Previous Page Next Page 
విరిజల్లు పేజి 17


    "ప్రతి పద మిద మపి నిందతి మాధవ! తవచరణీ పతితాహం" ఈ చరణం పాడేప్పుడు రాధే ప్రత్యక్షంగా అక్కడ వుంటే నిజంగా ఆమె కూడా కృష్ణునితో తనంత మధురంగా విన్నవించాడా అని విస్తుపోయేది.
    చేతిని అందుకుని మరోమారు తేనెకన్నా మధురమయిన తన లేత పెదవులకి ఆనించుకుంది. ఆ స్పర్శ అతనికి శీతలంగా వున్నా ఆమెను అణువణువునా కాల్చేస్తుంది.
    అతను కొద్దిగా కోపం ధ్వనించేట్టు అన్నాడు "యిక లేవండి మేడమ్!"
    కూర్చున్నాక ఆమె ముఖంలోకి సూటిగా చూసి అడిగాడు "మేడం! ఎందుకిలా చేస్తున్నారు? మీ ఉద్దేశ్యమేమిటి? నాతో యిలా పరాచికాలాడటం మీకు మంచిది కాదేమో!"
    మ్రాన్పడిపోయింది "చెప్పండి....వచ్చిన రోజునుంచీ గమనిస్తున్నాను. మీ మనసులో ఉన్నదానికి వాగ్రూపం చెందుతున్నదానికీ పొంతనే కుదరటంలేదు! ఎందుకిలా దాగుడుమూత లాడుతున్నారు. చెప్పండి మేడమ్"    
    ఏమీ జవాబు చెప్పలేదు. కానీ ఆమెలో ఆలోచనా తరంగాలు ప్రళయవేళ సముద్రంలో ఉవ్వెత్తుగా లేస్తూ తరంగాలుగా సాగసాగాయి. విరిగిపడుతున్నాయి. మళ్ళీ ఉవ్వెత్తుగా లేస్తున్నాయి. ఆపుకోవాలని కానీ అడ్డుకోవటం కానీ ఆమెకు చేతనవటం లేదు.
    అతను మళ్ళీ అన్నాడు. ఆమెలోని కలవరాన్ని గమనించాడు. ఇప్పుడే ఈమె రహస్యం బయల్పడాలి. లేకుంటే మళ్ళీ ఆమెతో నెగ్గుకురావటం కష్టం! ఏదయినా వేడిమీదే.
    "మనస్సుని దాచుకోకండి__మర్మంగా ఉంచుకుంటే ఏదయినా అంతే! చివరికి మనకీ బాధగా తయారవుతుంది. అది మీకే బాధ సభ్యత పేరుతో నన్ను ఇరుకున పెట్టటానికి యత్నించకండి. నేను డాక్టర్ని శరీరానికి మాత్రమే వైద్యం చేయటం కాదు నా వృత్తి మనస్సుని కూడా మరమ్మత్తు చేయాలి చెప్పండి.... మీ మనస్సులో వున్న బాధేమిటో చెప్పండి."
    ఏం చెబుతుంది? ఎలా చెబుతుంది!
    ఎన్ని సంవత్సరాలనుండో లావాల మనసులో ఉబుకుతూ బయటికి పొంగకుండా వున్న దుఃఖాన్ని అణుచుకోవటం సాధ్యంకాక ఎలాగో భగవంతుని దయవల్ల మార్గంలో పడి అది శరీరాన్ని లోలోపలే దహిస్తుంటే పరిసరానికి లొంగి వాటి ప్రభావాన్ని మనస్సుపై జల్లుకుని దాన్నే పన్నీటి జల్లులనుకుని శాంతి నెరగకున్నా శాంతి పొందుకై యత్నిస్తూ శాంతంగా ఉండటానికి యత్నిస్తూ శాంతంగా బ్రతుకుతున్నట్లు నటిస్తూ.
    ఛీ! ఏం బ్రతుకు తనది? అంతా నటన....నటన....జీవితంలో తనకు ఈ మూడక్షరాలు తప్ప కోరుకునే ఆ రెండక్షరాలు లభ్యంకావా? నిరాశతో నిస్పృహతో కృంగిపోవటం కంటే తనకీ జన్మలో మరేమీ దొరుకదా? సుఖమూ, సౌఖ్యమూ రెండూ మంటలోపడి మాడిపోయినా తనకు చింతలేదు. కానీ పుటం పెట్టిన బంగారంలా అందులోంచయినా తనకి శాంతి దొరికితే చాలు.
