Previous Page Next Page 
పాప నవ్వింది పేజి 2

 

    ఐదునిమిషాలు గడిచింది. ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చున్నారు మిగిలిన ముగ్గురునూ. ఆ వెళ్ళిన మనిషి కోసం నిరీక్షిస్తూ. ఇంతలో పది నిమిషాలు కావటం, వెళ్ళినావీడేదుమధుమలాడుతూ విసురుగా బైటకొచ్చి వాళ్ళ వైపైనా చూడకుండా వెళ్ళిపోవటం జరిగింది. తరవాత అమ్మాయి లోపలి వెళ్లి అయిదు నిమిషాలకే నిర్లిప్తంగా వచ్చేసింది. మూడో ఆవిడ వెళ్ళి పదిహేను నిమిషాలైనా రాలేదేమిటా అని కమల చూస్తుండగానే బైటకొచ్చి కమల వంక వో చిరునవ్వు పారేసి వెళ్ళింది. ఈ అమ్మాయికే ఈ వుద్యోగం ఇచ్చారేమోనని అనుకుంటున్నా కమల తనని రమ్మనడంతో లోపలికి వెళ్ళింది.
    సాంతం తలెత్తి చూడకుండానే యాంత్రికంగా అక్కడి వాళ్ళకి నమస్కారం చేసి నుంచుంది. నాలుగు క్షణాలైనాక 'కూర్చోమ్మా' అన్న మృదువైన స్వరానికి తలెత్తి చూసింది. అక్కడ నలభై అయిదేళ్ళు సమీపించిన ఒక గంబీరమైన స్త్రీ కూర్చుని వుంది. ఆడంబరంగా లేకపోయినా చూడగానే గొప్పింటి మనిషని పించింది.
    పిల్ల నాయనమ్మ ఈవిడేనా అని మళ్ళీ ఒకసారి చూసింది కమల. నొక్కుల జుట్టు అక్కడక్కడ తెల్లని వెంట్రుకలు  మనిషికి నిన్డుతనంతెచ్చి పెట్టినై. అసలావిడేకి వన్నె తెచ్చినవామే కళ్ళు. ఎంత దయగా శాంతంగా చూస్తున్నదో అనుకుంది కమల. ఆ చూపుల్లోని చల్లదనానికి మనసు కుదుట పడి తల బాగా ఎత్తి చూసింది.
    ఆవిడేదో కాయితాలు చూస్తున్నది. ఆమె పక్కనే అరవై ఏళ్ళు దాటిన పండంటి ముసలాయన కాయితాలు తిరగేస్తూ కూర్చుని ఉన్నాడు.
    ఒక నిమిషం గడిచింది.
    'నీ పేరేంటమ్మ?' అన్నారాయన.
    'కమల' అని జవాబిచ్చింది , ఇదేం ప్రశ్నా అన్నట్లు చూస్తూ.
    'ఏం చదువుతున్నావ్?'
    అవన్నీ కాయితాల్లో వున్నాయి కదా అన్నట్లు చూసి , కమల ఒక క్షణం అయినాక ' బి.ఎ పరీక్షలు రాశానండి' అన్నది.
    అయన చిరునవ్వుతో 'పాసవుతావా' అన్నారు.
    'వో తప్పకుండా అవుతానండి. ఇంత మటుకు నేను తప్పలేదు.' అంది కమల చురుగ్గా.
    నిజమేనమ్మా నీవు తప్పుతూ చదివి నట్లయితే పద్దెనిమిదేళ్ళకే బి.ఏ. ఎట్లా చదువుతావు? అంటూ ఆమె వంక చూశారు. ఆవిడ ఔనన్నట్టు నవ్వుతూ తలూపింది.
    'ఐతే నీకెన్నేళ్ళు?'
    'జూన్ లో పద్దెనిమిది నిండు తాయి అండీ!
    'నువ్వు' అని ' చూడమ్మా నిన్ను నువ్వు అన్నాననిఏమీ అనుకోకు. నీ తాతగారి కుండే వయసు నాది' అన్నారాయన.
