పాప నవ్వింది
అరుణ
పరీక్ష లైపోయి పదిహేను రోజులు కావొస్తుంది.ఈ నెలాఖరుకి వచ్చేసేయ్యమని మామయ్య వుత్తరం రాశాడు.
కాని వెళ్ళడానికి కమలకి మనస్కరించడం లేదు. ఈలోపుగా ఏదైనా వుద్యోగం దొరికితే బాగుండునని చూస్తున్నది రోజూ చేతి కందిన పేపరల్లా.
తోమ్మిందింటి కల్లా కమల లైబ్రరీ కి పేపర్లు చూసుకోటానికి వొచ్చింది. తలుపులు తెరిచి దుమ్ము దులుపుతున్నాడు ఎటెండర్.
'నరసయ్య పేపర్లోచ్చినయ్యా?'
'అప్పుడే వొచ్చినయ్యమ్మా. మీరు రోజూ చూసే తెలుగు పేపరు, ఇంగ్లీషు పేపర్లు అన్నీ ఆ చివర సీట్లో పెట్టాను.
'మంచిది నరసయ్య నాకు వుద్యోగం వొస్తే నిన్ను మర్చిపోను.'
'మీకు వుద్యోగమే రావాలి కాని నాకంత కన్నా ఏం కావాలమ్మా.'
ఎండెక్కక ముందే వొచ్చి రోజూ వుద్యోగాలకి సంబంధించిన ప్రకటనలు చూడటం కమలకి పరిపాటయింది. అట్టే ప్రకటనలుండవు. కనక ముందు తెలుగు పేపరు చూసి, తీరిగ్గా ఇంగ్లీషు నిచూసేది. ఆ ఉద్దేశం తోటే తెలుగు పేపరు తీసుకుని 'అ ఇది చూసినా ఒకటే , చూడక పోయినా ఒకటే' అనుకుంటూ మడత విప్పింది. కాని ఆరోజు వింతగా ఒక ప్రకటన చూసింది 'కావలెను' శీర్షికలో.
'తల్లి లేని ఓ శ్రీమంతుల నాలుగు సంవత్సరముల పాపను కనిపెట్టి వుండుటకు పద్దెనిమిది ఇరవై మూడు సంవత్సరముల మధ్య వయసు గల యువతి కావలెను. మంచి క్రమ పద్దతులు నేర్పి పాపతో కలిసి మెలిసి వుండగలిగిన సంస్కారము, సభ్యత గల ఆరోగ్యవంతులైన యువతులు మాత్రమే దరఖాస్తు పెట్టుకోవలెను. భోజన వసతి సదుపాయములు కాక నెలకి రెండు వందల రూపాయలు జీతం యివ్వబడును. పాప ఇతర పనులకి ఆయా ఏర్పాటై వున్నది. పిల్ల తండ్రి విదేశాలలో వున్నందువల్ల పిల్ల నాయనమ్మ పర్యవేక్షణ లో ఈ యువతి పని చేయవలెను. పదిహేనో తారీకు లోగా ఈ దిగువ చిరునామా కి అందేటట్లుగా దరఖాస్తు తో పాటు రెండు సిఫార్సు వుత్తరాలు జతచేసి పంపవలెను!
ఆ ప్రకటన కమలని ఆశ్చర్యపరిచింది. అనేక ఊహలు , అనుమానాలు ఆలోచనలు బుర్రలో సుడిగుండాలై తిరిగినై . మనదేశంలో ఇట్లాంటి వుద్యోగాలు వుంటాయా? వున్నా అవి గౌరవప్రదంగా వుంటయ్యా. ఒక సరికొత్త ప్రదేశంలో కొత్త మనుషుల మధ్య వుంటూ పనిచేసుకోవటం అంత తేలికైన పనికాదే? వాళ్ళేట్లాంటి మనుష్యులో ఏమిటో, మామూలు ఆఫీసు వుద్యోగాలైతే తనలాంటి వో పదిమంది మధ్యన పొద్దున్న పదింటి నించి సాయంత్రం ఐదింటి వరకు పనిచేసి వొచ్చేయ్యటం వేరు. ఈ ప్రకటన ప్రకారం రాత్రింబవళ్ళు అక్కడే వుండాలి. కాని జీతం బాగానే వుంది. ఖర్చులు గడిచి రెండు వందలంటే మాటలా!'
'ఆపిల్ల నాయనమ్మ ఎంత భయంకరంగా వుంటుందో అనుకోటంతో మళ్ళీ భయం నెట్టుకొచ్చింది. కాని కనీసం ఆ యింట్లో మగవాళ్ళేవారూ లేనట్లే వుంది. వున్న పిల్ల తండ్రి విదేశాల్లో వున్నాడు, అది ఒక విధంగా మంచిదే, అనిపించింది. కానీ ఇంకా ఇంట్లో ఎట్లా రాత్రింబవళ్ళు గడపడం?'
