Previous Page Next Page 
నల్లతంబి పేజి 15

"అంత దూరంనుంచి భోజనం వేళకు వచ్చి ఆతిధ్యం స్వీకరించకుండా వెళ్ళిపోతానంటే ఎలా? రండి వెళ్దాం" అని సమాధానంకోసం ఎదురుచూడకుండా లోనికి నడిచాడు రాజశేఖర్.
మౌనంగా అతనిని అనుసరించారు ధీరజ్, మురుగన్.
ముగ్గురూ డైనింగు టేబుల్ దగ్గర కూర్చున్నారు.
"అమ్మగారిని కూడా పిలువు భోజనానికి."
వంటమనిషి పైకి వెళ్ళిన కొద్దిసేపటికి క్రిందకు దిగివచ్చింది చందన. అపరిచితుని చూసి ఆగిపోయిందామె.
"ఫర్వాలేదు. రా, చందనా!"
చందన మౌనంగా వచ్చి అతని ప్రక్కన కూర్చున్నది.
తన భార్యను ధీరజ్ కు పరిచయం చేశాడు రాజశేఖర్.
ఇద్దరూ చూడముచ్చటగా వున్నారు. చక్కనైన జంట అనుకున్నాడు ధీరజ్.
భోజనాలైనాక అతనిని తన పర్సనల్ రూమ్ కు తీసుకువెళ్ళాడు రాజశేఖర్.
"అన్నా! నేనిక సెలవు తీవుకుంటాను" అన్నాడు మురుగన్.
రాజశేఖర్ సరేనన్నట్టు తల వూపాడు.
"మిస్టర్ మురుగన్....వెయిట్ ఎ మినిట్" ఇన్ స్పెక్టర్ ధీరజ్ కంఠం ఖంగుమంది.
వెళ్ళబోయేవాడు కాస్తా ఆగాడు.
రాజశేఖర్ భ్రుకుటి ముడివడింది.
"బైదిబై....మురుగన్ గురించిన వివరాలు నేను తెలుసుకోవచ్చా?" ప్రశ్నవేసి జవాబుకోసం క్షణం ఆగాడు ధీరజ్.
"ఎస్, వై నాట్! మురుగన్ నాకు లీగల్ ఎడ్వయిజర్. అంతే కాదు. నాకు అత్యంత ఆప్తులలో ఒకడు..." అతనిమీద తనకు వున్న విశ్వాసాన్ని ప్రకటించాడు రాజశేఖర్.
"అఫ్ కోర్స్....మీ నమ్మకాన్ని నేను కాదనడంలేదు. మీకు ఇబ్బంది లేకపోతే కొన్ని నిమిషాలు నేను మురుగన్ తో ఒంటరిగా మాట్లాడదామనుకొంటున్నాను."
"ఆల్ రైట్!" ఏమనుకున్నాడో ఏమో రాజశేఖర్ ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళాడు.
ఇప్పుడక్కడ మురుగన్, ఇన్ స్పెక్టర్ ధీరజ్ మాత్రమే మిగిలి వున్నారు. మురుగన్ ను కూర్చోమన్నట్టు కుర్చీ చూపాడు ఇన్ స్పెక్టర్ ధీరజ్.
అతని ప్రశ్నలకు తడుముకోకుండా ఎలా సమాధానం చెప్పాలో లోలోపల రిహార్సల్స్ వేసుకుంటున్నాడు మురుగన్.
కింది హాల్లో వున్న రాజశేఖర్ మనస్సు ఎన్నడూ లేనంత చికాకుగా వుంది. తన సహాయం కోరి అంతదూరం నుంచి వచ్చాడుకదా అని ఇన్ స్పెక్టర్ ధీరజ్ కు ఆవకాశం ఇచ్చినందుకు గాను తన దగ్గర పని చేసే వాళ్ళనే అనుమానించి లేనిపోని అశాంతికి గురిచేస్తున్నాడు.
అసలు ఏమిటతని ఉద్దేశ్యం? 'కమెండో' ఎవరో తనకు తెలుసుననా! తెలిసీ చెప్పడంలేదనా? లేక అతనికి ఆశ్రయం కల్పించి వుంటానేమోననే అనుమానమా?
