Previous Page Next Page 
నీలికనుల నీడల్లో పేజి 18

    "అలా ఫలానిది అని కాస్త గుర్తుచేసి అడిగితే చెప్పగలను...ఎత్తు అంటే ఎలా తెలుస్తుంది...ఏ అతివతాలూకా ఎత్తు పల్లాల్ చెప్పక ఎత్తు అంటే ఎలా? ఎత్తులు కొలతలు"...
   
    "మీకు మందు ఎక్కువయింది" నవ్వుతూ అన్నాడు బన్సీలాల్.
   
    "ఇంకా వ్యాధి తగ్గందే! అదేం మాట లాల్ జీ!" ఇన్ స్పెక్టర్ జోకేశాడు.
   
    బన్సీలాల్ ముఖమాటంగా నవ్వాడు.
   
    "ఇందాక ఎత్తు అన్నారు అదేమిటి?"
   
    "అదే మనిద్దరం కలిసి వేశాము....!"
   
    "గుర్తొచ్చింది"....టకీమని చెప్పాడు ఇన్ స్పెక్టర్.
   
    బన్సీలాల్ ముఖం వికసించింది..."చెప్పండి" అన్నాడు ఫిష్ కట్ లెట్ నోట్లో పెట్టుకుంటూ.
   
    "రంగమని విషయంలో మనిద్దరం పోటా పోటీలు పడ్డాము తస్సదియ్య అదేమో తుమ్మచెక్కలాగా...."
   
    "ఛా....ఛా...." వెంటనే అనేశాడు బన్సీలాల్...
   
    "ఛాఛా కాదు ఛీ..ఛీ..అనాలి" నవ్వుతూ పలికాడు ఇన్ స్పెక్టర్.
   
    "నేను చెప్పింది అదికాదు"
   
    "మరేదట?"
   
    "లెటర్ సంగతి"
   
    "లెటరా!"
   
    "అదేనండీ బాబూ! మనిరువురం కలసి తయారుచేసిన లెటర్....ఆ కవరుని మిమ్మల్నే పోస్ట్ చేయమన్నాను..."
   
    "అలా ఎందుకన్నారు?" ఇన్ స్పెక్టర్ అడ్డు తగిలి అడిగాడు....అప్పటికే నిషా బాగా ఎక్కి మాట తడబడుతున్నది.
   
    అప్పనంగ దొరికితేచాలు పీపాడుకూడా పీల్చి పారేసే రకం....అధికారం చేతిలో వున్నవాడ్ని మేపుతుంటే అవసరానికి గుప్పెటలో వుంటాడుకదా అనుకుంటే అవసరం తక్కువయింది మేపుడు ఎక్కువయింది. తప్పదు కొన్ని కొన్ని తప్పవు...
   
    బన్సీలాల్ ఆలోచిస్తుంటే "ఎత్తు కవరు లెటర్...అన్నారు అవునా?" అంటూ గుర్తుచేశాడు ఇన్ స్పెక్టర్.
   
    ఏం మాట్లాడాలో తెలియక బన్సీలాల్ నవ్వి ఊరుకున్నాడు.
   
    "మీరు గుర్రం ఎక్కారు. అప్పుడేనా దిగండి లాల్ జీ దిగండి" అన్నాడు ఇన్ స్పెక్టర్.

    బన్సీలాల్ ఏదో అనే లోపల నౌకరు లోపలికి వచ్చాడు....
   
    "అయ్యా! మీకు ఫోన్..." వినయంగా చెప్పాడు నౌకరు.
   
    "ఎవరు ఎక్కడ్నించి?"
   
    "అడిగాను చెప్పలేదు."
   
    "చాలా బిజీగా వున్నారని ఇన్ స్పెక్టర్ తో మాట్లాడుతున్నారని చెప్పాల్సింది."
   
    "చెప్పినా వినలేదు. మీతో నే మాట్లాడలట. అర్జంట్ సీక్రెట్ ఏరే ఈమాటలు చెప్పమన్నారు."
   
    అర్జంట్ సీక్రెట్ ఆ మాటలు వినగానే బన్సీలాల్ వులిక్కి పడ్డాడు.... "పద వస్తున్నాను...." నౌకరుతో అని "ఇప్పుడే వచ్చేస్తాను...మీరు కానిస్తూ వుండండి..." ఇన్ స్పెక్టర్ తో చెప్పి అక్కడ్నుంచి ఇవతలికి వచ్చేశాడు.
   
    అక్కడ ఇన్ స్పెక్టర్ వక్కడూ మిగిలిపొయ్యాడు.
   
                                                    14
   
    "ఈపూట వద్దామనుకున్నాను కాని వెధవ కేసుతో ఇప్పటిదాకా కుదరలేదు సారీ లాల్ జీ!"
   
    "ఎవరు మీరు?" నొసలు చిట్లించి అడిగాడు బన్సీలాల్.
   
    "జోక్ చేస్తున్నారా లాల్ జీ!"
   
    బన్సీలాల్ వచ్చి ఫోన్ చేతిలోకి తీసుకొని తన పేరు చెప్పంగానే విన్న మాటలవి, స్వరం చూడబోతే పరిచయం వున్నట్లు తోస్తున్నది మరి....!

    "ఏమాలోచిస్తున్నారు లాల్ జీ!"
   
    "ఎవరు మీరు?"
   
    "అదేమిటి, నాస్వరం గుర్తు పట్టలేదా?"
   
    "ఎవరు మీరు అంటున్నాను" బన్సీలాల్ గట్టిగా అడిగాడు.
   
    "పార్టీకి పిలిచిన నన్ను మీరు మర్చిపోయారన్న మాట! అంటే నా వాటాకూడా మీరు సేవించి"...
   
    "అధిక ప్రసంగం నేనడిగింది పేరు"
   
    "ఇన్ స్పెక్టర్ కన్నారావునే మీరు మర్చిపోయారంటే మీరు నల్లగుర్రాన్ని పూర్తిగా ఎక్కేసిస్వారీ చేస్తున్నారు అనుకోవాలి లాల్ జీ!"
   
    "మీరు ఇన్ స్పెక్టర్ కన్నారావా?" బన్సీలాల్ తెల్లబోయి అడిగాడు.
   
    "ఏమిటి విషయం నా శీలాన్నే శంకిస్తున్నారా!"
   
    "బన్సీలాల్ అయోమయంలో పడిపోయాడు....సాయంత్రం ఇన్ స్పెక్టర్ కి ఫోన్ చేసి రాత్రికి పార్టీకి రమ్మన్నాడు. అలాగే అని పది దాటంగానే ఇన్ స్పెక్టర్ వచ్చాడు....ఇరువురు తీర్ధ ప్రసాదాలు పుచ్చుకుంటూ కూర్చున్నారు. వీడెవడో ఇప్పుడు ఫోన్ చేసి నేను ఇన్ స్పెక్టర్ ని పార్టీకి రాలేకపోయాను అంటున్నాడు....మాటల్లో పెట్టి వీడి అమీ తుమీ తేల్చుకోవాలను కున్నాడు.

 Previous Page Next Page