Previous Page Next Page 
కలియుగంలో సీత పేజి 18

 

    రామచంద్రం ఆఫీసు నుంచి ఆటే ఓ స్నేహితుడింటికెళ్ళి ఆలశ్యంగా వస్తానని ఉదయమే వెళుతూ చెప్పి వెళ్ళాడు.

 

    జయకి వైరు బుట్టలల్లె పిచ్చి. ఎదురింట్లో ఆవిడకి సాయం చేస్తూ తాను అల్లుతూ వైరుతో అల్లేవి చాలా రకాలు నేర్చుకుంది. జయ స్కూలు నుంచి రాగానే ఎదురింటికి వెళ్ళింది.

 

    రాజు ఆటలాడటానికి గ్రౌండ్ కెళ్ళాడు.

 

    ఇంట్లో సీత రూప మిగిలారు.

 

    "ఏమని మొదలుపెట్టాలి, ఎలాఅడగాలి?" సీత ఆలోచిస్తున్నది. అక్కా ఏదోలా వుందని అనుమానించిన రూప తానే కల్పించుకుంది. సీతకి శ్రమ తప్పింది.

 

    "అక్కా"

 

    "ఊ"

 

    "ఇవాళ మా కాలేజికి ప్రవీణ మేక్సి వేసుకు వచ్చింది. ఎంత బాగుందో తెలుసా, అదే నా కళ్ళలో మెదులుతున్నది.

 

    కొన్ని కొన్ని అంతే. కన్ను మూసినా తెరిచినా కళ్ళ ముందే కదలాడుతుంటాయి.

 

    "కరెక్ట్. నా కళ్ళముందు ఎప్పుడూ రకరకాల డ్రస్సులు నగలు ఫాషన్ గా అలంకరించుకునే ఫాన్సీవీ అన్ని గిరగిర తిరుగుతుంటాయి. మరి నీకు కూడానా అక్కా!"

 

    మాట వచ్చినప్పుడే మాట్లాడటం, సమయం సద్వినియోగం చేసుకోవటం సీతకి బాగా తెలుసు.

 

    "నాకయినా అంతేనే రూపా! ఇవాళ ఓకారులో ఓ దృశ్యం చూశాను. అదింకా కళ్ళముందు నుంచి తొలిగిపోలేదు. బహుశా ఎప్పటికి పోదనుకుంటాను.." నిమ్మదిగా ఆగి ఆగి అంది సీత.

 

    "ఎమిటక్కా ఆ దృశ్యం అంత అద్భుతమైనదా? అంత మర్చిపోలేనిదా?" రూప ఆతృతగా అడిగింది.

 

    "అద్బుతం సంగతేమోగాని మర్చిపోలేనిదని మాత్రం చెప్పగలను."

 

    "నువ్వు మర్చిపోలేనిదంటే నిజంగా అది అత్యంత అద్భుతమైనదే అయివుంటుంది. నువ్వేది పట్టించుకోవు పెద్దగా వేటిమీద ఆశ పెంచుకోవు క్విక్ గా చెప్పేసెయ్ అక్కా! నిజంగా అంతగా కళ్ళముందు నిలిచిందంటే అదేదో...."

 

    "నన్నేమన్నా చెప్పనిస్తావా?"

 

    "సారీ అక్కా! చెప్పు ఇంక అడ్డు తగలను.

 

    "ఓ యువతి యువకుడు స్కూటరు మీదళుతుంటే చూశాను..."

 

    "ఓహ్. ఇదా! బజారుకేళితే ఇలాంటి దృశ్యాలు కోకొల్లలు ఇందులో అంత ఆకర్షించేదేముంది? అద్భుతమేముంది."

 

    "ఉందీ అనుకుంటే ఉంది. వాళ్ళిద్దరూ ఓ ఫాన్సీ షాపులోంచి వచ్చారు. అతను స్కుటరేక్కాడు ఆ అమ్మాయి అతని వెనుక కూచుని నడుంపట్టుకుంది. రయ్యిన ఆ వాహనం కనుమరుగయింది. వాళ్ళిద్దరూ మాత్రం నా కళ్ళముందే కదలాడుతున్నారు."

