Previous Page Next Page 
మనసా....ప్రేమించకే నువ్విలా పేజి 2

    చటుక్కున లేచి హెయిర్ కు రబ్బరుబాండ్ వేసి బాత్ రూమ్ లోకి వెళ్లి హడావిడిగా బ్రష్ చేసుకుని. అద్దంలో ఫేస్ అడ్జస్ట్ చేసుకుని గబగబా నడిచింది... విజిటర్స్ రూమ్ లోకి! ఆ వచ్చింది ఎవరో... తెలుసు తనకు!
    తెల్లకోటులో కిటికీవైపు తిరిగి చైర్ లో కూర్చుని బయటకు చూస్తున్నారు డాడ్!
    తనను విష్ చేయడంకోసం  అంతదూరం నుండి ఇంతప్రొద్దునే ఇక్కడకు చేరుకొని... ఎంత ప్రేమో -డాడీకి తనంటే! తనకోసం అన్నీ స్పెషల్ గానే చేస్తారు.
    పాదాల చప్పుడు కాకుండా మెల్లగా మునికాళ్ల మీద నడిచెళ్లి భుజాల మీద చేతులేసి, వీపుకు తల ఆన్చి-
    "హాయ్ డాడ్!" అంది.
    చేయి వెనక్కి మలిపి జుట్టు నిమిరారాయన.
    "డాడ్! రాత్రి ఫోన్ చెయ్యకపోతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఏడుపోచ్చింది!  నాకుతలుసు మీరోస్తారని! థాంక్యూ డాడ్... థాంక్యూ! ఐ లైక్ యూ డాడ్... ఐ లైక్ యూ వెరీమచ్!" అంది అర్థంగా- రెండు చేతుల్తో వీపును భుజాల మీదుగా అదిమి పట్టుకుని.
    థాంక్స్! మెనీమెనీ థాంక్స్! ఐ యాం వేరీలక్కీ!"
    గొంతు డాడీది కాదు. మరి ఎవరు? డాడీకి జలుబు చేసిందా? భుజాలు పట్టుకుని ముందుకు తిప్పబోయింది.
    చటుక్కున జ్ఞాపిక తలవంచి తలమీద ముద్దు పెట్టుకుని వడివడిగా గుమ్మం దాటబోయాడతడు.
    "యూఁ..! స్టాప్.... స్టాప్ ఐసే!!" అని కోటు పట్టుకుంది.
    కోటు జారి చేతిలో కొచ్చింది.
    అతవెళ్లిపోయాడు. పరిగెట్టుకుంటూ కారిడార్ లోకి వచ్చింది.
    లేడు. గేటు వరకూ పరుగెత్తింది.
    ఎక్కడా లేడు.
    చేతిలోని కోటు జేబులో ఫైవ్ స్టార్ చాక్ లెట్!
    'స్టుపిడ్! ప్రాక్టికల్ జోకులేస్తున్నాడు! ఐ విల్ టేక్ రివేంజ్!' కసిగా అనుకుంది.
    మలుపులో డాడీ కారు కనిపించడంతో మళ్లీ చిన్నపిల్లయిపోయింది.
    "హాయ్ హనీ! హ్యాపీ బర్త్ డే!"
    "థాంక్యూ డాడ్!"
    చేతిలో 'ఫైవ్ స్టార్' చూసి అడిగారాయన- "నాకంటే ముందు నా హనీకి చాక్ లెట్ ఎవరిచ్చారబ్బా?"
    నవ్వుతూ చాక్ లెట్ విసిరేసి - "ఎవరిచ్చినా... నేను తినేది ఫస్ట్ మీ చాక్ లెట్టే!" అంది. కూతురి భుజాలు పట్టుకుని దగ్గరికి జరుపుకున్నారాయన! తండ్రికి పూర్తిగా అనుకుని నడుస్తూ "రాత్రి ఫోనెందుకు చెయ్యలేదు?" మారాంగా అడిగింది.
    "చేశాను. నేను 'జ్ఞాపిక డాడీని! అని చెప్తే- నీ ఆటలు సాగవు పెట్టేయమని వార్నింగ్ ఇచ్చారు. నన్ను  నమ్మలేదు వాళ్ళు. ఏ రోమియోనో డాడీనని అబద్దం చెప్తున్నాడనుకున్నారేమో!" అంటే-
    'రోమియో చేస్తే- డాడీ అనుకుని ఇచ్చారు. డాడీ చేస్తే- రోమియో అనుకుని ఇవ్వలేదు' నవ్వుకుంది.