    'దానికేముంది లెండి . మీరు పెద్దవారు.'
    'ఏ సబ్జక్టులు చదివావు?'
    'సంగీతం, ఫైన్ ఆర్ట్స్, డొమెస్టిక్ సైన్సండి!
    బేషుగ్గా వున్నాయమ్మా. అన్నీ ఉపయోగపడేవే. మరి మీ నాన్నగారేం చేస్తారమ్మా?'
    కమల రెండు మూడు క్షణాలు తలవంచుక్కుర్చుని 'మా అమ్మా, నాన్నా ఇద్దరూ నాకైదో ఏటనే పోయినారండి" అన్నది.
    ఈ జవాబుకి వాళ్ళిద్దరూ కలవరపడ్డట్టు కనపడ్డారు.
    ఆమె అందుకుని 'ఇద్దరూ ఒకసారి ఎలా పోయినారమ్మా" అన్నది.
    'చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి వూరు వెళ్ళామండి. వాళ్ళ వూరు సముద్రపు వొడ్డునే వుంటుంది. గ్రహణం నాడు స్నానం చేస్తూ లోతు కెళ్ళి కొట్టుకు పోయినారు.' అని ఆగిపోయింది.
    వాళ్ళ ముఖాలు విచారాన్ని వెలిబుచ్చినై. ఈ సంభాషణ తప్పించటానికి కన్నట్లు 'అట్లాగా అమ్మా. మరి ఇప్పటి వరకు ఎక్కడున్నావ్' అన్నది ఆమె.
    'ఆరోజున మా అమ్మా నాన్నలతో మా మావయ్య భార్య కూడా కొట్టుకు పోయిందండి. మా మామయ్య కొడుకు కృష్ణ నీ పెట్టుకుని మామయ్య వొడ్డున కూర్చున్నాడండి. నన్ను ఆయనే పెంచాడు.'
    'అట్లాగా అమ్మా' అని ఆవిడే అయన వైపు కానివ్వమన్నట్లు చూసింది.
    అయన అందుకుని 'సరే గాని అమ్మాయ్, మరి నీవిక్కడవుండి పని చెయ్యటానికి మీ మామయ్య ఇష్ట పడతాడా" అన్నాడు.
    'ఆయనకి యిప్పుడు వొంట్లో బాగా లేకపోతె కృష్ణ నాగపూర్ తీసి కెళ్ళాడండి. వో ఆరు నెల్లయింది. నన్ను కూడా రమ్మన్నారు. కాని పరీక్షలని నేనే వెళ్ళలేదు.'
    'మరి నీకు పిల్లలంటే ఇష్టమేనా? వాళ్ళతో కాలం గడపగలవా?'
    'వో , ఇష్టమేనండీ పిల్లలంటే నాకు చాలా ఇష్టం. వాళ్లతో రెండు నిమిషాల్లో కలిసిపోతా'నంటున్న కమల మొహంలో కనపడ్డ ఆనందానికి, ఆ పసితనానికి అయన పకపకా నవ్వారు.
    నవ్వి ' సరే. ఆ పిల్ల నీ మాట వినకపోతే ఏం చేస్తావ్' అన్నారు.
    'కలిసి కాసేపు అల్లరి చేసి తరవాత మంచి మాటలతో బుజ్జగించాలి. నయానో భయానో అప్పటికీ వినకపోతే ' అంటున్న కమల మాటలకి అయన 'ఒకటి వద్దిస్తావు అంతేనా' అన్నారు.
    'అబ్బే లేదండి. లేస్తే మనిషిని కాదన్న భయంతో కళ్ళ బెదురుతో పెంచాలి' అని తానేమన్నా తప్పు చెప్పానేమో అనుకుంటూ చూసింది.