 

    రుపకి అనుమానం వచ్చింది. సీత చెప్పెతిరులో అసహజం లాంటిది తోస్తున్నది. "వాళ్ళిద్దరూ నీకు తెలిసినవాళ్ళా?" అడిగింది.

 

    "ఆ అమ్మాయి తెలుసు. ఇంకా పెళ్ళి కాలేదు. పరాయిమగాడితో ఇకఇకలాడుతూ వాడి నడుంపట్టుకు వేలాడుతూ ఎలా ఆ స్కుటరేక్కిందా అని......"

 

    రూప ముఖంలో రంగులు మారాయి. "ఎవరా అమ్మాయి" అంది కొద్ది గాభరాతో .

 

    "ఎవరో అయితే బాదేముంది రూప..."

 

    "అక్కా!"

 

    సీత కళ్ళలో ఎర్రజిరలు ఏర్పడ్డాయి. "రూపా ఈ ముసుగులో గుద్దులాట చాలిద్దాం మధ్యాహ్నం నువ్వు కాలేజిలో లేవు. వకుళమ్మ గారింటికెళ్ళి అలా బజారులో పనుండి అటోచ్చాను, నీ వెవరితోనో పడి ఫాన్సీ షాపులోంచి నవ్వుతూ తుళ్ళుతూ బైటికి రావటం మీ యిద్దరూ కల్సి స్కుటరేక్కటం నీవేమో అతని నడుం పట్టుకుని అతని వీపు మీద కొరిగి ఛి...ఛి...ఈదృశ్యం ఎవరైనా చూస్తే ఎంత అగౌరవం? నాన్నకి తెలిస్తే? బాబా తొందరపడి పెళ్లి చేసుకున్నాడని ఇప్పటిదాకా నాన్నా దిగులు పడుతున్నారు. ఇప్పుడు నీవు కూడా....?

 

    "అక్కా!"

 

    "అతనికి నీకు ఎన్నాళ్ళ పరిచయం? అసలతను ఎవరు?"

 

    "రవి నా క్లాస్ మేట్ , స్కూటరెక్కమంటే...."

 

    "ఆడది చనువిస్తే మగాడు స్కూటరెక్కించుకుంటాడు. బుజానా ఎక్కించుకుంటాడు. ఆ తర్వాత లోకువయితే కాలరాస్తాడు. పో పొమ్మని మెడ పట్టుకుని గెంటేస్తాడు."

 

    "రవి అలాంటివాడు కాదక్కా, రవికి నేనంటే ప్రాణం. రవీ నేను ప్రేమించుకుంటున్నాము.' నిర్భయంగా చెప్పింది రూప.

 

    సీత కళ్ళార్పటం మర్చిపోయి రూపని చూస్తూ వుండి పోయింది, రూపని తాని విషయం అడగంగానే ఏడుస్తుందని అబద్దాలు చెపుతుందని భయపడి పోతుందని ఎన్నో అనుకుంది, అదేంలేదు ధైర్యంగా  మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పేస్తున్నది రూపని మందలించాలా, అభినందించాలా!

 

    "ఇప్పుడేమయిందని అక్కా! అలా తెల్లబోయి చూస్తావ్, రవికి అందముంది, ధనముంది, మాంచి సరదా అయినవాడు. ధైర్యముంది నన్ను మనస్పూర్తిగా ప్రేమించాడు పెళ్ళాడుతానని మాటిచ్చాడు. మా విషయం సమయం వస్తేగాని చెప్పకూడదనుకున్నాం ఇవాళ నీ కంటపడనే పడ్డాము. ప్రేమించుకోటం తప్పా అక్కా!"

 

    'నన్నడగటం దేనికి అది నువ్వేచేప్పు.'   

 Previous Page Next Page