    "ఓ.కే. డాడ్! ఎనీ హౌ... మీరోచ్చేశారు చాలు!" అని కబుర్లలో డాడీతెచ్చిన గిప్టులు చూడ్డంలో పడిపోయింది.
    ఆ తండ్రీకూతుళ్ళు ఆనందమైనా, దుఃఖమైనా ఇద్దరే పంచుకుంటారు. మూడోవ్యక్తికి వారి మధ్య స్థానమే ఉండదు. ఇద్దరూ 'తండ్రీకూతుళ్ళు' అనేకన్నా - మంచిఫ్రెండ్స్' అనడం నిజం.
    "నీకోసం ఏం తెచ్చానో స్పెషల్ గా.... గెస్ చెయ్యి హనీ!" అడిగారాయన చేతిలో ప్యాక్ లో ఉన్న వస్తువుని వెనక్కి పెట్టుకుంటూ.
    "ప్లవర్ గార్డెన్ బుక్స్!"
    "సగం కరెక్ట్.. సగం కాదు!"
    "సరే! చెప్పేయండి డాడ్....ప్లీజ్!"
    "స్పార్టకస్!"
    "నిజంగా! ఎక్కడా? ఎక్కడ దొరికింది డాడ్? ఒఫ్ఫ్ఁ.... ఐ లైక్ యూ వెరీమచ్ డాడ్! ఎప్పట్నుంచీ అడుగుతున్నాను నేను!" తండ్రి భుజంమీద తలపెట్టుకుంది.
    "ఓ.కే హనీ! కానీ, ఇది  అమాంతం చదివి నమిలి మింగేయొద్దు. ఒక్కొక్క  చాప్టర్ చదివి కొంత టైమిచ్చి, ఇంకో చాప్టర్ చదువు! అప్పుడుకానీ - నువ్వు సరిగా  జడ్జ్ మెంట్ కు రాలేవు"
    "వాట్ డాడ్!" ఎలా చదవాలో కూడా చెప్పాలేంటి? ఇప్పుడు నేను పెద్దదాన్నయిపోయా! చూడండీ.... కాళ్ళెత్తకుండానే మీ పోల్దర్స్ దగ్గరికొచ్చేసా! హైహీల్స్  కూడా వేసుకోలా... చూడండీ!" అని తండ్రి పక్కన నిలబడి తండ్రి అటు చూడగానే కాళ్లు పైకెత్తింది.
    "మైడియర్ హనీ! నువ్వెంత పెద్దయినా నాక చిన్నపిల్లవేరా? నేనున్నన్నాళ్లు నిన్ను చిన్నపిల్లలానే చూసుకుంటా! ఊఁ....ఊ! సరే- బయలుదేరుతున్నా! కాలేజ్ వేస్ట్ చేసుకోకు! నీ గోల్ నీకు గుర్తుందిగా.... బై హనీ!"
    "బై డాడ్! రోజూ స్టెత్ మరచిపోకుండా క్లినిక్ కి తీసుకెళ్లండి! నాయర్ కు చెప్పడి- మీకు రోజూ జూస్ ఇవ్వకపోతే హనీ వచ్చి తిడుతుందని! ఇంక మీరు ఒక సూట్ మీది కోట్ ఇంకో సూట్ మీద వేసుకోకండి! నేనెలా పెట్టానో అలానే వాడుకోండి. ఇంకా...."
    "ఓ.కే. హనీ! నువ్వు నా కూతురివా...అమ్మవా?" ఆమె తలకు తన తల కొడుతూ నవ్వారాయన.
    "రెండూ..!" రండు కళ్ళూ మూసి తెరిచింది.
    బయలుదేరి వెళ్లిపోయారాయన.
    కాలేజ్ కెళ్లేసరికి క్లాస్ స్టార్టయింది. కంగారుగా తన డెస్క్ దగ్గర కెళ్లింది. డెస్క్ లోంచి నోట్స్ తీసి రన్నింగ్  నోట్స్ కు ప్రి పేరయిపోయింది.
    నలభై అయిదు నిముషాలు అవలీలగా గడిచిపోయాయి.
