Previous Page Next Page 
టు హెల్ విత్ లవ్ పేజి 19


    "భోజనానికి పిలుచుకురా!"
    "ఆయ్! అలాగేనండీ!"
    ఆమె వెళ్ళిపోగానే సురేష్ సంభాషణ కంటిన్యూచేశాడు.
    "మీరు వెళ్ళినపనిఏమయింది?"
    "ఎరేంజ్ మెంట్స్ అన్నీ అయిపోయాయ్."
    "మైగాడ్! ఇంత ఫాస్ట్ గానా?"
    "మహీధర్ ఫ్రెండ్ ఒకాయిన ఉన్నాడిక్కడ! చాలా ఇన్ ఫ్లుయెన్ షియల్! ఆయనకు వప్పజెప్పేశాను.....మీరు మరోసారి హాల్లోకెళ్తారా?"
    "నేనా?"
    "అవును."
    "ఎందుకు?"
    ఆమె ఓ క్షణం తటపటాయించి చెప్పింది.
    "నేను డ్రస్ మార్చుకోవాలి."    
    "ఓస్ ఇంతేనా? ఇంకేదో కొంప మునిగే వ్యవహారంచేయబోతున్నారనుకున్నాను. ఈ మాత్రానికే నేను బయటికెళ్ళిపోవాలా? వెరీ సిల్లీ! కావాలంటే కళ్ళు మూసుకుంటాను. కానీండి! మా తులసి అలాగే చేస్తుంది ఎప్పుడూ."
    ఆమె ఇబ్బందిగా నవ్వింది.
    "నేను తులసిని కాదు కదా!"
    "ఓహో! అట్నుంచి నరుకొచ్చారా? అయితే నేను మహీధర్ననుకోండి కాసేపు. మహీధర్ అయితే అసలు కళ్ళు మూసుకోడు కదా!"
    "ఎందుకని?"
    "మీ అందాన్ని చూడ్డానికి వేయికళ్ళు కూడా చాలవని నా అభిప్రాయం. మరి నాకున్న రెండేరెండు కళ్ళు కూడా మూసుకోమనటం అన్యాయం."
    ఆమె ముఖంలో విసుగు కనిపించింది.
    "అయితే నేనే హాల్లో కెళ్తానులెండీ" కోపం నటిస్తూ అంది.
    సురేష్ ఛటుక్కున లేచినిలబడ్డాడు.
    "హు! ఆడాళ్ళు! ఎప్పటికి మగాడి పైకొస్తారింకా! మగాడితోపాటు డ్రస్ ఛేంజ్ చేసుకోలేనివాళ్ళు ఇంకెప్పుడు సమానత్వం సాధిస్తాను. నో! మగాడిదౌర్జన్యాన్ని నిట్టూర్పులతోసహిస్తూ ఎప్పటికి అడుగున పడి నలిగిపోతూనే ఉంటారు."
    మాయనవ్వాపుకోడానికి ప్రయత్నంచేస్తోంది.
    "ఆల్ రైట్ హాల్లో కెళతాను! ఎదుటివ్యక్తికళ్ళు పచ్చగా వుంటే ఓర్వలేదు మీరు" అనేసి హాల్లోకి నడిచాడు.
    భోజనాలు చేస్తూండగా ప్రోగ్రాం వివరించింది మాయ.
    "పొద్దున్నే ఎనిమిది గంటలకు బోట్లో గుడికెళ్తున్నాం. వెళ్ళగానే స్నానంవగైరాలు కానిచ్చి తిన్నగా మంటపంలోకి వెళ్తాం. అక్కడ ఓ గంట సేపట్లో పెళ్ళితంతు అంతా పూర్తవుతుంది అంతే! వెంటనే తిరిగి వచ్చేయటమే!"
    "ఆ తరువాత?"
    "ఆ తరువాత ఇంకేముంటుంది? ఎవరిదారివాళ్ళది"
    "అన్యాయమండీ! ఇంత శాస్త్రీయుక్తంగా వివాహం జరిపించాక ముద్దూ ముచ్చటాలేకుండా మమ్మల్నిగాలికొదిలేస్తారా?"
    మాయనవ్వుతూ తులసివేపు చూసింది.
    తులసి డైనింగ్ టేబుల్ కిందినుంచి అతని తొడమీద గిల్లింది.
    "ఇదిగో ఇంకోసారి గిల్లావంటే ఏదొకరోజు 'లాస్ట్ బస్' లో ఇంటికొచ్చేస్తాను జాగ్రత్త!" బెదిరింపుగా అన్నాడు.
    ఆ మాట వినగానే కిచన్ గార్డన్ వెనుకనుంచి ప్రభకిసుక్కుమని నవ్విన నవ్వూ దాని వెనుకేకూరగిన్నె ఒకటి కిందపడిపోయిన  చప్పుడూ వినిపించినయ్.
    భోజనాలవగానే తులసి సోఫాలో పడుకుని నిద్రలోకి జారి పోటానికి ప్రయత్నాలు ప్రారంభించింది.
    "రాత్రి ట్రెయిన్ లో నిద్రసరిగ్గా లేదు" అంది కళ్ళు మూసుకుని ఆవలిస్తూ.
