"ఎవరో ఆ మనిషి?"
శకుంతల "నాతో కంప్లెయింట్ చేయటానికి వచ్చారా? ఇంకా విపులంగా చెబుతున్నాను, నేనే!" అంది.
అతడు అమితాశ్చర్యంగా ఆమె కళ్ళలోకి చూస్తూ "అదేమిటి? మీకంత అవసరం ఏమివచ్చింది?" అన్నాడు వ్యాకులపాటుతో.
అతని ఆశ్చర్యాన్ని సహించటం కాగా "ఏ మాత్రం దయ, క్షమవున్న ప్రతివారూ అవతలివాళ్ళ కష్టసుఖాలను విచారించటానికి ప్రయత్నిస్తారు. చేతనయితే సహాయం చేయటానికి కూడా ప్రయత్నిస్తారు. ఈ మాత్రందానికి అంతగా ఆశ్చర్యపడటం దేనికో?" అంది.
"అయితే నా కష్టసుఖాలు విచారించటానికి మీరు పూనుకున్నారన్నమాట."
దీనికి సమాధానం చెప్పటం ఏమాత్రం ఇష్టంలేక శకుంతల తల ప్రక్కకు తిప్పుకుంది.
ప్రకాశరావు తను మీ చేతగాని స్థితిలో వున్నట్లు ఎడమకాలిని నేలకేసికొట్టి కష్టంగా "మీ రెప్పుడూ ఇంతే, నా కర్థంకాని పనులు ఏవేవో చేస్తారు. మీ ఆంతర్యం గ్రహించటానికి నా బుర్ర బద్దలు కొట్టుకోవాలి" అని కళ్ళు రకంగా పెట్టాడు.
శకుంతలకు ఈ మాటలు, చేష్టలు నవ్వు తెప్పించాయి. కానీ ఆ సమయంలో నవ్వటం భావ్యంకాదు. పెదాలవెనక నవ్వును దాచిపెట్టుకుంటూ "మీరంత
నొచ్చుకుంటారు దేనికి? నే నేం చేశానని?"
" మీరేం చేశారో, నే నెందుకింత బాధపడుతున్నానో నా స్థితిలో మీరుంటేగాని మీకుఅర్థంకాదు. ఇంతకీ నేను......" తన స్థితిని గురించి నోరు జారబోతుండగా అతని పెదాలు వణికాయి. అతని కళ్ళలో కనిపించీ కనిపించనట్లుగా నీళ్ళు నిండాయి. గాద్గదికంగా అన్నాడు "మీరు చాలా తెలివిగలవారు. అమాయకుల్ని చేసి ఆడించటం మీకు చాలా సరదా, మీకంత కష్టంగా వుంటే చెప్పండి - ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను.
అతనలా బెదిరించటంచూస్తే శకుంతలకి కొద్దిగా కోపం వచ్చింది. అయినా అణిచి పెట్టుకుంటూ "మీరు ఈ ఇంట్లో వుండలేనంతటి మూర్ఖంగా ప్రవర్తించామా మేము?" అంది పౌరుషంగా.
"కాదు. నన్ను మూర్ఖుడ్ని చేస్తున్నారు."
ఆమె ఈసారి కొంచెం కటువుగా "ఇంతకీ మీరనేదేమిటో కొంచెం విపులంగా చెప్పండి మహాశయా!" అంది.
ఆమె చాలా అనేసరికి ప్రకాశరావు నీళ్ళు నములుతూ "అనేందుకేముంది! నన్నిలా ఇరకాటంలో పెట్టి చంపవద్దని ప్రార్థిస్తున్నాను."
"మిమ్మల్ని అంత ఇరకాటంలో పెట్టిందీ మీ హృదయాన్ని గాయ పరచిందీ అయిన విషయం ఏమిటో చెప్పండి బాబూ. ఇందాక బజారు కెళ్ళాను అవీ ఇవీ కనిపిస్తే తీసుకోవాలనిపించింది. తీసుకున్నాను, దానికింత రాద్ధాంతం దేనికి?"
ప్రకాశరావు తడబడి అన్నాడు. "సరే మీకు బుద్దిపుట్టింది -అలా చేశారు కాని - - - నా ఇష్టాల ప్రమేయం లేకుండా అంతా మీ ఇష్టమే నన్నమాట? అవతల మనిషి మీరు చేస్తున్నా పనిని ఏ విధంగా అర్థం చేసుకుంటాడో ఆలోచించుకోవద్డా?"
