Previous Page Next Page 
పెంకుటిల్లు పేజి 18


    ఆమె కళ్ళనిండా  నీళ్ళు నిండాయి. కుర్చీలోకి వచ్చి కూర్చుని, ముందున్న బల్లమీద రెండు మోచేతులూ ఆనించి అరచేతుల్తో ముఖం వుంచుకొని ఆలోచించసాగింది.

    ఏమిటి యీ మనిషి? ఇంత నిరాడంబరంగా, నిర్వికారంగా యెలా ఉండగలుగుతున్నాడు? ఎక్కడో వున్న తనవారి  స్థితిగురించి యెంతయినా మనస్సులో పెట్టుకుంటాడేగాని ఆప్తురాలిగా ప్రవర్తిస్తున్న తనతో మాట వరసకైనా చెప్పడేం? అవన్నీ మనసులో ఉంచుకొని సహించగలుగుతున్నాడా? అతనికి ఎంత తక్కువ డబ్బు వాళ్ళు పంపించేదీ తనకు తెలుసు. ఈ కొంచెం ధనంతో జీవితాన్ని నెట్టివేయడం అసంభవం రోజూ సరిగ్గా భోజనం కూడా చేస్తాడోలేదో తనకు తెలీదు.

    శకుంతల హృదయమంతా జాలితో నిండిపోయింది. తన ముందు అతను రహస్యంగా వుండనవసరం లేదని యిందాక అన్నాడు. కాని ఆ మాట నిజంకాదు. తన బాధల్ని కప్పిపుచ్చుకావాలనీ, నిశ్చింతగా పైకి కనబడాలని అతను సదా ప్రయత్నిస్తున్నాడు. తనతో అతను అబద్దాలు చెప్పటం లేదన్నమాట నిజమేకాని నిజం కూడా చెప్పటం లేదన్న మాట అబద్ధం కాదు.

    ఆలోచిస్తున్న కొద్దీ ఆమె గుండె కరిగిపోసాగింది. ఆ సమయంలో ఆమె ఊహలు ఒక ఉత్తమమయిన, ఉన్నతమయిన స్థాయిలో విహరించాయి. రోజూ చూస్తున్న ఈ పరాయివూరి పేదవాళ్ళ అబ్బాయి, వివివ్ద రకాలుగా ఆమె కళ్ళముందు రూపు ధరించాడు. ఏ విధంగా చూసినా అతనంటే ఏ రూపంలో చూసినా ఆమెకి జుగుప్సాభావం కలగటల్లేదు. ఆ వ్యక్తిని అదుపాజ్ఞలలో పెట్టాలనీ, ఇతనికి ఏలోటూ రానీయకుండా కాపాడుతూ వుండాలని ఆమె నిశ్చయించుకొంది.

    మెల్లగాలేచి బయటకు వచ్చి తలుపులు వేసింది. ఇందాక బల్లమీద ప్రకాశరావు పెట్టిన మూడు ఐదు రూపాయల నోట్లూ అలాగే వున్నాయి. ఏదో తోచి అవి తీసుకొని మళ్ళీ గదిలోకి వెళ్ళి పెట్టెలో ఒకమూల పెట్టి వచ్చింది. వంటమనిషీ, పనివాడూ తప్ప ఇంట్లో ఎవరూ లేరు. దృఢనిశ్చయంతో తన గదిలోకి వెళ్ళి, హ్యాండ్ బాగ తీసికొని బయటకు వచ్చింది. ఆమె ముఖం అప్పుడు వింత తేజస్సుతో వెలిగిపోతోంది. అంతవరకూ లోపల ఏదో పనిచేస్తున్న రంగయ్య ఆమెకు ఎదురుగావచ్చి "ఎక్కడికమ్మా?" అని ప్రశ్నించాడు.
   
    "బజారుకు వెళుతున్నాను రంగయ్యా, ఇంట్లో వుండు జాగ్రత్తగా అంటూ చెప్పులు తొడుక్కొని విసురుగా బయటకు వెళ్ళిపోయింది శకుంతల.

