Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 18


    "ఎవరన్నారు?"
    "నేననుకుంటున్నాను.'
    "నువ్వనుకుంటే సరేనా? తెలుగు పిక్చర్ డైలాగ్స్ నేను రాసిన తర్వాత ఫేర్ ఎవరు చేస్తారు? ఆర్టిస్టుల పోర్షన్లు రాయాలి. డబ్బింగ్ చెయ్యాలి. పిక్చర్ పని గురించి నీకు తెలీదు.... వెళ్ళి బాయ్ ని పిలువు" అన్నారు. అక్కడే వున్న కాలింగ్ బెల్ బటన్ నొక్కాను. బాయ్ వచ్చాడు.
    త్వరగా సామాన్లతో దిగండి. అయిదయిపోతోంది. మన కోసం బండి ఆగదు".
    "టైముంది సార్! అయిదున్నరకి బండి" అని బాయ్ అన్నాడు.
    "అయిదు గంటలకని చెప్పారే..... అయితే ఫరవాలేదు. రండి రిక్షాలోనే పోదాం" అన్నారు.
    "నడచి వెళదాం లెండి. దగ్గరేగా" అంటూ, "మేమూ మీతో వస్తున్నాం, మరచిపోతారేమో" అన్నాను.
    "లేదులే ఇక మర్చిపోను" అన్నారు.
    అందరం ఒక్కసారే బయలుదేరాం. అయినా మేం వారికన్నా అయిదు నిమిషాలు లేటుగా స్టేషన్ కి చేరుకున్నాం. స్టేషన్ లో సిగరెట్ తాగుతూ మా కోసం చూస్తున్నారు.
    మైసూరులో బండి బయలుదేరింది. నేనూ, అమ్మా మాటలతో టైం సంగతే మరచిపోయాం.
    బెంగుళూరులో బండి ఆగగానే దిగిపోయాం. పక్క కంపార్టుమెంటులోంచి దిగిన శ్రీశ్రీ గారు మా దగ్గరికి వచ్చి, "అదిగో - అవతల ఫ్లాట్ ఫాం మీద మద్రాసు బండి వుంది. వెళదాం రండి" - అన్నారు.
    రాత్రి పదిగంటలకి మెయిల్ బయలుదేరింది. మద్రాసులో దిగి, ముగ్గురం ఒకే టాక్సీలో బయలుదేరాం.
    రెండు వందలు వారి చేతికివ్వబోయాను.
    "నిన్న సాయంకాలం నేనిచ్చినవేగా? తెలివుండే ఇచ్చాను. ఉంచుకో" - అన్నారు.
    మమ్మల్ని ఇంట్లో దింపేసి వారు వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళే ముందు ఒక్క మాట కూడా చెప్పలేదు. సిగరెట్ దమ్ములాగుతూ "వస్తానని" మాత్రం అన్నారు.
    "నమస్కారమండీ" అన్నాను.
    కుడిచెయ్యి నుదుటివరకూ వెళ్ళి దిగిపోయింది.
    మా యింట్లో నిద్రపోతున్న వాళ్ళంతా లేచి కూర్చున్నారు.
    బయలుదేరింది మొదలు ఇంటికి వచ్చినంతవరకూ జరిగిందంతా నాన్నగారికి పూసగుచ్చినట్లు చెప్పాను.
    చాలా సంతోషించారు. "అయితే - మళ్ళీ మైసూరు ట్రిప్ వుందన్నమాట"
    "అని అనుకుంటున్నాను. ప్రాప్తం ఎలా వుందో" అంటూనే నా దృష్టి మెట్లవైపు మళ్లించాను.
    ఎనిమిది గంటలయ్యింది.
    శ్రీశ్రీగారు పైకి వస్తున్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఉండబట్టలేక -
    "అప్పుడే వచ్చారేమిటి?" అన్నాను.
    "అప్పుడే ఏమిటి? గంటన్నరయ్యింది. జ్యోతీ పిక్చర్స్ వాళ్ళు కారుపంపారు.
    మనం వెళ్ళాలి. త్వరగా రా".
    "నేనింకా స్నానం చెయ్యలేదు" అన్నాను.
    "తర్వాత చెయ్యొచ్చు. టైం లేదు".
    "అయిదు నిముషాలు టైమిస్తారా? ముఖం కడుక్కొని వస్తాం".
    "......త్వరగా" అన్నారు.
    వారికి మా పెద్ద చెల్లెలు రమోలా కాఫీ ఇచ్చింది. నేనూ, అమ్మా ముఖాలు కడుక్కుని, బట్టలు మాత్రం మార్చి బయలుదేరాం. ముగ్గురం కారెక్కాం. శ్రీశ్రీగారు ముందు సీట్లో కూర్చున్నారు. తనతో పాటూ కొత్త కంపెనీకి నన్ను తీసుకువెళుతున్నారు, ఇంటికి వెళ్ళి గంటలో తిరిగొచ్చారు.
    ఆ ఒక్క సంఘటనే శ్రీశ్రీగారి వైపు నా మనసు లాగి, నాలో చిన్న మార్పు తెచ్చిందని చెప్పకతప్పదు.
    నిజానికి, నన్ను కొత్త కంపెనీకి తీసుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన కొచ్చే ఎమౌంట్ నాకు తెలియవలసిన పనిలేదు. మొదట ఆయన వెళ్ళి మాట్లాడుకుని, అగ్రిమెంట్ చేసి, అడ్వాన్స్ తీసుకున్న తర్వాత, నాకు ఏ విషయమైనా చెప్పవచ్చు. నిజంగా ఇంకొకరైతే, తప్పకుండా ఆ పనిచేసి వుండేవారు.
    ఆయనలో వుండే ఆ సిన్సియారిటీ, నిష్కల్మష ప్రవర్తన, నిరాడంబర జీవితం, దాపూ మూపూ ఏమీ ఎరగని పసిపాప మనస్తత్వం నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి.
    ఇటువంటి శ్రీశ్రీనా  తాగుతున్నారన్న నెపంతో దుయ్యబోస్తున్నారు. మనం పది మాటలు మాట్లాడితే ఒక్క మాటయినా సమాధానం రాదే - తప్పని సరయితే 'ఆ-ఊఁ' అన్న ధ్వని తప్ప!
    ....ఇలా అనేక ఆలోచనలతో, వారి మనస్తత్వానికీ, నిజాయితీకీ లొంగిపోతున్నానా - అనే సందేహం కలిగింది. ట్రిప్లికేన్ లో పోలీస్ స్టేషన్ కి ఎదురు సందులో మొదటి ఇంటి మేడమీద కంపెనీ!
    చాలా విశాలంగా వుంది జ్యోతీ పిక్చర్స్! పిళ్ళైగారు, జవ్వేరి - అని ఇద్దరు ప్రొడ్యూసర్లు.
    అరవవాళ్ళేమో శ్రీశ్రీగారిని చూడగానే "వాంగసార్ - వాంగ వాంగ - వణక్కం" (రండి సార్! రండి రండి. నమస్కారం) - అంటూ ఇద్దరూ ఎంతో గౌరవంగా ఆహ్వానించారు. పిళ్ళై మెయిన్ ప్రొడ్యూసర్ అని చెప్పారు.
    కృష్ణా పిక్చర్స్ వారి "మధురైవీరన్" అనే తమిళ పిక్చర్ తెలుగులోకి డబ్బింగ్ చెయ్యాలన్నారు.
    శ్రీశ్రీగారు వాళ్ళకి నన్ను "ఈమె నా అసిస్టెంట్ - సరోజ" - అని పరిచయం చేశారు.
    మాటల్లోకి దిగారు. నేను పక్కనే కూర్చొని అన్నీ వింటున్నాను. కానీ నోరు మెదపలేదు.
    మీరెంత ఇస్తారంటే, మీరెంత అడుగుతారని అనడమే కానీ డబ్బు విషయం తేల్చడం లేదు.
    ఇంతలో ప్రొడ్యూసర్లిద్దరూ ఏమనుకున్నారో ఏమో, "అయిదు నిమిషాల్లో వస్తామ"ని వాళ్ళ రూమ్ కి వెళ్ళారు.
    
