''అదిగో ....అక్కడ....'' అంటూ వేలు చూపిస్తూ బిత్తరపోయాడు వెంకట్.
తల తిప్పి చూసిన మిత్రులకు అక్కడ ఎవరూ కనిపించలేదు.
వెంకట్లో అయోమయం, అనుమానం, భీతి....చలిజ్వరం వచ్చిన వాడిలా వణికిపోతున్నాడు.
''ఏరా....నువ్వు నిజంగా చూశావా?'' ధైర్యాన్ని కూడగట్టుకుంటూ ప్రశ్నించాడు అనిల్.
నీరసంగా తల వూపాడు వెంకట్.
ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకొని ధైర్యంగా బయటకు వెళ్ళారు.
ఎంత వెదికినా ఎక్కడా ఎవరూ కనిపించకపోవడంతో తమలో తామె గొణుక్కుంటూ లోపలకు వెళ్ళిపోయారు.
గెస్ట్ హౌస్ తలుపులు మూసుకుపోయాయి.
ఈసారి తెరిచి వున్న ఆ కిటికీ తలుపులు కూడా మూసుకున్నాయి.
అంతవరకూ ఆ పరిసరాలలోనే ఒక చెట్టు చాటున నిలిచి వాళ్ళ చర్యలన్నీ గమనిస్తున్న లెక్చలర్ నీలిమ కళ్ళు ఎర్రని జ్యోతుల్లా మండుతున్నాయి.
అప్పుడే ఆ గెస్ట్ హౌస్ ముందు ఆగిందోక ఆటో.
వాచ్ మెన్ అబ్బులుతో పాటు ఒక అందమయిన యువతి కిందకు దిగింది.
వాళ్ళను చూసిన నీలిమ భ్రుకుటి క్రోధంగా ముడివడింది.
ఆటో వెళ్ళిపోయింది.
నీలిమ అప్పుడు ముందుకు కదిలింది.
* * * *
యూనివర్సిటీ ఉమెన్స్ హాస్టల్....
గడిచిన రెండు రోజులుగా వార్డెన్ నీలిమ లేకపోవడంతో స్టూడెంట్స్ అల్లరి శ్రుతిమీరి కిష్కిందకాండను గుర్తుకుతెస్తున్నది.
హాస్టల్ వార్డెన్ కమ్ లెక్చరర్ నీలిమ అంటే స్టూడెంట్స్ కు బ్రహ్మ రాక్షసి క్రింద లెక్క, డిసిప్లిన్ అంటే ప్రాణం యిచ్చే వార్డెన్ విధించిన ఆంక్షల వలన స్టూడెంట్స్ తమ అభిరుచుల్ని, సరదాలను తప్పినిసరిగా లోలోపలే అణచివేసుకుంటూ వచ్చారు.
అలాంటిది....ఒక్కసారిగా స్వేఛ్చ లభించేసరికి ఎవరికిష్టమొచ్చిన రీతిలో వాళ్ళు మరచిపోయిన సరదా జీవితాన్ని అనుభూతిలోకి తెచ్చుకుంటూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు.
లెక్చరర్ నీలిమకు ముందు వెనకా ' నా ' అనే వాళ్ళెవరూ లేరు. సెలవుల్లో సైతం హాస్టల్లోనే వుండే నీలిమ అసలు ఎక్కడికి వెళ్లిందో .... ఏమయ్యిందో....చెప్పాపెట్టకుండా అటు యూనివర్సిటీకి రాకుండా....ఇటు హాస్టల్లోనూ లేకుండా మంత్రం వేసినట్టు మాయం కావటం ప్రతి ఒక్కరికీ అంతుబట్టని మిస్టరీగా మిగిలిపోయింది.
వార్డెన్ నీలిమ అదృశ్యమైన విషయం ప్రిన్స్ పాల్ నోటీస్ కు కూడా వెళ్ళింది.
కానీ ఆ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో హాస్టల్ గేటు తెరచుకుని లోపలకు వస్తున్న నీలిమను చుసిన స్టూడెంట్స్ అందరూ మాటా పలుకూ లేకుండా బిగుసుకుపోయారు.
ఆమె లేదుకదా అనే ధైర్యంతో అంత రాత్రివేళ కూడా గదుల తలుపులు బార్లా తెరిచి, రకరకాల వేషాలు, ఆటల్లో మునిగిపోయి వున్నారంతా.
ఆ సమయంలో వార్డెన్ ను చూడగానే తమకు పనిష్మెంట్ తప్పదనే భయంతో తెల్లముఖాలు వేసుకొని చూస్తున్నారు.
లోపలకొచ్చిన లెక్చరర్ నీలిమ అందరివైపు సీరియస్ గా చూసింది కొన్ని క్షణాలపాటు.
'' All this world is a stage and we are all actors come on my girls, let
us enjoy the night.''
నీలిమ ముచ్చటగా మురిపెంగా అన్న మాటలకు ఒక్కసారిగా నిర్విణ్ణులయ్యారు విద్యార్ధినులు.
ఈమె తమ వార్డెన్ నీలిమేనా అన్న ఆశ్చర్యం!
వాళ్ళ ఫీలింగ్స్ తో నిమిత్తం లేకుండానే తన గదివైపు నడిచి వెళ్ళిపోయింది లెక్చరర్ నీలిమ.
విభ్రాంతిగా ఆమెనే చూస్తుండిపోయారు స్టూడెంట్స్.
* * * *
ఇన్స్ పెక్టర్ ధీరజ!
రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధతో ఏర్పాటు చేసిన మహిళా పోలీస్ స్టేషన్లలో భాగంగా ఆ నగర మహిళా పోలీస్ స్టేషన్ కు కొత్తగా రిక్రూట్ అయి వచ్చింది ధీరజ.
వచ్చీ రావడంతోనే ఆమెకు ఎదురయిన తోలి కేసు లెక్చరర్ నీలిమది....ఆమె కేసులో వున్న మిస్టరీ ఏమిటో తెలియకుండా విచిత్రమైన రీతిలో మాయం కావడం వెనుకనున్న కారణాలను అన్వేషిస్తున్నది ధీరజ అంతరంగం.
అప్పుడు సమయం అర్ధరాత్రి పన్నెండు గంటలు.
నీలిమ కనిపించకుండా పోయి రెండు రోజులు గడిచాయి.
ఆమెకు బంధువులు ఎవరూ లేరు, కనీసం సెలవు కూడా పెట్టలేదు....సెలవు పెట్టకుండా ఇంతవరకెప్పుడూ యూనివర్సిటీకి గైర్ హాజరు కాలేదు.
ఎక్కడో ఎదో జరిగింది.
అది తెలియాలంటే ఆమె కొలీగ్స్ ను కలుసుకుంటే తప్ప ఏదో ఒక ఆధారం లభించకపోదు. ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం అప్పటికప్పుడు స్కూటర్ మీద బయలుదేరింది ఇన్స్ పెక్టర్ ధీరజ.
టీచర్స్ కాలనీ....ఆరవ రోడ్డు....పదకొండవ నెంబర్ ప్లాట్ ముందుకెళ్ళి స్కూటర్ కు స్టాండు వేసింది.
ఆ కాలనీలో జనసంచారం లేదు. చుట్టూ ప్రక్కల ఏ ఇంట్లోనూ లైట్లు వెలగకపోయినా, ఆ ప్లాటులో మాత్రం ఇంకా లైట్లు వెలుగుతూనే వుండటం గమనించిన ధీరజ భ్రుకుటి ముడివడింది.