Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 19


    శ్రీశ్రీగారు మమ్మల్ని వదిలితేగా! కిందికి రమ్మంటున్నారని కబురొచ్చింది. వచ్చి కూర్చున్నాం.
    "చెప్పండి సార్" - అన్నారు నిర్మాతలు.
    "చూడండి. నాకు పదివేలు, నా అసిస్టెంట్ సరోజకి రెండు వేల అయిదు వందలు ఇవ్వండి" - అన్నారు.
    "మీకు పదివేలిచ్చి, వేరే రెండు వేల అయిదు వందలు ఆమె కివ్వడమంటే కష్టం. మీకు ఏడువేల అయిదువందలు, అసిస్టెంట్ అని ఆమె పేర వేరే అగ్రిమెంట్ చేసి రెండువేల అయిదు వందలు ఇస్తాం సార్! ఆలోచించుకుని చెప్పండి. మీరు సరే అంటే అగ్రిమెంట్ టైప్ చేయిస్తాన"ని ఫైనల్ గా చెప్పేసి మాకు ఆలోచించుకోడానికి అవకాశం ఇచ్చారు.
    శ్రీశ్రీగారు చాలా సంతోషించారు. "అంత పెద్ద అమౌంట్ వస్తుందనుకోలేదని, నాకు వేరే 2,500 కంపెనీ ద్వారా వస్తున్నందుకు తనకెంతో తృప్తిగా వుందనీ" అన్నారు.
    అయిడియా యిచ్చినందుకు "గుడ్" అని మెచ్చుకున్నారు.
    అగ్రిమెంట్లకోసం మాకు తెలియకుండా వాళ్ళు, వాళ్ళకి తెలీకుండా మేం తొందరపడుతున్నాం.
    అనుకున్న ప్రకారం అగ్రిమెంట్లు అయిపోయాయి.
    శ్రీశ్రీగారికి వెయ్యిరూపాయలు, నాకు అయిదు వందలు అడ్వాన్స్ ఇచ్చి రసీదులు తీసుకున్నారు.
    డబ్బు విషయంలో శ్రీశ్రీగారికి తెలిసిన టెక్నిక్ ఎవరికీ తెలీదనే చెప్పాలి. సంతకాలు చేసేటప్పుడు శ్రీశ్రీగారు-
    మాటలు - పాటలు - శ్రీశ్రీ. సహాయం - యు.సరోజ అని ఓ కార్డూ, డైలాగ్ డైరక్షన్ - యు. సరోజ - అని ప్రత్యేకంగా వేరే కార్డు ఇవ్వాలని కూడా క్లాజు పెట్టించారు. సాయంకాలం ఆరుగంటలకి అరుణా రికార్డింగ్ థియేటర్ లో పిక్చర్ ప్రొజక్షన్ వేస్తున్నామని అయిదున్నరకి కారు పంపుతామని చెప్పారు నిర్మాతలు.
    శ్రీశ్రీగారు చాలా హుషారుగా ఉన్నారు.
    "ఎలా మాట్లాడాన"ని అడిగారు.
    "చాలా బాగా మాట్లాడారు. ఇలాగే డబ్బు రాబట్టుకునే విషయంతో పాటూ పనిలో కూడా ఎవరూ సాటి - కారనిపించుకుంటే మనకి ఊపిరి తీసుకోడానిక్కూడా టైం దొరకదు. డబ్బింగ్ అనేమాట వస్తే శ్రీశ్రీ గారే రాస్తున్నారు. ఇంకెవరున్నారని అందరిచేతా అనిపించుకోవాలి"- అన్నాను. చురుగ్గా నా ముఖం చూశారు.
    "తప్పకుండా మనకే ఆ కీర్తి దక్కుతుంది. డబ్బింగ్ కి ఒక చరిత్ర సృష్టించి, ఇదో చిన్నలోకం అనిపిస్తారు చూడు. నువ్విలా అనుసరించుకుని వుంటేచాలు" అన్నారు.
    "అంటే మీ ఉద్దేశం?".
    "మ్యూజిక్ పరీక్షలు పాసయ్యావుగా? స్వభావసిద్దంగా ఆ సెక్షన్ కి పారిపోడానికి అవకాశాలెక్కువ వుంటాయి. ఈ డబ్బింగ్ లో అనుభవం లేకున్నా ఓనమాలతో ప్ర్రారంభించి ఒక పిక్చర్ కి డైలాగ్స్ రాసే  కెపాసిటీ వుండేలా నీకు ట్రయినింగ్ ఇవ్వడంతో పాటు, నీ కష్టానికి తగిన డబ్బు కూడా ముట్టేలా చూస్తాను. ఆలోచించుకో" అంటూ.
    "అయిదున్నరకి వస్తాను. సిద్దంగా వుండండ"ని చెప్పి వెళ్ళిపోయారు.
    'బాగుపడితే ఇద్దరం బాగుపడతాం - లేకుంటే ఇద్దరం చెడిపోతాం' అని చలపతి అన్నయ్యతో నేనన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఆ మాట నిజమే!
    ఇటో కాలు, అటో కాలు అయితే లాభంలేదు.
    అన్ని పన్లూ కాదని శ్రీశ్రీగార్ని ఎన్నుకొని, తెగించి ఎలా మైసూరు వెళ్ళానో, అలాగే చావో రేవో తేల్చుకోవాలంటే ఏమయినా సరే శ్రీశ్రీగారి దగ్గరే పనిచెయ్యాలి. ఇక రెండవ ఆలోచన వద్దు. ఎవరు చెప్పినా అంతకన్నా వినొద్దు. వారిని నమ్ముకొని పనిచేస్తే నడి సముద్రంలో విడిచిపెట్టే వ్యక్తి కాదు. అది నిరూపణయిపోయింది. వారి దగ్గరే వారు అవకాశం ఇచ్చినన్నాళ్ళూ పనిచేస్తాను. అని దృఢంగా నిశ్చయించుకొని ఆమాటే అమ్మతో అన్నాను. అమ్మ కూడా చాలా సంతోషించింది.
