"వదిన కస్సలు బుద్దిలేదు" పదిహేనోసారి అనుకుంది సునీత.
విశాల అన్నయ్య వరస ఆయన ఒకాయన పోయాడు. ఈ రోజు పదోరోజు పొద్దుటే లేచి పిల్లలను స్కూలుకు పంపే బాధ్యత సునీతకు అప్పగించి హడావుడిగా తయారయి-
"సునీతా! మీ అన్నయ్యని నిద్ర లేపాను, కాఫీ కలిపి యివ్వు నాకు ఆలస్యం అయిపోతుంది వెళుతున్నా" అని చెప్పి వెళ్ళిపోయింది విశాల.
సునీతకు అన్నయ్య వదినల విషయం చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. ఉదయం విశ్వం నిద్రలేచే సమయానికి బయట వాళ్ళెవరినీ ఆ గదిలో వుండనివ్వదు భార్య. ఎంత దగ్గిరవాళ్ళయినా సరే, బహుశా నిద్ర లేవగానే అతడు మరెవరి మొహం చూడకూడదని ఆమె ఉద్దేశ్యం కాబోలు. అతడు ముఖం కడుక్కుని వచ్చి హాల్లో కూర్చుంటాడు. కాఫీ తీసుకెళ్ళి పేపరుతో పాటు అందిస్తుంది.
"మా ఆవిడ కాఫీ బ్రహ్మాండంగా చేస్తుంది. పొద్దుట లేవగానే తన చేతి కాఫీ తాగకపోతే నాకు ఈ రోజంతా ఏదో మిస్సయినట్లుగా అనిపిస్తుంది" అంటాడు విశ్వం అవకాశం దొరికినప్పుడల్లా.
"కాఫీ నేను చేస్తే తప్ప ఆయనకు రుచించదు" అని ఎంత అనారోగ్యంగా వున్నా తనే కాఫీ కలిపి యిస్తుంది విశాల.
ఆమె కాఫీని పదిమందిలో మెచ్చుకుంటూ, పొగుడుతూ, ఆమె అహాన్ని తృప్తి పరుస్తాడు విశ్వం ఆ రకంగా అతడికి కాఫీ కలుపుకునే అవసరంకూడా రాలేదింతవరకూ నెలలో ఇరవై ఏడు రోజులూ మంచి నీళ్ళ గ్లాసుతో సహా అందించే భార్యకు ఒక్కరోజు, ఒక్కపూట తన చేతి భోజనం పెట్టలేని దుస్థితిలో వుండడం కూడా గొప్పగా చెప్పుకునే దంపతులు వీళ్ళు.
సునీత అందించిన కాఫీ సిప్ చేసి తృప్తిగా తల వూపాడు విశ్వం.
"చాలా బావుంది కాఫీ, అచ్చం అమ్మచేతి కాఫీలా".
"ఆశ్చర్యంగా వుందన్నయ్యా వదిన చేతి కాఫీ తప్ప మరేదీ రుచించదనుకున్నాను" అంది సునీత.
"అదా" నవ్వేశాడు విశ్వం. "నిజానికి నాకిలా సత్రంగ్ గానూ, చక్కర తక్కువగానూ వుండే కాఫీ యిష్టం ఆరోగ్యానికి మంచిది కాదు అని మీ వదిన లైట్ కాఫీ ఇస్తుంది".
"మరి ఆ మాట చెప్పి నీకు కావలసినవిధంగానే చేయించుకోవచ్చుగా?"
"అమ్మో, మీ వదిన చస్తే వొప్పుకోదు. తను చెప్పేదాంట్లోనూ తప్పులేదుగా స్ట్రాంగ్ కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదు. నా మంచి కోసమే అలా చేస్తుందని నేను ఎదురు చెప్పను. ఎంతయినా సైన్సు చదువుకుంది కదా!"
"అవునన్నయ్యా సైన్సు చదువుకుంది, పాసయ్యింది. కాని పిల్లలకు సైన్సు పాఠాలు చెప్పడానికి తీరిక లేదు, ఇంట్రెస్టు లేదు. ఈ రోజు పొద్దుటే లేచి అన్ని పనులు వదిలేసుకుని వాళ్ళ వదిన మొహం చూడడానికి పరుగులెత్తుతూ వెళ్ళింది. ఎందుకో తెలుసా? దుఃఖంలో వున్న ఆవిడ మొహాన బొట్టు తుడిచేసి, గాజులు విరగ్గొట్టి తెల్లబట్టలు కట్టి, ఆవిడ మొహం చూసి తనకు శుభాన్ని మూటకట్టుకు రావడానికి వెళ్ళింది. నీ భార్య సైన్సు చదువుకుందన్నయ్యా కానీ అర్ధం చేసుకోలేదు" అంది ఆవేశంగా సునీత.