దీనికి శకుంతల వెంటనే సమాధానం చెప్పింది. "అవతల మనిషి ఇంత తెలివైన వాడనీ, ఒక చిన్న సంఘటనని గురించి ఆలోచించి పోగులు తీసినట్లుగా అనేక ఆలోచన్లతో సతమతమయ్యేటంత సెన్సిటివ్ అనీ ముందే తెలిసివుంటే, ఈనాడు శకుంతల ఈ పని చేసేదిగాదు. కాని ఆమె పొరపాటు చేసిందని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటోంది."
"మీరు నన్ను వెర్రివాణ్ని చేస్తున్నారు. అద్దె చెల్లించకుండా, మీ ఖర్చుమీద మీ ఇష్టప్రకారం బ్రతకమంటారా చెప్పండి? అది మీకేమైనా ధర్మంగా తోస్తున్నదా? వెనకటికి కూడా ఒకసారి లాండ్రీవాడికి డబ్బులు మీరే ఇచ్చి నన్ను చాలా కించపరచారు"
శకుంతల కోపం మానుకుని గట్టిగా నవ్వుతూ "మీరు మాకు ఏమైనా బాకీపడితే ప్లీడరయ్యాక సంపాదించి చెల్లిద్ధురుగానిలెండి" అంది.
ఎట్లా అయినా ప్రకాశరావు ఈరోజు లోపల్నుంచి పెల్లుబుకుని వస్తున్న ఉద్రేకాన్ని అణచుకోలేక పోతున్నాడు. శకుంతల జాలిచూపులు, చిరునవ్వులు అతన్ని ఏ మాత్రం శాంతాక్రాంతుడ్ని చేయలేకపోయాయి. అంతులేని అవమానంతో ఉద్రేకంతో అతని శరీరం కంపించసాగింది. ఆమె నిజంగా తనని అవమానిస్తున్నదని అతననుకున్నాడు.
"మీరనుకున్నంత గతిలేనివాడ్ని కాను, ఎంత మీ అద్దె సకాలంలో చెల్లించకపోయినా, పసతులులేక బాధపడుతున్నా నాకూ ఆత్మాభిమానం వుంది. నేనేం ముష్టివాడ్నికాదు.'
ప్రకాశరావు ఈ మాటలు బయటికి అంటే యేమయ్యేదో తెలీదు. అతను అందామనుకుని, అదే క్షణంలో తనని తాను విమర్శక దృష్టితో చూచుకుని తన ప్రవర్తనకి, తన ధోరణికి తనే అసహ్యం చెందాడు. అతని క్రోధం చల్లారలేదు, కాని ఎంతైనా శకుంతల ఆమె చేసిన పని ఎటువంటిదైనా ఆమె హృదయాన్ని అంత తీవ్రంగా గాయపరచటం న్యాయంగా తోచలేదు అతనికి.
"మీరు ఊరికినే ఆవేశపడకండి. మీరింకా స్వతంత్రులు అనుకుంటున్నారేమో; పెద్దవారు మీ తండ్రిగారు వున్నారని మరచిపోకండి. వారికి ఈ విషయం తెలీదుగా! తెలిస్తే ఆయన ఏమనుకుంటాడో, ఎంత ఆవేశపరుడౌతాడో ఆలోచించండి. ఆయన సమ్మతిలేకుండా మీరు......"
శకుంతల ముఖం ఎర్రబడిపోయింది. కళ్ళు రక్తారుణ కాంతితో ప్రకాశించాయి. అవమానంతో, ఉక్రోషంతో ఆమె హృదయమంతా నిండిపోయి, ఒక్కసారి నిలువునా వణికింది. అదురుతున్న పెదాలు విప్పి ఏదో అనబోయింది. కాని ఆమెకు సాధ్యంకాలేదు. పొంగి వస్తూన్న దుఃఖాన్ని ఆమె ఆకట్టుకోలేకపోయింది. ఆమె రెండు చేతులతో ముఖాన్ని కప్పుకుని లోపలకు పారిపోయింది.
ప్రకాశరావు తెల్లబోయి చూస్తూ నిల్చున్నాడు. తను పలికిన వాక్యాల్లో శకుంతలను అంతగా గాయం కలిగించిందేమిటో అతనికి అర్థం కాలేదు. ఇరుకులో పడిపోయినట్లు భావిస్తూ వెనక్కి తిరిగి రెండు మూడు అడుగులు వేశాడు. ఈ జరిగిన సంఘటన వల్ల అతనికి ఏమాత్రం ప్రశాంతంగాలేదు. ఎంతో చిరాకుగా వుంది. ఇటువంటి కష్టం కలిగించే రోజులు వచ్చినప్పుడు అతడు వెర్రిగా 'భగవాన్? ఈ జీవితంలో, ఉహుఁ.... ఈ ప్రపంచంలో ఈ రోజు అనేది లేకుండా చేస్తే యెంత బావుండేది?' అనుకునేవాడు ఇదేమాట అనుకున్నాడు.
