Previous Page Next Page 
అసావేరి పేజి 16

    అక్కడ ఆమె అశ్రువులు కళ్ళాపి జల్లలేదు.
   
    కానీ అనురాగం రంగవల్లి కల్ని పెడుతూంది.
   
    మామిడాకులు కట్టలేదు. కానీ మనసు రహదారి మనోజ్ఞమైన అలంకరణలతో ఆ ప్రదేశాన్ని ప్రేమమండపంగా మార్చింది.
   
    అతడు కదిలాడు నిశ్శబ్దంగా.
   
    ఆమె చూస్తూంది ఓరగా.
   
    అనురాగ ద్వారబంధాన్ని ఎలా దాటాలీ అన్న సందిగ్ధత వుంది.
   
    సరిగ్గా అప్పుడు కనిపించాడు ఎదురుగా నిలబడ్డ రవి. ఆమె అన్నయ్య.
   
    ఖంగుతింది.....కంగారుపడింది. కళ్ళు తుడుచుకోవాలన్న విషయమూ మరిచిపోయింది.
   
    "మళ్ళీ ఏమన్నాడు" ఆమె కన్నీటిని అక్కడ దూరంగా నడిచి వెళుతున్న శంకూని అపార్ధం చేసుకున్న రవిని వారించాలనుకున్న ఆమె ప్రయత్నం విఫలమైంది.
   
    ఆమె కంపించిపోతూ క్లాస్ రూంకి వెళ్ళిపోయింది.
   
    కానీ అప్పటికే శంకూ షర్టు కాలరు పట్టుకుని ఆవరణలోని రావిచెట్టు దగ్గరికి ఈడ్చుకుపోయాడు.
   
    "నేను....నేను...నేనేం చేయలేదు"
   
    "నా కొడకా నిక్కరు వదిలిపెట్టి పేంటేసుకోవడం తెలియగానే పెద్ద హీరోనైపోయాననుకుంటున్నావా? మొన్న తగిలినవి చాల్లేదూ....?" నేలపైకి విసిరాడు.
   
    మొన్నటిలాగే జరుగుతున్నదేమిటో ఈ రోజూ అర్ధం కాలేదు శంకూకి. పూర్తిగా గాయాలు ఎక్కడ మానేయని అందుకే నీరసంగా లేచాడు.
   
    చుట్టూ స్టూడెంట్స్ మూగారు. వెంకట కూడా అక్కడికి పరుగెత్తుకొచ్చాడు. కానీ రవి ఉద్రేకాన్ని చూసి ముందుకెళ్ళలేకపోయాడు.
   
    "రవీ....ప్లీజ్ నేను...ఏమీ..."
   
    ఒక నిస్సహాయుడిపై ఇంతమంది చూస్తుండగా తన అహాన్ని ప్రదర్శించడం చాలా ఆనందంగా అనిపించిందేమో ఏదో నచ్చచెప్పబోతున్న శంకూ చెంపపై చాచి కొట్టాడు.
   
    కళ్ళు బైర్లు కమ్మాయి. బోర్లాపడ్డ శంకూ రొప్పుతూ లేచే ప్రయత్నం చేస్తున్నాడు. "అసలు....నేనేం తప్పుచేశానని...." శంకూ గొంతు ఆర్ద్రంగా మూలుగుతూంది మొన్నెప్పుడో తగిలిన చెంపపై గాయం నుంచి ఇప్పుడు మళ్ళీ రక్తం ధారకడుతూంది. "నిజం రవీ! నేను ఏ తప్పు.....
   
    "నోర్ముయ్....లంజా..." మరోసారి తన్నాడు నడుంపై బలంగా.
   
    సన్నని మూలుగు శంకూ గొంతునుంచి "నన్ను తిట్టుకానీ..." దుఃఖం ముంచుకొస్తూంది. అంతకుమించి అలవాటులేని ఆ'తిట్టు' అతడి గుండెల్ని మండిస్తూంది. "మా అమ్మని ఏమీ అనకేం....."
   