    అప్పటికింక వాళ్ళు అడగవలసినవి ఏమీ లేదన్నట్టుగా 'ఈ సిఫార్సు వుత్తరాలు నీవు చెప్పి రాయించుకున్నావా, వాళ్ళే రాసిచ్చారా' అన్నారు.
    'నే చెప్తే రాస్తారా అండీ అంత పెద్ద వాళ్ళు?' వాళ్ళే రాసిచ్చారు.
    'నీకింకా ఏం వచ్చమ్మా?'
    'టై పోచ్చండి. వంట వచ్చండి. కుట్టు అల్లిక వచ్చండి' అంటున్న కమలతో.
    'అప్పుడే అన్నీ ఎట్లా నేర్చుకున్నావమ్మా' అన్నారాయన.
    'మామయ్య స్టెనో అండి. మునుపు రిజర్వు బాంక్ లో . చిన్నప్పుడే ఆయనతో ఆడుకుంటూ టైపు నేర్చుకున్నాను. మిగతావన్నీ అవసరం కొద్ది వొచ్చినై.'
    కమల మాటలకి అయన నవ్వుతూ 'ఐతే ఇల్లు లక్షణంగా దిద్దగలవన్నమాట' అన్నారు.
    కమల తల వంచుకోంది నవ్వుతూ.
    ఇంకా పంపిడ్డామా అని వాళ్ళిద్దరూ ముఖాలు చూసుకున్నారు.
    'ఐతే ఎప్పుడొచ్చి చేర్తావు' అన్న దానికి కమల ఒక్క క్షణం తను విన్నది నిజమా అని విస్మయంగా చూసింది.
    'రావటానికి ఎప్పుడు వీలౌతుందో చెప్పుమ్మా, నీ కోసం కారు పంపుతాము" అన్నారాయన.
    కమల ముఖం వికసించింది. ఈ మాటలకి. అదీ కాకుండా ఇప్పటి వరకూ అంతా బాగానే ఉన్నట్టు తోచింది. కాని ఒకటి రెండు విషయాలు తను అడిగి తెలుసుకోక తప్పదనుకుని మెల్లగా 'నాకు ఒకటి రెండు విషయాలు తెలుసుకోవాలని వుంది.' అడగోచ్చునా అండీ అన్నది.
    ఆ మాటలకి వాళ్ళిద్దరూ కనుబొమ్మలు పైకెత్తి చూశారు. కాని వాళ్ళకా మాటలో కాని, కమల గొంతులోని ,అడిగిన తీరులో గానీ ఏవిధమైన అవిధేయత గాని అహంకారం గాని కనిపించలేదు. పైగా చిన్న పిల్లలు తమ భయాలని తీర్చుకోటానికి తాపత్రయ పడ్డట్లుంది కమల ముఖం . దాంతో అయన ప్రసన్నుడై 'అడుగమ్మా' అన్నారు.
    'అయితేనంది ఒకవేళ.....' అంటూ ఆగటం చూసి 'ఫరవాలేదమ్మా అడుగు' అని మళ్ళీ అయన అనటంతో 'నాకు ఇక్కడ వుండటం ఇష్టం లేకపోతె వెళ్ళనిస్తారా' అన్నది దిగులుగా.
    ఆ మాటలు విన్న వాళ్ళిద్దరి కీ కమలను చూస్తె నవ్వాగలేదు. నవ్వుతూనే 'ఎందుకు పోనివ్వమమ్మా' లక్షణంగా మాకార్లోనే దింపిస్తాం' అన్నారు.
    కమల ముఖం ఆ మాటలు విని సంతోషంతో వెలిగింది. అంతలోనే 'పాప నాయనమ్మగారేవరండి'అన్నది.
    వాళ్ళు వొస్తున్న నవ్వాపుకుంటూ ఒకరొకరు చూసుకున్నారు.
    'ఆ ఆలోచన ఎందుకొచ్చిందమ్మా' అన్నారాయన.
    'ఆమె ఎంత పెద్దగా వుంటారో ఎట్లా వుంటారో అనీ భయంగా వుందండి.'
