"ఎవడ్రా.....పింజారి వెధవా....కుక్క కాలు నాకినట్టు నా కాలు తాకావు" అంటూ వంగి తుడుస్తున్న శ్రీచంద్ర ను చూసాడు. తల కిందకి ఉండడం వల్ల గుర్తించలేదు.
"సోమరి వెధవలు....దుక్కలా వుండి పనీపాటా చేతనవ్వక ఇలా బండ్లు తుడిచి డబ్బులడుక్కుంటారు" అంటూనే "ఒరే దుక్క వెధవా....కాస్త నా కాలు కూడా తుడవరా" అన్నాడు దర్పంగా.
ఆ గొంతు ఎక్కడో విన్నట్లు అనిపించింది.
"గురూ....ఆ గొంతు విన్నావా?" శ్రీచంద్ర పక్కనే చేరి లో గొంతుకతో అన్నాడు.
"విన్నట్టుందిరా"
"మరీ....ఘంటసాలో, బాలసుబ్రహ్మణ్యమో గుర్తుపట్టావా?"
"లేదురా.....ఉదిత్ నారయణ అనుకుంటా. ముక్కుతో మాట్లాడుతున్నాడు" అనుమానంగా అన్నాడు శ్రీచంద్ర.
"నేను లేకపోతే ఎలా బ్రతుకుతావు గురూ....ఆ గొంతు మన నాన్నది" అన్నాడు మెల్లగా.
ఉలిక్కిపడ్డాడు శ్రీచంద్ర "మన నాన్నదా?" అన్నాడు ఆశ్చర్యంగా.
"సారీ గురూ....మీ నాన్నది. నా బాబాయ్ ది సరేనా....వెంటనే ప్రోసిడైపోదాం."
అప్పటికే గ్రీన్ సిగ్నల్ పడింది.
ఆంగ్లో ఇండియన్ అయిదు రూపాయలు తీసింది.
అది గమనించిన గరుడాచలం "అంతోద్దు మేడమ్" ఇలాంటి అప్రాచ్యపు ముష్టి వెధవలకు రూపాయి చాలు" అన్నాడు.
సత్తిపండు ప్రమాదాన్ని పసిగట్టి ఆంగ్లో ఇండియన్ చేతిలోని అయిదు రూపాయల నోటు లాక్కున్నాడు.
* * *
"చీ....చీ.....ఇదంతా నీ మూలాన్నే వచ్చింది. పొరపాటున అయన నన్ను గమనించి వుంటే జంటనగరాల గూబగుయ్ మనేలా తిట్ల దండకం మొదలు[పెట్టేవాడు" కోపంగా అన్నాడు శ్రీచంద్ర.
"అందుకే ఆయనకు కనిపించకుండా నేను మొహానికి ....ఆయిల్ పూసుకున్నానుగా" ఓ నవ్వు నవ్వి అన్నాడు సత్తిపండు.
అప్పుడు గమనించాడు సత్తిపండు మొహమంతా ఆయిల్ జిడ్డుతో నిండి వుండడాన్ని.
"అవును గురూ....కొత్త పిన్ని బావుంది. బాబాయ్ సేలేక్షనే సెలక్షన్. ఈ పిన్నిని పెళ్ళెప్పుడు చేసుకున్నాడు గురూ" ఆసక్తిగా తలని ముందుకు పెట్టి అడిగాడు.
పక్కనే వున్న కంకరరాయి చేతిలోకి తీసుకున్నాడు శ్రీచంద్ర.
'అదేంటి గురూ...."
"చంపేస్తాన్రోయ్ కుళ్ళు జోకులేస్తే....."
"నాకేం తెలుసు గురూ....బాబాయ్ ఆవిడ భుజం మీద చేయివేసి ఎమోషనల్ గా ఫీలవుతుంటే అపార్ధం చేసుకున్నా. అద్సరే గానీ ఇంకో గిరాకి చుసుకుందామా?" అడిగాడు సత్తిపండు.
"వద్దులేరా.....అన్నట్టు ఎంత సంపాదించావ్?"
"ఎంత గురూ.....ఓ రెండొందల యాభై" అన్నాడు తాపీగా.
"అదేంట్రా.....అంత సంపాదించావా? అంత డబ్బెలా వచ్చిందిరా......నేను సిన్సియర్ గా అన్నీ స్కూటర్లు తుడిస్తే పాతిక కూడా రాలేదు. పైగా నా చొక్కా అంతా పాడైపోయింది. నీ చొక్కా తళతళలాడుతోంది. పైగా అంత డబ్బెలా...." అనుమానంగా అడిగాడు శ్రీచంద్ర.
"బుర్ర....బుర్రుండాలి గురూ....చూస్తూ వుండి నన్ను ఫాలో అవ్వు గురూ" అంటూ రెడ్ సిగ్నల్ పడ్డంతో అక్కడే ఆగివున్న జీపు దగ్గరికి వెళ్ళాడు.
