'అతను చాలా సరదా అయిన వాడిలా వున్నాడే- భలే కలుపుగోలుగా మాట్లాడేస్తున్నాడు. మంచి విట్టిగా జోకులు, మాటలు మంచి కంపెనీ ఇస్తున్నాడు అందరికీ- అతని మాటల చాతుర్యంతో అతని రూపురేఖలు ఎవరికి గుర్తు రావడంలేదు'
ఆ... కావాలని పెద్ద ఫోజులు కొడ్తున్నాడు, ఇంప్రస్ చెయ్యడానికి... అందరి మధ్య తన ఇన్ ఫీరియార్టీ కాంప్లెక్స్ తగ్గించుకునే ప్రయత్నం అది- కసిగా అంది.
"ఏయ్, మరీ అన్యాయంగా మాట్లాడకు. పాపం మంచివాడు. అన్నింట్లో నేనున్నానంటూ ప్రతిపని అందుకుని మంచి హెల్ప్ ఫుల్ గా వున్నాడు. శ్రీధర్ చెప్పాడు ఇంట్లో అందరిని చాలా బాగా చూసుకుంటాడుట. రిలయబుల్ పర్సన్ అని అన్నాడు. ఏదో మీ చెల్లెలి అదృష్టం.... నీవే అనవసరంగా వాదులు....' ఉషారాణి అంది.
'ప్లీజ్.. ఆ టాపిక్ తేకు నా దగ్గిర' మొహం ఎర్రబరుచుకుని అంది జయంతి.
'ఏమిటి స్నేహితురాళ్లిద్దరు ఎవరిమీద నేరాలు చెప్పుకుంటున్నారు' - దివాకర్ నవ్వుతూ వచ్చాడు.
'మీ గురించే- ఉషారాణి కొంటెగా అంది. జయంతి సిగ్గుపడింది.
'అంత అపరాధం నేనేం చేశాను చెప్మా-' అమాయకత నటించాడు దివాకర్.
"అపరాధం కదా మరి, మంచి ఎలిజిబుల్ పెళ్ళికొడుకయి ఉండి ఇంకా పెళ్ళిచేసుకోకపోవడం"
'అబ్బ,. ఏమిటండీ బాబూ, పెళ్ళి పెళ్ళి అంటూ నన్ను పట్టుకున్నారేంటి- ఏదో హాయిగా ఇలా బతకడం చూడలేకపెడుతున్నారులా ఉండి మీరంటే చేసుకున్నారు. నేనెందుకు సుఖపడిపోవాలని బాధా...' నవ్వాడు.
"అంటే చేసుకుని మేం కష్టాల ఊబిలోకి దిగామంటారా?' కయ్యానికి కాలు దువ్వింది.
"ఏమో, దిగితే కాని లోతు తెలియదంటారుగా- ఏది ఇంకా ఇవాళేగా దిగరాదు. అందుకే పెళ్ళంటే ఏదో చాలా సంబరం పడిపోతున్నారు....' ఉడికించాడు దివాకర్.
'శుభం పలకరా అంటే మీలాంటివాడే ఏదో అన్నాడట-ఇలాంటి దీవెనలీయకండి బాబూ...' ఎప్పటి నుంచో పరిచయం వున్నట్టు ఇద్దరూ వాదులాడుకుంటుంటే జయంతి ముచ్చటగా వింటూండిపోయింది. 'మీరేమిటండీ, మీ స్నేహితురాలు నన్నిలా జాడించి పారేస్తుంటే కాస్తయినా సపోర్ట్ ఇవ్వరు...' అన్నాడు జయంతిని చూసి.
'అది నా ఫ్రెండు, మీకెందుకు సపోర్టు ఇస్తుంది- ఇంతకీ నేనన్నమాటకి జవాబు....'
