వినాయకరావుగారి ప్రథమ భార్య,బిడ్డలు లేకుండానే ఇరువది యైదవయేట కాలము చెందినది.అప్పుడే రెండవభార్యను చేసుకోన్నారట.రెండవ భార్యకు చాలా కాలమువరకు కాన్పురాలేదు.శేషాచలపతితో వియ్యమందుటకై నా నాకు బిడ్డలు కలుగలేదే అని ఆయన దిగులు పెట్టుకునేవారట,మా తండ్రిగారు పోయిన రెండేళ్ళకు వారి ప్రథమ పుత్రిక ఉద్భవించినది.అందాల ఆ చిన్నపాప నేనేత్తుకొన్నప్పుడు చాకలి తెచ్చిన బట్టలైనాసరే ,ఆమె అశుభ్రపరచినా మాట్లాడకుండా ప్రక్కనే ఉన్న మా యింటికి గిరుగెత్తుక వెళ్ళి ఆ బట్టలు విడిచి శుభ్రమైన బట్టలు కట్టుకొని వచ్చేవాడిని.మేము రేపల్లెచదువుకు వెళ్ళేసరికి శకుంతల తప్పటడుగులు వేస్తుండేది.మొదటిసారి సెలవలకు వచ్చినప్పుడు,ఆమె ముద్దు మాటలు మాట్లాడినది.రెండవసారి సెలవలకు వచ్చినప్పుడు,మొదట నన్ను చూచి క్రొత్తచేత సిగ్గుపడినా రెండవదినం నా మెడచుట్టి నన్ను వదిలింది కాదు.
బంగారపు తొనల ఒళ్ళు,ఒత్తుజుట్టు;ఆ జుట్టు వెనక్కు తీసుకోవటము తెలిసేదికాదు.జుట్టు మధ్యనుంచే కళ్ళతో చూస్తూ మాటాడేది. బావ వత్తేలు బితకత్తులు తెత్తిపెత్తాడు''నాన్నా బావను పెల్లి తేతుకుంతా'' అని అంటూ వుంటే దేహ మనఃప్రాణాలతో కాంక్షించి పెళ్ళిచేసుకొన్న నవయౌవనుని హృదయంలా నా హృదయము దడదడ మనేది.పాలకడలి పొంగులో పైకుబికిపోయేది.
నేను పదేళ్ళ కుర్రవాడిని.ఆమె అయిదేళ్ళ బాలిక.మే మిద్దరం చిన్నతనాన్నుంచీ ఒకే కంచంలో తినడ మలవాటు. వాళ్ళింటికి వెళ్ళినా వాళ్ళమ్మ ఒకే వెండికంచంలో మాకు అన్నం పెట్టేది.ఒక్కొక్కప్పుడు మా ఇంట్లోనే రాత్రులు నా మంచం మీదనే,నా ప్రక్కన పడుకొని నిద్ర పోయేది.మానిద్దురలో ఆమె నాన్నగారు వచ్చి ఎత్తుకొని తీసుకుపోయేవారట.వాళ్ళమ్మ ఏమి పెట్టినా నాకు పెట్టకుండా తినేదికాదు. నేనేమి సంపాదించినా శకుంతలకు పెట్టకుండా తినేవాణ్ణికాదు.
నేను విన్న కథలు, చదివిన కథలు ఆమెకు చెప్పేవాణ్ణి.ఆమెకు వాళ్ళ అమ్మమ్మ చెప్పిన ఈగ పేరు మరచిన కథ,రాజుకు ఏడుగురు కొడుకుల కథ,పేను కథ,కాకీ పిచ్చుక కథ తన తియ్యనైన లేత మాటలతో,
పేదరాసి పెద్దమ్మా
పెద్దమ్మ కొలుకా
కొలుకుచేతి గొడ్డలా
గొడ్డలికొత్తే చెత్తా
చెత్తుమీద వాలిన పిత్తల్లాలా
పిత్తలు తాగే నీల్లా
నీల్లల్లో తిరిగే తేపల్లాలా
తేపల్ని పత్తే జాలరివాలా
నా పేలేమితి?''
అని కథ చెప్పుతుంటే, నా ఆ చిన్ననాటి దశలోనే ఆ మాటలతో కలిసిపోయి ఏలోకాలలోకోపోయేవాడిని.ఆమె ఆకథ ఎన్ని మారులుచెప్పినా క్రొత్త అందాలతో కనబడేది. గుజ్జనగూళ్ళ ఆటలాడే వాళ్లము.''నేను బువ్వ వండుతాను,నీవు క త్తేరుకు వెళ్ళిరాబావా''అని ఆమె అన్నప్పుడు ఆ బొమ్మరిల్లే మహాభవనమై,ఆ వేయించిన కందిపప్పే పంచభక్ష్య పరమాన్నాలై,ఆమె నా దివ్యసుందరి గృహిణియై,రాజ్యభారము వహించిన ఒక ఉన్నతోద్యోగిని నేనై,అవ్యక్తంగా క్రీనీడలలో నాకా రోజులల్లో మహదాశ్చర్యమైన ప్రపంచ మొకటి ప్రత్యక్షమయ్యేది.ఒక్కొక్క ఏడు నాకు పై పడుతున్న కొలది,మాయందొకరికొకరికున్న ప్రేమ ద్విగుణీకృతమయ్యేది.
