Previous Page Next Page 
హ్యూమరాలజీ-1 పేజి 18


    "ఏమిటీ! నా పేరు బట్టతలా?"
    రెడ్డి ఖంగారుపడి నావేపు చూశాడు! "ఈయన పేరేమిటని ఇందాక నిన్ను అడిగితే "బట్టతల" అని చెప్పావుకదా! అన్నాడు గాబరాగా.
    నేను ఎందుకయినా మంచిదని అక్కడ చేరిన గుంపువెనక్కు నడిచి, "ఊరికే అన్నాలేసరదాకి!" అన్నాను పరిగెత్తుకుంటూ పారిపోవడానికి రెడీగా నిలబడి.
    "సారీ సార్! ఏదో పొరపాటు జరిగింది! ఇంతకూ మీ పేరేమిటన్నారు?"
    "గాడిదగుడ్డు" ఇంకా మండిపడుతూ అన్నాడు.
    "చూడండీ గాడిదగుడ్డు.. సారీ! మీరు కోపంగా ఉన్నట్లున్నారు. అలాంటి పేరెక్కడయినా ఉంటుందా ఏమిటి? సరే కానీండి! పేరొదిలేద్దాం! చూడండి. ఎవరికోడలిని వాళ్ళే కిర్సనాయిలు కొనుక్కుని తగలెయ్యడం మన సంఘ ఆచారం! మీరిప్పుడు కొత్తగా పుట్టింటివాళ్ళే కిర్సనాయిలుకూడా సప్లయి చేయాలంటే ఎవరికయినా ఇబ్బందే కదా...."
    "గాడిదగుడ్డు! అలా సప్లయి చేసేవాళ్ళ అమ్మాయినే చేసుకుంటామని మధ్యవర్తికి క్లియర్ గా చెప్పాను."
    "అయినా అలా కిర్సనాయిలు అడగడమే చాలా తప్పండి!" అన్నాడు మా కాలనీ తాలూకు ఆంజనేయశాస్త్రి జనంలోంచి ముందుకొచ్చి.
    "ఏమిటి? తప్పా!" బట్టతలాయన మళ్ళీ రెచ్చిపోతూ అడిగాడు.
    "అవును."
    "ఏమిటి తప్పు?"
    "తప్పుకాకపోతే ఏమిటయ్యా! ఇవాళ మీరు కిరసనాయిలు ఉచితంగా ఇమ్మంటున్నారు. రేపు ఇంకొకాయన అంటించడానికి అగ్గిపెట్టెకూడా కావాలంటాడు. అసలే పెళ్లి ఖర్చులూ, కట్నాలూ ఇవ్వలేక చస్తూంటే- పాతిక లీటర్ల కిర్సనాయిలు బ్లాకులో కొనియివ్వాలంటే మాటలా ఏమిటి?"
    "అదంతా నాకనవసరమయ్యా! మా అబ్బాయికి కనీసం మూడు పెళ్ళిళ్ళయినా చెయ్యాలికదా! ముగ్గురి దగ్గర కట్నం, లాంఛనాలు వసూలు చేస్తేగానీ వాడికి నాలుగు డబ్బులు మిగలవని మీరూ వప్పుకుంటారు! అవునా! మరి మిగిలే ఆ నాలుగు డబ్బుల్లో ముగ్గురు భార్యలను ఒకరి తర్వాత ఒకరిని విడివిడిగా కిరసనాయిలు పోసి తగలబెట్టాలంటే ఎంత ఖర్చోమీరే ఆలోచించండి!" కొంచెం శాంతంగా అన్నాడు బట్టతలాయన.
    "పోనీలేవయ్యా గోపాల్రావ్,మ్ కిరసనాయిలు ఇచ్చేసేయ్, అయిన ఖర్చు ఎలాగూ అయింది. ఇంక ఇప్పుడు వెనక్కు తగ్గడందేనికి?" ఎవరో గోపాల్రావ్ కి సలహా ఇచ్చారు.
    "ఇమ్మంటారా?" సందేహంగా అడిగాడు గోపాల్రావ్.
