ఆరోజు ఆఫీసులో అందరూ రెండు గంటలు అదనంగా పని చేస్తున్నారు. మర్నాడు ఆడిట్ పార్టీ వస్తోంది.
గౌతమ్ తన గదిలో ఉన్నాడు. స్టెనో టైపిస్టు చరితను పిలిచి డిక్టేషనిచ్చి, "అర్జంటుగా టైపు చేయాలి." అన్నాడు.
ఆ గదిలోనే పక్కగా ఎలక్ట్రానిక్ టైపు మిషను ఉంది. చరిత అక్కడకు వెళ్ళి టైపింగు ప్రారంభించింది.
మధ్యలో ఆమెకు చిన్న సందేహం వచ్చి గౌతమ్ నడగాలని వెనక్కు తిరిగి తెల్లబోయింది.
అదామె ఊహించని సన్నివేసం.
ఆఫీసులో సభ్యతకూ, సంస్కారానికీ మారు పేరు గౌతమ్. అలాంటి దతనప్పుడామె వంకే కళ్ళప్పగించి చూస్తున్నాడు.
చరిత సిగ్గుపడి తలొంచుకుని మళ్ళీ తలెత్తింది.
అతడింకా అలాగే చూస్తున్నాడు.
తను గమనించనప్పటి విషయం సరే! తను చూసిందని తెలిసి కూడా అతడింకా అలాగే చూడడం చరిత కేదోలా అనిపించి, "ఈరోజేమయిందో ఇతగాడికి" అనుకుని వెనక్కు తిరిగింది.
కానీ ఆమె సందేహం అలాగే ఉండిపోయింది. అందుకని చటుక్కున టైపు మిషను దగ్గర్నుంచి లేచింది.
ఆమె అక్కడి నుంచి కదలినా అతడు టైపు మిషను వైపే చూస్తున్నాడు.
చరిత ముందు ఆశ్చర్యపోయినా తర్వాత అసలు విషయాన్నర్ధం చేసుకుంది.
ఎందుకో గౌతమ్ కీ రోజు తనను చూడగానే మనసు చలించింది. తను టైపు చూస్తూంటే తనవంకే చూస్తున్నాడు. ఉన్నపళంగా నేను వెనక్కి తిరిగేసరికి పట్టుబడిపోయాడు. అతడి సంస్కారం సిగ్గుపడింది కానీ అతడు బయటపడకూడదనుకున్నాడు. అందుకని ఏదో ఆలోచనలో పడినవాడిలా శూన్యంలోకి చూస్తున్నట్లు నటిస్తున్నాడు.
ఇంకా ఇంకా ఎంతసేపు నటిస్తాడో?
చరిత గొంతు సవరించుకుని నెమ్మదిగా అతడిని సమీపించింది.
ఆమె గొంతు సవరించుకున్నప్పుడతడు చలించలేదు. కానీ ఆమె తన్ను సమీపించగానే ఉన్నట్లుండి, "నో....నో....నో..." అని అరిచాడు.
చరిత భయపడి చేతిలోని నోట్ బుక్ జారవిడిచింది. ఆమె హైహీల్సు అడుగు తడబడింది.
మరుక్షణంలో చాలామంది ఆ గదిలో అడుగుపెట్టారు. వారిలో వెంకట్రత్నం కూడా వున్నాడు.
గౌతమ్ ఈ లోకంలోకి వచ్చాడు. చుట్టూ చూశాడు. అంతా ఏం జరిగిందని అడుగుతున్నారు.
"హైహీల్సు కదా, కుర్చీకి చీర తగిలి కాలుజారి పడిపోతూంటే ఆయన నో....నో....నో.... అని గట్టిగా అరిచాడు" అదీ చరిత సమాధానం.
గౌతమ్, "కంగారులో నాకు కాళ్ళూ చేతులూ ఆడవు. అవతల మనిషి పడిపోతూంటే కూర్చుని అరిచి ఏం లాభం, చేయూత నివ్వాలి తప్ప!" అన్నాడు.
