Previous Page Next Page 
మరో ప్రస్థానం పేజి 16

 

                                      దూదిపులిమీద పుట్ర*

    

ఓరోరి ముఖ్యమంత్రిగా - ఇందిరమ్మ
గారి బాజా భజంత్రిగా
ఓరౌరా వెంగళప్పిగా - జలగవు నీ
పేరంటే కడుపు నొప్పిరా!

బానిసకొక బానిసకొక
బానిసవోయ్ బానిసా!
మానిసి జన్మాని కిసీ
మచ్చవు నడపీనుగా!

ఎదిరిస్తాం చూడు నీ జులుం -ధగిడీకే
వదిలిస్తాం నేడె నీ కిలుం
ఎందుకు నీకింతగా హజం - బ్లడీఫూల్
ఇంక సాగబోదు నీ జులుం

పాతపెంట వదలని నీ
భూతభక్తి పోదే
నూతన భవితవ్య రాజ్య
కేతన మిక మాదే

కాంగిరెస్సు చాకలింటిలో - దిక్కుమాలి
వంగి వంగి నడచు గాడిదా!
కలవారల కంపుగుడ్డల - మూటలెత్తు
కర్మ గతి నిన్ను వీడదా?

కుట్రకేసు2 బనాయించి
కులికేవా దొమ్మరీ
గూడపుఠాణీ చేసిం
దెవరో చూద్దా మ్మరి!

ప్రజాసేన నడుస్తోందిరా - నీ గుట్టును
ప్రజల ముందు పడేస్తుందిరా
ప్రజాకోర్టు జ్వలిస్తుందిరా - నీ  తప్పుకు
తగిన శిక్ష విధిస్తుందిరా

దొంగనోట్ల దొంగవోట్ల
రాజ్యం ఒక రాజ్యమా?
లంచగొండి వెధవలిచ్చు
సాక్ష్యం ఒక సాక్ష్యమా?

పోలీసుల బలగముందనీ పొంగిపోయి
చంపిస్తా వెంతమందినీ?
జనసైన్యం జుట్టుజట్టుగా  - నీ నెత్తురు
పిండుతుంది బొట్టు బొట్టుగా!

కుట్రదారు ప్రభుత్వమే
ప్రజలు దాన్ని చీల్చరా?
క్రుద్ధ విప్లవోగ్ర
కలం నిన్ను కాల్చదా?
నడివీధిని నడవలేవురా - ఆదమరచి
నడిరాతిరి నిదురపోవురా?
నక్సలైటు పోల్చినాడురా - నీ నెత్తిని
నాటుబాంబు పేల్చుతాడురా?

కమ్యూనిజమంటె నీ
కమ్మయ్యో ఎంత భయం?
నిజం చెప్పనా, కమ్యూ
నిజానిదే తుది విజయం
(వి.ర.సం. రచయితల నిర్భంధానికి నిరసనగా)
రచన:12-7-74,ముద్రణ: మరో ప్రస్థానం, విరసం ప్రచురణ-మే, 1980

*దూదిపులిమీద పుట్ర : విశాఖపట్నం (అప్పటి వాల్తేరు) స్టేషన్లో దూదిపులి కొనుక్కొని శ్రీశ్రీ  దానిపై నీళ్లు గుమ్మరించారు. అది ప్రభుత్వాలకు సంకేతమని శ్రీశ్రీ ఉద్దేశం.

2. సికింద్రాబాద్ కుట్రకేసు ప్రస్తావన. దీన్ని 1974 మే  18న అప్పటి వెంగళరావు ప్రభుత్వం పెట్టింది. కొండపల్లి సీతారామయ్య. కె.జి. సత్యమూర్తి వంటి నక్సలైటు నాయకులతోపాటు ఆరుగురు విరసం రచయితలతో సహా మొత్తం 45 మంది మీద ఈ కేసు పెట్టారు. 15 ఏళ్ల విచారణ తరువాత 27-2-89 న సెషన్స్ (స్పెషల్) కోర్టు ఈ కేసు కొట్టేసింది.

 Previous Page Next Page