ప్రనూష కూడా తనలాగే ఫీలవుతోందని ఇంకా తెలియలేదు అప్పటికి శ్రీచరణ్ కి.
గోడ గడియారం పన్నెండు గంటలు కొట్టడంతో, ఆలోచనల్లో నుంచి ఉలిక్కిపడ్డాడు శ్రీచరణ్.
తను ఏ పరిస్థితిలో ప్రనూషను పెళ్ళి చేసుకోవాల్సి వచ్చిందో అప్పటివరకు ఓసారి గుర్తుచేసుకున్నాడు.
బయటకు వచ్చి ప్రనూష గదివైపు చూశాడు. ఇంకా ఆ గదిలో లైటు వెలుగుతూనే వుంది.
అంటే ప్రనూషకూడా తనలానే ఫ్లాష్ బాక్ ను గుర్తుచేసుకుంటోందా? అనుకున్నాడు.
అతని ఆలోచన తప్పుకాదు. సరిగ్గా ఆ సమయంలో ప్రనూష నిద్రరావడం లేదు ప్రనూషకు. అప్పటివరకు టీవీ చూసి విసుగెత్తి కట్టేసింది.
ఆలోచనలో పడిపోయింది. విసుగ్గా వెళ్ళి కిటికీ దగ్గర నిలబడింది. తన కోరికలు, ఇష్టాలు అన్నీ గంగలో కలిసిపోయాయి.
"ఛ.... ఛ....ఈ పండు వెన్నెల రేయిలో హాయిగా భర్త గుండెల మీద తలపెట్టి పడుకొని...సరసాలాడుకుంటూ...ఉండవలసిన తను....శ్రీచరణ్ మూలంగా....
సాంప్రదాయమని...గాడిద గుడ్డని. గొంతుకు ఓ తాడుముక్క చుట్టుకుని చస్తానని బెదిరించి మరీ తనకి పెళ్ళిచేసారు.
తన పెళ్ళికి దారితీసిన పరిస్థితులు గుర్తుకు రాసాగాయి. ఆ రోజు తనకు బాగా గుర్తుంది.
"సత్యవతీ....ఒసే సత్యవతీ..." గట్టిగా కేకేసి పిలిచాడు శర్మ భార్యని.
'అబ్బబ్బ....వస్తూనే వున్నానుగా...ఏదో నేను పక్క వీధిలో వున్నట్టు అరుస్తారేంటి? వంటింట్లో నుంచి బయటకు వస్తూ అంది సత్యవతి.
"మనమ్మాయి ప్రనూషను చూసుకోవడానికి రేపు వస్తున్నారే..."
"నిజంగానా? మరీ విషయం అమ్మాయికి ఓ ముక్క చెబితే బావుంటుందేమో...
"అబ్బా.... అదెవరూ.... మన కూతురు.... రేపు చెప్పొచ్చులే...అయినా నేను పెళ్ళి చూపులకు వస్తున్నానని నీకు మీ అమ్మా నాన్నలు చెప్పారా? నేను వచ్చానా?" అని అడిగారా?" అన్నాడు శర్మ.
"అందుకే ఇలాంటి మొగుడు దొరికాడు" తనలో తనే గొణుక్కుంది. కానీ పైకి అన్లేదు సత్యవతి. "ఇంతకీ అమ్మాయెక్కడే" అడిగాడు శర్మ.
"పెరట్లో స్నేహితురాళ్ళతో గోరింటాకు పెట్టించుకుంటోంది" చెప్పింది సత్యవతి.
"ఏయ్.... ప్రనూష.... నీ చేతులు ఎంత బావున్నాయే, ఎవరైనా అమ్మాయిల బుగ్గలను ముద్దుపెట్టుకుంటారు. కానీ నీ చేతులను చూస్తే మటుకు, బుగ్గలకన్నా, ఇవే జోటర్ అని చేతుల్ని ముద్దులతో ముంచెత్తుతారు" అంది ప్రనూష ఫ్రెండ్ పావని.
గర్వంగా తన చేతుల వంక చూసుకుంది ప్రనూష. లంగా, వోణీలో" ముద్దుగా, బొద్దుగా వుంది.
పెరట్లో తులసిచెట్టు దగ్గర కూర్చొని ప్రనూష చెల్లెలు ప్రియ, ఫ్రెండ్ పావని కలిసి గోరింటాకు పెట్టుకుంటున్నారు.