వచ్చిన వాళ్ళకి పరిస్థితి అర్ధమయింది.
గది తలుపులు తెరిచి వున్నాయి. గౌతమ్ తన కుర్చీలో వున్నాడు. అతడికీ చరితకూ తగు మాత్రం దూరముంది. వీటన్నింటికీ మించి గౌతమ్ కి మంచి పేరుంది.
ఎవ్వరూ కూడా ఇంకో విధంగా అనుమానించలేదు.
* * * *
వెంకట్రత్నం ఆఫీసునుంచి వెళ్ళబోయేటప్పుడు చరిత ఆయన వద్దకు వెళ్ళి ఏదో చెప్పాలన్నట్లు తటపటాయించింది. ఆయన అర్ధం చేసుకుని, "చెప్పమ్మా ఏమిటి?" అన్నాడు.
"మీరు నాకో సాయం చేసిపెట్టాలి" అందామె.
"ఏమిటి?"
"గౌతమ్ కి మీరంటే చాలా గౌరవం. మీకతడివద్ద చనువుంది."
"ఊఁ అయితే?"
"అతడు కానీ నన్ను ప్రేమిస్తున్నాడేమో మీరు తెలుసుకోవాలి...."
వెంకట్రత్నం తెల్లబోయి ఆమెవంక చూశాడు. ఆ మాటల సిగ్గు ఆమె ముఖం నిండా పులుముకుని బంగారు వన్నె ముఖం గులాబిలా మెరుస్తోంది.
"ఎందుకు?"
"అప్పుడు మీరతడికో విషయం చెప్పాలి" అంది చరిత.
"ఏమిటది?"
"అతడు నన్ను ప్రేమిస్తూంటే, అది నా కిష్టమేనని!" అని చరిత చటుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది.
18
గౌతమ్ ఆఫీసు నుంచి తిన్నగా యిల్లు చేరుకున్నాడు.
ప్రియురాలి మాటలు స్పష్టంగా వినగలిగాడు తను.
ప్రకాశరావు నామె ఊహల్లోంచి తుడిచిపెట్టేసింది. మంచి వరుడి కోసం ఎదురుచూస్తోంది. ఆమె గుండె చప్పుడు వింటూ కూడా ఆమె మనసును తెలుసుకోలేకపోయాడు తను. సాయంత్రం పార్కులో ఆమె స్నేహితురాండ్రతో అన్న మాటలు విన్నాక అనిపిస్తోంది.
ఆమెకు అందమక్కర్లేదు, ఐశ్వర్య మక్కర్లేదు. తనకోసం మాత్రమే జీవించే నిస్వార్ధ ప్రేమికుడు కావాలి.
ఆ నిస్వార్ధ ప్రేమికుడు....తనే!
ఆమె తనవంటి వాడినే కోరుతోంది. తను వెతుక్కుంటూ వెళ్ళి అడిగితే ఆమె తనదవుతుంది.
ఆపని ఎప్పుడు చేయాలి?
ఎప్పుడో కాదు....ఇప్పుడే!
"హాసా!" పిలిచాడతడు.
* * * *
హాస వెంటనే బదులివ్వలేదు. పక్కకు చూసింది.
తమ్ముడు గిరిధర్ శ్రద్ధగా లెక్కలు చేసుకుంటున్నాడు.
"ఒరేయ్ గదిలోంచి బయటకి పో!" అందామె.
"ఎందుకు?"
"నేను ఫోనులో మాట్లాడుతూంటే నీకు భయంగా...."
"నువ్వు ఫోనులో మాట్లాడతావా, నేను వింటానులే!"
"ఛీ....ఇవి పర్సనల్ కబుర్లు. నువ్వు వినకూడదు."
"నేను నీకు పర్సనల్ తమ్మువాణ్నేగా."