ఒక రోజున మా స్నేహితులకు ఆట యుద్దమునుంచి నిజమయిన యుద్దము వచ్చినది.తోలు బొమ్మలాట చూచిన ఫలితమది.ఒక జట్టు పాండవులు,ఒక జట్టు కౌరవులు.నేను అర్జునుణ్ణి.పడిపోయిన దుర్యోధనుడి తలపాగా కోస్తున్నట్టు నేను నటిస్తున్న సమయంలో,ఆ దుర్యోధనుడి జుట్టు కొంచెము లాగినాను.పధ్నాలుగేళ్ళ రెడ్డిపిల్లవాడుకోపముతో లేచి,అయిదువేళ్ళు అంటేట్టు చెంప పెట్టు ఇచ్చినాడు. ఒక నిమిషం తెల్ల బోయినాను.రెండవ నిమిషం కళ్ళనీళ్ళు తిరిగినవి,మూడవ నిమిషం వెర్రి కోపంవచ్చి పొట్ట మీద తన్నినాను. ఆ మరునిమిషంలో వాడి జుట్టు నేను,నా జుట్టు వాడు పీక్కోవడము గ్రుద్దుకోవడం,తన్నుకోవడం,స్నేహితులందరు చుట్టూగూడి నవ్వడం,ఈ మహా యుద్దంలో ఎక్కడనుంచివచ్చిందో శకుంతల.వాళ్ళ నాన్నగారి పేపబెత్తము పట్టుకొని గబగబవచ్చి దడదడ ఆ రెడ్డి స్నేహితుణ్ణి నాలుగు తగిలించింది.సోగలైన ఆమెకళ్ళు అప్పుడు స్పులింగాలు ఆర్చినవి.మహాగ్నిహోత్రాలై వెలిగినవి.''మా బావను కొడతావా?వెధవా!నిన్ను చంపేస్తా''నని మహాకోపముతో పలికినది. ఆ రెడ్డి బాలుడు తెల్లబోయి, నా జుట్టు వదిలినాడు.నేను తెల్లపోయి వాడి జుట్టు వదిలినాను.
నన్ను థర్డు ఫారంలోకి వేసినప్పటికి నాకు పండ్రెడవయేడు.శకుంతలకి ఏడవ ఏడు.బావతో వెళ్ళి రేపల్లెలో చదువుకుంటానని ఆమె పోరు పెట్టింది. పుత్రికమీద ప్రేమతో వినాయకరావుగారు రేపల్లెలో కాపురము పెట్టి,పిల్లను అక్కడ ఆడపిల్లల బడిలో చేర్పించినారు. అప్పుడామెకు కలిగిన సంతోష ముత్తుంగతరంగములైనది, మా మాస్కూళ్ళ నుంచి రావడం తోనే మేము కలుసుకొనేవాళ్ళం.''నాకు సంగీతం చెప్పించు నాన్నా ''అని ఆ పదేళ్ళ బాలిక సంగీతం కూడా ప్రారంబించింది.రోజూ క్లాస్ లో చదువుకొన్న పాఠాలు నాకు ఒప్పచెప్పేది.పాఠంలో ఏ మాత్రం అనుమానం వచ్చినా నన్నడగవలసిందే. ఆ చిన్ననాటి రోజుల్లోనే నేను బి.ఏ.చదువుతున్న కుఱ్ఱవాడ్ని అన్నట్టు సంచరించేది.
తన చుట్టాలతో మాట్లాడేటప్పుడు ''మా బావకు సంగీతం బాగా వచ్చును.మా బావ కథలు బాగా చెప్పుతాడు, మా బావ ఎంతో తెలివైనవాడు,మా బావ అన్ని క్లాసుల్లోను ఫస్టుగా ప్యాసవుతాడు ''అన్న అసదృశమైన ఆమె పూజలో నేను జవహర్ లాల్ నెహ్రూ అంతటివాణ్ణా అనుకోనేవాణ్న.తెలియకనే ఆ చిన్ననాటి కళలు,ఆ భావాలు,ఆ చిత్రాలు కాశీపటముల పెట్టెలోని బొమ్మలవలె అవ్యక్తమైన మధురమై తిరిగిపోయినవి.పెద్దవారి మాటల్లా ఆడబోయిన మాటల్లో అర్ధము లేదు,అర్ధవత్క్రుతులు మాత్ర మున్నవి.ఆ నీడలలో గాఢతమస్సులు లేవు సందె వెలుగులు పరిమళపూర్ణాలై లేచిపోతుంటవి.ఆ రోజులలో గ్రీష్మాతపములు లేవు.సువ్యక్తదినకాంతులు లేవు.నిష్కల్మష ప్రేమలు,నిర్మల హృదయాలు!