జిల్లా సూపరింటెండెంట్ ల పైనబడే పని తొందరవల్ల రోజు రోజుకూ పెరిగిపోయే లా అండ్ ఆర్డర్, రక్షణ సమస్యలకు వారికి కావలసినంత సమయాన్ని కేటాయించనందువల్ల రైల్వే పోలీసులు ఎదుర్కొనే రకరకాల సమస్యలకు తగిన పరిష్కారాలను తీసుకునే ఆవకాశం లేకుండా పోతోంది.
అయినప్పటికీ ప్రభుత్వం ఉన్నంతలోనే అధికారాలను డీసెంట్రలైజ్ చేసి, చాలినంత సిబ్బందిని ఇవ్వలేకపోయినా అవసరాలకు తగ్గట్టుగా ఇతర విభాగాల నుంచి ఆఫీసర్ల ను డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి రైల్వే పోలీస్ శాఖను, వారి పనితీరును ఉద్దరించడానికి ప్రయత్నిస్తోంది.
ఆ ప్రయత్నంలో భాగంగానే లోకల్ పోలీస్ లో అన్ని రంగాలలో నైపుణ్యం సంపాదించిన ఇన్ స్పెక్టర్ ధీరజ్ ను డిప్యుటేషన్ మీద రైల్వేకు తీసుకున్నారు.
ఇన్ స్పెక్టర్ ధీరజ్ తనకు అప్పజెప్పిన భాద్యతను సక్రమంగా నిర్వర్తించడంలో అనేక కొత్త పద్దతులను, విధానాలను రైల్వే పోలీసింగ్ లో ప్రవేశపెట్టాడు. జరిగిన నేరాలను దర్యాప్తుచేసి, నేరస్తులను పట్టుకోవడం ఒక పద్దతి అయితే, అసలు నేరాలు జరగకుండా చూడడం కూడా తన బాధ్యతగానే గుర్తించాడు.
ఈ మధ్య తరచుగా ఫస్టుక్లాస్ కూపేల్లో జరుగుతున్న దోపిడీలను నివారించడానికి ప్రతి ఫస్టుక్లాస్ బోగీలోనూ కానిస్టేబుల్స్ ను ఎస్కార్టుగా ఏర్పాటు చేశాడు ఇన్ స్పెక్టర్ ధీరజ్.
* * *
తిరుమల ఎక్స్ ప్రెస్ వేగంగా వెళుతుంటే చలిగాలి బయటనుంచి రివ్వుమంటూ లోనికి దూసుకు వస్తున్నది.
అప్పటికి బాపట్ల దాటి పదిహేను నిమిషాలవుతున్నది.
వేగంగా వెళ్ళే ట్రయిన్ కాస్తా ఉన్నట్టుండి వేగం తగ్గిపోయి, ఆగి పోయింది!
దూరం నుంచి అరుపులు, కేకలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.
ఏదో జరిగింది!
ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆతురతతో బిలబిలమంటూ ట్రెయిన్ బీట్ పోలీసులు క్రిందకి దిగారు.
ఎదురుగా స్టూవర్టుపురం స్టేషన్ బోర్డు కనిపించింది దిగుతున్న పోలీసులకు.
కావాలనే చెయిన్ లాగి రైలును ఆపి వుంటారని వూహిస్తున్నలత లోనే గుంపులు గుంపులుగా ప్రయాణీకులు పెట్టెల్లోనుంచి దిగి పరుగులు తీస్తూ వారివైపుకు రాసాగారు.
వెనుక ఎక్కడో వున్న జనరల్ ప్రయాణీకులవద్ద నుంచి నగలను సొమ్మును ఇద్దరు దొంగలు దోచుకుంటున్నారనే వార్త పోలీసుల చెవినపడింది.
ఎలాగయినా ఆ ఇద్దరు నేరస్తులను పట్టుకు తీరాలనే పట్టుదలతో ఎదురు వస్తున్న ప్రయాణీకులను తప్పించుకుంటూ దోపిడీ జరిగే బోగీ దగ్గరకు పరుగు తీశారు పోలీసులు.
అప్పటికే దోపిడీ జరిగిపోయింది. అందినంత మేరకు డబ్బు, నగలు ఊడబెరుక్కుని ఎయిర్ బాగ్ లో దోపుకుని కిందకుదూకి స్టేషన్ కు ఉత్తరం వైపుగా వున్న డొంక రోడ్డువైపుకు పరుగులు తీశారు ఆ ఇద్దరు క్రిమినల్స్.
