Previous Page Next Page 
ప్రేమకు పెట్టుబడి కావాలి పేజి 2


    "చెప్పమంటావా?"

 

    "ప్రేమ, రాఘవేంద్రరావు సినిమాలోని కథానాయిక భావుకత లాంటిది. అన్నమయ్య పద లాలిత్యంలోని రసాస్వాదన లాంటిది. వీణాపాణి పదరవళి ప్రేమ. వీణాపాణి అంతఃసృష్టి ప్రేమ. ప్రేమంటే రెండక్షరాలు..... ప్రేమ....."

 

    "ప్రేమంటే రెండక్షరాలేనా...... నాలుగక్షరాలు కాదా?"

 

    "నాలుగక్షరాలా?"

 

    "అవును LOVE........ నాలుగక్షరాలు కూడా."

 

    "ఇంగ్లీషు ప్రేమ గురించి కాదు...... తెలుగు ప్రేమ గురించి చెప్పు."

 

    "ఒకప్పుడు అంటే మా  బామ్మకాలంనాటి ప్రేమ దద్దోజనం లాంటిది...... నేటికాలపు ప్రేమ ఫాస్ట్ ఫుడ్.... హైద్రాబాద్ బిర్యానీలాంటిది. లేకపోతే ఫ్రిజ్ లో పెడితే, ఫ్రిజ్ పాత గాడ్రేజ్ బీరువా అయిపోతుంది."

 

    "ప్రేమకు పవరుందా..... లేదా?"

 

    "ఎందుకు లేదు....... మెదక్ లో తయారైన అయిదువందల నోటులా అయిపోయింది నేటికాలపు ప్రేమ..... నకిలీ ఫైవ్ హండ్రెడ్ నోటుకే పవరెక్కువ."

 

    "ప్రేమకు మనసు లేదా?"

 

    "ఎందుకు లేదు...... ప్రేమను ప్రేమ ప్రేమిస్తుంది..... ప్రేమించే ప్రేమను ప్రేమ ప్రేమిస్తుంది..... ప్రేమించే ప్రేమ ప్రేమనే ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమించే ప్రేమే, ప్రేమనే ప్రేమిస్తుంది."

 

    "మేఘసందేశం'లో దాసరి డైలాగ్స్ నాకు చెప్పొద్దు."

 

    "పోనీ 'ప్రేమనగర్; లో డైలాగ్స్ చెప్పనా?"

 

    "చెప్పు."

 

    "నీ ఊపిరి ప్రేమించాను....... నీ ఉచ్చ్వాసను ప్రేమించాను..... నీ నీడను ప్రేమించాను..... ఏకంగా నిన్నే ప్రేమించాను."

 

    "బావుంది చాల్లే...... సీరియస్ గా అడుగుతున్నాను., ప్రేమంటే ఏమిటి?'

 

    "ప్రేమంటే Cipher."

 

    "అంటే?"

 

    "మన్ మోహన్ సింగ్ నీకు బాగా తెలుసు కదా..... అతగాడ్ని అడుగు."

 

    "నన్ను ఇంకో మగాడితో అంటకట్టి నా శీలాన్ని అవమానిస్తున్నావ్."

 

    "మన్ మోహన్ సింగ్ కూడా నీకు మగాడేనా?"

 

    "ఆయనెక్కడుంటాడో చెప్పు...... అతడెవడో నాకు తెలీదు."

 

    "ఆయన మన కేంద్ర మాజీ ఆర్ధికమంత్రి.

 

    "అంతేనా....... చచ్చిపోయాను...... మా పక్కింటి మన్ మోహన్ అనుకున్నానులే...... కానీ...... నా శీలం......."

 

    "మాటి మాటికి నువ్వు శీలం...... శీలం అని మన ఫెమినిజమ్ సోదరీమణుల్లా గోల పెట్టక."

 

    "నన్ను నువ్వు అర్థాంగిగా చేసుకోవా?"

 

    "అర్థాంగిగానే కాదు..... పూర్ణాంగిగా చేసుకుంటాను."

 

    "పూర్ణాంగా...... ఇదేదో కొత్త పదంలా వుందే?"