    ఈ మాటలకి వాళ్ళిద్దరూ నవ్వాపుకోలేకపోవటం చూసిన కమలకి ఆవిడే ఆ నాయనమ్మ అని తెలిసి ముఖం సిగ్గుతో కందిపోయింది. కొంతసేపటికి అయన నవ్వాపుకుని 'ఇప్పుడు తెలిసిందా. ఈవిడే ఆ రాజేశ్వరి దేవి. పిల్ల నాయనమ్మ. చూస్తె భయంగా ఉందా?' అన్నారు. ప్రేమగా చూస్తున్న ఆమె ముఖాన్ని , దయగా చూసే ఆ కళ్ళనీ చూసిన కమల నవ్వుతూ 'లేదండీ' అన్నది.
    'నీ ప్రశ్న లైనయ్యా ఇంక' అన్న దానికి 'ఒకసారి పాపని చూసి వెళ్తానండి' అన్న కమల మాటలు వాళ్ళిద్దరికి ఆశ్చర్యాన్ని కలిగించినై. పిల్ల చిన్నదైనా , అమాయకురాలిగా కనపడ్డా, మంచి తెలివైనది. లోతు గలది అనుకున్నారు. బెల్ నొక్కగానే ఇందాకటి అబ్బాయి వచ్చాడు. 'చూడు బిక్షాలు పాపని తీసుకునిరా" అన్నారాయన.
    ఆవిడే లేచి 'అక్కర్లేదు-- నే తీసికెళ్ళి చూపిస్తా' నంటూ 'రా కమల' అని లోపలికి తీసికెళ్ళింది.
    లోపల చాలా పెద్దదిగా విశాలంగా వుంది ఇల్లు. ఎన్ని గదులో దాటి పోయినట్లుంది కమలకి. ఎటు పోయింది కూడా అంతు పట్టలేదు. ఒక పక్కగా వో పెద్ద హాలు, దానికి పక్కగ గదులు వున్న ఒక భాగం కనపడ్డది. ఆ హల్లోకి అడుగు పెట్టింది రాజేశ్వరి దేవి కమలతో.
    అక్కడ ఒక పక్కన చిన్న బల్లలు, కుర్చీలు, ఇంకో పక్కన రెండు మంచాలు, ఇంకో వైపున రకరకాల బొమ్మలు అమర్చి వున్నై.  గదిలో అంతటాకాలికి నేల తగలకుండా మెత్తని తివాచి వేసి వుంది. పైన లైట్ల గుత్తి  వెళ్ళాడుతున్నది. ఆన్నిచోట్లా కావాల్సినప్పుడు లాక్కునేందుకు చక్కని తెరలున్నై-.
    కుర్చీలు వేసి వున్న వైపున వేవిషియన్ తెర లోంచి నీరెండ మొహం మీద పడుతుండగా ఒక నాలుగేళ్ల పిల్ల టీపార్టీ ఇచ్చుకుంటూన్నది. ఫ్రిల్ వేసి కుట్టిన తెల్లని అర్గండి గౌను వేసుకుని బొద్దుగా నల్లని ఉంగరాల జుట్టుతో చూడగానే ముచ్చటేసి దగ్గరకి పిలిచేట్టున్న ఆ పిల్లని చూసేటప్పటికి కమలకి ముచ్చటేసింది.
    'పాపా' అని రాజేశ్వరి దేవి పిలవటం తో పాప తిరిగి చూసి 'మామ్మా , మామ్మా' అంటూ పరిగెత్తుకొచ్చి 'నేను పార్టీ చేసుకుంటున్నాను. నోత్తావా మామ్మా' అంది . ఆవిడ ఆపిల్ల నెత్తుకొని 'వస్తాను తల్లి. ఏం పెడతావు. బాగా ఆకలిగా వుంది' అంటూ నడిచింది.