    ఆమెకు యెక్కువగా బజార్లో తిరగటం అలవాటులేదు. ఎంతో అవసరం వుంటేగాని వెళ్ళదు. అదైనా యెక్కువగా తండ్రితోనే వెడుతూ వుండే అలవాటు. ఆమె స్వభావానికి ఎక్కువగా తిరగటం సరిపడదు. అందుచేతే రెండేళ్ళు నాలుగుమైళ్ళ దూరంలోవున్న కాలేజీలో చదివినా మిగతావాళ్ళకి పట్టుబడిన అభ్యాసాలు యీమెకు పట్టుబడలేదు. అదీగాక చిన్నప్పటినుంచీ నిరాడంబరంగా అలంకరించుకోవటం, మితిగా ప్రవర్తించటం ఆమె అలవర్చుకుంది. ఇటువంటి స్వభావం యెక్కువగా చదువుకున్న వాళ్ళకి గిట్టకపోవచ్చు. అందుచేతనే అక్కడక్కడా స్నేహితులు వున్నా వాళ్ళ ఇంటికి తను పోవటంగానీ, తన ఇంటికి వాళ్ళు రావతంగానీ తరచుగా సంభవించదు.

    ఇవ్వాళ్ళ బస్సులో ఒక స్నేహితురాలు తారసపడింది. శకుంతల ఆమెనుచూసి చిరునవ్వు నవ్వి పలకరించింది.

    "ఈ మధ్య బొత్తిగా కనపడటం మానేశావు" అందామె.

    శకుంతల నవ్వి "ఏం చేయను? నాకు అన్నీ చేద్దామని వుంటుంది. ఏమీ చేయలేకపోతాను" అంది. ఈ మాట అంటున్నప్పుడు ఆమెకు ఒక బెంగాలీ రచయిత అన్న సూక్తి గుర్తుకు వచ్చింది. "ఎక్కువ తీరిగ్గా వున్నప్పుడే మనం ఏ పనీ చేయలేకపోతాము. తీరిక లేనప్పుడు ఎలాగో తీరిక చేసుకొని ప్రతి పనీ చేయగలుగుతాము."

    "మనం కలుసుకుని ఎన్నాళ్ళయింది" అని అడిగింది అవతలి ఆమె.

    శకుంతల ఆలోచించి "ఏమో, ఐదునెలలు కావచ్చు."

    ఆ అమ్మాయి శకుంతల క్లాసుమేటు కాదు. జానియర్ .ఏదో సందర్భంలో ఇద్దరికీ ఒకసారి పరిచయం ఏర్పడ్డది. శకుంతల ఆమెతో స్నేహం పెంపొందించుకుందామని ప్రయత్నించకపోయినా ఆమె యీమెని విడిచి పెట్టలేదు. శకుంతల దగ్గరవున్న కొని సుగుణాలు ఆమెకు నచ్చాయి.

    "మా ఇంటికి రేపు ఒకసారి వస్తావా?" అనడిగింది.

    "నువ్వే వద్దూ."

    శకుంతలకు టిక్కెట్ ఆమె తీసుకుంది. ఆమె ఇప్పుడు కాలేజీకి పోతోంది. సెలవు తీసుకుని మధ్య దార్లో దిగిపోయింది. పారిస్ కార్నర్ చేరేవరకూ శకుంతల ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా కూర్చుని అక్కడ దిగిపోయింది.

    తిరిగి ఆమె వచ్చేసరికి ఒంటిగంట దాటింది. అంటే ఇంచుమించు రెండు గంటలసేపు బయట గడిపిందన్నమాట. ఆమె చేతిలో ఏదో కాయితపు పొట్లాలు వున్నాయి. ఆమె వచ్చేసరికి రంగయ్య కునికిపాట్లు పడుతూ హాల్లో గోడకి జారగిలబడి కూర్చుని వున్నాడు. శకుంతల వచ్చిన చప్పుడుకు లేచి నిలబడి "ఏమిటమ్మా ఇవన్నీ?" అని అడిగాడు.

    శకుంతల మాట్లాడకుండా హాలు మధ్యగావున్న బల్లమీద అవన్నీ పెట్టి- విప్పి చూపించింది. "ఎలా వున్నాయి?" అని అడిగింది.

    రంగయ్య ఆశ్చర్యంతో "ఎవరికమ్మా ఇవన్నీ? బాబుగారికి మీరు  తెచ్చే అలవాటు యెప్పుడూ లేదే" అన్నాడు.

    శకుంతల నవ్వుతూ "ఏ బాబుగారికి? ప్రకాశరావు బాబుగారికి!" అని జవాబు చెప్పింది.

    రంగయ్య తెల్లమొహం వేసి "అలా యెందుకు అమ్మగారూ?" అని అడిగాడు.