    "నాకు నిద్రసరిగ్గా లేదు" అంటూ ఆమె పక్కనే తనూ వరిగిపోబోయాడుగానీ తులసి అతనిని తోసేసరికి కిందకు జారితివాచీమీద పడిపోయాడు.
    ప్రభనవ్వు ఈ సారి డైనింగ్ టేబుల్ దగ్గర్నుంచి వినిపించింది.
    "అయితే నేను వెళుతున్నాను "కిందనుంచి లేచి బయటకు నడుస్తూ అన్నాడు.
    "ఎక్కడికి?" మాయ అడిగింది.
    "ఎక్స్ ప్లోరేషన్! కొత్త ప్రదేశాల్నీ, కొత్త మనుషుల్నీ ఎక్స్ ప్లోర్ చేయడం నా హాబీ......!"
    "ఇప్పుడేం ఎక్స్ ప్లోర్ చేయబోతున్నారు?"
    "మీ గార్డెన్! ఉదయం సగ భాగమే చూపించారు కదా! అందులోనూ అవుట్ హౌస్ బయటే ఆపేశారు....అందుకని....."
    మాయమొఖంలో ఓ క్షణంపాటు కలవరం కనిపించింది.
    "అక్కడేమీ లేదు! చిన్న స్టూడియో! మహిధర్ తన వర్క్ కోసం ఏర్పాటు చేసుకున్నాడు"
    "ఓ.కే. అదే చూస్తాను.....ఏం వర్క్ చేస్తున్నాడో...."
    బయటకొచ్చేశాడు.
    ప్రకృతి మరింత శోభాయమానంగా వుందిప్పుడు. ఎండను ఎక్కువగా చోరనీకుండా వుండడానికి అన్ని చెట్లు కలసి ప్రయత్నాలు చేస్తున్నాయ్ గానీ పూర్తిగా విజయం సాధించలేకపోతున్నాయ్. ఉండుండి సుర్రమని తగిలేఎండ, ఆ వేడికి ఆయింట్ మెంట్ లా చల్లని గాలీ......చాలా ఉత్తేజంగా వుంది సురేష్ కి. "పరాయి స్త్రీ వంక కన్నెత్తిచూడను" అని తులసికి ప్రామిస్ చేయలేదుగానీ ఎందుకో ఇంకో అమ్మాయివేపుమనసు పోదు తనకి! కానీ యిప్పుడు యింత చక్కని వాతావరణంలో.....మనసు, శరీరం కొంచెం మార్పుని కోరుతున్నాయ్ ఎందుకు?
    తనూ తులసీ ప్రేమించుకోవటం మొదలుపెట్టాకయిదే మొదటిసారి అలా అనిపించటం కారణం ఏమయి వుంటుంది?
    ఏమయి వుంటుంది....
    హఠాత్తుగా తట్టిందతనికి.
    ఇది సైకాలాజికల్ వార్ ఫేర్!
    తులసీ ప్రెగ్నెంట్ అనేసరికి యెందుకోకొంచెం దూరం తప్పదనిపిస్తోంది. అదివరలాగా ఫ్రీగా వుండాలంటే మనసు కొంచెం జంకుతోంది. అది నథింగ్ బట్ సైకలాజికల్ అని తనకు తెలుసు. అయినా అవుట్ హౌస్ గానీ మరీ అంతచిన్నదేం కాదు. చాలా పొడుగ్గా, లోరూఫ్ తో, పెద్ద పెద్ద కిటికీలతో చాలా అందంగా వుంది.
    అసలు అది మాయ వుంటున్న ఇంటికంటే కూడా విశాలంగా అనిపిస్తోంది.
    తలుపుదగ్గరకొచ్చాడు సురేష్. తాళం వేసివుంది. అద్దాల కిటికీల్లోంచి లోపలకు చూడడానికి ప్రయత్నించాడుగానీ కర్టెన్స్ వుండటంవల్ల కనిపించటంలేదు. కర్టెన్ పక్కగా వున్న సన్నని గాప్ లో నుంచి చూశాడు. గది మధ్యలో పెద్ద మంచం.....సాధారణంగా వుండే టేబుల్ కాట్ సైజ్ పెద్దది. ఇంటివెనుకవేపుకి నడిచాడతను.
    "ఓ చిన్న ఉద్యానవనం....మధ్యలో మరో స్విమింగ్ ఫూల్!
    ఆ స్విమ్మింగ్ ఫూల్ కి చుట్టూ వున్న పూల మొక్కల్ని చూస్తూనే ఠక్కున నిలబడిపోయాడతను. ఆ దృశ్యం తను అంతకుముందెక్కడో యెప్పుడో చూశాడు.
    కానీ యెలా సాధ్యమది?
    తానుమొదటిసారిగా వస్తున్నాడిక్కడికి!    
    ఒకవేళ ఏదయినా ఎడ్వర్టయిజ్ మెంట్ ఫిలింలో చూసాడా! చక చక ఆలోచిస్తున్నాడుగానీ గుర్తు రావటంలేదు. పాజిబుల్! ఏ సినిమాహాల్లోనో చూసివుండాలి.

 Previous Page Next Page