తలూపింది సావేరి తల వంచుకునే.
మంగ అటూ ఇటూ చూసి రహస్యంగా అంది "కబురందించనా?"
సావేరి చెంపలపై హఠాత్తుగా విరిసిన ఓ హరివిల్లు కదిలి కళ్ళదాకా ప్రాకింది. కనుపాపలపై తెలుపు ఎరుపుల ముత్యాల్ని నింపింది.
"రాలుగాయి పిల్లా బోధపడింది...." నవ్వేసింది మంగ. "ఎక్కడి వాడమ్మా ఈ అందాల భరణి మనసు దోచుకున్న ఆ అల్లరివాడెవరమ్మా? సూర్యుడంత కాంతితో వుంటాడా....చంద్రుడంత చిలిపి వెన్నెల్ని కురిపిస్తాడా...."
సావేరి చెప్పలేదు. నెలవంక అంచున మంచు సిగ్గయి నిలిచింది. ఆ సిగ్గు పూచిన మొగ్గయింది. విరియని మనసు రెక్కల మధ్యనే ఇంకా నిజాన్ని దాచేయాలనుకుంది.
"చెప్పు తల్లీ....ఎవరు? ఎవరమ్మా ఎవరు?"
"శ..." ఓ ప్రణవం గొంతుదాకా వచ్చింది.
"శివుడా!"
తలూపింది. "శంకరుడు"
"శంక!" తిరిగి వల్లించబోయిన మంగ ఉలికిపాటుగా ఆగింది "శంకూ!"
"ఆ-?" సావేరి రెప్పల్ని టపటప లాడించింది. "శంకూ-నీకు తెలుసా!" పట్టుకుని కుదిపేసింది. జవాబు చెప్పకుండా స్థాణువులా నిలబడ్డ మంగని వాటేసుకుని మరీ అడిగింది. "చెప్పవే! శంకూ....నీకు తెలుసా?"
మంగ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. కానీ అవి కనిపించకుండా జాగ్రత్తపడుతూ మరెటో తల తిప్పుకుంది.
ఇప్పుడు అంతా చాలా స్పష్టంగా అర్ధమైపోయింది శంకూపై దాడి ఎందుకు జరిగిందీ. అంతేకాదు.... ముగిసిపోయే శంకూ కథకి మొదటి పుట సావేరి అవుతూందని బోధపడిపోయింది.
మంగకి ప్రేమంటే కొద్దిగా తెలుసేమోకాని అమర ప్రేమల గురించి అవగాహన లేదు. ప్రేమ కోసం నెల రాలిన గోమియో జూలియట్ ల గాథ తెలీదు. సజీవ సమాధితో ముగిసిన అనార్కలీ సలీంల అదృశ్యమైన ప్రేమకావ్యాల గురించి ఎప్పుడూ వినలేదు కాని ఇక్కడో రసాభాసం చెందబోయే ప్రేమకావ్యానికి సృష్టీ జరిగిపోతూందని అర్ధమైపోయింది.
"అమ్మా సావేరీ...." మంగ కంపించిపోతూంది ఉద్వేగంగా...."ఇది కూడని పని తల్లీ....ఆకాశానికి, నేలకి చెలిమి కూడదమ్మా....నెల సమాధి అవుతుంది. నిప్పురవ్వకీ, నీటికీ సముద్రానికీ ప్రేమేమిటి తల్లీ.....! ఆరిపోతుందమ్మా.....పూరిగుడిసెకీ, పర్వతానికీ స్నేహమేమిటి....! కూలి పోతుందమ్మా!"
సావేరికి సరిగ్గా అర్ధం కాలేదు. అసలు అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించాలనీ అనిపించలేదు. "అసలు శంకూ నీకు తెలుసో లేదో అధో చెప్పవే."
"అమ్మా....శంకూ నీకు తగడు తల్లీ...."
"మంగా...." తన ఇష్టాన్ని ప్రశ్నించడం సావేరికి నచ్చలేదు.
"అవునమ్మా సావేరీ" ఆమె ఆలోచనల్ని అక్కడే త్రుంచేయాలనుకుంటూంది మంగ.
"శంకూ మాటాడగలడేమో కాని మూగవాడు....ప్రేమకు అర్హుడేమో కాని నువ్వు ప్రేమించకూడనివాడు. అసలు....అసలు...నోటితో ఏదీ అడగలేనివాడే....నిన్ను కావాలని ఎలా కోరుకున్నాడు....!? నీతో అన్నాడా?"
"అనలేదు. కానీ నాకు ఇష్టమయ్యాడు. నన్ను ఇష్టపడుతున్నట్టే చూస్తుంటాడు.
"పొరపాటు పడ్డావు తల్లీ.....పిచ్చి సావేరీ....శంకూ గురించి నీకు తెలిసింది చాలా తక్కువమ్మా! శంకూ అందమైన పువ్వుని చూసి పులకరిస్తాడు. పూలరెమ్మల్ని తాకి పలకరిస్తాడు....నీటి అలలతోనూ మాటాడతాడు. గాలి కెరటాలతోనూ ఆటలాడుకుంటాడు. అందగాడే అయినా అందడమ్మా!"
"మంగా...." రోషంతో రొప్పుతూంది సావేరి. "నిన్నవన్నీ చెప్పమనడంలేదే! శంకూ నీకు తెలుసా లేదా?"