    ఆమె ముఖంలో శ్రావణమేఘాల్లా తారట్లాడుతున్న భావాల మబ్బులు గమనిస్తున్నాడు.
    "ఎందుకంత వేదన ఈవిడకి? ఇంత చిన్న వయసులోనే అంత ఘోరమైన అనుభవాన్ని పొందిందా? అనుకోలేని అనుకోరాని సంఘటనలకు గురైంది? ఎవరీ అభాగ్య? నిజంగా అభాగ్యేనా? కల్మషరహితంగా ప్రవర్తిస్తుందా? కానీ ఏదో గుండెని మండించే రహస్యం దాచుతోంది? చెప్పదా అది....ఎందుకని యిలా?"
    ఆలోచనని త్రోసి రాజని అన్నాడు.
    "మీరు చెప్పాలి....తప్పదు?"
    అతని కంఠంలోని ఆజ్ఞకి బంధితురాలైంది. దుఃఖమో సంతోషమో, సంభ్రమో, ఉద్వేగమో, ఏదో తెలియని భావాన్ని స్పష్టంచేసే గొంతుకతో పిలిచింది. మావి నమిలిన కోయిలలా జామపండు మెసవిన కోయిలలా....  
    "వేణూ!" ఆమె సంబోధనవిని విభ్రాంతుడయ్యాడు.
    ఏమిటీ వింత మనిషి! ఎవరీ చిత్రవిచిత్ర సంఘటనల్ని విచిత్రాది చిత్రంగా చిత్రిస్తున్న చిత్రనారి? రోజు రోజుకీ ఒక్కో వింతని ఘటింపజేస్తుంది?
    అతని ఆలోచనలకి తావివ్వకుండా అంది. "నువ్వు గుర్తించనే లేదా?" విస్మయంగా ఆమె ముఖంలోకి చూస్తున్నాడు. "యెవరు....? ఎవరు!!
    "ఎవరని గుర్తించాలి? అసలు ఈమె యెవరు? తనెక్కడ కలుసుకున్నదీ దివ్యసుందర పరిమళాన్ని? ఎలా కలుసుకున్నదీ శుభధవళా జ్యోతిర్మూర్తిని? ఎక్కడ పరిచయం అయిందీ శరజ్ఞ్యోత్న్సా వీచికా పరమ కళ్యాణమూర్తిని?
    అతని వదన మండలంలో తారట్లాడుతున్న ఆలోచనా పూర్వక అశాంతి మేఘాల్ని మనసులో నిరంతరం సాగుతున్న ఆలోచనా తరంగిణీ గమనించింది.
    "నన్ను నేనే పరిచయం చేసుకోవాల్సిన దరిద్రపు గొట్టు స్థితి దాపురింప జేసుకున్న దౌర్భాగ్యురాల్ని. అది ణీ తప్పు కాదు వేణూ! ఈ స్థితి సంభవించటానికి మూలకారణం నేను. దోషం నాది. మనిద్దరి మధ్య అంధకారం రాక్షసిలా కూర్చుంది. దాన్ని తొలగించే జ్ఞాపక శక్తిని ప్రసాదించే పరిచయ భాస్కరుడు దయించాలి వేణూ!"
    హృదయాన్ని అణువులుగా మార్చుతున్నాయ్. ఆమె మాటలు ఏ అణువులోనైనా ఏ కొంచెమైనా స్మృతి ఒక్కసారి వికసించి ఒక్కసారి మెదలరాదా భగవాన్ ఏమిటిది?
    "నన్ను నేను ఎరిగి చూచుకోకుండా ఇలాగే నీకు దూరంగా ఉంటూ నిన్ను చూస్తూ మనస్సుకి శాంతిని ప్రసాదించుకోవాలనుకున్నాను. కానీ అది అసంభవమైంది. ఎదురుగా వెన్నని పెట్టుకుని దాన్ని గ్రహించాలని మండుతున్న మనస్సుని చంపుకుని అందుకోమంటే ఎవరైనా నిగ్రహించుకోగలరా!"
    అనుకోకుండా ఆకస్మికంగా పరిచయమై అతి సన్నిహితంగా మెదులుతూ అనురాగాన్ని సంపాదించుకున్న ఈ నూత్న యువతిలో యింతగా చెలరేగుతున్న ప్రళయానికి కారణమేమిటో అర్ధంగాక సతమత మౌతున్నాడతను.