"ఏయ్...ప్రనూ....ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడట. చూద్దాం. నీ అదృష్టం ఎలా వుందో..." అంది పావని.
"నాకు ముందు మంచిమొగుడు కాదు, మంచి ప్రియుడు రావాలే." అంది ప్రనూష.
"అదేంటే...ఇంట్లో ఇల్లాలు....వంటింట్లో ప్రియురాలు" టైపులో వుంది నీ కోరిక..." అంది ఆశ్చర్యంగా పావని.
'నా ఉద్దేశం ప్రియుడూ, మొగుడూ వేరువేరు అని కాదే....ముందు మంచి వ్యక్తిని ప్రేమించాలి...కొద్దిరోజులు ఒకరి మనసులోని భావాలు మరొకరు చెప్పుకోవాలి. ఒకరికొకరు అర్ధం చేసుకోవాలి.... అతన్తో కలిసి సినిమాలకు వెళ్ళాలి. ప్రేమలోని మాధుర్యాన్ని అనుభవించాలి. కొన్నాళ్ళు ప్రేమికులుగా వుండి, ఒకరికొకరు పూర్తిగా అర్ధమయ్యాక, అప్పుడు పెళ్ళి చేసుకోవాలి" అంది ప్రనూష.
"ఉహు! ఇవన్నీ సినిమాల్లో చూడ్డానికి, నవలల్లో చదవడానికీ బావుంటాయే. అయినా నీకివేం ఆలోచనలే.....అంది పావని.
"మా అక్క ట్రాకే సెపరేట్" అంది ప్రియ.
"అదికాదు పావనీ....ప్రేమంటే అదో గత జన్మబంధం చెట్టాపట్టాలేసుకొని, ఒకరి కళ్ళలోకి మరొకరు చూస్తూ, ఊసులు చెప్పుకుంటూ ఎన్నో బాసలు చేసుకుంటూ, ప్రేమంటే.... ఇదే... అన్నట్టు బ్రతకాలి, ఆ తర్వాత పెళ్ళి చేసుకోవాలి.
పెళ్ళయ్యాక తను ప్రేమని గుర్తుచేసుకొని మురిసిపోవాలి.
ప్రేమించిన వ్యక్తితో వెన్నెల్లో నడుస్తూ వెళ్ళడం ఎంత బావుంటుందో తెలుసా....
మంచులో తడుస్తూ వెళ్ళడం, ఎంత హృద్యంగా వుంటుందో నీకు తెలుసా...
ఒకటికీ ఒకటి జతయి...మనసుకు మనసు తోడయి....
రెండు రెళ్ళ అడుగులు నాలుగయి....
పచ్చగడ్డి మీద వున్న విహారికా బిందువులపై...
ఏడడుగులే కాదు...
ఒక జీవిత కాలము దూరపు భారాన్ని సైతం...
క్షణకాలంలో అధిరోహించేసి, చిటికెలో చుట్టేస్తే...అదెంత మధురం...మరెంత హృద్యం...?
గుండెలో పదిలమయ్యే భావాలు...
మనసులో ముద్రించుకునే అనుభూతులు.....
ప్రనూషలో భావుకత ఉప్పొంగింది.
అలానే ఆమెను చూస్తుండిపోయారు పావనీ, ప్రియ.
పావని, ప్రియ చప్పట్లు కొట్టడంతో తన భావుకతా ప్రపంచంలో నుంచి బయట పడింది ప్రనూష.
"వాహ్... తెలుగు సినిమా పాటలు రాయకూడదటే...ఎంత బావుందే నీ భావుకత..." అంది మనస్పూర్తిగానే పావని. సిగ్గుపడింది ప్రనూష.
తనని మెచ్చుకున్నందుకు కాదు. తనలా మరో వ్యక్తిముందు, తన భావాలతో పట్టుబడి బయటపడ్డందుకు.
"అక్కా....నువ్వు ప్రేమంటే అంత ప్రేమా...." ప్రియ అడిగింది అక్కని. ఇన్నాళ్ళూ తామిద్దరూ ఒకే ఇంట్లో వున్నా అక్క మనసులో మాట ఇలా ఎన్నడూ బయట పడలేదు.