దూరంగా పారిపోతున్న వాళ్ళిద్దరూ పోలీసులకు స్పష్టంగా కనిపిస్తూనేవున్నారు. ఆ ట్రెయిన్ మొత్తంమీద పది మంది వరకూ పోలీసులు వున్నారు. పోలీసులు ఆ నేరస్తుల వెంట పడ్డారు.
పట్టువదలని విక్రమార్కుల్లా తరుముకువస్తున్న పోలీసులను చూసి వాళ్ళేమనుకున్నారో ఏమో ఉన్నట్టుండి ఆగిపోయారు. వారి చేతుల్లో నల్లగా నిగనిగలాడే రివాల్వర్లున్నాయి.
"రాడికల్స్ జిందాబాద్, పోలీసుల జులుం నశించాలి!"
ద్దగా నినాదాలు చేస్తూ పోలీసుల వైపు రెండుసార్లు కాల్పులు జరిపారు.
వారి ఎదురు దాడికి పోలీసులు బిత్తరపోయి పరుగెత్తేవారల్లా చటుక్కున నేలకు కరుచుకున్నారు.
వీళ్ళు రాడికల్స్ అని అర్ధం కావడంతో ఏం చేయాలో తోచక కొన్ని క్షణాలు పోలీసులు డైలమాలో పడ్డారు. ఆ కాస్త సమయంలోనే ఆ నేరస్తులిద్దరూ డొంక రోడ్డును వదిలి పిచ్చి తుప్పలతో ఎగుడు దిగుడుగా వుండే ఇసుక దిబ్బలకు అడ్డంపడి పరుగు తీశారు. అక్కడక్కడా వున్న చిన్న చిన్న మొక్కలు మొలచిన నారుమడుల వంటి పొలాలను దాటుకుంటూ పరుగుతీస్తూ పోలీసుల కళ్ళను ఏమార్చి మాయమైపోయారు.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మరొక దోపిడీ జరిగిపోయింది.
వార్త తెలియగానే ముందుగా అవాక్కయిపోయాడు ఇన్ స్పెక్టర్ ధీరజ్.
స్టూవర్టుపురంలోకి నేరస్థులు పారిపోయారానీ, వెళుతూ రాడికల్స్ కు అనుకూలంగా నినాదాలు చేశారని కాదు - జనరల్ కంపార్ట్ మెంట్ లో దోపిడీ జరిగే సమయంలోనే రెండు త్రీ టైర్ బోగీలలోని ప్రయాణీకులవద్ద నుండి ఒక్కరినీ వదలకుండా విలువైన సంపదనంతా ఇద్దరు వ్యక్తులు దోచుకుపోయారు!
ఒక రైలులో ఓకే సమయంలో రెండుచోట్ల దోపిడీలు జరిగాయి. ఏ విధంగా జరిగి వుంటుందో వూహించే ప్రయత్నం చేయసాగాడు ధీరజ్.
అంత మంది జనం చూస్తుండగానే జనరల్ బీగీని దోపిడీ చేసిన ఇద్దరూ పారిపోయారు. అంటే, ఆ ఇద్దరే స్లీపర్ బోగీ లను దోచుకోలేదు. స్లీపర్ బోగీలను కొల్లగొట్టిన వారే తమను చాలెంజ్ చేస్తున్న క్రిమినల్స్. ఎందుకంటే ఆ బోగీలలో ఒకదాని తలుపుపై 'కమెండో' అన్న స్లిప్ అంటించి వుంది!
ఆలోచిస్తున్న ఇన్ స్పెక్టర్ కు క్లూ దొరికింది.
తిరుమల ఎక్స్ ప్రెస్ లో దోపిడీ జరిగిన తరువాత తన బోగీలో ఇద్దరు ప్రయాణీకులు తగ్గారని గుర్తించాడు టి.టి.ఇ.
ఆ ఇద్దరి పేర్లు కె.డి. రావు, బి.సి. రావు.
రిజర్వేషన్ ఫారాలలో వుండే వారి చిరునామాల ప్రకారం ఆ ఇద్దరూ వుండేది విజయవాడలోని శివాలయం వీధిలోనని తెలియడంతో చురుగ్గా కదిలాడు ఇన్స్పెక్టరు ధీరజ్.
