Previous Page Next Page 
త్రినేత్రుడు-2 పేజి 19


    బి.డి. గార్ వేర్- గార్ వేర్ పెయింట్స్ అధినేత ఒకప్పుడు రైల్వేలో నెలకు 35 రూపాయిల జీతానికి పనిచేశాడు.

    ఒకప్పుడు గార్ వేర్ ఇంపీరియర్ బ్యాంక్ లో క్లర్క్ ఉద్యోగానికి వెళితే తిప్పి పంపేశారు. కాలగమనంలో అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారాక, అదే బ్యాంకుకి గార్ వేర్ వైస్ చైర్ మన్ గా చాలా సంవత్సరాలుగా వున్నాడు. ప్రీ మెట్రిక్యులేషన్ చదువుకునేందుకు కనీసం పుస్తకాలు కొనుక్కోలేని గార్ వేర్-తన కుటుంబాన్ని లాక్కురావడానికి చేయని పనిలేదు. ఆ తరువాత బ్యాంకులో గుమాస్తా ఉద్యోగం వచ్చినా వ్యాపారం మీద మక్కువతో సంవత్సరం తిరక్కుండానే వదిలేశాడు. ఆ తరువాత టాక్సీలను అద్దెకి తిప్పడం- అమ్మిపెట్టడం, కొనిపెట్టడం లాంటి కమీషన్ వ్యాపారం కూడా చేశాడు. అలాంటి గార్ వేర్ ఈనాడు భారతదేశపు ప్లాస్టిక్ పరిశ్రమకు మకుటంలేని మహారాజు 1980 నాటికే అతని టర్నోవర్ 70 కోట్లు. అంటే అతని ఒకప్పటి జీవితానికి ట్వంటీ మిలియన్ టైమ్స్ ఎక్కువ. ఇప్పుడు అతని టర్నోవర్ తేలిగ్గా వందకోట్లు దాటి వుంటుంది.

    మోహన్ సింగ్ ఓబరాయ్...

    సిమ్లాలోని సెపిల్ అనే హోటల్ లో నెలకు '45' రూపాయిలకు బిల్ క్లర్క్ ఉద్యోగం చేశాడు ఒకప్పుడు. అతనే కొన్నాళ్ళకు పట్టుదలతో ఆ హోటల్ ని కొనేసి దానికి యజమాని అయ్యాడు. అలాంటి 45 రూపాయిల జీతగాడైన ఓబరాయ్ కి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సొంత హోటల్స్ వున్నాయి. చెయిన్ ఆఫ్ హోటల్స్... ఆశ్చర్యంగా లేదూ? మూడు ఖండాలలో అతని పేరిప్పుడు వ్యాపార వీధులలో మారుమ్రోగుతుంటుంది. ఇప్పుడు సంవత్సరపు ఆదాయమెంతో తెలుసా? 15 మిలియన్ అమెరికన్ డాలర్స్. కేవలం తన శక్తి సామర్ధ్యాలతో, పట్టుదలతో, అకుంఠిత దీక్షా, దక్షతలతో హోటల్ తర్వాత హోటల్ నిర్మించుకుంటూ వెళ్ళాడు. పైగా అవన్నీ ఫైవ్ స్టార్ హోటల్సే. ఇప్పుడతని ఆస్థి అవలీలగా రెండొందల కోట్లుంటుంది. ఇలాంటివాళ్ళు ఎందరో... ఎందరెందరో మహానుభావులు. వారిముందు నేనెంత?"

    సైంటిస్ట్ కి ఆశ్చర్యంతో నోరు పెగల్లేదు వెంటనే...

    తెప్పరిల్లిన సైంటిస్ట్ ఆ మరుక్షణం పరిశోధనలోకి వెళ్ళి అహోరాత్రులు శ్రమించి సహజ వాయువుతో నడిచే వాహనానికి రూపకల్పన చేశాడు.


                                        *    *    *    *


    త్రినాధ్ కారు వెళ్ళి టెలిఫోన్ ఎక్చ్సేంజ్ బిల్డింగ్ ముందాగింది.

    అప్పటికే వివిధ పత్రికల నుంచి వచ్చిన రిపోర్టర్స్ త్రినాధ్ ని చుట్టుముట్టారు ఏమిటి విశేషమంటూ.

    చిరునవ్వుతో వారివేపు చూసి, తనతో రమ్మని తను చీఫ్ ఇంజనీర్ ఛాంబర్ వేపు సాగిపోయాడు.

    మరో నిమిషానికి అందరూ చీఫ్ ఇంజనీర్ ముందున్నారు.

