర్. ఆ సబ్జెక్టు మహా బోర్ బాబూ' అన్నాను.

    'అయితే ఈరోజు స్కూల్ ఎగగొడదామా?'

    ఈ అయిడియా బావున్నట్టు నాకు తోచింది.

    చాలాసేపు ఆలోచించాక సరేనన్నాను.

    'మరి సంతలో ఏమైనా కొనుక్కోవడానికి మనదగ్గర డబ్బుల్లేవు కదా' అన్నాను.

    'నా దగ్గరాలేవు. సంపాదిస్తేలే' అన్నాడు ప్రకాష్.

    అంతలో స్కూల్ వచ్చింది.

    "నువ్విక్కడే వుండు నేనిప్పుడే వస్తాను" అని నన్ను స్కూల్ కి ముందు ఓ ఎద్దుల బండి చాటున నిలబెట్టాడు. వెళ్ళిన పది నిముషాలకల్లా ఉషారుగా తిరిగి వచ్చాడు ప్రకాష్.

 Previous Page Next Page