కొంచెంసేపు అతనక్కడే తచ్చట్లాడాడు. తర్వాత ప్రశాంతంగా ఉండేందుకు బయటికిపోయి కొంతసేపు అటూ, ఇటూ తిరిగివద్దామనే ఉద్దేశ్యంతో బయట ద్వారంవేపు రెండడుగులు వేసేసరికి టక్ టక్ మని బూట్ల చప్పుడు చేసుకుంటూ రామారావుగారు లోపలకు వస్తున్నారు. ఆయన ప్రకాశాన్ని చూసి "ఇక్కడే నిలబడి వున్నారేం?" అని అడిగారు.
ప్రకాశరావు కష్టంగా "ఏమీ లేదండీ" అని గొణిగాడు.
"శకుంతల ఏం చేస్తోంది?"
"ఏమో?" హీనస్వరంతో అన్నాడు.
రామారావుగారు సరాసరి బూట్లయినా విప్పకుండా లోపలకు వెళ్ళిపోయారు కూతుర్ని పేరుపెట్టి పిలుస్తూ. ఆయన వచ్చేసరికి శకుంతల తన గదిలో పందిరి మంచంమీద పడుకొని దిండులో తలదాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ గోచరించింది. ఆయనకు గుండెలో ముల్లుగుచ్చుకున్నట్లవగా ప్రక్కనే కూచుని జుట్టు నిమురుతూ "ఎందుకు తల్లీ యేడుస్తున్నావు?" అని అడిగాడు.
శకుంతల జవాబు చెప్పలేదు. తండ్రి కంఠస్వరం విని ఇంకా కొంచెం ఎక్కువగా ఏడవసాగింది. ఆయన బలవంతంగా కుమారై ముఖం తనవైపు త్రిప్పుకుని మళ్ళీ అడిగాడు.
"నాన్నా" అంటూ ఆయన ఒళ్ళో తలపెట్టుకుని బావురుమంది కూతురు. రామారావుగారి గుండె ద్రవించింది. శకుంతల కంట తదిపెడితే ఆయన ఏ పరిస్థితిలోనూ చూడలేరు.
ఆయనెంతో బుజ్జగించిన మీదట శకుంతల కళ్ళు తుడుచుకుని "ఆడదయి పుట్టటంవల్ల మంచని తోచిన పనికూడ చేయకూడదనే నిబంధన మన సమాజంలో వుందాండి నాన్నా?" అని అడిగింది అతి కష్టంమీద మాట పెగల్చుకుంటూ.
"ఎవరన్నా రమ్మా?" అన్నాడు తండ్రి ఆశ్చర్యంగా. "ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. నే నెడయినా పరులకి ఉపకారం కలిగే పని చేసినప్పుడు అందులో కల్మషం వుందని మీరు విశ్వసిస్తారా నాన్నా?"
రామారావుగారికి ఏమీ పాలుబోక "నా విషయం తెలుసుండీ నువ్విలాగ అంటే యేం చెప్పేది?" అసలు జరిగిందేదో చెప్పవూ?" అన్నాడు.
శకుంతల కొంత ప్రయత్నంమీద జరిగిన విషయం చెప్పింది. తరువాత "మీరు నాకు చిన్నప్పట్నుంచీ ఎటువంటి ఉపదేశాలు ఇచ్చేవారు? మన ఇంట్లో వుండి ఇబ్బంది పడుతున్నవారికి ఆ మాత్రం సహాయం చేయకూడదా? అందులో తప్పు ఏముంది?" అంది.
రామారావుగారికి కుమారై చేసింది సబబైనపనో కాదో తెలుసు. ఆమెను ఓదారుద్దామనే ఉద్దేశ్యంతో "పిచ్చి తల్లీ! ఇంత చిన్న విషయానికేనా బాధపడ్డావు? నువ్వు చేసినపని తప్పని ఎవరన్నారు? అలా యెవరైనా అనుకుంటే అది కేవలం భ్రమ" అన్నాడు.
"అలా అయితే ఆ విషయం వారితో చెప్పిండి నాన్నా! ఆయన్ని వోప్పించండి. అప్పటిదాకా నేను మాట్లాడను వారితో" అంది ఆమె మెల్లగా ఇవతలకి జరుగుతూ.
