Next Page 
ప్రేమికారాణి పేజి 1

                        
                                                 

                        ప్రేమికారాణి

                                                                                ---- పోల్కంపల్లి శాంతాదేవి
   
    రేయి నుండి రోజు బయట పడుతూంది!

    రోజుకు స్వాగతం చెప్పడానికన్నట్టుగా సప్తాశ్వుని రధచక్రాలు కదిలినట్టున్నాయి. తూర్పున వెలుగురేఖలు ప్రాకుతూ వస్తున్నాయి! చీల్చి చెండాడదానికి వస్తున్న వజ్రాయుధాన్ని చూసి శక్తి ఉడిగిన దానవుడు పారిపోతున్నట్టుగా తూర్పు ఉషస్సు చూసి చీకటి పారిపోసాగింది! రాత్రంతా తమని ఉజ్వలంగా ఏలి పలాయనాన్ని చిత్తగిస్తూన్న చీకటిని చూసి వెలవెలబోతున్నాయి చుక్కలు! చీకటి పరాభవానికి సంబరం వేసినట్టుగా గాలి చల్లనై అల్లరి పిల్లాడిలా పరుగులు పెడుతూంది!

    ఆ సమయంలో,

    నగరం ఒళ్ళు విరుచుకొంటున్నది!

    టైంపీస్ అలారం గణగణమనసాగింది.

    రాత్రంతా దగ్గుతో ఆయాసపడి అప్పుడే కాస్త కునుకుపట్టిన సుందరయ్యకి మెలుకువ వచ్చేసింది ఆ శబ్దానికి! లేచి కూర్చొన్నాడు.

    అలారం ఆగిపోయింది. సుందరయ్య మంచందిగి లైట్ వేశాడు. గదిలో మరోప్రక్కగా, మరో మంచంమీద ప్రేమీ గాఢ నిద్రలో ఉంది. గడియారం వైపు చూశాడు సుందరయ్య. పావు తక్కువ అయిదు! 'ప్రొద్దున్నే ఆంటీ దగ్గరికి వెళ్ళాలి' అంది పాప. రాత్రి చాలాసేపటివరకు ఏదో వ్రాసుకొంటూనే ఉంది! పడుకోబోయేటప్పుడు 'అలారం శబ్దానికి నాకు మెలకువ వస్తుందో లేదో, నువ్వు లేపు నాన్నా!' అంది అలారానికి కీ ఇచ్చి టేబిల్ మీద పెడుతూ. ఇంకా రాత్రి అలసట తీరినట్టుగా లేదు ఆ పిల్ల ముఖం చూస్తే. లేపడానికి మనస్కరించలేదు సుందరయ్యకు. కాని, లేచాక ఎందుకు లేపలేదని కేకలేస్తుందేమో! ఏమో ఏమిటి? లేస్తుంది.

    "పాపా! పాపా!"
    తండ్రి పిలుపుకు "ఉఁ" అని ఒత్తిగిలి మళ్ళీ పడుకొంది ప్రేమీ.

    సుందరయ్య తటపటాయింపుగా కాస్త ఆగి, "ప్రొద్దున్నే ఆంటీ దగ్గరికి వెళ్ళాలన్నావుగా అమ్మా?" అన్నాడు.

    'ఆంటీ' శబ్దం చెవిని పడుతూనే నిద్రమత్తు వదిలిపోయినట్టుగా అయింది ప్రేమీకి. దిగ్గున లేచి కూర్చొని ముందు టైంపీస్ వంక చూసింది. "మైగాడ్! అలారం కొట్టినా మెలకువ రాలేదన్నమాట. ఎంతమొద్దులా పడుకొన్నాను!"

    లేచి గబగబా పక్క చుట్టబెట్టింది. నోట్లో నీళ్ళు పోసుకుని ఉమ్మి వేసి చీపురు పట్టుకొని వాకిట్లోకి వచ్చింది. స్ట్రీట్ లైట్ వెలుతురు ఆ ఇంటి కాంపౌండ్ లోకి బాగా పడుతూంది! లైట్ వెలుగులో తూర్పు తొలి వెలుగు కనిపించడంలేదు. బాగా రాత్రిగా అనిపిస్తూంది! పచ్చటి ఆకులమధ్య ఎర్రమందారాలు విరగబూసి ప్రేమీని పలకరిస్తున్నట్టుగా గాలికి చిన్నగా కదులుతున్నాయి! గేటు ఆర్చీమీద ప్రాకించిన మల్లెతీగ గుబురులో నక్షత్రాల్లా విచ్చిన మల్లెలు తొంగి చూస్తున్నాయి! మల్లె సుగంధాలు వేస్తూ మత్తుగా స్పర్శిస్తూంది గాలి ప్రేమీని.

    నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉన్న వాతావరణం చూసి ఒక నిమిషం మైమరచిపోయినట్టుగా అలా నిలబడిపోయింది ప్రేమీ. తరువాత ఒంగి వాకిలి చిమ్మడం ప్రారంభించింది.

    ఎంత చక చకా చేసినా పని తెమిలేసరికి ఆరు అయింది. తండ్రికి వేసుకోడానికి మందు ఇచ్చి "ఆంటీకి కాగితాలు ఇచ్చి ఓ గంటలో వచ్చేస్తాను నాన్నా! ఈలోగా మాత్రం నువ్వు వంట ప్రారంభించకు!" అని చెప్పింది ప్రేమీ.

    "అలాగే తల్లీ!"

    "అంటావుకాని వచ్చేసరికి శుభ్రంగా వంట ముగించేసి ఉంటావు!"

    "ఈ రోజు ఏం చెయ్యను!"

    ఆ క్షణంలో ఆ ఇద్దరినీ చూస్తే అతడే కొడుకు. ఆమే తల్లిలా ఉన్నారనిపిస్తుంది! తల్లి కేకలేస్తూంటే కొడుకు వినమ్రంగా సమాధానం ఇచ్చినట్టుగా ఉంది!

    ప్రేమీ బాగ్ భుజానికి తగిలించుకొని కాళ్ళకి జోళ్ళు వేసుకొంటూ మళ్ళీ చెప్పింది. "నేను వచ్చేసరికి చక్కగా నిద్రపోవాలి! రాత్రంతా నీకు నిద్రేలేదు!"

    "ఆఁ, అలాగే పడుకొంటాను."

    ప్రేమీ గేటు తలుపులు జాగ్రత్తగా వేసి చకచకా నడవసాగింది. కొళాయిల్లో నీళ్ళు జల్లున వస్తూన్న శబ్దం, బకెట్లు బర్రున లాగిన శబ్దం, వాకిళ్ళు చిమ్ముతున్న శబ్దం 'తెల్లారిపోయింది' అన్న ఆత్రుతని తెలియజేస్తున్నాయి! కొన్ని ఇళ్ళముందు తడి ఆరని వాకిళ్ళలో ముగ్గులు వేసి ఉన్నాయి! కొందరు వేన్ దగ్గరి నుండి పాలసంచులు తీసుకువెడుతున్నారు ఇళ్ళకు.

    "టమేటా, బీన్స్, కాబేజ్..." అరుస్తూ కూరలబళ్ళు వస్తున్నాయి!
   

Next Page