'ఏం అడిగారు?' అదే మీ పెళ్ళి సంగతి'
'మళ్ళీ మొదలెట్టారూ...' దివాకర్ ఏదో అనే లోపల గోపాలకృష్ణ వచ్చి "రండి రండి ఇంక కబుర్లు చాలు మనం వెడితే...' అంటూ ఉషారాణి వంక తిరిగి 'రండి, పాపం శ్రీధర్ తొందరపడ్తున్నాడు...' అన్నాడు. అన్నింట్లోనూ జొరపడ్తాడు. దివాకర్ ఏం జవాబు ఇచ్చేవాడో, మధ్యన వచ్చి పాడుచేశాడు అనుకొంది జయంతి. అంతా టేబిల్ దగ్గర చేరారు. 'మనం వెడితే వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చూసుకుంటారు' అన్నాడు తమాషాగా- అంతా అర్ధం కానట్టు చూసారు. 'వాళ్ళ ఫస్ట్ నైట్ ఈ హోటల్లోనే అరేంజ్ అయింది- పది అయింది- ఇంక మనం వాళ్ళని వదిలేయాలి' అన్నాడు జేబులోంచి హోటలు రూము తాళాలు శ్రీధర్ కి అందించాడు.
'ఓ సారీ... సారీ... మాకీ సంగతి తెలియదు' రాహుల్ నవ్వాడు. ఉషారాణి సిగ్గుపడింది జయంతి ఏదోలా అయింది. శ్రీధర్ నవ్వి అందరికీ షేక్ హేండ్ ఇచ్చి 'రేపు మావూరికి వెళ్ళాలి. అక్కడ గృహప్రవేశం అది అయ్యాక ఓ వారం అట్లా ఊటీ, కొడైకెనాల్ తిరిగి వస్తాం. మళ్ళీ రాహుల్ పెళ్ళి వేళకి వస్తాం. ఓకే గుడ్ నైట్..... ఈ సాయంత్రం బాగా గడిచింది.... థాంక్స్ ఫర్ ది కంపెనీ-' సెలవు తీసుకుని ఉషారాణి తో కలిసి లిఫ్ట్ వైపు నడిచాడు. అంతా గుడ్ నైట్ చెప్పుకుని బయలు దేరారు. "దివాకర్- మమ్మల్ని కాస్త తోవలో డ్రాప్ చేయగలవా- ఆటో దొరికితే సరే లేదంటే.....' గోపాలకృష్ణ అన్నాడు.
'ష్యూర్....రండి, మీరెక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ చేస్తా' అన్నాడు.
'ఛా... తామిద్దరూ వంటరిగా వెళ్ళే అవకాశం లేకుండా వీళ్ళిద్దరూ తయారు అనుకుని జయంతి పళ్ళు నూరుకుంది. రాహుల్, భావిక వెడ్తూ వెడ్తూ తమ పెళ్ళికి రావాలని చెప్పి వెళ్ళారు అందరికి- కారులో వెనక సీటులో దమయంతి, జయంతి కూర్చున్నారు, గోపాలకృష్ణ ముందు సీట్లో కూర్చుని లొడలొడ వాగుతూంటే భరించలేక కళ్ళు మూసుకుని తల ఆన్చింది జయంతి- సగం దూరం వెళ్ళే వరకు ఆటో ఏదీ కనపడలేదు- 'ఇంకాస్త దూరమేగా డ్రాప్ చేస్తాను' అన్నాడు దివాకర్. దాంతో మరింత నీరుకారి పోయింది జయంతి. మంచి ఛాన్సు మిస్సయిపోయినట్లు బాధ. ఎంతో చక్కగా గడిచిన సాయంత్రం ఆఖరికి చప్పగా ముగిసింది. 'తోవలో జయంతి గారిని ముందు డ్రాప్ చేసి, మీ యింటి కెడదాం' అన్నాడు దివాకర్. వాళ్ళని ముందు దింపితే ఓ రెండు నిమిషాలకన్నా అతనితో వంటరిగా వుండచ్చు అనుకున్న జయంతి ఆశకి నీళ్ళు చిమ్మినట్లయింది. ముఖం ముడుచుకుంది. దమయంతి అది కనిపెట్టి 'మనం ఆటోలో వెళ్ళాల్సింది, అనవసరంగా దివాకర్ గారికి శ్రమ....' అంది. శ్రమ ఏముంది వెళ్ళేతోవేగా' అన్నాడు గోపాలకృష్ణ.
'అంతే లెండి మీ బుర్ర' దమయంతి .... అంటే.... అంటే ఏమిటి?'
'అంటే లేదు....కొంటే లేదు.... ఇంక చాలు ఆపండి...' విసుగ్గా అంది దమయంతి.
'మీ భాష నాకర్ధం కావడం లేదు. ఏం మాట్లాడుతున్నారు' దివాకర్ అర్ధం కాకఅన్నాడు.