విశ్వం కొద్దిసేపు ఆలోచనలో పడ్డాడు. ఏం చెప్పాలో నన్నట్లుగా తర్వాత మెల్లిగా అన్నాడు.
"ఆవేశం తగ్గించుకుని నేను చెప్పేది శాంతంగా వింటావా సునీతా?"
"ఆవేశం కాదన్నయ్యా! ఆక్రోశం బి.యస్సీ చదువుకున్న ఒక స్త్రీ మరో స్త్రీని విధవరాలిని చేసి చూడకపోతే భవిష్యత్తులో కీడు జరుగుతుందని మూఢ నమ్మకంతో 'వెళ్ళి తీరాలి' అని వెళుతూంటే నా వొంటిమీద తేళ్ళు, జెర్రులు పాకుతున్నట్లనిపిస్తుంది".
"అమ్మా, బామ్మల ప్రభావం విశాల మీద చాలా వుంది. ఛాదస్తం కాస్త ఎక్కువపాలేననుకో కాని అది మరెవరికీ కీడు చేయనిది కదా?"
"ఇది ఎవరికీ కీడు చేయని ఆచారం అని నువ్వంటున్నావా అన్నయ్యా?" ఆశ్చర్యంగా అంది సునీత.
"ఇప్పుడు విశాల వాళ్ళ వదిన "నా కిదంతా యిష్టంలేదు. ఇవన్నీ నేను చేయించుకోను" అని పట్టు పట్టిందనుకో... నేను పూర్తిగా ఏకీభవించి సహకరించేవాణ్ణి కాని చేయించుకున్న వాళ్ళే అది మనస్ఫూర్తిగా నమ్ముతున్నప్పుడు మనమేం చేయగలం చెప్పు?"
"ఏ స్త్రీ కూడా తన నుదుటి కుంకుమని చెరిపెయ్యటాన్ని పదిమంది వచ్చి తిలకించడం సహించలేదు అన్నయ్యా! ఆమె భయపడేది చుట్టూ వున్న నలుగురికే ఆ నలుగురిలో కనీసం ఒక్కరాయినా తనకు అండగా నిలబడతారని తెలిస్తే ఈ దురాచారాన్ని ఎదిరించే ధైర్యం ఆమెకు వస్తుంది. కనీసం చదువుకున్న స్త్రీలయినా ఇలాంటి ఆచారలని ఖండిస్తే తప్ప మనలో మార్పు రాదని నువ్వే ఎప్పుడూ చెబుతూండేవాడివి. ఇప్పుడిలా మాట్లాడటం ఆశ్చర్యంగా వుంది. నీలో యింత మార్పెలా వచ్చింది?"
"నాలో మార్పు వచ్చిందని నువ్వనుకోవడం పొరపాటు నేనిప్పటికీ అంటాను. చదువుకున్న స్త్రీలే సమాజంలో మార్పు తేగలరని కాని అది వాళ్ళు మనస్ఫూర్తిగా నమ్మగలిగినప్పుడే చేయగలరు".
"ఆమెలో మార్పు తేవడానికి ప్రయత్నించలేవా?"
"అలా చెబితే మగవాడినన్న అహంతో నేను శాసిస్తున్నట్లనుకుంటుందని నా భయం. అలా బలవంతంగా తనలో మార్పువస్తే సంతోషిస్తాను కాని మనసులో ఒకటుంచుకుని పైకి నా కోసం మార్పు వచ్చినట్లు నటిస్తే నేను సంతోషించలేను" అన్నాడు విషయం తేల్చేసినట్లుగా.
సునీత మరేం మాట్లాడలేదు. ఆలోచనలో పడింది. అన్నయ్య చెప్పినదాంట్లో నిజం వుందనిపించింది. ఎందుకు తెలీకుండా ఆమెకు దుఃఖం వచ్చింది.
* * *
సృజననూ, వరుణ్ నీ కూర్చోపెట్టి స్క్రేబుల్ ఆడిస్తోంది సునీత. అన్నయ్య వాళ్ళ పిల్లల మానసిక అభివృద్ధి పట్ల తగిన శ్రద్ద తీసుకోకపోవడం గమనించి, తనే పాఠాలు చెప్పడం కాకుండా కొన్ని గేమ్స్ జనరల్ నాలెడ్జి పుస్తకాలు కొనుక్కొచ్చింది రోజుకోగంటయినా వాళ్ళతో కూర్చుని ఆడిస్తుంది. సృజనాకు చదువుమీద కంటే ఆటలపట్ల శ్రద్ద ఎక్కువ. క్యారమ్స్, చదరంగం బాగా ఆడుతుంది. తగిన ప్రోత్సాహం ఇస్తే ఆ ఆటల్లో మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటుందనిపించింది. వరుణ్ బాగా చదువుతాడు, తెలివయినవాడు స్క్రేబుల్ పాయింట్స్ ఎప్పుడూ వాడికే ఎక్కువ వస్తాయి. అందుకే ఉత్సాహంగా ఆడుతున్నాడు.