దీన్ని తరుముకుంటూ ఇంకో విషయం తట్టింది. ఇదీ ఒక తీరుగా బాగానే వుందనిపించింది. తను ఒక ఇల్లు వాకిలీ అన్న జంజాటం పెట్టుకోనక్కరలేదు. వంటా వార్పూ అంటూ, పప్పు దగ్గర్నుంచి వెతుక్కో అక్కర్లేదు. ఏ బదరా బందీ లేకుండా కాలం గడపొచ్చు.
ఇంతలో మళ్ళీ ఆ పిల్ల ఎట్లాంటిదో , కుంటిదో, గుడ్డిదో ! ఏమీ లేకపోతె అంత ఉన్నవాళ్ళ కి నాలాంటి వాళ్ళ అవసతం ఏమొచ్చింది.అనుకుంది. కానీ ఆయా వేరే వుంది గదా పిల్ల పనులు చూట్టానికిమ నాకు తోడుగా అన్న ఆలోచనతో కొంత ధైర్యం వొచ్చింది.
ఆలోచనలు తేగేటట్టు లేవు. మనసు ముందుకీ వెనక్కి పరుగెత్తుతూనే వుంది. ఇంకో రెండు పుట్టుకోస్తూనై అప్పటికే పన్నెండు కొట్టబోతున్నారు.
ఇంక లాభం లేదనుకుని వో నిశ్చయాని కొచ్చింది కమల. దరఖాస్తు పెట్టినందు వల్ల ఏ ప్రమాదం లేదు. వుండబోదు. పెట్టినదానికి జవాబుగా వాళ్ళు తనని ఇంటర్ వ్యూకి పిలుస్తారా వెళ్తుంది. అందువల్ల కూడా నష్టం ఏమీ లేదు. ఈ దశలన్నీ దాటి వాళ్ళు తనని ఆ వుద్యోగానికి తీసుకున్నారే అనుకో ఏం పోయింది? నాలుగురోజులు చూసి బాగలేకపోతే చక్కా వొచ్చేది. అంతేగా వాళ్ళేమీ తనని కట్టి పడేయ్యరు కదా. అని అనుకుని ధైర్యం తెచ్చుకుని ఇంటిదోవ పట్టింది.
తనపేరు , చిరునామా , వయసు చదువూ మాతృభాష మొదలైనవన్నీ అడిగినవి, అడగనివి అన్నీ కాయితం మీద పెట్టింది. ఇంకా సిఫార్సు వుత్తరాలే కావాలి. ఒకటి ఎటూ తన కాలేజీ ప్రిన్ సిపాలు ఇచ్చింది ఉండనే వుంది. ఇంకొకటి ఎట్లా అనుకున్న వెంటనే అనురాధ మనసులో మెదిలింది వాళ్ళ లెక్చరర్ అనూరాధగారి నడిగితే సరి అనుకుంది. ఈ వూహ రావటంతో వెంటనే వాళ్ళింటికి బైలు దేరింది.
కమలని చూడగానే అనూరాధ ఆదరణగా రమ్మని లోపలికి తీసుకు వెళ్ళి కూచోపెట్టి 'ఇంత ఎండలో వచ్చావెం కమలా కాస్త చల్లబడ్డాక రాకపోయినావా' అంటూ నాయర్ కి టిఫిన్ చెయ్యమని చెప్పి గ్లాసెడు నిమ్మకాయ రసం తెచ్చిచ్చింది కమలకి.
ఆ గ్లాసు అందుకుని 'మీరేప్పుడోచ్చారండీ వూరునించి? ఇంకా వచ్చారో లేదో అనుకుని పోనీ ఒకసారి చూసిపోదామని వొచ్చా' అంటూ చెమట పట్టిన ముఖం తుడుచుకుంది.
'పేపర్లు దిద్దాలని అమ్మ వుండమన్నా వీలుగాక నిన్ననే వొచ్చాను కమలా, అమ్మాయి అయన బాబు మాత్రం అక్కడే వున్నారు. శలవలైనాక వస్తారు.'
ఇంతలో నాయర్ వేడివేడి బజ్జీలు తీసుకు రావటంతో ఇద్దరూ టిఫిన్ తీసుకున్నారు.
ఇప్పుడిక తీరిగ్గా అనురాధ 'అయితే కమలా నీవింక ఏం చెయ్యదల్చుకున్నావ్. చదువై పోయింది కదా' అని మొదలెట్టింది.