    "ఏం మీ అమ్మేమన్నా పతివ్రతనుకున్నావా అది నిజంగా లంజేరా....బాస్టర్డ్...." ఈలలు వేశారు రవి బృందం పైశాచికంగా.
   
    శంకూ పైకి లేచాడు నిస్త్రాణగా. "ప్లీజ్! అమ్మనేమీ అనకు. అలా తిట్టకు."
   
    "ర్రేయ్....పెళ్ళి కాకుండా ఎవడితోనో కడుపు చేయించుకొని కనేసిందని వూరంతా అంటారే! బాదెందుకురా?"
   
    శంకూ నొసలు చిట్లించి చూశాడు అది.... ఆ విషయం అతనికి తెలియని విషయమే....అందుకే స్తబ్దుడై చూస్తున్నాడు ఆ స్థితిలో కూడా.
   
    "నిజంరా శంకూ....మీ అమ్మకి ఎవడో కడుపు చేసి పారిపోతే పుట్టిన బాస్టర్డ్ వి నువ్వు...."
   
    "రవీ!" శంకూ ఎంత గట్టిగా అరిచాడూ అంటే క్షణంపాటు రవి సైతం కంగారుపడ్డాడు.
   
    "వదిలెయ్....మా అమ్మ సంగతి మాట్లాడకు."
   
    నా చెల్లి సంగతి మాట్లాడతానంటూ రవి జరిగిన విషయం అక్కడ చర్చించలేదు. అది తన కుటుంబ పరపతికి సంబంధించిన సమస్య మరి "ఒక్కసారికాదు లక్షసార్లు మాట్లాడతానురా శంకూ....మీ అమ్మ పెళ్ళికాకుండానే కడుపు...."
   
    ఆ వాక్యం పూర్తికానేలేదు. శంకూ చేయి బలంగా రవి పొట్టని తాకబోయింది.
   
    అప్పుడే అక్కడికి దూసుకొచ్చిన సురేంద్ర అమాంతం శంకూని ఒడిసిపట్టుకున్నాడు.
   
    దుఃఖోద్విగణంగా రొప్పుతూ పట్టు విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు శంకూ. "నన్నొదులు...వాడ్ని చంపుతా...."
   
    "ఏమైందిరా ఒరేయ్ శంకూ..." శంకూ చెంపలనుంచి కారుతున్న రక్తాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాడు. "నా మాట విను."
   
    శంకూ కళ్ళ నుంచి రాలుతున్న నీళ్ళు చెంపల్లోని రక్తంతో కలిసి పోతున్నాయి. వినన్రా....నేను వినను అమ్మ కెవరో కడుపు చేస్తే నేను పుట్టానని నోటికొచ్చినట్టు వాగుతున్నాడు"
   
    "నిజమేన్రోరే..." రవి పగలబడి నవ్వాడు గర్వంగా. "ఇది అబద్దం కాదు. అందరూ చెప్పుకునేదే...."
   
    మరోసారి విదిలించుకొని కలియబడాలనుకున్నాడు. కానీ సురేంద్ర బలంగా ఆపాడు.
   
    "విడిచెయ్ సురేంద్రా.... పాపం మాతృభక్తి పెల్లుబికిపోతూంది. ఒదిలెయ్....కీళ్ళు విరిచేస్తాను."
   
    "రవీ! కంట్రోల్ యువర్ టంగ్" సురేంద్ర కంఠం ఖంగుమంది.
   
    "ఏం....ప్రాణస్నేహితుడి తరపున వకాల్తా పుచ్చుకుంటున్నావా?"
   
    "కాదు....నిన్ను ప్రాధేయపడుతున్నాను."
   
    "వినలేదూ అనుకో...." రవి తలబిరుసుగా చూశాడు.
   