ఆయన లేస్తూ "అలాగే. కాని నువ్వు డ్రెస్ చేసుకొని రెడీ కావాలి. ఇవాళ మంచి డ్యాన్సు ప్రోగ్రాం వుంది. టిక్కెట్లు తీసుకొన్నాను" అన్నాడు.
"నాకు రావాలని లేదు నాన్నా."
ఆయన తల అడ్డంగా వూపుతూ, సున్నితంగా "ఉహూఁ నీకోసం వెడదామని నే ననుకొన్నాను. నాకోసం నువ్వు రావాలి. ప్రకాశరావుగారు కూడా వస్తారు. ముగ్గురికి టిక్కెట్స్ కొన్నాను" అంటూ ఆయన బయటికి వెళ్ళిపోయారు.
ప్రకాశరావు వీళ్ళతో రావటానికి మొదట ఒప్పుకోలేదు. అలా అనటంలో రాకూడదని అతని అభిప్రాయం ఎప్పటికీకాదు. మొదట్నుంచి పీడిస్తున్న అనుమానమే ఇప్పుడూ పీడిస్తోంది. అందులోనూ ఈ వేళ జరిగింది మామూలు విషయం కాదాయే! పైగా రామారావుగారిదాకా పోయింది. ఆయనవచ్చి తనను సమాధాన పరచబోవటం, తను సిగ్గుపడటం అదంతా ఇంకా కొంత లేనిపోని గొడవ. అసలు ఆయన ప్రక్కన నిలబడి మాట్లాడగల తాహతు తనకుందా అని ప్రకాశరావు అనుమానం! అటువంటిది శకుంతల తనతో చనువుగా మెలగటం, అవసరంవస్తే ఉపచర్యలు చేయటం రామారావుగారు శ్రద్ధతీసుకొని కబుర్ల చెబుతూ వుండటం ఇవన్నీ కలలో జరిగే విషయాలలాగ తోచాయి. ఆయన అన్నిట్లోనూ తనకన్నా పెద్దవాడు. రమ్మని పిలుస్తుంటే ఒకటి రెండుసార్లు కంటే ఎక్కువగా వాదించటం ప్రకాశరావుకు చేతకాక పోయింది. అంగీకరించక తప్పలేదు. అంతలో శకుంతల రెండు కప్పులతో కాఫీ తెచ్చి అక్కడి బల్లమీద పెట్టి మాట్లాడకుండానే వెళ్ళిపోయింది.
కనుచీకటి పడుతుండగా ముగ్గురూ బయలుదేరారు టాక్సీలో. ప్రోగ్రాం జరిగేచోటికి చేరుకొన్నారు. సరిగ్గా ప్రోగ్రాం ప్రారంభం అవుతుండగా లోపలకుపోయి కూర్చున్నారు. ఈలోగా శకుంతలా, ప్రకాశరావు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఇద్దరి మనస్సుల్లోనూ ఏదో అవ్యక్తమైన ఆందోళనగానే ఉంది. హాల్లో కూర్చున్నాక శకుంతలే అతనివంక ఓసారి ఓరగా చూసింది. ప్రకాశరావు మామూలుగా ఇటువంటి ముఖ్యావసరాల్లో వేసుకునే దుస్తులు వేసుకున్నాడు. తండ్రి దుస్తులలో అతనిని లోలోపలే ఒకసారి పోల్చుకుంది. అతని అమాయకమైన ముఖాన్ని చూస్తుంటే కలుగుతున్న ఈ అనుభూతే అతనిమీద అంతకు ముందువున్న సర్వకోపాన్ని హరింపజేస్తోంది. తల త్రిప్పుకొని మెల్లగా నిట్టూర్చింది.
అటూ - ఇటూ కూర్చున్న యువతీ యువకులు ఇద్దరూ మాట్లాడకుండా కూర్చోవడంచేత యెక్కువగా మాట్లాడవలసిన అవసరం రామారావుకు కలిగింది. అసలే ఆయన మాటకారి. ఆయనకు తెలియకుండానే తన ఛలోక్తులతో యీ ఇరువురి హృదయాల్తో దోబూచులాడుతున్నా, చీకటి ఛాయల్ని పారద్రోలటానికి ప్రయత్నించాడు.
ప్రకాశరావుకి సహజంగా ఇటువంటి వినోదాలంటే ఇష్టం ఈ సందర్భాలు యెక్కువగా తటస్థించలేదు. అతను పట్టించుకోనూలేదు. తను ఇలా రావటాన్ని చూస్తే తనని ఎరుగున్నవారు ఏమని తలపోస్తారో అని భయంగానే ఉంది.