    పాప మామ్మ చేతుల్లోంచి దిగి ఆపిల్ ముక్కలు కమలా ఫలం తొనలు, బిస్కెట్లు చూపించి 'ఇవిగో మామ్మా తిను' అని ఇచ్చింది. 'సరేగాని పాప మరి ఈకమల కి పెట్టావా' అంది. పాప కమలని దిగాదిగా చూసి 'ఇంద' అని రెండు చేతిలో పెట్టింది. తను పెట్టిన ఆపిల్ ముక్క కమల నోట్లో వేసుకోవటం తో 'బాగుందా' అన్నది ఉత్సాహంగా. కమల అంతకన్న సంబరంగా 'వో' అన్నది.
    వాళ్ళని చూస్తూ రాజేశ్వరి 'చూడు పాపా రేపటి నించి  నువ్వు ఆడుకోటానికి కధలు చెప్పుకోటానికి , చదువుకోటానికి తోడుగా ఈ కమల వొస్తుంది. నీతో పాటు ఇక్కడే ఉంటుంది. నీ కిష్టమేనా పాపా' అంది.
    'నాకిష్టమే మామ్మా. ఇక్కడే వుంటుందా నా దగ్గిర పడుకుంటుందా' అంటూ అడగటం మొదలెట్టింది .
    'ఔనమ్మా.'
    పాప వెంటనే కమల చెయ్యి పట్టుకుని 'నిజంగా వస్తావా? నీపెరెంటి అన్నది.
    కమల కూడా చిన్నపిల్లల్లేనే ;నాపేరా, కమల' అంది.
    'నీపేరేం బాలే. నేనింకో పేరు పెట్టనా? అంది ముఖం పెద్దవాళ్ళల్లె పెట్టి.
    అప్పటికే మోకాటితండా వేసుకుర్చుని కమల పెట్టమ్మా నా పేరు నాకూ బాలే' అంది.
    దాంతో పాప మొహం అంత చేసుకుని 'అయితే ఇక నించి కమలీ' అని పిలుస్తా సరేనా' అంది.
    కమల చటుక్కున పాపను చేతుల్లోకి తీసుకుని 'బాగుంది పాపా. చాలా బాగుందమ్మా ఎంత మంచి పేరో మరి నీ పేరో" అన్నది.
    'మాధురీ దేవి'
    'అంత పెద్ద పేరే సరే' నువ్వు నన్ను కమలీ' అను. ,మరి నిన్ను నేను 'మాధురీ అంటాను?' సరేనా?'
    పాప క్షణం అలోచించి 'సరే నువ్వొక్క తేవే మాధురీ అనాలి. ఇంకెవరూ అనకూడదు తెల్సా' అంది.
    'సరే పాపా నేనేళ్తున్నాను. మళ్ళీ రెండు రోజుల్లో వస్తా!
    పాపా ఇంకో రెండు ఆపిల్ ముక్కలు చేతిలో పెట్టి 'మర్చిపోవద్దు తప్పకుండా రావాలి' అని  'టాటా' చెప్పింది.
    కమల ఒకసారి పాప తల చేత్తో మెల్లగా తాకి 'ఎల్లుండి సాయంత్రం ఆరు గంటలకి వస్తానండి.' అని చెప్పి రాజేశ్వరి దేవికి నమస్కరించి వెనక్కి తిరిగింది.
    రాజేశ్వరీ దేవి 'ఉండమ్మా కారులో వేల్దువు గాని' అన్నదానికి కమల వద్దంటున్నా 'నీ ఇల్లెక్కడో తెలియకపోతే ఖాదర్ మళ్ళీ నీకోసం రావద్దూ' అని 'బిక్షాలూ' అని కేకేసింది. బిక్షాలు రాగానే 'అమ్మాయిని వాళ్ళింట్లో దింపి రామ్మన్నానని ఖాదర్ కి చెప్పు' అని లోపలికి వెళ్ళిపోయింది. బిక్షాలు తో పాటు బైటి కొచ్చి కారేక్కిందో లేదో పది నిమిషాల్లో ఇంటి దగ్గర దిగింది కమల.

 Previous Page Next Page