అదే మళ్ళీ నాలుగంగుళముల శ్వాస వెలుపల నష్టమే, మిగతా నాలుగంగుళముల శ్వాస మంచి శ్వాసయై లోపలికి వెళుతుంది.
అదే ఎడమ నాసిక నుండి శ్వాస నడుస్తున్నప్పుడు పన్నెండు అంగుళముల శ్వాస బయటకు వచ్చి దానిలో నాలుగు అంగుళముల శ్వాస నష్టమై తిరిగి ఎనిమిది అంగుళముల పొడవైన శ్వాస లోపలకు వెళుతుంది. అదే తిరిగి వెలుపలకు వచ్చునప్పుడు లోపల చుట్టగా చుట్టి వుండే శ్వాసలో నాలుగు అంగుళముళ పొడవంత శ్వాసను వెలుపల విడిచేస్తుంది.
ఈ పద్దతిలో ప్రతిరోజూ ఇరవై నాలుగు గంటల కాలంలో ఇరవై ఒక్కవేల ఆరువందల శ్వాసలు కుడి, ఎడమ నాశికలలో నుంచి నడుస్తూంటుంది.
ఈ విధంగా ఇరవై ఒక్కవేల ఆరువందల శ్వాసల్లోంచి ఒక్కొక్క శ్వాస నాలుగు అంగుళముల పొడవు శ్వాసగా నష్టమవుతూ మానవకోటి ఆయుప్రమాణాన్ని తగ్గిస్తూ ఉంటుంది. ఈ రహస్యం సిద్దిపొందిన యోగులకు తప్ప మామూలు వారికి తెలియదు.
అంతేకాదు మానవుల అన్ని ఆశలకూ, కోరికలకూ తలంపులే ముఖ్య కారణం. ఆ తలంపులు లేకుంటే ఏ ఆశలూ, కోరికలూ వుండవు.
ఆశలకు తలంపులే బీజము. ఈ తలంపులన్నీ శ్వాసలో పుడుతుంటాయి. యోగాభ్యాసము ద్వారా శ్వాసయొక్క వేగాన్ని పొగరును అణిచి వేస్తే శ్వాస వేగంగ లేక ముక్కు కొనయందుండి ఒక్క అంగుళము పొడవుగల శ్వాస తిన్నగా కిందికి... ఎటువంటి తలంపులూ పుట్టకుండా వుంటాయి.
నీకు ప్రాణవాయువు అందని ప్రదేశంలో సైతం నాకు అందుటకు శ్వాసని నియంత్రించుకోవటమే. ఇక నీకు స్వస్థత చేకూరింది. నా యోగశక్తి వలన. దానితో నీలో శ్వాస వేగాన్ని నియంత్రించి, నా కరస్పర్శ ద్వారా నీకు శ్వాస అందేలా చేయటమే కారణం....' అని వివరించాడు.
దాంతో మనిషి యొక్క ఆయుష్షు మనం నిత్యం జరిపే ఉచ్చ్వాస, నిశ్వాసాలమీదే ఆధారపడి వుందని తెలిసింది నాకు..." అంటూ ఒక్క క్షణం ఆగాడు వరప్రసాదం అతడు చెప్పిన విషయాలు అభిరాంని ఆశ్చర్యానికి, ఉద్వేగానికి లోను చేశాయి.
వరప్రసాదం నశ్యం డబ్బాలోంచి కొంత తీసుకుని పీల్చి, తుమ్మాడు. అప్పుడు సమయం రాత్రి పదకొండు గంటలవుతోంది.
"మీకు నిద్రొస్తూందా?" అడిగాడు వరప్రసాదం.
"లేదు" బదులిచ్చాడు అభిరాం.
"అయితే హిమాలయాల్లో ఒక అఘోరీతో నాకు జరిగిన అనుభవం చెబుతాను వినండి" అన్నాడు.
ఇంకా 'నాకు నిద్రొస్తుంది పడుకుంటాను' అని వరప్రసాదం అంటాడేమో అని ఊహించుకున్న అభిరాం అతడలా అనకపోవటంతో అతనిలోని ఉద్వేగం రెట్టింపయింది.
"హిమాలయాలపై నేను సంచరిస్తుండగా ఒక ప్రదేశంలో కొందరు వ్యక్తులు తారసపడ్డారు. మాటల్లో వారిది శ్రీనగరనీ, ఈ ప్రాంతంలో సంచరించటం మంచిది కాదనీ అన్నారు. నేను కారణం అడిగాను. ఇక్కడికి దగ్గరలోని ఒక గుహలో ఓ అఘోరీ వున్నాడని అతని కంటపడటం మంచిది కాదని చెప్పి వాళ్ళు ముందుకు సాగిపోయారు. అది మానససరోవర ప్రాంతం. కైలాస గిరులన్నవీ అక్కడే.