 

    "కొత్తపదం కాదు..... ఈ మధ్యే మా ఫెమినిస్ట్ ఫ్రెండ్ చెప్పిందిలే. శాస్త్రబద్దంగా పెళ్ళి చేసుకున్న ఆడవాళ్ళు 'అర్థాంగు'లైతే, మనసు అనే ఆత్మబోధ ప్రకారం వుండే వాళ్ళను 'పూర్ణాంగు' లంటార్ట...... ఇదే ఫెమినిజమట."

 

    "ప్రేమ గురించి చెప్పమంటే, ఏదేదో చెప్తావ్.... నిజంగా నువ్వు ప్రేమ గురించి ఏమనుకుంటున్నావో చెప్పు?"

 

    "నిజంగా..... నిజంగా చెప్పమంటావా...... పదహారేళ్ళ వయసులో ప్రేమ పచ్చదనం నిండిన తమలపాకు లాంటిది. ఇరవై ఆరేళ్ళ వయసులో ప్రేమ మొగ్గవిచ్చిన తొలిపూత లాంటిది. ముప్ఫై ఆరేళ్ళ వయసులో ప్రేమ మందారం రెక్క మెరుపులాంటిది. నలభై ఆరేళ్ళ వయసులో ప్రేమ నాజూకైన వెన్నెల లాంటిది.

 

    ఏభై ఆరేళ్ళ వయసులో ప్రేమ గేరులేని కారులాంటిది. అరవై ఆరేళ్ళ వయసులో ప్రేమ అరుంధతి నక్షత్రం లాంటిది."

 

    ఈ అందమైన, తాత్వికమైన నిర్వచనానికి పద్దెనిమిదేళ్ళ అమ్మాయి సముద్రపు అలలా హాయిగా నవ్వింది. ఆ నవ్వు  మనుషుల్ని సేద తీర్చడానికి భగవంతుడు నవ్వినా నవ్వులా చాలా పవిత్రంగా వుంది.

 

    ఆ అమ్మాయి నవ్వినా నవ్వుకు పులకరించిపోయిన మధు కూడా హాయిగా నవ్వుకున్నాడు.

 

    ఆ నవ్వు పూర్తిగా నవ్వు కాదు - సగం నవ్వు.

 

    మధు పూర్తిగా ఏ పనులూ చెయ్యడు. అలా చెయ్యకపోవటానికి బోలెడు కారణాలున్నాయి.

 

    అందులో మొదటిది బిడియం. రెండవది భయం. మూడవది సిగ్గు. నాల్గవది సంకోచం. ఐదవది ఆత్మన్యూనతాభావం. ఆరవది ఒంటరి ప్రపంచంలో ఎదగటం. జెనిటిక్స్ వల్ల, జనరేషన్ వల్ల మనుషులకు కొన్ని గుణాలొస్తాయి. అలాగే ఒక గుణం మధుకు కూడా వచ్చింది. దానికి కారణం వాళ్ళ తాత. ఆ గుణం అతనికి గొప్పగానూ, ఎదుటి వ్యక్తులకు తప్పుగానూ వుంటుంది. అందులో బోల్డంత హాస్యరసం కూడా వుంటుంది. నిజమైన హాస్యం ఎప్పుడూ కన్నులాంటిది. ఆ కంటికింద ఎప్పుడూ విషాదపు తెర వుంటూనే వుంటుంది.

 

    
                                          *    *    *

 

    దూరంగా గోదావరి నది 'అందాలరాముడు' సినిమాలోని బాపూ తీసిన దృశ్యంలా కనబడుతోంది.

 

    చిన్నపల్లెటూరు. అటు పడవమీద వెళితే ధవళేశ్వరం ఊరు. ఇటు పడవ దిగి నడిస్తే పాపికొండల కనుమ.... ఆ కనుమలొ ఆ పల్లెటూరు తమలపాకుల మీద పెట్టిన వక్కలా వుంటుంది. చుట్టూ నీళ్ళు. 'లవకుశ' సినిమాలో రాజవీధిలాంటి వీధి.

 

    ఆ వీధికి ఒక చివర రామమందిరం. ఆ పక్కన పెద్ద చెరువు. ఆ వెనక చెరుకుతోటలు.

