Next Page 
శతఘ్ని పేజి 1

                                 


    
                                             శతఘ్ని
                                                                             -----కొమ్మనాపల్లి గణపతిరావు
    
                                  

   

     అర్దరాత్రి.......
    
    భూవనభోమండలాల్ని ప్రయ్యలు చేస్తున్న ఉరుములు......
    
    గాడి తప్పిన అర్దరాత్రి స్వతంత్రంలా ప్రకృతి స్వేచ్చగా సాగిస్తున్న మారణహోమం......
    
    మెరుపులు ఫెళ ఫెళార్భాటాలు....... ప్రళయ ప్రభంజనం.....
    
    నిశరాత్రి వణికిపోతూంది.......
    
    నగరం శిరస్సుపై నెత్తుటిజల్లులా వర్షం ఉధృతమౌతుంది.
    
    శిలువమోస్తున్న సంస్కృతిలా మిగిలిన భూగోళంరాలిన యశస్సుకి రాని ఉషస్సుకి మధ్య నిలిచి విష ఖచిత ఖడ్గప్రహరాల్లాంటి చినుకుల్తో నేలదద్దరిల్లిపోతూంది........
    
    అలజడిగాకదిలాడతడు......
    
    రాయాల్సిన కాగితాలు గదిలో టేబుల్ పైనుంచి ఎగిరిపోతున్నాయి. ప్రారంభించాల్సినపంక్తులు ఆలోచనల తమస్సులో ఇంకా రూపుకర్పూర పేటికలాంటి మేధకి అక్షర ఇవ్వకముందే అవాంతరంలా అనిపించే ప్రకృతి భీభత్సం...... బయట మెరుపుల్లో వివస్త్రగా మారుతున్న చీకటి.....
    
    భస్మసముద్రపు ఊర్ధ్వధారలా వర్షపు జల్లు కిటికీలోనుంచి దూసుకురాబోతుంటే వేగంగా అటునడిచాడు రెక్క మూయాలని...... బయట సౌరభం కోల్పోతున్న నైట్ క్వీన్, పిచ్చి చూపులు చూస్తున్న ఫెరన్ మొక్క బాల్కనీకి ఆవలివేపు బోగస్ విల్లా...... రోజూ రచయితగా అతడికి ప్రేరణనందించేవి యివే! కాని ఈ రోజు అవి తమ అస్తిత్వం కోసం అలజడిపడుతున్నాయి. ఈదురుగాలిని ప్రతిఘటిస్తూ బలంగా కిటికీ రెక్కల్ని మూశాడు.
    
    అదోలాంటి ప్రశాంతత......
    
    రాయాలి.......
    
    కాని ఏమిటి......
    
    ఎక్కడ ప్రారంభించాలి......
    
    బయట చప్పుళ్ళకి దూరంగా, బాహ్య ప్రపంచానికి సుదూరంగా...... మరో కొత్త విశ్వంలోకి వాసంత సమీరాలే తప్ప గ్రీష్మతాపం లేని యింకో కల్ల లోకంలోకి వెళుతూ........ వెళ్ళిపోతూ...... ఉలికిపడ్డాడు...... సమీపంలో పిడుగు పడ్డ చప్పుడు....... గుండె దడదడలాడుతుంటే ఆందోళనగా కిటికీ తెరవబోయాడు...... ఉన్నట్టుండి గదిలో చీకటి ఆవరించింది ...... 'డేమిట్' కరెంట్ పోయినందుకు విసుక్కుంటూ అగ్గిపెట్టెకోసం టేబుల్ పై తడుముతుంటే......మరోమారు ఆకాశం పగిలినచప్పుడు.......    

    గదిలోకి చొచ్చుకొచ్చిన ఓ మెరుపు...... మెరుపు కాదు...... ద్వారం దగ్గర నిలబడివున్నారెవరో...... "ఎ.....వ......ర...... ది" గగుర్పాటుగా అరిచాడు...... జవాబులేదు...... "మీ...... మ్మ...... ల్నే"
    
    అతడికేకతో గది ప్రతిధ్వనించిపోయింది. అప్పుడు కనిపించింది మెరుపు వెలుగుల్లో అస్పష్టంగా వర్షంలో తడిసివున్న ఓ స్త్రీ.....
    
    ఎలా......
    
    అతడి గుండె దడదడలాడింది.
    
    మూసివున్న ద్వారంలో నుంచి ఆమె ఎలా రాగలిగింది?
    
    మరోమెరుపు.....
    
    ఈసారి కాస్త స్పష్టంగా కనిపించింది.
    
    వయసులోనే ఉన్నా వయసు మళ్ళినట్టు కన్పించింది.
    
    మంచుకప్పుతున్న కాశ్మీరంలా ఉంది...... కాళ్ళనుసముద్రంలో ముంచి అరమోడ్పు లైన నేత్రాలతో నిలబడ్డ కన్య కుమారిగానూ అనిపించింది.
    
    సన్నగా కంపించాడతడు.

    ఎవరీమె.....
    
    శిరస్సు పైచీనాబ్ నదీ పాయలాంటిపాపిడి....... హరప్పామొహంజొదారోనేత్రాలు....... హిమపానువులతలపింపచేసే వక్షం...... థార్ ఎడారి యిసుక తిన్నెలసున్నితత్వం....... ఆద్యంతాలచీకటి రహస్యమా..... లేక అగ్ని పుష్పమా...... ఏమిటాకాంతి ...... సూర్యకిరణాలను అన్వేషించే ఆకాశ పరివ్యాప్తధూమపుష్పంలా ఎందుకుజ్వలించి పోతూందిమె?
    
    "ఎవరు మీరు?"
    
    సన్నగా మూలిగిన చప్పుడు.....
    
    కాదు...... ఆమె విలపిస్తున్నట్టు వెక్కిపడుతూంది.
    
    "మాట్లాడరేం"
    
    అతడిగొంతులో చిత్రమైన ఆర్తి.......
    
    "నేనే......."
    
    గీతంలాలేదు. స్వరం తప్పినబృందగీతంలా వినిపించింది.
    
    "నేనే అంటే"
    
    "నీలాంటివాళ్ళు పట్టించుకోని దగ్ధకుసుమాన్ని"
    
    "అర్ధంకావడం లేదు"
    
    "రచయితవి కదూ"
    
    ఆశ్చర్యపోయాడు "నేనెవరో తెలిసేవచ్చావన్న మాట"
    
    "అవును" ఆమె గొంతులో గుండెలార్పేస్వగతం.
    
    "నీ ఆశ్రయం కోరి వచ్చాను......"
    
    జవాబు చెప్పలేకపోయాడు.
    
    "నేనుకోరేది నీ యింటిలోస్థానం కాదయ్యా" ఆమెగొంతులో గుండెలార్పేబడలిక నిస్త్రాణ.....    

    "మరి"
    
    "నీకలంలో అణువంత ఉనికిని"
    
    గదిలో వెలుగు లేదు....... అయినా ఆమె వెళుతున్న దీపంలా వుంది ......
    
    స్థాణువయ్యాడు....... స్వప్నంలోలా మరోఅడుగు ముందుకేశాడు.

Next Page