నాకెలాగైనా ఆ ఘోరీని చూడాలని అనిపించి వారు చెప్పిన గుహవైపు నడిచాను. ఆ పరిసరాలలో ఏ అలికిడీ లేదు. ధైర్యం చేసి లోపలకు వెళ్ళాను. లోపల రాతి మీద ఓ ఆకారం కూర్చుని వుంది. నా అలికిడికి ఆ ఆకారం దిగ్గున లేచి నుంచుంది.
సుమారు ఆరడుగుల అయిదంగుళాల ఎత్తులో, బలిష్టంగా, పొడవాటి జుట్టు, గడ్డం, జనపనార గోచీ- దిహీ ఆ ఆకారం యొక్క అవతారం అతడే అఘోరీ అయుంటాడని అనుకున్నాను నేను. అతని చేతికి ఏవో తీగలు చుట్టుకుని వున్నాడు.
'ఈ పరిసరాలలో తిరగడం ప్రమాదమనీ, ఇక్కడో అఘోరీ ఉంటాడు- అతనికంట పడటం మంచిది కాదని నీకు వాళ్ళు చెప్పారు కదా! అయినా ఇక్కడికి వచ్చావేమిటీ? నీకు భయం లేదా?' నన్ను చూస్తూనే అడిగాడతను.
నాకు నోటమాట రాలేదు. ఈ గుహ వద్దకు వెళ్ళొద్దని శ్రీనగర్ వాసులు నన్ను హెచ్చరించిన ప్రదేశం అఘోరీ గుహకు ఫర్లాంగు దూరమైనా వుంటుంది. అయినా ఇతనికి వాళ్ళు నాతో చెప్పిన మాటలు ఎలా తెలిశాయని ఆశ్చర్యపోయాన్నేను.
'ఏమిటి వాళ్ళు నిన్ను హెచ్చరించిన సంగతి నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా?' అడిగాడతను. నా తల గిర్రున తిరుగుతున్నట్టయింది. అతడు తిరిగి రాతిమీద కూర్చుని, నన్ను రమ్మని పిలిచాడు.
నేను ముందు సందేహించినా అంతవరకూ వచ్చాక చేయగలిగింది. లేక అతన్ని సమీపించాను. అతడు నన్ను తన పక్కన కూర్చోమన్నాడు. నేను మారు మాట్లాడకుండా కూర్చున్నాను.
అతని శరీరం నుంచి భయంకరమైన దుర్వాసన కొడుతోంది. హఠాత్తుగా నా కళ్ళు ఓ మూల పడివున్న మనిషి పుర్రెలు, ఎముకల్నీ పసికట్టాయి. 'ఇతను మనుషుల్ని తినేవాడా?' ఆ ఆలోచన వస్తూనే నాలో సన్నగా వణుకు మొదలయింది.
'ఇక్కడికి దగ్గరలో, కుడివైపు వెళితే నదొకటి వుంది. అక్కడికి పోయి కుండతో నీళ్ళు పట్రా పో!' అన్నాడతను ఓ కుండ నా చేతికిచ్చి నాలో వణుకు తగ్గలేదు. అలాగే వెళ్ళాను. గుహకు దగ్గరలోనే నది వుంది. కుండ ముంచి నీళ్ళు తీసుకున్నాను. అక్కడ్నుంచి పారిపోదామా అనిపించినా ఏం జరుగుతుందో చూద్దామనే ఉత్సాహం ఆ కోరికని చంపేసింది.
నీళ్ళకుండతో గుహలోకి నడిచాను.
'పారిపోదామనుకున్నావు కదూ' నన్నే తీక్షణంగా చూస్తూ అడిగాడతను. నేను మౌనంగా తల వంచుకున్నాను. 'సరే! నదిలో శవం తేలి వస్తుంది. దానిని ఒడ్డుకు లాగి, తొడ, కండరాలు కోసి కొంత మాంసం పట్రా' అన్నాడతను నాకు షాక్ తిన్నంత పనైంది. కదలకుండా అక్కడ నిల్చుండిపోయాను.
'మాంసం కోసి తెస్తావా? లేకుంటే నిన్ను కోసి మాంసం తీసుకోవాలా? నీకేది యిష్టం?' గర్జనలా వినిపించిన అతని గొంతుకి, దిక్కు తోచక అతడందించిన కత్తి తీసుకుని నది వద్దకు వెళ్ళాను.