హాస చెవిలో, హలో....హలో.... అని ఒకటే నాదం.
"అబ్బ....ఉండు బాబూ....ఇవతల నా తమ్ముడున్నాడు...." అంది హాస.
"అక్కడికి నిజంగా, నువ్వెవరితోనో మాట్లాడుతున్నట్టు...."
"అంటే నువ్వు నమ్మనంటావు....అయినా నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేమిటి?"
"నమ్మిస్తే నీకే మంచిది? నువ్వు ఫోన్ చేసినప్పుడల్లా నేను బయటకు వెళ్ళిపోతూంటాను"
"అయితే ఏం చేయాలో చెప్పు...."
"మా స్కూలుకి వెళ్ళేదారిలో ఓ పాత పెంకుటిల్లుంది. ఆ యింటి వీధి గోడకి నిన్నే సున్నాలు వేయించారు. దానిమీద "రంగారావు" అని వ్రాయాలని మాట్లాడే వాళ్ళు."
"ఎందుకు?"
"ఆ రంగారావుగాడో యింటి గోడమీద నాపేరు వ్రాసి నన్ను పుట్టించాడు. ఈ యింటి గోడ మీద వాడి పేరు వ్రాయాలని నిన్నట్నించీ ఉబలాటంగా వుంది. ధైర్యం చాలటం లేదు."
"పాపం, తెల్లటి గోడ....పాడుచేయొచ్చా?"
"ఎన్నికలొస్తున్నాయి. ఎలాగూ ఏ తెల్లగోడా బ్రతకదు" అన్నాడు గిరిధర్.
"సరేలే." అని....హలో! నువ్వింకా లైనులోనే ఉన్నావా?" అంది హాస.
"హాసా! నీ హృదయాంతరాళాల నుండీ పిలుపు నన్నెప్పుడయినా చేరుకుంటూనే ఉంటుంది."
"సరే, థాంక్సు! కానీ నువ్వలా నాతో మాట్లాడుతుంటే ఎవరూ నమ్మడం లేదు. నాలో నేనే మాట్లాడుకుంటున్నాననుకుంటున్నారు. అందరి సంగతీ ఎలాగున్నా ముందు నా తమ్ముడిని నమ్మించాలి. వాడెప్పుడూ నా గదిలోనే ఉంటాడు మరి....నేను చెప్పింది చేస్తావా?"
"హాసా! నువ్వు నన్ను అడక్కూడదు. ఆజ్ఞాపించాలి"
హాస అతడికి వివరాలు చెప్పసాగింది.
* * * *
"ఎవరది?" అంటూ గసిరాడు అప్పుడే యింట్లోంచి వీధిలోకి వచ్చిన వెంకట్రతనం.
గోడమీద పేరు వ్రాయడం పూర్తి చేసిన గౌతమ్ కంగారుగా "నేనండీ!" అన్నాడు.
వెంకట్రత్నం అతడిని చూసి ఆశ్చర్యపడి, "అరే, గౌతమ్. నువ్వా? ఏమిటీ మా యింటి గోడ దగ్గర నువ్వేం చేస్తున్నావ్!" అన్నాడు.
"అబ్బే, ఏమీలేదండి....గోడ చూస్తున్నాను....." అన్నాడు గౌతమ్.
"గోడనేం చూస్తావోయ్." అంటూ వెంకట్రత్నం తనూ అటు పరీక్షగా చూసి. "అరే, యిక్కడేవెధవో ఏదో రాశాడు" అన్నాడు.
గౌతమ్ తడబడి, "రాసినవాడు వెధవయ్యుండడు. పెద్దమనిషే అయ్యుంటాడు. ముత్యాల కోవలా ఉంది దస్తూరీ" అన్నాడు.
"పెద్దమనుషులు గోడల మీదెందుకు రాస్తారయ్యా! నాకూ సరిగ్గా కనిపించడం లేదు, ఇక్కడేం రాసుందీ? అన్నాడు.