    నెక్ట్స్  సెమిస్టర్ కోసం ప్రి పేరవ్వాల్సిన మేటర్ రన్ అవుతోంది. నోట్ చేసేసుకుంది గబాగబా!
    క్లాసయిపోయాక అవంతి నోట్సడిగింది. జ్ఞాపిక ఇచ్చేసింది.
    ఆ నోట్స్ రిఫర్ చేస్తూ... అందులోంచి కిందపడిన గ్రీటింగ్ కార్డ్ చూసి లోలోపలే చదువుకుంది అవంతి.
    ఆ తర్వాత- లీజర్ పిరియడ్ కోసం ఎదురుచూసి, అది రాగానే టీజింగ్ స్టార్ట్ చేసింది జ్ఞాపికను-
    "హేయ్ఁ.... అందరూ వినండి! ఈరోజు జ్ఞాపిక బర్త్ డే!"
    తన బర్త్ డే స్ఫూర్తికీ, కామినికీ తప్ప  ఎవరికీ తెలీదు. వాళ్ళవైపు కోపంగా చూసింది జ్ఞాపిక. వాళ్ళు సైగ చేశారు- మేమేమీ చెప్పలేదన్నట్టు.
    అందరూ "హ్యాపీ బర్త్ డే టూ యూ!" అని హమ్ చేశారు.... గట్టిగా క్లాప్స్ తో.
    "హేయ్ఁ...."దీంట్లో జ్ఞాపిక బాయ్ ఫ్రెండ్ పంపిన గ్రీటింగ్ కార్డుందే....చూస్తారా?" అంటూ ఒక గ్రీటింగ్ కార్డ్ తీసింది నోట్ బుక్ లోంచి!
    "ఏయ్ఁ..." అని జ్ఞాపిక వెంటపడే లోపే పరిగెత్తుతూ పరిగెత్తుతూ గట్టిగా చదివింది.
    "నా నీకు-
    ఓ జ్ఞాపిక.... మనో వ్యాపికా!
    అజ్ఞాతికా.... అనుభూతికా!
    హ్యాపీ బర్త్ డే టూ యూ!!
        -నీ నేను!"
    "హేయ్ఁ... ఎవరే తుమ్ హారా ఆవారా?" అడిగింది.
    "షట్! నాకే తెలీదెవరో! నన్ను టీజ్ చేయబట్టి త్రీ మంత్స్ అయింది! పట్టుకోలేకపోతున్నాను. ఈరోజు చేతిలో చిక్కి కూడా గుర్తుపట్టేలోపే తప్పించుకున్నాడు."
    "వుయ్ డోంట్ బిలీవ్! 'హాయ్ఁ...' అనగానే డేటింగ్ పెట్టుకునే సెంచరీ ఇది. ఇంత గాఢంగా టీజ్ చేస్తున్నాడంటే సమ్ థింగ్, సమ్ థింగ్ హొ రహీ హై యార్!"
    "ఏయ్! బి ఇన్ నోట్ లిమిట్స్!  రియల్లీ ఐ డోంట్ నో.... హు ఈజ్ హి!"
    "నీ  డెస్క్ లోని నోట్ బుక్ లోకి గ్రీటింగ్ వచ్చిందంటే- మన క్లాస్ మేటో, కాలేజ్ మేటో అయ్యుంటాడే!" అంది అవంతి.
    "చోడో యార్! ఐ హవ్ నో ఇంట్రెస్ట్ టు ఇన్వెస్టిగేట్~ ఐ నో... హి ఈజ్ ఎ రొమియో! బట్ ఐయామ్ నాట్ జూలియట్!" కేర్ లెస్ ఆన్సర్.... జ్ఞాపిక నుండి.
    "ఇదేంటే...ఏవీ కేర్ చెయ్యదు?"
    "అదే...మనకెవరయినా బాయ్ ఫ్రెండ్ గ్రీటింగ్ కార్డ్ ఇస్తే రొమాంటిక్ గా ఎంత థ్రిల్లయిపోతాం..?!" అంది అవంతి.
    "అది వాళ్ళ డాడ్  విషయంలో తప్పితే ఇంకెవ్వరి విషయంలోనూ అంత ఇంట్రెస్ట్ చూపదే! సెన్సేషన్ లెస్!!" నవ్వారందరూ.
    కానీ, జ్ఞాపిక ఆ గ్రీటింగ్ కార్డ్ ని అతి  పదిలంగా దాచుకుంది.