'అవునండీ ఏదైనా వుద్యోగం చెయ్యాలను కుంటున్నాను. కానీ ఈరోజుల్లో అది దొరకటం అంత తేలిక కాదుగా' అని పొద్దున్న తాను చూసిన ప్రకటన గురించి అంతా వివరంగా చెప్పి తనకొక సిఫార్స్ వుత్తరం కావాలని అడిగింది.
అనూరాధ కూడా పొద్దున్న కమలకి కలిగిన అనుమానాలే ఒక్కొక్కటి బయట పెట్టటం మొదలెట్టింది. 'అందులోనూ ఆడపిల్లవి, నువ్వు అట్లా అక్కడికి వెళ్ళి ఉండగలవా' అంటూ, కమల ఆమె సందేహాలన్నీ తీర్చి , ముందు చేరినా ఎప్పుడిష్టం లేకపోతె అప్పుడే మానెయ్యొచ్చు కదా అని నచ్చ చెప్పటం తో అనూరాధ సరేనని సరి పుచ్చుకుని సిఫార్స్వుత్తరం రాసిచ్చింది.
కమల ఆరోజే దరఖాస్తు సిఫార్సు లతో సహా పోస్టు లో వేసి ఇంకో పది రోజుల దాకా దీనిని మరిచి పోదామనుకుంది.
కాని కమలకీ విషయం మరవటం చేత కాలేదు. ప్రతిక్షణం ఆ ఇల్లెక్కడో. ఎట్లా వుంటుందో, ఎంతమంది వుంటారో , ఆ నాయనమ్మ యెంత వయసుదో, కోపిష్టిదో, కాదో, ఆపిల్ల చెప్పినట్లు వినే రకమౌనో కాదో, గారాల అల్లరి ఆకతాయో ఏం పనులుంటాయో ఆన్న ఈ విధమైన ఆలోచనలతో సతమతమైంది.
రోజూ లైబ్రరీ కి వెళ్లి పేపర్లు చూస్తున్నదే కాని ఏ ప్రకటనా అంత ఆకర్షించలేక పోయింది కమలని.
ముళ్ళ మీదున్నట్లు రోజులు గడపటం మొదలు పెట్టింది. పదిహేనో తారీఖు ముందే పోస్టు మాన్ కోసం ఎదురు చూడటం మొదలు పెట్టింది. ఈ నిరీక్షణతో ఇరవయ్యో తారీక్కూడా దాటింది. కమల ఇంక తన్ని వుద్యోగానికి పిలవను కూడా పిలవరని వో నిట్టుర్పు విడిచి మళ్ళీ పేపర్లు దీక్షగా చూట్టం మొదలెట్టింది.
ఈమధ్య కమల అంతగా పేపర్లు చూట్టం లేదెందుకా అనుకుంటున్న నరసయ్య ఇది చూసి తృప్తిపడ్డాడు.
ఆరోజు మధ్యాహ్నం కమల లైబ్రరీ నుంచి వచ్చి భోజనం చేసి కాసేపు పడుకుందామని కన్ను మూసేటప్పటికి పోస్టు మాన్, 'మీకో రిజిష్టర్ లేటరుందమ్మా' అంటూ వచ్చాడు. తనకు రిజిష్టరు వుత్తరాలేందుకు పంపుతారా అనుకుంటూ సంతకం పెట్టి తీసుకుని చింపింది కమల.
కవరులోంచి వో ఖరీదైన కాయితం టైపు చేసింది చేతుల్లో పడ్డది. దాంట్లో ఇరవై మూడో తారీఖు పొద్దున పదిగంటలకు సరిఫికేట్లతో సహా పైన వుదహరించిన చిరునామా వద్ద హాజరు కావలసినది అని రాసి వుంది.
కమలకది చూడగానే చేరుతూ కాళ్ళూ కాసేపు చల్లబడై - కాసేపు 103 డిగ్రీల జ్వరం వొచ్చినట్టు శగలు చిమ్మినై, ముచ్చెమటలు పోసినై , నానా హంగామా పడ్డది. భయంతో ఆలోచన్లతో.
ఆ ఇల్లెట్లా వుంటుందో శ్రీమంతులు కనక గూర్ఖాలు, కుక్కలు తరిమేటట్లు వుంటుందేమో. ఎంతమంది తనని పరీక్ష చేస్తారో అసలు ఎంతమంది వస్తారో తనకి ఛన్సైనా వుంటుందో లేదో అనుకోసాగింది.