    "ఇచ్చేసేయ్! ఈ సంబంధం తప్పిందంటే మళ్ళీ ఎప్పటికి ఇంకో సంబంధం కుదురుతుందో ఏమో! ఈలోగా మీ అమ్మాయికి భర్త చేతిలో తగలబడేవయసుదాటిపోవటం లేదూ? ఏ వయసు ముచ్చట ఆ వయసులో జరిగితేనే 'ముద్దు' అన్నారు. అంటే, నా ఉద్దేశ్యం మీ అమ్మాయి కలకాలం ఇలాగే కిర్సనాయిలు చావుతప్పించుకునీ భ్రష్టత్వం పొందుతుందని కాదు. ఏదొక సంబంధం చూసి ఎలాగూ పెళ్లిచేస్తావ్? ఆ అత్తమామలు, భర్తాకలసి ఎలాగూ కిర్సనాయిలు పోసి తగిలెయ్యకా మానరు. ఎటొచ్చీ నీకు టైము ప్రకారం అమ్మాయిని తగలబెట్టించలేక పోయానే అన్న దిగులుండిపోతుంది ఆఖరివరకూను" నెమ్మదిగా నచ్చజెప్పాడు జనార్ధన్.
    "సరే" అన్నాడతను.
    అంతలోనే గోపాల్రావ్ గారి భార్య సావిత్రమ్మ కస్సున లేచింది.
    "ఏమిటి, కిరసనాయిలు ఇస్తారా? అమ్మాయి వయసు దాటిపోతోందిక దాని ఇలాంటి కొత్త పద్దతులన్నీ మొదలెడితే ఇంక అయినట్లే ఇవాళ కిర్సనాయిలు వప్పుకుంటే రేపు అగ్గిపెట్టి కూడా ఇమ్మంటారు. ఆ తర్వాత మీ అమ్మాయి అంత్యక్రియల ఖర్చుకూడా పెట్టుకోమంటారు. ఇలా దీనికి అంతం ఎక్కడుంది. వీల్లేదు, కిర్సనాయిలు ఇవ్వడానికి ఛస్తేవప్పుకోను" అందామె మొండిగా.
    మరుక్షణం మా కాలనీ తాలూకూ ఆడవాళ్ళందరూ అలవాటు చొప్పున చప్పట్లు కొట్టారు ఉత్సాహంగా.
    "అవును! ఇలా అడ్డమైన సౌకర్యాలు పెంచడానికి వీలులేదు" అంటూ అరిచారు కొంతమంది.
    ఇక లాభంలేదని రెడ్డిగారు కల్పించుకున్నాడు.
    "చూడండమ్మా! పద్ధతులేవి కాలాన్నిబట్టి మారుతుంటాయి మనం అడ్డుపడగూడదు. ఆ రోజుల్లో పద్ధతులేవేరు! మా తాతయ్య ఇప్పటికీ చెప్తుంటాడు. వాళ్ళకాలంలో మొగాళ్ళు ఒక్కటే పెళ్లి చేసుకుని, ఒకే భార్యతో జీవితాంతం కాపురం చేసేవారట. అలాగే ఒకో వంశానికీ ఒక్కోరకమైన ఆచారాలు ఉంటాయి. మా వంశం ఆచారం ఏమిటంటే మగాళ్ళు వరుసగా ముగ్గురు భార్యలవరకూ కాల్చిచంపాలి. నాలుగోభార్య మాత్రం జీవితాంతం సంసారం చేయాలి. ఏ పరిస్థితుల్లోనూ ఆమెను కిరసనాయిలు పోసి కాల్చిచంపకూడదు. ఒకవేళ తనంతట తానుగా ఆమె ఆత్మహత్య చేసుకోవడం-లేదా చనిపోవడం జరిగితే అప్పుడుగాని ఇంకో పెళ్ళి చేసుకోడానికి వీలులేదు!
    అలాగే ఆంజనేయశాస్త్రి వంశ సంప్రదాయం ప్రకారం పెళ్ళయిన సంవత్సరంలోగా వరుసగా నలుగురు కోడళ్ళను అత్తామామలు మాత్రమే కిరసనాయిలు పోసి నిప్పంటించాలి. వాళ్ళ కొడుకు కేవలం వారికి సహాయం చేయాలిగాని స్వయంగా నిప్పంటించకూడదు.