    "సంఘంలోని అవినీతిని అరికట్టే సామాజిక బాధ్యత ప్రతి పౌరుడికి వుందని నా భావన" త్రినాధ్ సౌమ్యంగానే అన్నాడు.

    ఇంజనీర్ త్రినాధ్ కేసి కోపంగా చూస్తూ "వాడ్డూ యూ మీన్?" అన్నాడు.

    "మీరంటే మీరే అవినీతిపరులని నేననలేదు. మీ సంస్థలో అవినీతి పెద్ద ఎత్తున జరుగుతోందని నేను నిరూపిస్తాను. తగిన చర్య తీసుకుంటారా?" సీరియస్ గానే అడిగాడు.

    చీఫ్ ఇంజనీర్ కి అరికాలిమంట నెత్తికెక్కింది. నిజానికి అతను నిజాయితీపరుడే. అందుకే త్రినాధ్ మీద అంత కోపం వచ్చింది.

    "కూల్ డౌన్ మిస్టర్ ఇంజనీర్- మేం ప్రెస్ నుంచి వచ్చాం. మీరు నిజాయితీపరులైతే నిరూపించుకోండి. అప్పుడు మీ నిజాయితీ గురించే వ్రాస్తాం. గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకోవడమెందుకు?" ఓ రిపోర్టర్ సూటిగా అన్నాడు.

    ప్రెస్ వాళ్ళతో పెట్టుకోవడం అంత మంచిదికాదని అతనికీ తెలుసు.

    "ఓ.కె... నిరూపించండి" అన్నాడు చీఫ్ మొహాన్ని కందగడ్డలా చేసుకుని.

    త్రినాధ్ లేచి "మిస్టర్ చీఫ్... ఇప్పుడు మనం టెలిఫోన్స్ మీటర్స్ వుండే రూమ్ కి వెళ్ళాలి" అన్నాడు కూల్ గా.

    చీఫ్ కేమీ అర్ధంకాలేదు త్రినాధేం చేయబోతున్నాడన్నది.

    చీఫ్ కోపంగా రీడింగ్ మీటర్స్ వుండే హాల్ కేసి సాగిపోయాడు.

    అతని వెనకే త్రినాధ్, రిపోర్టర్స్ బయలుదేరారు.

    మీటర్స్ రూమ్ ఇరవై అడుగుల దూరంలో వుండగానే "అదే మీరడిగిన రూమ్" అన్నాడు చీఫ్ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. త్రినాధ్ చటుక్కున అందరికంటే ముందుకొచ్చాడు.

    "మీరంతా దయచేసి నిశ్శబ్దంగా నన్ను ఫాలో అవ్వండి. డోర్ దగ్గర నాతోపాటే ఆగిపోయి లోపలకు తొంగిచూడండి చాలు అంతా మీకే అర్ధమవుతుంది" అన్నాడు త్రినాధ్ నడకలో వేగం తగ్గించి.

    మరికొద్ది క్షణాలు అందరూ నిశ్శబ్దంగా హాలు డోర్ దగ్గరకు చేరుకుని లోపలకు తొంగిచూసి షాక్ తిన్నారు ఒక్కసారే.

    లోపల ఇద్దరు వ్యక్తులున్నారు.

    వాళ్ళు కొన్ని మీటర్స్ దగ్గరే నిలబడి ఏవో చక్రాల్ని వెనక్కు త్రిప్పుతున్నారు.

    "లోపల ఏం జరుగుతుందో చూశారుగా ఫ్రెండ్స్! ప్రతి ఫోన్ ఎక్సేంజ్ లో ఒక మీటర్ ఫిక్స్ చేస్తారు. ఆ ఫోన్ సొంతదారుడికి ఎస్.టి.డి. ఏర్పాటు వుంటే అతను ఎన్ని నిమిషాలు ఫోన్ లో మాట్లాడితే అంతసేపు మీటర్ తిరుగుతూనే వుంటుంది. అలాగే లోకల్ కాల్స్ కి తిరుగుతుంటుంది. ఆ మీటర్ లో రికార్డ్ కానివి ట్రంకాల్స్ ఒక్కటే. ప్రతి నెలాఖరున ప్రతి నెంబర్ కి బిల్ ప్రిపేర్ చేస్తారు. ఆ మీటర్ లో చూపించిన రీడింగ్ ని బట్టే బిల్ ప్రిపేర్ చేస్తారు. సో... దీన్నిబట్టి లోపల జరిగే అవినీతి మీకీపాటికి అర్ధమై వుండాలి. ఫోన్ సొంతదారు దగ్గర లంచం తీసుకుని అతని నెంబర్ కి సంబంధించిన మీటర్స్ ని వెనక్కు త్రిప్పుతారు..."