 

    చెరుకుతోటలోంచి చెరుకుగడను తీసుకుని పదేళ్ళ ప్రేమ పరుగు, పరుగున వచ్చింది.

 

    అప్పుడు పన్నెండేళ్ళ మధు చెరువులొ స్నానం చేస్తున్నాడు.

 

    "ఏయ్..... మధూ..... నిక్కరు  వదిలేసి..... షర్టుతో స్నానం చేస్తున్నావేమిటి? ఎవరైనా షర్టుని ఒడ్డున పెట్టి, నిక్కరుతో స్నానం చేస్తారుగదా."

 

    "పిచ్చిమొహమా..... షర్టు తడిచిపొయినా ఫర్వాలేదు. షర్టు వేసుకోకపొయినా ఎవరూ అడగరు. నిక్కరు వేసుకొకపొతే అందరూ నవ్వుతారు. తడిసిన నిక్కరైతే మరీ ఎక్కువగా నవ్వేస్తారు" చెప్పాడు మధు ఎక్కడో ఆలోచిస్తూ.

 

    ఆ మాటకు ప్రేమకు నవ్వొచ్చింది.

 

    నీటిలోంచి బోసిమొలతో పైకి వచ్చాడు మధు. మధుని చూసి సిగ్గుపడి తల పక్కకు తిప్పేసుకుని-

 

    సీగాన ప్రసూనాంబ టైపులొ 'వెవ్వె..... వె....." అంది.

 

    "నువ్వే వెవ్వె..... మీ బాబు వెవ్వె....." అన్నాడు మధు నిక్కరు తొడుక్కుంటూ.

 

    "నాకు చెరుకుగడ ఇవ్వవా?" అడిగాడు మధు.

 

    "ఇంద....." అంటూ అందిచ్చింది.

 

    సగం గడ విరిచి, ఆ ముక్కను నిక్కరు జేబులో పెట్టుకుని మిగతాదాన్ని కొరకడం ప్రారంభించాడు.

 

    "ఎందుకు దాచేసుకున్నావు? తెమ్మంటే ఇంకో చెరుకుగడని తేనా?" అడిగింది ప్రేమ.

 

    "మళ్ళీ తేవడం దండగ. కావాలంటే దొరకదుగా! అందుకే దాచేసా" చెప్పాడు మధు.

 

    "నువ్వు పిసినారివి....." అంది ప్రేమ.

 

    "మనం పెళ్ళి చేసుకుందామా?" అని సడన్ గా అడిగాడు మధు.

 

    "పెళ్ళంటే....?"

 

    "అదేలే..... మీ గోపాలం బాబాయ్ కి మొన్న జరగలేదూ..... కొత్త పిన్ని రాలేదూ....అదన్నమాట!"

 

    "పందిరి వేశారు, బాజాలు కొట్టారు అదా..... అలా చెప్పవేం? చేసుకుందాం. మనం ఇప్పుడే పెళ్ళి చేసుకుందాం. సరేనా?" అమాయకంగా అంది ప్రేమ.

 

    "పెళ్లంటే అలా కాదులే.... మావాళ్ళు మీ ఇంటికి రావాలి, మీ వాళ్ళు మా ఇంటికి రావాలి, మనం ఫోటోలవీ తీయించుకోవాలి."

 

    "ఫోటోలా! మధూ...... మధూ...... మనం ఫోటో దిగుదాం."

 

    "దిగుదాం. కానీ కెమెరా ఏదీ?"

 

    "రాజమండ్రి వెళదాం. అక్కడ స్టూడియోలుంటాయి కదా! పదిరూపాయాలిస్తే చాలు."

 

    "ఎప్పుడెళదాం?"

 

    "రేపాదివారం."

 

    
                                          *    *    *

 

    ఆదివారం!

 

    పడవ మీద రాజమండ్రి వెళ్ళి, ఫోటో తీయించుకుని, ఫోటో స్టూడియో వాడిని బతిమిలాడి, రెండు గంటలసేపు అప్పులవాడిలా అక్కడే వుండి, ప్రింట్ వేయించుకుని, ఆ ఫోటోలోని తమనిద్దర్నీ చూసుకుని మురిసిపోతూ, మళ్ళీ పడవ నెక్కారు మధు, ప్రేమ పడవ నీళ్ళమీద తేలిపోతోంది.