    నాన్నగారితో ఇంటికొచ్చాక అన్ని విషయాలూ ఊపిరి తీసుకోకుండా చెప్పేసి డబ్బు నాన్నగారి చేతిలో పెట్టేసి కాళ్ళమీద పడిపోయాను.
    మా నాన్నగారు చాలా సంతోషించారు. ఆయన శ్రీరామభక్తులు. మనసులో ఆ రాముడికి మొక్కుకున్నారేమో నాకు తెలీదు. కానీ తర్వాత మాత్రం -
    "నీ పెంకితనంతో అడ్డు ప్రశ్నలు వెయ్యకుండా శ్రీశ్రీగారు చెప్పినట్టు విని పని జాగ్రత్తగా చెయ్యి మంచి పేరు తెచ్చుకో అధిక ప్రసంగం వల్ల అనర్ధాలే కానీ అనుకున్న పనిని సాధించలేం, జాగ్రత్త!" అని చెప్పారు.
    మా యింట్లో అందరికీ మా నాన్నగారంటే సింహస్వప్నం చనువంటూ ఏవైనా వుంటే నాకేవుంది. ఎవ్వరం ఆయన గీచిన గీటు, దాటకూడదు - అన్నమాట కాదనకూడదు.
    "అలాగే నాన్నగారూ!" - అంటూ "సాయంత్రం పిక్చర్ కి వస్తారా?" - అని అడిగాను.
    "నీ పనికి సంబంధించినంతవరకూ మీ అమ్మని వదిలేశాను. నీ పని నువ్వు చూసుకో. మిగతావాళ్ళు ఎవరిపన్లు వాళ్ళు చేసుకుంటారు. సరేనా?".
    "ఊఁ". అన్నాను.
    అన్న టైముకి కారు వచ్చింది. మా యింటివైపు నుండి కూడా స్టూడియోకి వెళ్ళొచ్చు. ఎందుకనో, కారు ముందు కవిగారింటికి వెళ్ళి తరువాత నా దగ్గరకి వచ్చింది. అమ్మతో కారెక్కుతూ "నమస్కారం" అన్నాను.
    సిగరెట్ పట్టుకున్న ఎడంచేతి పిడికిలి పెదవులకు అంటినట్టుంచి, లాగిన దమ్ముకి చప్పిదవళ్ళు కనిపిస్తూ వుంటే "ఊఁ" అని చెయ్యెత్తారు. అంతే - మరేం మాటలు లేవు. థియేటర్ దగ్గర దిగిపోయాం.
    పిక్చర్ ప్రారంభించారు. ఇరవైరీళ్ళ పిక్చర్.
    'చిన్నదే' అనుకున్నాను. (అంటే అంత పెద్దదన్నమాట)
    పిక్చర్ చూస్తున్నంతసేపూ నా గుండె దడదడలాడుతూనే వుంది.
    ఎం.జి.ఆర్., భానుమతి, పద్మిని, ఐ.వి.సరోజ, ముత్తులక్ష్మి, తంగవేలు.....హేమాహేమీలున్నారు.
    పోటా పోటీలతో డైలాగ్స్ మాట్లాడి ఎవరి పాత్రలు వారు తినేశారు. ఎలా డబ్ చేస్తాం అన్న బెంగ పట్టుకుంది.
    పిక్చర్ పూర్తయ్యింది.
    నవ్వుతూ "ఎలాగుంద"ని శ్రీశ్రీగారు నన్నడిగారు.
    "భయంకరంగా వుంద"న్నాను.
    "ఏం" అన్నారు.
    ఇది "మన అంతు తేల్చే పిక్చర్"
    "తెలివైనదానివే - ఫరవాలేదు' అనే భావం వచ్చేలా నా ముఖం చూసి, ప్చ్" అని ఎంతో తేలికగా అన్నారు.
    'నువ్వు అరవమాటల్ని తెలుగులోకి షాట్లతో సహా రాసెయ్యి"
    "అలాగే" అన్నాను.
    పిళ్ళై, జవ్వేరి, గారలు వచ్చి "ఎప్పడి ఇరుక్కు సార్" (ఎలాగుంది సార్!) అని అడిగారు.
    "చాలా బాగుంది సార్! మీరు ఎన్నుకున్న పిక్చర్ మా అంతు చూస్తానంటోంది" అన్నాను.
    అరవంలోనే నేనన్న ఆ మాటలకి వాళ్ళిద్దరూ విరగబడి నవ్వుకున్నారు. మాకు స్క్రిప్ట్, పాటల పుస్తకం, కాగితాలు కావాలన్నారు శ్రీశ్రీగారు.
    నేను వెంటనే అందుకొని "కార్బన్ పేపర్లూ, 25 ఎక్సర్ సైజ్ పుస్తకాలు, 400 పేజీలకి తక్కువ లేకుండా రూళ్ళతో వున్న పొడుగాటి బౌండు పుస్తకం ఒకటి" కావాలన్నాను. "అవన్నీ మీరు ఉదయం ఆఫీసుకి వచ్చేసరికి  తెప్పించిస్తానమ్మా! ఇప్పుడు స్క్రిప్ట్ మాత్రం తీసుకువెళ్ళండి" అంటూ స్క్రిప్టు, కాగితాలు ఇచ్చారు. ఇళ్ళకి బయల్దేరాం. మరుసటి రోజు ఉదయం తొమ్మిదిగంటలకి వస్తానని చెప్పి శ్రీశ్రీగారు వెళ్ళిపోయారు.
    మాయింట్లో అందరం  చాలా సంతోషంగా వున్నాం. సంతోషం అయిదు వందల కోసం కాదు. నేను కథలు చెప్పే రోజుల్లో ఇలాంటి అయిదువందలు చాలా చూశాను. ఇక్కడ సంతోషానికి ప్రత్యేక అర్ధం వుంది. నేను అడుగుపెట్టిన వేళా విశేషం, మొదటి పిక్చర్ తోనే సంధి కొట్టకుండా, రెండవ పిక్చర్ మంచి అమౌంట్ తో వచ్చినందుకు ఆ సంతోషం!
    