    చీఫ్ పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు త్రినాధ్ ఆమాటలకు.

    సరిగ్గా త్రినాధ్ విసిరినా ఛాలెంజ్ టైమ్ ఇరవైనాలుగు గంటలు పూర్తికావడానికి మరొక్క ఐదునిమిషాలే వుంది.

    సుదర్శన్ రావు వేవరింగ్ గా వున్నాడక్కడ.

    మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ "ఇరవైనాలుగు గంటలు పూర్తికావస్తున్నాయ్... ఎక్కడ అతని ఛాలెంజ్...? ఫోన్స్ పనిచేస్తూనే వున్నాయి. కాల్స్ వస్తూనే వున్నాయ్..." అన్నాడు సుదర్శన్ రావు కూతుర్ని ఉద్దేశించి.

    ప్రియాంక ఓసారి వాల్ క్లాక్ వేపు చూసింది. మరో ఐదు క్షణాలే వుంది త్రినాధ్ పెట్టిన గడువు పూర్తికావటానికి.

    ఛాలెంజ్ నెగ్గించుకోడా?

    నెగ్గించుకొనేటట్లయితే మరో మూడు క్షణాలే మిగిలివుంది. అలా కాదే...?! త్రినాధ్ కా సామర్ధ్యం వుందని తనకెందుకో ఇంకా నమ్మకం వుంది.

    మిగిలిన మూడు క్షణాలు ముగిసిపోయాయి.

    క్రమంగా సుదర్శన్ రావు, యోగేష్ ల ముఖాల మీదకు చిరునవ్వు వచ్చేసింది.

    మొత్తానికి ముగ్గురూ రిలాక్స్ అయ్యారు. కాని సుదర్శన్ రావులో సరికొత్త ఆలోచన తొంగిచూసింది. ఫోన్ కనెక్షన్స్ డిస్కనెక్ట్ చేయలేక పోయాడు త్రినాధ్. బానేవుంది పరువు దక్కింది. కాని తనింతవరకు ఛాలెంజ్ నెగ్గించుకుంటాడేమోనని పడిన ఆందోళనకు అర్ధం...? అంటే తను అంతర్గతంగా అతని స్థాయి పెరిగినట్లు ఒప్పుకున్నట్లేగా? అతను అన్న మాటను నెగ్గించుకునే సామర్ధ్యం కలవాడని తను పడిన ఆందోళన రుజువు చేస్తోంది. ఆశ్చర్యం-? నిజంగానే ఆశ్చర్యంగా వుంది.

    ఏది ఎలావున్నా... ఎలా జరగనున్నా ఒకటి మాత్రం నిజం. అతను ఎదిగాడు. ఎదుగుతున్నాడు- ఎప్పటికీ ఎదుగుతూనే వుంటాడన్న దాన్ని అతను అడ్డుకోవాలి.

    అప్పుడే అతనికి ఒకటి జ్ఞాపకానికొచ్చింది. ఒకప్పుడు త్రినాధ్ నిర్లక్ష్యంగా, పొగరుగా బొటనవేలి ముద్రవేసి తనవేపు విసిరేసిన తెల్లకాగితం... దాన్నిప్పుడు బయటకు తీయాలి. త్రినాధ్ ని ఒకే ఒక్క చావుదెబ్బ తీయటానికి మాత్రమే అది పనికివస్తుంది. ఎలా దాన్ని వుపయోగించాలి...?

    త్రినాధ్ పై తొలిసారి అతనిలోని ప్రమాదకరమైన మనిషి నిద్రలేచే ప్రయత్నం చేస్తున్నాడు.

    ఏమిటి త్రినాధ్ ఇలా చేశాడు...?

    అతను ఆ పని చేయకపోతే బావుండనే ఆశాభావం ఓ ప్రక్క- అతను తప్పక ఆ పని చేయగలడనే నమ్మకం ఓ ప్రక్క ప్రియాంకలో అప్పటివరకు కదలాడాయి. పెట్టిన గడువు పూర్తయ్యేసరికి ఆమెలో ఒకింత ఆశాభంగం...

    అంతలోనే ఉలికిపాటు.

    ఏమిటి తను తన శత్రువు అన్నమాట నెగ్గించుకోలేదని బాధపడి పోవటం? ఇప్పటివరకూ ఎలాంటి హంగు, ఆర్భాటం, హడావిడి లేకుండా తన సత్రువుల్లో, మిత్రుల్లో వారికి తెలియకుండానే అనూహ్యమైన మార్పు తీసుకొచ్చాడు త్రినాధ్.