"వరుణ్ ఒకసారి యిలా రా" విశాల వంటింట్లోంచి పిలిచింది.
"ఉండమ్మా వస్తాను" తన దగ్గరున్న అక్షరాలతో పదాలను సీరియస్ గా కూర్చుకుంటున్న వరుణ్ చిరాగ్గా అన్నాడు. విశాల అక్కడికే వచ్చింది.
"అన్నయ్య లేడా వదినా? వాడు సీరియస్ గా ఆడుతున్నాడు. వాన్నెందుకు లేపడం?" అడిగింది సునీత.
"ఆయన న్యూస్ వింటున్నారు. ఎట్లా పంపించను? గంటనుంచీ ఆ వంటగదిలో మగ్గిపోతున్నాను. ఆ వంటపని ముగించుకుని కాస్సేపు విశ్రాంతి తీసుకుందామంటే ఒక్కరూ చెప్పినమాట వినరు, కొత్తిమీర కావాలి".
"నేను వెళ్ళి తీసుకొస్తాలే వాడిని ఆడుకోనీ" లేచి చెప్పులు వేసుకుంది సునీత.
అన్నయ్య న్యూస్ వింటున్నాడని వంక చెపుతోంది. నిజానికి టీవీలో ప్రోగ్రాం మొదలయినప్పటినుంచీ చివరివరకూ అది ఆన్ లోనే వుంటుంది. న్యూస్ మీద కంటే న్యూస్ రీడర్ కట్టుకున్న చీరమీదా, పెట్టుకున్న నగలమీదా డిస్కస్ చేసుకుంటారు. కొందరికి వంకలు పెట్టి నవ్వుకుంటారు. అలా టైం ఎంతయినా వేస్ట్ చేసుకుంటారు తప్ప పిల్లలతో సరదాగా కాస్సేపు గడపడానికి యిష్టపడరు.
కొత్తిమీర కట్టలు విశాలకిచ్చి హాల్లోకొచ్చింది సునీత. ఏదో శాస్త్రీయ సంగీతం వస్తోంటే సోఫాల్లో జారగిలబడి వింటున్నాడు.
"అన్నయ్యా! ఇంటిపనులు, చిన్న చిన్న బజారుపనులయినా చెయ్యవు. ఎందుకని?" అడిగింది.
విశ్వం నవ్వాడు. "నలభై యేళ్ళుగా లేని అలవాటు యిప్పుడు చేసుకోనా?"
"ఎందుకు చేసుకోకూడదు? సిగరెట్లు కాల్చడం చిన్నప్పటినుంచీ వున్నా అలవాటా?"
"చూడు నీతా! ఇంటిపనులు చెయ్యకపోవడం నా తప్పుకాదు. నేనేపనీ చెయ్యడం వాళ్ళకిష్టం వుండదు. కాబట్టి చెయ్యను. నేనే జబారు కెళితే నా మొహం చూసి పుచ్చి పోయిన వంకాయలు, కుళ్ళిపోయిన కూరలు ఇస్తాడు కూరలవాడు, ఏం లాభం?"
"కూరల్లో మంచివేవో, చెడువేవో తెలుసుకోవడం పెద్ద బ్రహ్మవిద్యేం కాదు".
"ఏమిటి అన్నా చెల్లెళ్ళిద్దరూ పోట్లాడుకుంటూన్నారు?" విశాల రానే వచ్చింది.
"ఏం లేదు నిన్ను చాలా కష్టపెడుతున్నానని, యింటి పనుల్లో సహాయం చెయ్యడం లేదనీ, నన్ను మందలిస్తోంది సునీత".
"అందులో మందలించాల్సిందేముందీ? అత్తయ్య చిన్నప్పటినుంచీ అలా పెంచింది. ఇప్పుడు నేను పనెలా చేయిస్తాను? అయినా చేసేవాళ్ళం మాకు లేని బాధ నీకెందుకు? నీకు కాస్త పని చెప్పినందుకా! ఇంకెప్పుడూ చెప్పను లేమ్మా!" అంది విశాల కరుగ్గా.