    శకుంతల వాడి ముఖం వంక సూటిగా చూసి "రంగయ్యా! నేను చేసిన పని మంచిదంటావా? కాదంటావా?" అని ప్రశ్న వేసింది.

    వాడు మూసిముసిగా నవ్వి మీరు చేసిన పనేమిటో నాకు తెలవందే యెలా చెప్పేదమ్మగారూ?" అన్నాడు.

    ఆమె తన పొరపాటు తెలుసుకుంది. ఒక రకం ఉద్రేకంతో ఏదో చేసివేసినా ఆ చేసింది సబబైనా పనేనా అని ఇప్పుడు కొంచెంగా ఆలోచించసాగింది. ఆమె ఎటూ నిర్ణయించుకోలేకపోయింది. మంచి పనో కాదో తెలుసుకునేపాటి యుక్తాయుక్త జ్ఞానం ఆమెకా సమయంలో లేకపోయింది. కాని సాధారణంగా ప్రతివారికి, ఎంతో అమాయకురాలు అయితే తప్ప తాము యెటువంటివారో, తాము చేసిన పనులు యెటువంటివో ఒక నిశ్చితాభిప్రాయం వుంటుంది. దాన్నే ఆత్మవిశ్వాసం అని కూడా  అనవచ్చు. అయితే శకుంతలలాగే ఆ ఆత్మవిశ్వాసం కోల్పోయే స్థితికి ప్రతివారూ యెప్పుడో ఒకప్పుడు రాకమానరు.

    ఆమె రంగయ్యతో అంది "నే నెటువంటిదాన్నో నీకు తెలుసుగా రంగయ్యా! నా ప్రశ్నకు కరెక్టుగా సమాధానం చెప్పాలి."

    "కరెక్టుగా చెబుతానమ్మగారూ."

    శకుంతల తన స్వభావాన్ని ఇన్నాళ్ళుగా వాడు అర్థం చేసుకునే వుంటాడనే నమ్మకంతో భారమంతా వాడిమీదే తోసివేస్తూ "అది కాదు. ఆయన మన ఇంట్లో వుంటున్నాడు. సరిగ్గా భోజనం వుండక, బట్టలు లేక బాధపడుతుంటే చూస్తూ యెలా ఊరుకోమంటావు చెప్పు. ఇవాళ ఓసారి ఆయన గదిలోకిపోయి చూసేసరికి గుండె ఫేలయిపోయింది. మన ఇంట్లో వుంటున్న వారి సంగతి మనం కనుక్కోవాలంటావా? అక్కర్లేదంటావా?" అని గబగబా అనేసింది.

    "ప్రకాశంగారి సంగతా?"

    "ఊఁ, నీ కెంతకీ అర్థం కాదేం ఖర్మ?" అని శకుంతల విసుగ్గా జవాబిచ్చింది.

    హనుమంతుడిలాంటి ఈ బంటుకు విషమ సమస్య ఒకటి వచ్చిపడింది. జవాబు ఏం చెబుదామా అని కొంచెంసేపు ఆలోచించాడు. శకుంతల ముఖ కవళికలు చూసేసరికి వాడు చెప్పదలుచుకుంది చెప్పలేకపోయాడు. బుర్ర గోక్కుంటూ "ఎందుకు కాదమ్మా? అవశ్యం కనుక్కోవలసిందే" అన్నాడు.

    శకుంతల వాడి భుజంమీద చిన్న దెబ్బవేసి సంతోషంతో "ఉన్న మాట చెప్పావు రంగయ్యా. ఎంత మందమతివైనా కొన్ని కొన్ని విషయాల్లో నీ బుర్ర బాగా పనిచేస్తుంది." అని గబగబా లేచి ప్రకాశరావు గది తలుపులు తీసి, తీసుకువచ్చినవన్నీ అందులో చక్కగా సర్దివచ్చింది.

    ఆ మధ్యాహ్నం మనస్సంతా చాలా నిర్మలంగా, హాయిగా వున్నట్లు భావించి, ఆనందం పొందింది శకుంతల. ఆకస్మికంగా ఆవరించిన ఆనందం తాలూకు మైమరపుతో తను చేసిన చొరవకు ఆశ్చర్యం చెందలేదు. గదిలో వుంటున్న ఈ మిత్రుని స్థితిగతులు ఇన్నాళ్ళూ విచారించలేదే అని ఇందాక కలిగిన బాధ ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయింది. చేసేపని ఏమీ ఉండకపోవటంవల్ల రోజూ మధ్యాహ్నం ఒక గంటసేపు నిద్రపోయే అలవాటు ఆమెకు వుంది.