    ఇప్పుడిక డైరెక్ట్ ఫైట్ కే దిగాడు.

    కాని తొలి ప్రయత్నంలోనే దెబ్బతిన్నాడే పాపం...? సరీగ్గా ప్రియాంక ఇక్కడ అలా ఆలోచిస్తున్న సమయంలోనే అక్కడ త్రినాధ్ జర్నలిస్టులు, చీఫ్ ఇంజనీర్ ఎదురుగా కూర్చున్నారు.

    తన హయాంలో ఎక్సేంజిలో అక్రమాలు జరగవని కొద్దినిమిషాల క్రితమే రెచ్చిపోయాడు అతను.

    కానదెంతోసేపు నిలుపుకోలేకపోయాడు. తప్పు తన క్రింద ఉద్యోగులు చేసినా అది తనకే చుట్టుకుంటుంది. ఏక్షన్ తీసుకోక తప్పదు. పైగా తన డిపార్ట్ మెంట్ తప్పు జర్నలిస్ట్ ల ముందు బట్టబయలయింది.

    కోపంతో ఇంజనీర్ ముఖం కొలిమిలా మారిపోయింది.

    "మిస్టర్ ఆఫీసర్... ఇది మీకు తెలీకుండా జరిగినా పొరపాటే. కాని... దాన్నిప్పుడు సరిదిద్దుకోకపోతే మరింత పెద్ద తప్పవుతుంది. కోట్లలో వ్యాపార లావాదేవీలు నిర్వహించే సుదర్శన్ రావు ఫోన్ బిల్లులు మాత్రం వేలల్లోనే వుంటుంటాయి. దీన్నిబట్టి మీరిప్పుడు ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదనుకోండి. మేము ఫోన్ బిల్లులు చెల్లించం- సరికదా కోర్టుకు వెళ్ళవలసి వస్తుంది..." త్రినాధ్ మాటలు సూటిగా వున్నాయి. అవి ఓ పక్క హెచ్చరిస్తూ, మరో పక్క సత్వర చర్యను సూచిస్తున్నాయి.

    జర్నలిస్ట్ లు హుషారుగా వున్నారు.

    సరికొత్త కరప్షన్...

    ప్రపంచం దృష్టికి ఇంతవరకు రాని కరప్షన్...

    దీనిమీద గొప్ప న్యూస్ స్టోరీని వెరీ ఇంట్రస్టింగ్ గా వ్రాయవచ్చు. ఫోన్ కాల్ ని నమ్మి వచ్చినందుకు నిజంగానే తమ పేపర్ కి మంచి న్యూస్ దొరకబోతోంది. ఈ లెక్క ప్రకారం సుదర్శన్ రావు లెంతమందో...?

    ఆఫీసర్ బెల్ నొక్కాడు.

    "సుదర్శన్ రావుకి సంబంధించిన ఫోన్స్ అన్నిటిని డిస్కనెక్ట్ చేయండి ఇమీడియట్ గా..." అన్నాడు ఆఫీసర్.

    అసిస్టెంట్ ఇంజనీర్ ఒక్కసారి షాక్ అయ్యాడు. సుదర్శన్ రావు గురించి తెలిసే ఈ నిర్ణయం తీసుకుంటున్నాడా? నిజంగానే చెబుతున్నారా అన్నట్లుగా చూశాడు ఆఫీసర్ వేపు.

    "మరో విషయం... ఇమీడియట్ గా అతనిమీద ఫైల్ పుటప్ చేయండి. క్విక్..." అన్నాడు మిలటరీ ఆర్డర్స్ పాస్ చేస్తున్న ధోరణిలో.

    అసిస్టెంట్ ఇంజనీర్ కి నమ్మక తప్పలేదు. అతను భయపడుతూనే వెళ్ళిపోయాడు.

    "ఓ ఫోన్ చేసుకోవచ్చా...?" త్రినాధ్ కూల్ గా అడిగాడు.

    "ప్లీజ్" అన్నాడు ఆఫీసర్.

    త్రినాధ్ నెంబర్ తిప్పి ఓ క్షణం కళ్ళు మూసుకున్నాడు.

    "హలో... ఎవరూ?" ఆవేపున ప్రియాంక గొంతు వినిపించింది.

    "తిమ్మడు... ది సేమోల్డ్ తిమ్మడు..." త్రినాధ్ చిరునవ్వు పెదాల మీద కదలాడుతుండగా అన్నాడు.

 Previous Page Next Page