    ఇక జనార్ధన్ గారి సంప్రదాయం మరో రకంగా వుంటుంది. ఇంటి కోడల్ని భర్తగానీ, అత్తమామలుగానీ చంపడానికి వీలులేదు. ఆమె అడపడుచులే స్వయంగా మంచిరోజు చూసి కిరసనాయిలు పోసి నిప్పంటించాలి" నాటో ముగించాడు రెడ్డి.
    సీతారామయ్య గారు చేతికర్రతో వణుకుతూ ఉత్సాహంగా కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. ఆయన కూడా ఏదో చెప్పడానికి సరదాపడుతున్నాడని అందరికీ అర్ధమయిపోయింది.
    "మాది బాగా వెనుకబడ్డ ప్రాంతం కదా! అక్కడ యింకో సంప్రదాయం ఉంది. అదేంటంటే భర్త భార్యను తగలబెట్టే రోజునే-అత్తగారినీ, తల్లినీ కూడా చంపేయాలి. ఆ తర్వాత ఆ భర్తా అతని తండ్రి మామగారూ- ముగ్గురూ ఒకే పందిట్లో మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోవాలి!"
    హేమలత ఠక్కున అందుకుంది.
    "అవున్లెండి, ఎవరి సంప్రదాయం వాళ్ళది. మాలో పద్దతి ఇంకో రకం. పెళ్ళయ్యాక ఆమెను ఎవరూచంపరు. తనంతటతనే ఓ గదిలో కిరసనాయిలు పోసుకుని నిప్పంటించుకుని చచ్చిపోవాలి. అప్పుడు భర్త ఆమె స్వహస్తాలతో "తన చావుకి ఎవరూ బాధ్యులుకారనీ, అత్తమామలూ, భర్తా ఆడపడచులు అంతా దేవతలూ- లేక దేవుళ్ళనీ, కేవలం తనకే సరదా పుట్టి ఛస్తోందని" రాసిన ఉత్తరం లగ్నంనాడు అతని ఉత్తరీయంలో కట్టిన మూటనుంచి తీసి పోలీసుల కిస్తారన్నమాట! అయితే ఈ ఉత్తరం అందుకునే పోలీస్ ఇన్ స్పెక్టర్ కీ ఒక కానిస్టేబుల్ కీ మనం బట్టలు పెట్టాల్సివుంటుంది! పవిత్రకార్యంగదా మరి."
    సీతారామయ్యగారికి పాతరోజులన్నీ కళ్ళముందు మెదలినట్లున్నాయ్.
    "ఇదేకాదర్రా! ఆ రోజుల్లో భార్యలను ఇప్పటిలాగా డైరెక్టర్ గా కాల్చేవాళ్ళుకాదు. ముందు కట్నాలగురించో, మరో వస్తువు గురించో వియ్యాలవారితో వివాదం పెట్టుకునేవాళ్ళు. అవన్నీ తెమ్మని భార్యను బాగా వేధించాక అప్పుడు కిర్సనాయిలు పోసి నిప్పంటించేవారు. ఒకవేళ వియ్యాలవారు అడిగినవన్నీ ఇస్తే ఆమెను చివరికంటా అస్సలు చంపేవారేకాదు! అలాగే కాపురం చేయనిచ్చేవాళ్ళు! అంత అజ్ఞానం ఉండేదారోజుల్లో."
    ఈ గొడవంతా వింటున్న పెళ్ళికొడుక్కి చిరాకు పుట్టుకొచ్చింది. చేతిలోని మంగళసూత్రం నేలకేసి కొట్టాడు. "నేనేం హరికథలు వినడానికి రాలేదయ్యా! ముందు కిరసనాయిలు ఇస్తారా ఇవ్వరా తేల్చండి?" అన్నాడు మొండిగా, శాయీరామ్ మంగళసూత్రం అతని చేతికిచ్చి సమాధానపర్చాడు.
    "అలా తొందరపడితే ఎలాగయ్యా! ఓ పక్కన మీ మామగారు ఇస్తానని ఒప్పుకున్నారు గదా! మీ అత్తగారికి యెలాగోలా నచ్చజెప్తాంలే! అల్లరి పడకు?"

 Previous Page Next Page