    తను సోమరినేమో అని అప్పుడప్పుడూ సిగ్గుపడేందుకు కూడా కారణం అదే. కాని ఆరోజు ఆమెకు నిద్రకూడా పట్టలేదు. ఊరికనే పరుపు మీద పడుకొని మృదువైన తన రెండు చేతులతో ముఖాన్ని కప్పుకుని, వ్రేళ్ళ సందునుండి పైకప్పువంక చూస్తూ తన చిలిపితనానికి తనే నవ్వుకోసాగింది. తను రోజులా నిద్రపోలేదన్న విషయంకూడా ఆనాడు శకుంతల విస్మరించిందంటే నిజంగా యెంత వింతపడాల్సిన సంగతి!

    సాయంత్రం ఐదుగంట లయ్యేసరికి శకుంతల అప్పుడు మధ్యాహ్నం రెండోసారి కాఫీ త్రాగి పందిరిమంచంమీద బోర్లాపడుకుని ఓ ఇంగ్లీషు నవల చదువుకుంటోంది. ఇంతలో వీధి తలుపు తీసిన చప్పుడయింది, ఆమె నవలా ధ్యాసలోవుండి అంతగా పట్టించుకోలేదు కాని గది తలుపులు తీస్తున్నట్టూ, తెరచినట్టూ, శబ్దాలు వినిపించేసరికి ఆమె చదువుతున్న పుస్తకం ఒక ప్రక్కకు నెట్టి కూర్చుంది. హృదయం ఎందుకో జలదరించగా, ఏదో సిగ్గుతెరలు క్రమ్మినట్లు అయి లేవబోయికూడా, అశక్తురాలై ఆలోచిస్తూ వుండిపోయింది. ఒకటి....రెండు మూడు నిమిషాలు గడిచాయి. హాల్లో అడుగుల చప్పుడు క్రమక్రమంగా దగ్గరకు వచ్చి ఒకచోట ఆగిపోయింది.

    "శకుంతలగారూ!"

    ఈ కంఠంలో కాఠిన్యం విని శకుంతల బెదురుతూ నిల్చుంది.

    ఆ పిలుపు మళ్ళీ వినబడింది. ఆమె లేచి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ హాల్లోకివస్తూ, బయట అతన్ని చూసి గుమ్మందగ్గరే ఆగిపోయింది.ప్రకాశరావు మ్రాన్పడిపోయి, వ్యాకులపాటును సూచిస్తున్న వదనంతో నిలబడి వున్నాడు.

    "ఏమిటి?"

    "చూడండి. ఆ గది ఇంకా నా క్రిందనేవుందా? లేకపోతే వేరే ఎవరికైనా ఇచ్చారా?"

    శకుంతల ఒక్కసారి విద్యుత్ ఘాతం తగిలినట్లుగా అయి అతని ముఖంలోకి తేరిపార చూసింది. కాని నిర్మలంగా, అందంగా వున్న అద్దం ముక్కలయి గాజుపెంకులుగా మారిపోయినట్లు అతని ముఖంలో గుర్తుపట్టలేనన్ని భావాలు గోచరించేసరికి వాటిలో ఎవోక్క చిహ్నాన్నీ అవగాహన చేసుకోలేక, శకుంతల తలవంచుకుని "ఆ గది మీదే" అంది.

    ప్రకాశరావు దృఢంగా "కాని అందులో నా సామగ్రికన్నా ఎక్కువగా యేమేమిటో కనిపిస్తున్నాయి!" అన్నాడు.

    "గదిలోని వస్తువులన్నీ మీవే."

    అతను తడుముకోకుండా "అయితే ఇలా ఎందుకు జరిగింది?" అని ప్రశ్నించాడు. ఆమె తెల్లబోయి ప్రకాశరావు ముఖంలోకి చూస్తూ "కానిపని ఇక్కడ ఏం జరిగింది?" అంది.

    "పొద్దున్న ఈ బల్లమీద పెట్టి వెళ్ళిపోయిన డబ్బు తిరిగి నా పెట్లోకి యెలా వచ్చిందో కాస్త చెబుతారా?"

    "ప్రాణంలేని వస్తువు ఎలా లేచి వస్తుంది? ప్రాణం వున్న మనిషి చేతులతో తీసుకుపోయి పెడితే అక్కడ అవతరిస్తుంది."        

 Previous Page Next Page