                               *    *    *
    
                                            శ్రీశ్రీ మని టెక్నిక్
    
    "ఎంత అడుగుదాం చెప్పు. మనం కూడా మాట్లాడుకొని, ఒక నిర్ణయానికొద్దాం-" అన్నారు.
    నేను బిక్క చచ్చిపోయాను.
    "నన్ను అడుగుతారేమిటి?".
    "అడగడంలో తప్పేం వుంది? నా దగ్గరున్నావు. నాతో కలిసి పని చేస్తున్నావు కనక అడిగాను".
    "అయితే పదివేలు అడగండి" అన్నాను.
    "పదివేలు ఇస్తారా?"
    "ఎందుకిస్తారు? బేరాల్లో పడతాం. ఆఖరికి ఎనిమిది వేళకి దిగుదాం. అంత కన్నా చచ్చినా తగ్గొద్ద"న్నాను.
    ఇంతలో వాళ్ళు కూడా వచ్చేశారు.
    "చెప్పండి శ్రీశ్రీగారూ?" - అని పిళ్ళైగారన్నారు.
    "పదివేలు ఇవ్వండి" అన్నారు శ్రీశ్రీగారు.
    "పదివేలా? మా బడ్జెట్ అంత లేదండీ?"
    "అయితే మీరే చెప్పండి."
    "ఏడువేలు అనుకున్నాం సార్!"
    "చూడండీ, పిక్చర్ చాలా పెద్దదని - డైలాగ్స్, పాటలు కష్టమని విన్నాను. రాయడం కష్టం. అందులోనే నా అసిస్టెంట్ కి కూడా ఇవ్వాలి. ఒక పని చెయ్యండి. - మొదట పిక్చర్ వేసి చూపించండి. తర్వాత మాట్లాడుకుందాం" అన్నారు శ్రీశ్రీగారు.
    నిర్మాతలిద్దరూ ఏమనుకున్నారో, "పిక్చర్ కి ఏముంది! చూద్దాం. మొదట అగ్రిమెంట్ అయితే మంచిది కదా!" అన్నారు.
    మేమిద్దరం ముఖాలు చూసుకున్నాం.
    "మీరు ఆలోచించుకోండి. ఇప్పుడే వస్తాం" - అని మళ్ళీ వెళ్ళారు నిర్మాతలు.
    నేను వెంటనే, "ఏడువేల అయిదువందలకి తక్కువ ఒప్పుకోవద్దు" అన్నాను.
    "మరి నీకో?".
    "నాకు ఇవ్వదలచుకున్నది వాళ్ళచేతే ఇప్పించండి".
    "అయితే నీకు వేరే అగ్రిమెంట్ రాస్తారు".
    "రాయనీండి. తప్పేంవుంది? మంచిదేగా?".    
    "సరే" అన్నారు.
    కాఫీలు మళ్ళా తెప్పించారు. తాగాం. నేను కావాలనే, మమ్మల్ని కూర్చోపెట్టిన రూం వదిలి బైటకి వచ్చేశాను.
    అమ్మా, నేనూ మాట్లాడుకుంటూ మేడమీదికి వెళ్ళాం.

 Previous Page Next Page