కాసేపు జీపు తుడుస్తున్న బిల్డప్ ఇచ్చి తనని గమనించమన్నట్లు శ్రీచంద్రకు సైగ చేసి జీప్ డ్రైవ్ చేస్తున్న అతని దగ్గరికి వెళ్లి చేయి చాపాడు.
అతను రూపాయి కాయిన్ సత్తిపండు చేతిలో పెట్టాడు.
"ఏంటి రుపాయా? వేళాకోళంగా ఉందా? దావూద్ ఇబ్రహీం లెప్ట్ హ్యాండ్ తో పెట్టుకుంటున్నావు?" సీరియస్ ఎక్స్ ప్రెషన్ తో అని పొట్టి లాగులో చేయి పెట్టి "లోపల ఏముందో తెలుసా ఎ.కె. ౯౯ జాగ్రత్త. ఓ హండ్రెడ్ ఇచ్చి వెళ్ళిపో" ఇంకాస్తా గంభీరంగా అన్నాడు.
'ఓహో.....నువ్వు దావూద్ ఇబ్రహీం లెప్ట్ హ్యాండ్ వా?"
"అవును బే"
"మాఫ్ కీజియే సాబ్ అప్ కా పొట్టి లాగూమే క్యాహై సాబ్" డ్రైవర్ స్థానంలో వున్నతను వినయంగా అడిగాడు.
శ్రీచంద్ర ఈ సంభాషణ, సన్నివేశం చిత్రంగా చూస్తున్నాడు కళ్ళార్పకుండా.
"హై....హూ....హొ......పొట్టిలాగుమే ఎ.కె. 99 హై....హూ.....హొ....." అన్నాడు హిందీలో ఎలా మాట్లాడాలో అర్ధం కాక సత్తిపండు.
"సాబ్! ఒక్కసారి ఈ సీటు కింద చూడండి" అంటూ సీటును పైకి లేపాడు. లోపల రివాల్వర్లు, తల్వార్లు, బాంబులు ఉన్నాయి.
"మై చోటా రాజన్ కా రైట్ హ్యాండ్ హూ" అంటూ ఓ రివాల్వర్ తీసి సత్తిపండు వైపు గురిపెట్టాడు.
అంతే సత్తిపండు హడలిపోయాడు.
"గురూ...చచ్చాం" అంటూనే పరుగందుకున్నాడు.
ఎందుకైనా మంచిదని తనూ పరిగెత్తాడు శ్రీచంద్ర చేతిలో వున్న చొక్కా కిందపడేసి.
* * *
సత్తిపండు వీపు వంచి దబదబా నాలుగైదు బాదుళ్ళు బాదాడు శ్రీచంద్ర.
"ఇంక చాలు గురూ.....ఈవేల్టికి బాదుడు ప్రోగ్రాం ఆపేయ్. లేకపోతే కాపడం పెట్టడానికి ఓ సింగిల్ వైఫ్ కూడా లేదు" ఆఅన్నాడు సత్తిపండు.
సత్తిపండు ప్యాట్ని సెంటర్ నుంచి పారిపోయి ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చాడు.
అతడ్ని అనుసరిస్తూ వచ్చిన శ్రీచంద్ర దినికంతటికి కారణమైన సత్తిపండును కసిదీరా కొట్టాడు.
"ఒరేయ్ ...చీ...చీ....నన్నేంట్రా పిచ్చికుక్కలా పరిగెత్తించావు. ఆ గడ్డం గాడు తల్వార్ తీసుకుని ఎక్కడ నా వెంటపడి తల కసుక్కున నరికేస్తాడేమోనని భయపడ్డా" సత్తిపండును కొట్టి కొట్టి ఆయాసంతో ఉగిపోతూ అన్నాడు శ్రీచంద్ర.
"ఎందుకంటావ్ గురూ" తాపీగా అడిగాడు సత్తిపండు.
కోపంగా చూశాడు శ్రీచంద్ర.
"నాకూ భయమేసింది గురూ. హమ్మో....వాడెక్కడ రివాల్వర్ డాం.....డాం అని పేలుస్తాడేమోనని భయపడిపోయా. అయినా గురూ....నేనైతే పొట్టిలాగువాడ్ని. సిగ్గు ఎగ్గూ లేకుండా పారిపోయా. నువ్వేంటి గురూ.....నీ డిగ్నిటి......భలే పారిపోయోచ్చావు. అచ్చు బాబాయ్ బూతులు తిడుతుంటే కూడా ఇలాగే పారిపోయేచ్చేస్తావు....అది తలచుకుంటే నువ్వోస్తోంది గురూ" అని నవ్వసాగాడు.