    రాత్రి రూమ్ మేట్స్ నిద్రపోయాక గ్రీటింగ్ కార్డ్ తీసింది-
    '25 days to thank you'
    ఇరవై ఐదు రకాల పూలతో చేయబడ్డ 'బొకే' అది. Thankfull ఐటమ్స్ అన్నీ  అందులో వరుసగా రాయబడ్డాయి. అన్నీ శ్రద్దగా చదివింది.
    'kiss the ground you walk on'
    లేచి వజ్రాసనంలో కూర్చుని నేలకు ముద్దు పెట్టింది.
    'Sing you song!'
    చిన్నగా 'ఐ బిలీవ్ ఇన్ మ్యూజిక్ హమ్ చేసింది.
    'call your mother for you'
    చిన్నగా ఏడుపోచ్చింది. దిండుమీద తలపెట్టి - 'మమ్మా... కమ్ ఫర్ మీ! వన్స్ ప్లీజ్.... వన్స్ యు కమ్ ఫర్ మీ!' అనుకుంది.
    ఎవరు తనకోసం మిడ్ నైట్ వరకూ మేలుకుని బర్త్ డే విషెస్ తెలిపింది?
    పొద్దునే హాస్టల్ కొచ్చి తలపై కిస్ చేసి, చాక్ లేట్ ఇచ్చి, ఇంత అపురూపమైన గ్రీటింగ్ కార్డ్ తనకు పంపినదెవరు?
    ఎవరు..? తన టెస్టులన్నీ వడపోసి కనుక్కుంటున్నదెవరు?
    ఎవరు.... డాడీకి తప్ప తన మనసులో ఖాళీలేని చోటులో చోటు చేసుకుంటున్నదెవరు? నిద్రరాలేదా  రాత్రి! ... మౌనమై పోయింది మనసు.
    చటుక్కున లేచి స్ఫూర్తి దిండు కింద ఉన్న టార్చి తీసుకుని గేటు గడరికి వెళ్లింది.
    వాచ్ మన్ అడిగాడు- "క్యా హొనా మేడమ్?" అని.
    "మై డూండూంగా! ఆప్ జాయియే!" అని అంగుళం అంగుళం వెతికింది.
    అప్పుడు దొరికింది...గోల్డెన్ కలర్ ఫైవ్ స్టార్! దాన్ని తీసుకుని రూమ్ లోకొచ్చింది. ఉదయం డాడీ ఇచ్చిన  మిల్క్ బార్  తీసింది. మెల్లగా అదికొంచెం, ఇదికొంచెం ఒక్కసారే కొరికింది. రెండూ రెండురకాల రుచులు! రెండూ కలిసి అదో కొత్త రుచి.... మొత్తం తిని నీళ్లు తాగేసి పడుకుంది.
    పడుకున్నా... గుర్తుతెలియని వ్యక్తి ముందుకు తిరిగి చటుక్కున తలవంచి చాతీకాన్చుకుని ముద్దుపెట్టి - తను మొహం చూసే ఛాన్స్ ఇవ్వకుండా స్కేటింగ్ చేస్తున్నట్టు స్పీడ్ గా డోర్ లోంచి వెళ్లిపోవడం గుర్తొచ్చింది.
    ఎవరయి ఉంటారు..?
    ఆ సీన్ తలచుకోగానే ఏదో పరిమళం..! సంపెంగపూలూ, మొగలిపుప్పొడి కలిపిన పరిమళం! అదే... అదొక్కటే ఆధారం... స్కిన్ స్మెల్!
    య్యాఁ....! తను ఆ స్కిన్ స్మెల్ ఆధారంతోనే అతన్ని పట్టుకోగలదు!
    లేచి ఫ్రెండ్స్ చూడకుండా తన సూట్ కేస్ లో దాచిన తెల్లకోటు తీసింది. దాని వాసన చూసింది.
    సేమ్ స్మెల్!
    "య్యా హూ..!" అని అరిచింది.
    ఉలిక్కిపడి లేచారు స్ఫూర్తి, కామినీ.
    "వాట్  హ్యాపెండ్ యార్! ఎనీథింగ్ రాంగ్?!" దెయ్యంలా జుట్టు విరబోసుకుని వైట్ కోట్ చేతిలో పట్టుకుని మంచంమీద మోకాళ్ల పైన కూర్చున్న జ్ఞాపికను చూసి కంగారుపడి అడిగారు.
