మల్లేశ్ వస్తున్నాడు మీ దగ్గరకి! నేనే తీసుకొచ్చాను. మంచి బేరం! వదులుకోకండి. ఎంత వీలయితే అంత గుంజండి!" అని చెప్పేసి వెళ్ళి పోయాడు కిచెన్ లోకి.
అతనికి అర్ధం కాలేదు.
"మల్లేశ్ దగ్గర డబ్బు గుంజమంటాడేమిటి?" అతనేందుకిస్తాడు? పైగా కార్పోరేషన్ ఎలక్షన్స్ లో మనకు పోటీ కదా అతను?"
మస్తాన్రావ్ నవ్వాడు.
"బహుశా తనకు వ్యతిరేకంగా నిన్ను పోటీ నుంచి విరమించుకోమని అడగడానికి వస్తున్నాడనుకుంటాను."
"నేనెందుకు విరమించుకోవాలి?"
"అతను నీకు కొంచెం లంచం యిస్తాడు కాబట్టి."
మల్లేశ్ లోపలికి వచ్చేశాడు. అతని వెనుక యిద్దరు గుండాలు.
"నమస్తే అన్నా!" అన్నాడు రామచంద్రమూర్తిని చూసి నమస్కరిస్తూ.
"రండి! కూర్చోండి" అన్నాడు అతను లేచి నిలబడుతూ.
అతను కుర్చీలో కూర్చున్నాడు.
"మస్తాన్రావ్! నువ్వు కూడా యిక్కడనే వున్నావంటే మంచిగానే వుంటుంది."
"చాలా దూరం వచ్చారు ఏమిటి సంగతి?" అడిగాడు మస్తాన్రావ్.
"గదే! రామచంద్రమూర్తి సాబ్ పోటీ చేస్తుండు గదా! సర్దార్ పటేల్ రోడ్ లో మేమిద్దరమే వుంటిమి. ఓట్లు చిలినయ్యంటే ఎవ్వాళ్ళం గెలవం, వేరొకడు జితాయిస్తాడు. మనకు ఫాయిదా ఏమున్నది? ఏమంటావ్ రామచంద్రం సాబ్?"
"అందరూ గెలవరూ కదా. ఎవరో ఒకరే గెలుస్తారు."
"అదే నేననేది! నువ్వు పోటీ చేయటం వాళ్ళ నకొచ్చేడి రెండు వందల ఓట్లు బేకార్ గా పోతాయి. నువ్వేట్లయినా గెలవలేవు.
ఎందుకంటే రాజీవ్ నగర్ కాలనీ, ఎన్టిఆర్ నగర్ కాలనీ ఓట్లన్నీ నాకే వస్తాయి. మనలో మనకి కిరికిరెందుకు భాయ్ నీకు పదివేలిస్తా! నాకు అనుకూలంగా విత్ డ్రా అయిపో. నేను బరాబర్ గెలుస్తా."
అతను ఆశ్చర్యపోయాడు.
"పదివేలా?"
"అంతకంటే ఎక్కువ యియ్యటానికి కాదు భాయ్! అంతకంటే ఎక్కువ ఖర్చు చేయాల్నంటే ఆ పైసలు నీకెందుకిచ్చేడిది. నీకు పడే ఆ రెండువందల ఓట్లు నేనే కొంటా! ఏమంటున్నావు?"
"నాకేమీ అవసరం లేదు మీరు వెళ్ళొచ్చు."
అప్పుడే అందరికి "టీ" తీసుకొచ్చిన నటరాజ్ ఆ డైలాగ్ విని ఆశ్చర్యపోయాడు.
"అదేమిటి సార్ అట్లా అంటారు? కొంచెం తీరిగ్గా మాట్లాడితే భావుంటుంది" అన్నాడతను.
"నటరాజ్ ! మనం యిబ్బందుల్లో వున్నామని అన్ని పనులూ చేయగలమా? మనమేం నాయకులమా ఎంత హీనదశకయినా దిగాజారడానికి?"
నటరాజ్ తలగోక్కున్నాడు.
"ఇందులో తప్పేంలేదని నా ఫీలింగండి! ఎందుకంటే మల్లేశ్ అన్న యిస్తానంటున్న పడువేలూ అయన సొంత మేం కదండీ! ప్రజా ధనమే. కిందటి టరమ్ లో కార్పొరేటర్ లో వున్నప్పుడు కాజేసిందే. అలాగే మీకు ప్రభుత్వం యివ్వాల్సిన పి.యఫ్, ఫెన్షన్ యివన్నీ కూడా ప్రజల సొమ్మే. అంటే యిక్కడికేమయినట్లు? ప్రజల సొమ్ము ప్రజా ప్రభుత్వం నుంచి కాజేసిన మల్లెశన్నమళ్ళీ అదే ప్రజా సొమ్ముని మీకు ప్రభుత్వం యివ్వాల్సిన ప్రజా సొమ్ము కింద యిస్తున్నాడన్న మాట.'
మల్లేశ్ నవ్వాడు.
"నువ్వు చాలూ వున్నావు రా భాయ్. గిప్పుడేమంటావ్ రామచంద్రసాబ్?"
"ఇందాక చెప్పిన మాటే. మనం యింక ఆ టాపిక్ వదిలేద్దాం. కొంచెం ఈ పజిల్ మీరు చెప్పగలరేమో చూడండి. విజయం సాధించిన వారి కళ్ళల్లో యిది కనబడుతుంది. మెరువు, వెరపు, ఏది కరెక్ట్?"
"నన్నడిగితే మెరుపే కరెక్టనుకుంటాను"అన్నాడు మస్తాన్రావ్.
"మల్లేశ్ కోపంగా లేచి నిలబడ్డాడు.
"నేనీడకొచ్చింది నీ ఫజిల్ చేయడానిగ్గాదు. నా ఫజిల్ సాల్వ్ చేయడానికి సమజయిందా?" అనేసి బయటకు వెళ్ళిపోయాడు విసురుగా.
"అంకుల్! చూడంకుల్! అక్కయ్య కొడుతోంది నన్ను" పరుగుతో వచ్చి రామచంద్రమూర్తి పక్కన నిలబడింది శాంతి. ఆమె వెనుకే ఆమె అక్క రజని కోపంగా వచ్చింది.
అగు రజని! కొంచెం అగు! ఎందుకు గోడవోచ్చింది మీ ఇద్దరికీ?"
"డాక్టర్ దగ్గర వెళదామంటే రానంటోంది" విసుగ్గా అంది రజని.
"అసలు డాక్టర్ దగ్గరాకెందుకు?"
రోజూ సాయంత్రం పూట జ్వరమోస్తోంది అంకుల్! డాక్టర్ దగ్గర వెళ్దామంటే రాదు. డాక్టర్ తనకు క్యాన్సర్ అని చెప్తారేమోనని భయం అంట........."
అందరూ నవ్వేశారు.