    అంతే కాకుండా తనేకే ఈ విచిత్ర యువతికి సంబంధమేమిటో బాంధవ్యమేమిటో దిక్కు తెలియటంలేదు.
    "నిన్ను విడిచి బ్రతుకమని భగవంతుడు శాసిస్తే తిరిగి జీవితంలో ఏనాడైనా కలుసుకుంటామనే ఊహతో బ్రతికాను. కానీ నిన్ను మరిచిపొమ్మని శాశ్వితంగా దూరం కమ్మని శపిస్తే అదెలా? దానికంటే మరణం మేలు కాదా వేణూ!"
    విషయం చెప్పకుండా విస్తృతంగా విషాదకరంగా డొంకతిరుగుడుగా తన మనస్సుని రకరకాలుగా వెళ్ళడిస్తోంది. కానీ అతనికి అది భరింపరాని వేదనని కలుగజేస్తుంది.
    "అది అసాధ్యం వేణూ! నీకు దూరంగా వుండలేను దగ్గరగా రాకుండా ఉండలేను_దూరంగా పోలేను_నన్ను ఎరిగించుకోకుండా వుండలేను_నన్ను చూసినా సౌందర్యం చూసి ఆకర్షింపబడతావనుకున్నాను."
    అతని కళ్ళలో అంతటి దీన స్థితిలో అంతటి విషాదస్థితిలో కూడా అరుణిమ ఒక్కసారి వెలిగింది.
    "కానీ....కానీ.... నేనే పొరబడ్డాను.... నేను నేనని తెలిసేవరకూ నీవూ యింతే. నేను కాదంటే నాకంటే పరమ సౌందర్యవతి వచ్చినా ఆమె కాలి కొనగోటిని కూడా చూడవు.... కానీ నాకు తెలుసు నేనెవరో నీకు తెలిస్తే మరుక్షణం మనం యిలా ఉండలేం! నన్ను నన్నలా నీవు ఎవరివి? ఏమిటి నీ కధ అని ప్రశ్నించలేవు. చెప్పు వేణూ! నేనెవరినో చెప్పనా?"
    స్మృతికి అందకుండా మనస్సుకి స్పర్శించీ స్పర్శించకుండా వెన్నకంటే మృదువుగా మంచుకంటే చల్లగా వజ్రంకంటే కఠినంగా పదును కంటే వేడిగా ఆమె మాటలు బాధిస్తున్నాయ్ అతన్ని.
    ఇక లాభంలేదు వేణూ! నన్ను నేను ఎరిగించుకోవాలి. తప్పదు. అందుకు నాకు సిగ్గులేదు. అభిమానమూ లేదు. జంకూ గొంకూ అసలేలేదు. పైగా ఒక విధమైన గర్వం అదృష్టంగా వర్తిస్తోంది.
    ఒక్క క్షణం ఆగి గట్టిగా ఏడుస్తూ వొడిలో వాలిపోయి అంది.
    "నేను వేణూ! ఇలా చూడూ నా ముఖంలోకి సూటిగా చూడు. కళ్ళలో కళ్ళుంచి అగాధమైన ఈ స్త్రీ హృదయంలోకి తొంగిచూడు నేను! వేణూ! వెన్నెలకన్నా చక్కగా, మంచుకన్నా దట్టంగా నిన్ను అల్లుకున్న.... నీ....నీ....వి....ర__జ__ని__"


                                                          10


    "విరజా!"
    అది ఆనందమో, విషాదమో, దుఃఖమో, సంతోషమో, అన్నీ కలిసి నమ్మిశ్రిత రూపమందిన భావమో నేను నిర్దుష్టంగా చెప్పలేను చెప్పటానికి నాకు తెలీటంలేదు కూడా! తన వడిలో వాలిపోయిన ఆ అపురూప సౌందర్యవతి తన అమూల్య స్నేహితురాలు ఆత్మీయురాలూ దాదాపు చాలాకాలంనుంచీ ఎవరికొరకై అహరహము మనస్సులో మధన పడుతున్నాడో ఆ దివ్యసుందర విగ్రహం తన యెదలో చిరకాలంగా ఏ మూలోదాక్కుని తనని పరిపాలించిన విశిష్ట గుణను చూచాక ఆమె తన విరాజ అని తెలిసాక అతనిలో ఇతమిద్దమని తెలియరాని భావనలు చెలరేగాయి.

 Previous Page Next Page