 

    ప్రేమ మనసు కూడా ఆనందపు కెరటాల్లో తేలిపోతోంది.

 

    "ఫోటోలొ నువ్వు అందంగా వున్నావా? నేను అందంగా వున్నానా?"

 

    "నేనే......" అన్నాడు మధు.

 

    "కాదు నేనే" అంది ప్రేమ.

 

    "కోతిముఖం! నువ్వు అందంగా ఎలా వుంటావ్?"

 

    "నువ్వే కోతిముఖం" వెక్కిరించింది ప్రేమ.

 

    "పోనీ...... మనిద్దరం బాగున్నాం."

 

    "నీకంటే నేనే బాగుంటాను" అంది ప్రేమ

 

    "ఛ..... నువ్వా?"

 

    ఇద్దరు పావుగంట సేపు తగువులాడుకున్నారు. ఇంతలో పడవ ఒడ్డుకు వచ్చేసింది.

 

    "ఎందుకమ్మా తగూలాట? ఇద్దరూ బావుంటారు వెళ్ళిరండి......." అన్నాడు పడవవాడు.

 

    "ఆ పడవ  వాడికి నువ్వేమైనా యిచ్చావా?" కోపంగా అడిగాడు మధు.

 

    "నేనెందుకు ఇవ్వడం? ఇదిగో మధూ! నన్ను అనుమానిస్తే నాకు కోపం వస్తుంది"

 

    "నీకు కోపంవస్తే..... నాకేం లెక్కా జమా....."

 

    మధు, మగవాడిలా కోపగించుకున్నాడు.

 

    "అలా అంటే నీ జట్టు కట్టను."

 

    ఇద్దరూ మట్టిరోడ్డు మీద నడుస్తున్నారు. ఇద్దరివి ఎదురెదురు ఇళ్ళు!

 

    "నాఫోటో నాకిచ్చెయ్....." కోపంగా, ఉక్రోషంగా అంది ప్రేమ, ఫోటోలో ఇద్దరూ బాగా పడడం, చాలా బాగుంది మధుకి. రేపు స్కూల్లో అందరికీ చూపించాలనే ఆనందానికి అడ్డం వచ్చిన ప్రేమ మాటలకు మరింత కోపగించుకున్నాడు మధు.

 

    "ఇదిగో తీసుకో....." అని చేతిలోని ఆ ఫోటోను విసిరేశాడు మధు. ఆ ఫోటో గాలికి ఎగిరి, మట్టిరోడ్డు మీద పడిపోయింది.

 

    "నువ్వింత చెడ్డవాడివని నేననుకోలేదు" అని ఆ ఫోటోని తీసుకుని గౌనుతో తుడిచి-

 

    "నా ఫోటో నాది, నీ ఫోటో నీది....." రెండు ముక్కలుగా చేసి చూసుకోకుండా తనున్న భాగాన్ని అతనికేసి విసిరికొట్టి, మధు వున్న ఫోటోని తనుంచుకుని-

 

    "నన్నెప్పుడూ కలవొద్దు....." అని కోపంగా ఇంటిలోకి వెళ్లబోతూ మెట్ల దగ్గర ఆగిపోయింది ప్రేమ.

 

    మధు  ఇంటిలోకి వెళ్ళిపోయి, ఉయ్యాల మంచం మీద వెల్లకిలా పడుకుండిపోయాడు.

 

    మెట్లదగ్గర ఆగిపోయిన ప్రేమను వాళ్ళ బామ్మ- "ఏంటే బొమ్మలా వుండిపోయావ్" అని అనుకుంటూ ముందుకొచ్చిన బామ్మ, ప్రేమ వ్యవహారాన్ని చూసి సంతోషించి-

 

    "ఒసేవ్...... కళ్యాణీ..... నీ కూతురు పెద్దమనిషైందేవ్....." అని గట్టిగా అరిచింది.

 Previous Page Next Page