ఆ రాత్రంతా అవే ఆలోచనలు. రాత్రి కల్లో పిల్ల నాయనమ్మ తీర్పు చెప్తున్న యమధర్మరాజు వలె కనబడింది. మర్నాడు ధైర్యం చాలక అనూరాధ దగ్గరికి వెళ్ళి కాయితం చూపించింది. 'ఇప్పుడు భయమెందుకు కమలా రేపు వెళ్ళి చూడు. తరావాత ఆలోచిద్దాం.' అని ధైర్యం చెప్పి పంపింది.
ఇంతగా కమలని వెనక్కి ముందికి తోసిన ఆ ఇరవై మూడో తారీఖు రానే వొచ్చింది. కమల కారోజు తిండి సహించలేదు. ఏదో అయిందనిపించి లేచింది. మామూలు తెల్ల ప్రింటేడు వాయిల్ చీరే కట్టుకుని బయలుదేరింది తోమ్మిందింటికల్లా.
తాననుకున్నట్లే అది చాలా పెద్ద ఇల్లు. ఇల్లనే కన్న భవనం అంటే బాగుంటుంది. రోడ్డు ఈ చివరి నుంచి ఆ చివరి వరకూ ఇంటి కాంపౌండే. చిన్నవీ పెద్దవీ చెట్లు పచ్చ తివాచీ పరిచినట్లు కత్తిరించిన గడ్డి నేల, కనపడ్డై - మొదట్లో. గేట్లో గూర్కా వున్నాడు. కాని తాను భయపడ్డట్టు అరవలేదు. అటు పొమ్మని చెయ్యి చూపించాడు. ఆ చెయ్యి చూపించిన వైపు వో పెద్ద కట్టడం కనిపించింది.
ఆ కట్టుబడి ప్లాను చూస్తె పూర్వపుదనిపిస్తుంది. కాని ఎక్కడా చెక్కు చెదరక శోభాయమానంగా వుంది. గేటు దగ్గర్నించి ఇంటి వరకు సిమెంటు రోడ్డు, పక్కన తెల్లటి ఇటుకల లైను, లైను పక్కన రంగు రంగుల పూలచెట్లతో ఒక అడుగెత్తు గోడ దాని అవతల గులాబి మందార, మల్లె, రేరాణి ఇంకా ఏమున్నాయో కూడా కమల గమనించ ముందే పోర్టికో చేరుకుంది. అక్కడ ఒక పెద్ద తళతళ లాడుతున్న నల్లకారుకు ఇంకా మెరుగులు పెడుతున్నాడు కారు డ్రైవరు. కమల ఎందుకొచ్చింది తెలిసినట్టు చూసి, లోపలికి వెళ్ళి కూచోమని హాల్లోకి దారి తీశాడు.
హల్లో అప్పటికే ముగ్గురు స్త్రీ లుండటం చూసి వాళ్ళ ప్రక్కనే ఖాళీగా వున్న కుర్చీలో కూర్చుంది. కూర్చునే వరకూ తననే శల్య పరీక్ష చేస్తున్న వాళ్ళు తను కూర్చోగానే ఏ మడుగుతుందో అన్నట్టు ముఖాలు తిప్పుకూ కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళని చూటం కమల వంతైంది. వాళ్ళు ముగ్గురూ దాదాపు ఒకేవిధంగా వున్నారు. అంతా తనకన్నాపెద్దవాళ్ళే. వాళ్ళ ముఖాలు అనుభవం గడించి అరితెరినట్లు వున్నై. ఈకాలంగా అలంకరించుకుని వున్నారు. వాళ్ళని చూసిన కమల తనని అసలు లోపలికైనా పిలుస్తారో లేదో అని నీళ్ళు కారిపోయింది.
ఇంతలో వో పదహారేళ్ళ కుర్రాడు కాయితం పట్టుకుని ఏం చేత పేర్లు రాయించుకు వెళ్ళాడు. వాళ్ళ మాటల్ని పట్టి ఒకామె మాంటిసరీ ట్రెయినింగ్ పొందిందని, మరొకామె ఆయాగా వుంటున్నట్లు, మూడో ఆమెకి హోం సైన్సు డిగ్రీ ఉన్నట్లు కమల గ్రహించింది. వాళ్ళ అర్హతలు విన్న కమల తనెందుకు పనికిరానని వెళ్ళిపోవటమా, వుండటమా అన్న ఆలోచనలో పడ్డది. సరే, ఎటూ వచ్చాను కదా . ఆ కాస్త చూసి పోదాం లే. అని అనుకుంటుండగానే ఇందాకటి కుర్రాడు మొదటి కుర్చీలో కూర్చున్న ఆమెను పిలుచుకు వెళ్ళాడు.