"ఏమిటి శాంతి చిన్నపిల్లలగా! డాక్టర్ ఎందుకు చెప్తాడలా?" మందలింపుగా అన్నాడు అతను.
"మీకు తెలీదంకుల్ ౧ గోడమీద బల్లి నేను పెంచుకుంటున్న చిన్న రెక్కల పురుగుని తినేసింది.
"నువ్వు చెప్పే మాటలు నాకర్ధం కావటం లేదు."
"నేను ఓ రెక్కల పురుగుని పెంచుకుంటున్నానంకుల్! ఎప్పుడూ అది నా టేబుల్ పక్కన గోదామీదే వుంటుంది. ఒక బల్లి ఎప్పటి నుంచో దాన్ని తిన్నలని ప్రయత్నిస్తుంటే నేను తరిమి కొడుతున్నాను. నేను స్కూల్ కెళ్ళినప్పుడు మాత్రం ఆ పురుగుని అగ్గిపెట్టెలో దాచేసి వెళ్తుంటాను. నాకీ మధ్య జ్వరం వస్తోంది కదంకుల్! ఒకవేళ అది కాన్సర్ వల్ల గానీ ఎయిడ్స్ వాల్ గానీ వస్తుందేమో అని అనుమానం. ఒక చిన్న పిల్ల క్కూడా ఎయిడ్స్ వచ్చిందని ఆ మధ్య టివిలో చూపించారు కదంకుల్! అందుకే ఆ పురుగుని ఒకవేళ ఆ బల్లి ఎప్పటికయినా తినేస్తే నాకు క్యాన్సర్ ఉన్నట్లూ, లేకపోతే లేనట్లు అనుకున్నాను. నిన్నరాత్రి ఆ పురుగుని సడెన్ గా తినేసింది బల్లి. అంటే నాకు ఖచ్చితంగా క్యాన్సర్ వున్నట్లే! ఇప్పుడు డాక్టర్ దగ్గరకి వెళ్తే ఖచ్చితంగా అదే చెప్తాడంకుల్" అందుకే డాక్టర్ దగ్గర కెళ్ళటం నాకిష్టం లేదు."
"చూశారా అంకుల్ దీని పిచ్చి?" మళ్ళీ కోపంగా అంది రజని.
మస్తాన్రావ్ పకపక నవ్వేశాడు.
ఈ పిల్లని మాములు డాక్టర్ కి కాదు. మెంటల్ డాక్టర్ కి చూపించు ముందు. మెదడులో వున్న ఆ బల్లుల్ని , పురుగుల్ని తీసేస్తాడు."
మందలింపుగా అన్నాడు.
"ఏయ్ ముసలీ! నీ సంగతి నువ్వు చూసుకో! నా సంగతి నీకనవసరం " అంది శాంతి కోపంగా.
మస్తాన్రావ్ మండిపడ్డాడు.
"ఏమిటి? నన్ను ముసలీ అంటావా? నీకు పొగరెక్కి పోయిందే."
"అనటమేమిటి? నువ్వు నిజంగా మెంటల్ న్నర."
"నువ్వా ముసలిన్నర."
మస్తాన్రావ్ ఆమెను పట్టుకుని రెండు తగిలించాలని దగ్గరకొచ్చాడు కానీ శాంతి పారిపోయి సీత వెనక దాక్కుంది.
"అంటీ! నన్ను ముసలి నుంచి రక్షించు! కొట్టేస్తున్నాడు" అంది గట్టిగా.
మస్తాన్రావ్ సీతమ్మ దగ్గర ఆగిపోయాడు.
"దాన్నిటివ్వు సీతమ్మ! రెండు తగిలిస్తేనే గాని దారికి రాదు."
"బాగుంది ఆడపిల్ల మీద చేయి చేసుకుంటారేమిటి ఎవరయినా?" శాంతిని వెనకేసుకొస్తూ అందామె.
మస్తాన్రావ్ తగ్గిపోయాడు.
"సరేలే! మా ఇంటి ముందు నుంచేగా స్కూలు కెళ్ళేది ! ఉతికేస్తాను" అంటూ వెళ్ళిపోయాడు.
రజని వచ్చి ఆమె చెయ్యి పట్టుకుంది.
"పద! డాక్టర్ వెళ్ళిపోతాడు మళ్ళీ."
"నేన్రాను "గింజుకుంటోందామె.
సీత ఆమెను అనునయించింది.
"అలా అనకూడదు శాంతి! నీకు క్యాన్సర్ లేదు- గీన్సర్ లేదు నేను చెప్తున్నా కదా!"
"ఎలా చెప్పగలవాంటి నువ్వు?"
శాంతి అనుమానపడింది "నువ్వు చెప్పింది నిజమేనా అంటీ?"
"నిజం!"
"మైగాడ్."
"సరే! అయితే వెళ్తాన్లే " అనేసి రజనితో పాటు వెళ్ళిపోయింది.
రామచంద్రమూర్తి నవ్వేశాడు.
"'భలే ట్రీట్ చేశావు సీతా! ఈ పిల్ల ఇదే మనస్తత్వంతో పెరిగితే రేపు ఎన్ని సమస్యలు వస్తాయో ఏమో?"
"చిన్నప్పుడు అందరూ ఇంతే! నేనూ చాలాసార్లు అలాంటి పిచ్చి ఆలోచనలు చేసేదాన్ని. ఒకసారి పరిక్షలప్పుడు తెల్లవారుజామున నాలుగు గంటలకు కరెక్ట్ గా అలారం మోగితే పరీక్ష పాసవుతాననీ లేకపోతే ఫెయిలవుతాననీ ఒక లెక్క పెట్టుకున్నాను. ఆ సంగతి మా డాడీకి చెప్పేశాను మాటల్లో. మా డాడీ ఇంక నిద్రపోకుండా రాత్రంతా మేలుక్కుర్చుని తెల్లవారుజామున నాలుగింటికి తనే అలారం మోగించారు. ఆ అలారం టైంపీస్ సరిగ్గా పనిచేయటం లేదని ఆయనకి తెలుసు."
"చిన్నపిల్ల లేమిటండి! పెద్దోళ్ళకె రకరకాల 'పిచ్చి' పెరిగిపోతోందో పక్క... మన వెనుక వేపు వీధిలో ఆ సీతపతిరావ్ ఏం చేశాడో చూశారుగా. వ్యాపారంలో చావుదెబ్బ తింటానని వారఫలాల్లో రాశారని ఆ షాపు అర్జంటుగా కారు చవకగా అమ్మిపారేసి నిజంగానే చావుదెబ్బ తిన్నాడు. కనుక ఎవడి పిచ్చి వాడికానందమండి! మనం ఏం చెప్పినా ఎవడూ వినడండి."
రామచంద్రమూర్తి మళ్ళీ ఫజిల్ ముందుకి లాగాడు.