ఆ అడ్రసుకు వెళ్ళిన తరువాత కానీ తనను వాళ్ళెంత ఫూల్ ను చేసిందీ అర్ధం కాలేదు. అది తన స్టేషన్ లో పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టరు ఆచారి ఇల్లు!
ఒళ్ళు మండిపోయే కోపం వచ్చినా దిగమింగుకుని తిరిగి వచ్చి సీట్లో కూలబడ్డాడు ధీరజ్. ఫోను రింగవడంతో విసుగ్గా అందుకున్నాడతను.
"మిస్టర్ ఇన్ స్పెక్టర్! తిరుమల ఎక్స్ ప్రెస్ లో దోపిడీ చేసిన ఇద్దరు వ్యక్తుల శవాలు మీకు కావాలంటే కృష్ణా కెనాల్ జంక్షను దగ్గర పట్టాల పక్కనే పడి వున్నాయి. వెళ్ళి తెచ్చుకోండి" ఫోనులో పురుష కంఠం ఖంగుమంది.
పావుగంటలో ధీరజ్ తన సిబ్బందితో సహా ఆ శవాల దగ్గర వున్నాడు.
పదునయిన కత్తితో కోసినట్టుగా రైల్వే ట్రాక్ పక్కనే తలలు తెగిన రెండు శవాలు పడివున్నాయి.వారి గుండెలపై గుచ్చబడి వున్న రక్తంతో తడిసిన కాగితాలపై నిలిచిపోయింది ధీరజ్ దృష్టి.
"ఖబడ్దార్! నిజమేమిటో తెలుసుకోకుండా మా మీద నిందలు వేయడం మీకు అలవాటైపోయింది. ఎక్కడ కొట్లాటలు జరిగినా, దోపిడీలు జరిగినా, అల్లర్లు జరిగినా రాడికల్స్ చేశారని అనడం మీ చేత కానితనానికి నిదర్శనం. మేమెప్పుడూ అమాయక జనం జోలికి వెళ్ళం. అన్యాయంగా ఒకరి కష్టాన్ని దోచుకోము. కానీ మాపేర్లు వాడుకుని తాము చేసిన నేరాలను మాపై రుద్ది తెలివిగా తప్పించుకుంటున్నారు కొందరు నేరస్థులు. ఆ నిజాన్ని గ్రహించకుండా మేమే దోపిడీలు చేశామని హత్యలు చేశామని కేసులుపెట్టి మా కోసం వెదుకుతూ ఎవరో అనామకులను పట్టుకుని శిక్షిస్తున్నారు. అంతేగానీ నిజమయిన నేరస్తులను వెదకి పట్టుకోవడం మీకు చేతకాదు!
"హాయిగా ఎ.సి. గదులలో మెత్తని సీట్లలో ఫ్యాన్ల కింద కూర్చుని ఆర్డర్లు ఇవ్వడం కాదు, అవసరమయితే, రంగంలోకి దూకి నిజాయితీగా నేరస్తులను పట్టుకోవడానికి ప్రయత్నించాలి" మా పేరు చెప్పుకుని స్టువర్టుపురం దగ్గర పబ్లిక్ ను దోచుకున్న దొంగలు ఈ ఇద్దరే. వారి దగ్గర దొరికిన సొమ్మును కూడా శవాల దగ్గరే వదిలి వెళుతున్నాం. రైల్వే ప్రయాణీకులు ఎవరెవరు ఎంత పోగొట్టుకున్నారో వారికి చెందవలసిన మొత్తాన్ని వారికి అప్పజెప్పండి. ఇప్పుడే కాదు, ఇకముందు కూడా మా పేరు చెప్పుకుని నేరాలు చేసేవారికి ఇదే గతి పడుతుంది. ఇది మా హెచ్చరిక__రాడికల్స్."
ఉత్తరంలోని సారాంశం చదివి గాఢంగా నిట్టూర్చాడు ధీరజ్.
అంతవరకూ అతనిలో అంతర్లీనంగా వున్న అనుమానం నిజమైంది.
తాము వెదికే గజదొంగలు వీళ్ళు కాదని, వాళ్ళు చాలా తెలివైన నేరస్తులనీ సాధారణ పద్దతుల ద్వారా వారిని పట్టుకోవడం సాధ్యం కాదని అనిపించింది ధీరజ్ కు.
* * *