    "నా సహనం నశించిపోతుంది కాబట్టి ఒక పసికందులాంటి వాడి మీద చేయిచేసుకున్న నీ చేతుల్ని నేను విరిచేస్తాను..."
   
    "మిస్టర్ సురేంద్రా...." రవి రెండడుగులు ముందుకేశాడు. ఓ అరక్షణం ఆలస్యమయితే సురేంద్ర కలియబడేవాడే! అప్పుడు మధ్యలోకి వచ్చాడు శంకూ.
   
    "సురేంద్రా...." ఇంకా ఆ ఉన్మాదం నుంచి తేరుకున్నట్టు లేడు శంకూ "ఇది నాకూ, రావికీ మధ్య గొడవ! నువ్వు జోక్యం చేసుకోకు" ఎప్పుడూ పెదవి విప్పని శంకూ అలా మాట్లాడుతుంటే సురేంద్ర సైతం నివ్వెరపోయాడు.
   
    "సో...వీడు..." రవి శంకూనే చూస్తూ అన్నాడు. "అదే.....ఈ బాస్టర్డ్...అలా రోషంగా చూడకు. నాతో ముష్టియుద్దానికి సిద్దపడి వాళ్ళ అమ్మ శీలవతనే నిరూపించబోతున్నాడు! కదరా...."
   
    "అవున్రా" ఇప్పుడు అతను కూడా 'ఒరేయ్' అని అడ్రస్ చేశాడు. "నేను...నువ్వాన్నావే ఆ బాస్టర్డ్....రెండుసార్లు నా మీద ఉట్టిగా చేయిచేసుకున్న నేరానికి నీతో తలపడబోతున్నాడు. ఎవడిచేతనో అమ్మ మోసగించబడినా ఒక్కడికే పుట్టానని నిరూపించుకోబోతున్నాడు ఆ...."
   
    అక్కడ హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది. చాలా సేపటిదాకా.
   
    "నేను రెడీ" రవి తన సంసిద్దతని వ్యక్తం చేశాడు.
   
    "ఒరేయ్ శంకూ...." సురేంద్ర నచ్చజెప్పబోయాడు.
   
    "సురేంద్రా" శంకూ కళ్ళిప్పుడు నీళ్ళు వర్షించటం లేదు. హఠాత్తుగా వయసు పెరిగిపోయినట్టు ఆధ్యాత్మికంగా చూస్తున్నాడు. "బామ్మ తప్ప ఎవరున్నారు నాకు? నిజమే కావచ్చు! నేను ఎడ్రసులేని తండ్రికి పుట్టినవాడ్నే కావచ్చు! అయినా మాత్రం నాకు జన్మనిచ్చిన అమ్మని నేనొక్కడ్నే అసహ్యించుకోవాలి. వీళ్ళంతా ఎవరు...."
   
    సురేంద్ర నుదుట చెమట పట్టేసింది ఆ విషయం ఊళ్ళో అందరితో బాటు సురేంద్రకీ తెలుసు! కానీ యిప్పుడు ఏం సాధించాలని యిలాంటి రిస్క్ తీసుకుంటున్నాడో అర్ధం కావటంలేదు. పైగా యింకా పాలుగారుతున్నట్టే వుండే శంకూ రవితో ఏం తిరగబడగలడు?
   
    "శంకూ...అసలిదంతా...."
   
    "భయపడుతున్నావా సురేంద్రా! ఇందులో నేను నష్టపోయేదేముందని? గెలిస్తే వీడి నోరు శాశ్వతంగా మూయించే వాడినవుతాను....లేదూ అలాంటి తల్లి కడుపునా పుట్టినందుకు నాకు అదే సరయిన శిక్షనుకుంటాను."
   
    "ఇంత మొండితనమేమిట్రా?"
   
    "నో....నేను రెడీ రవీ! నువ్వెప్పుడంటే అప్పుడు...."

 Previous Page Next Page