    "నథింగ్! నథింగ్! జస్ట్.... జస్ట్ మీరు లేస్తారో, లెవరో అని అరిచా! అంతే.... నథింగ్  యార్! నథింగ్!" అంది తన  చేతిలోని కోటుని వెనకాల దాచుకుంటూ.
    దొంగను పట్టుకున్న ఎస్.ఐ.ల్లాగా ఇద్దరూ దగ్గరికొచ్చారు. వెనక్కి మడిచిన జ్ఞాపిక చేతుల్లోని కోట్ తీసుకున్నారు.
    "నథింగ్! హాఁ..." స్ఫూర్తి.
    "య్యా... నథింగ్! నథింగ్!!" జ్ఞాపిక.
    "ఇదెవరిదే?" కామిని.
    "అవును- ఇదేవరిది? హాఁ....అసలు ఇక్కడెందుకుందీ? నా చేతుల్లోకెలా వచ్చింది?" వాళ్ళనే అడుగుతున్న జ్ఞాపికను చూసి - తిక్కరేగింది వాళ్ళకు.
    "డ్రామా వద్దు! ఎవరిదిది?" ఇద్దరూ కలిపి అడిగారు.
    "ఎవరిదబ్బా? ఆఁ.... గుర్తొచ్చింది! మా డాడీది! కావాలంటే చూడూ... తెల్లగా ఉందీ! డాక్టర్లు తెల్లకోటే కదా వేసుకుంటారు? ఇది మా డాడీది! నేను డాడీనడిగి తీసుకున్నానన్నమాట! డాడీ గుర్తొచ్చినపుడు, మా డాడీని  వాటేసుకున్నట్టు, వాటేసుకుని పడుకోడానికన్నమాట! అంతే... జస్ట్- అంతేనన్నమాట!" ఫేస్ లో అమాయకత్వపు ఎక్స్ ప్రెషన్ ఇచ్చేసింది సడన్ గా!
    ఛస్తే నమ్మలేదు వాళ్ళు! ఒక సి.ఐ.డి. దొంగను చూసినట్లు చూడసాగారు.
    "ఆఁ..!" అని ఆవలింపు అభినయించి "ఒకటే నిద్దరొస్తోంది ఈరోజెందుకో! గుడ్ నైట్! హావ్ ఎ స్వీట్ డ్రీమ్!" అని నిండా ముసుగు పెట్టుకుంది కోట్ తో సహా- వాళ్ళ చూపులు తప్పించుకునేందుకు!
    స్ఫూర్తి, కామిని ఒకరినొకరు చూసుకుని "కుచ్ హొ గయా!" అనుకుని పడుకున్నారు.
   
                                             2
    ఇంటర్మీడియట్ లో అమ్మాయిలూ, అబ్బాయిలూ దొంగచూపుల్లో ఉంటారు. ఒకర్నోకరూ దూరంనుండి చూస్తుంటారు! ఏది, ఏం చెయ్యాలో తెలియని వయసు, చదువు- అప్పుడప్పుడే విచ్చుకుని ప్రపంచాన్ని చూస్తున్న మెదడు, బెరుకు... ఈ మూడింటి మధ్య మౌనంగా ఉంటారు.
    డిగ్రీ స్టేజ్ లో ఇంకొంచెం ముందుకొస్తారు.
    వారిపట్ల వారికి కొద్దిగా కాన్ఫిడెన్స్ మొదలవుతుంది.  అబ్బాయిలూ, అమ్మాయిలూ, పరిచయాలూ....నోట్సులు తీసుకోవడాల వరకొస్తారు! ఒకరిపట్ల ఒకరికి ఉన్న ఆకర్షణను 'ప్రేమ'గా కూడా భ్రమ పడుతుంటారు.
    పి.జి లెవెల్లో స్టూడెంట్స్ పర్ ఫెక్ట్ పర్సనాలిటీ డెవలప్ చేసుకుంటారు.
    కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్ పెక్ట్ పెరుగుతాయి. అమ్మాయిలూ, అబ్బాయిల మధ్య సరయిన అవగాహనా, సత్సంబంధాలూ నెలకొంటాయి. జీవితంపట్ల నిర్ణయాలు, ఆశయాలు బలపడుతాయి.

 Previous Page Next Page