"నా మాట విను తల్లీ...."
"విననే....నేనెవరి మాటా వినను....అస్సలు వినను అంటే వినను. అంతే..." మొండిగా అంది. సావేరి కంఠం రుద్దమవడమూ మంగ గుర్తించింది. "ఇష్టమైతే చెప్పు, లేకపోతే లేదు. అంతేకాని, నాకిలా నీతులు చెబితే చంపుతా....ఆ...."
కొన్ని క్షణాలపాటు ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది ఈ కథ ఏ మలుపు తిరిగినా ఇక సావేరిని మళ్ళించడమూ కష్టమనిపించింది. "అమ్మా సావేరీ...." చివరి అస్త్రాన్ని సంధించాలనుకుంది "నీకు శంకూ అంటే చాలా ఇష్టమా?"
తల పంకించింది అవునన్నట్టు.
"చాలా-చాలా ఇష్టమా?" మృదువుగా రెట్టించింది.
"చచ్చేటంత ఇష్టం."
ఓ నీటిబొట్టు మంగ కళ్ళల్లో నిలిచింది. "మరి శంకూ బ్రతకడమూ నీకిష్టమేగా?"
"ఎందుకు బ్రతకడు?" సావేరిలో సన్నని ప్రకంపన.
"అయ్యో" మంగ తల పట్టుకుంది. నీకెలా చెప్పేది తల్లీ.....నీ పాదం క్రింద ఇసుకరేణువుగా సైతం నలిగే అదృష్టానికి నోచుకోలేని మామూలు పిల్లాడమ్మా! నువ్వు కోరినా నీకు దక్కడు...ఎవరికీ దక్కనంత దూరంగా వెళ్ళిపోతాడు.
"అంటే?" సావేరి పెదవులు అదిరిపడుతున్నాయి.
"నీవాళ్ళే నీ ప్రేమని అంగీకరించరు. నీ లోగిలి మనుషులే శంకూని చంపేస్తారు." మంగ దుఃఖం కట్టలు త్రెంచుకుంది. "కాబట్టే ఇప్పుడు చావగొట్టి వదిలిపెట్టారు."
"ఏమిటీ...." ఒంటరి కెరటంలా ఓ బిందువు సావేరి కళ్ళ అంచున నిలిచింది.
"మీ అన్న శంకూని చితకబాదాడమ్మా. ఈ కథ ఇక్కడ ఆగితే శంకూ అలాగాయినా మిగులుతాడు. లేకపోతే ఇక బ్రతకడు....బ్రతకనివ్వరు."
మంగ వెళ్ళిపోయింది.
సావేరి కళ్ళిప్పుడు ధారాపాతంగా వర్షిస్తున్నాయి.
నిస్సహాయంగా కాదు....కసిగా...అంత కసిలోనూ సానుభూతిగా.
* * * *
"శంకూ!"
కాలేజీ కారిడార్ ని దాటుతున్న శంకూ టక్కున ఆగిపోయాడు.
అక్కడ ఓ స్థంభం మాటున అరమోడ్పులౌతున్న నేత్రాలతో నిలబడి వుంది సావేరి సగం గీసిన దేవుడి బొమ్మలా, పూర్తిగా తెరవని ప్రబంధంలా....శంకూ గుండెలు అదిరిపడ్డాయి.
"అయామ్ సారీ" ఆమె కనురెప్పల అందున ఓ నీటిబొట్టు కాబోతున్న మహాకావ్యంలా__
క్షణం రుషి అయ్యాడు. నా రుషిః కరుతె క్రమ కావ్యమనే మహర్షిలా ప్రశాంతంగా చూడాలనుకున్నాడు కాని మనసు లయ తప్పుతుంది. అంతకుమించి ఒంటిలోని రక్తం ఎందుకయ్యాయో తెలీని నిన్నటి గాయాల మచ్చల దగ్గర గూడుకట్టుకుంటూంది.
"నేను...అసలు కావాలని చూపించలేదు...." అర్ధంకాని కవితా వస్తువులా ఒక్కో పదమూ ఆమె పెదవుల మధ్యనుంచి జారిపడుతూంది. "ప్రామిస్....నిజం....నేను...."
అర్ధమయ్యి కాని స్థితి అదే. అలా చూడాలనే వుంది. అది ఎవరూ చూడని కథే అయితే ఆ స్వప్నంలో ఎవరికీ తెలియకుండా అలా ఎంత సేపైనా నేలకి దిగిన ఆ మెరుపు తీగని చూస్తూ గడిపేయాలని వుంది. కానీ భయం, ఆరాటం, ఆందోళన.
"ఇంకెప్పుడూ ఇలా జరగనివ్వను" ఆమె చెప్పుకుపోతూంది అశ్రుసిక్తనయనాలతో.
సిగ్గుతో తల వాల్చిన శుక్లపక్షపు జాబిల్లిలా నేలరేకల ముసుగు దిద్దుకుని ముందుకు నడిచివచ్చిన అనార్కలిలా చిగిర్చిన నవ్య కవిత్వపు నయాగరాలా ఒక సంజెవేళ ఏ గుండె దిగంతాల స్వరమేళనమో సత్యమై-శివమై-సుందరమై ఆమె గొంతులో ఆర్ద్రతని నింపుతుంటే చూస్తున్నాడు.