                          *    *    *
    
                                               శ్రీశ్రీగారి కోపం
    
    రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. నేనుమాత్రం మెళుకువగానే వుండి తమిళ్ స్క్రిప్ట్ తిరగేస్తున్నాను. తమిళభాషలో వున్న ఒక్కొక్క పేజీ చదివి తిరగేయడానికి ఇరవై ముప్పయి నిముషాలు పడుతోంది.
    ఈ పద్దతిలో తెలుగులోకి రాయడానికే చాలా రోజులయ్యేటట్టుంది. ఇలాగైతే లాభంలేదు. తమిళం చదవడానికి రాయడానికీ కూడా మనకుండే ఈ స్టాండర్డ్ చాలదు. దీనికోసం ఇంకొకరిమీద ఆధారపడడం కూడా అసందర్భం.
    అరవ భాషలో అక్షరాలు చదవడం, రాయడం వగైరా ఇంప్రూవ్ మెంట్లకి ఈ పిక్చరొక్కటే లిమిట్ ఆనుకొని ఒక పట్టు పట్టాలనుకున్నాను.
    ఆ ఆశయం అయితే బాగానేవుంది. కానీ ప్రస్తుతం దారేమిటి?
    పగలు ఆఫీసులో కూర్చుని రాస్తాం అంటే పప్పులుడకవు. చచ్చేటట్టుగా రాత్రింబవళ్ళు ఎద్దులా కష్టపడితేనే పని త్వరగా అవుతుంది. చదవడం రాయడం కూడా వచ్చేస్తాయి.

 Previous Page Next Page