తాను ఎప్పుడూ సంఘంలో పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడలేదు. తనకు వున్న ఆస్తితో నేరస్తులను సన్మార్గులుగా చేయడంతో ప్రభుత్వాలు. ప్రజలు తనకు బ్రహ్మరధం పడుతున్నారే కాని, ఏనాడూ, ఏ రాజకీయ నాయకునికీ అడుగులకు మడుగులొత్తలేదు.
తను ఒకరికి భయపడవలసిన అవసరం కానీ, బెదిరిపోవలసిన ఆగత్యం కానీ లేదు. తన విషయం పూర్తిగా తెలియక ఇన్ స్పెక్టర్ కుప్పిగంతులు వేస్తున్నాడు.
"మిస్టర్ రాజశేఖర్...!" గదిలో నుంచి బయటకు వస్తూనే పరధ్యానంగా వున్న అతనిని పిలిచాడు ఇన్ స్పెక్టర్ ధీరజ్.
రాజశేఖర్ ఏమిటన్నట్టు అతనివైపు చూశాడు.
"ఎనీహౌ....మిమ్మల్ని అభినందించకుండా వుండలేకపోతున్నాను. రియల్లీ యూ ఆర్ గ్రేట్? నేరస్తులను శిక్షించడమే మాకు తెలుసు. కానీ, నేరస్తుల సైకాలజీ ఎలా వుంటుందో, ఏ విధంగా నేరం చేసివుంటారో వూహించడం మీకు తెలిసినట్టుగా మాకు తెలియదని మిమ్మల్ని చూశాక నేను ఒప్పుకొంటున్న సత్యం."
"అంతేకాదు నేరస్థులుగా తయారుచేసేది కూడా మీరే."
బుల్లెట్ లా వచ్చాయి రాజశేఖర్ నోటివెంట ఆ మాటలు.
"అదేమిటి?" నివ్వెరపోయాడు ధీరజ్.
"ఎవరయినా ఐదేళ్ళ పిల్లవాడు నేరం చేస్తూ పట్టుబడ్డాడనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు?" ధీరజ్వైపు చూస్తూ ప్రశ్నించాడు రాజశేఖర్.
"చేయడానికేముంటుంది? ఇంకెప్పుడూ చేయవద్దని మందలిస్తాం."
"అదే మీరు చేసే పొరపాటు! కానీ, అతను ఆ నేరం చేశాడో లేదో వివరంగా అడగరు. చేశాడనే అభిప్రాయానికొచ్చి మీరు ప్రశ్నించడం వల్ల, మీరంటే ఉందే భయంవల్లగానీ ఇంకేదైనా కారణంవల్లనైనా అతడు మీకు సమాధానం సరిగా చెప్పకపోవచ్చు. తప్పు చేశాడు కాబట్టే అతనలా తడబడిపోతున్నాడనే భావం మీలో బలపడిపోయి, ఇంకెప్పుడూ చేయకు అనే ధోరణిలో మందలిస్తారే తప్ప అతను చేయలేదేమోననే భావం మీలో అసలు కన్పించదు.
"అలాంటప్పుడు ఆ లేత వయసులోనే తాను చేయని నేరాన్ని చేసినట్టు చిత్రించడంచూసి నిజంగానే అలాంటి మనస్తత్వాన్ని బానిసై పోతాడు. అప్పుడేమౌతుంది. అమాయకుడైన ఓ వ్యక్తి చిన్నతనంలోనే నేర జీవితానికి అంకురార్పణ జరిగిపోతుంది. తరువాత అతనే రేపటి సమాజంలో దొంగగా మారిపోయినా ఆశ్చర్యపడనవసరంలేదు. అలా జరగడానికి కారణం ఎవరు? మీరు కాదూ? మీలాంటి ఆఫీసర్లే డ్యూటీ మీద వుండే సిన్సియారిటీ వంకతో అలాంటి పసి జీవితాలు దారి మళ్లిపోవడానికి కారణవుతున్నారు. ఉదాహరణకు మురుగన్ జీవితం కూడా అలానే మొదలయ్యింది. చేయని నేరానికి శిక్ష అనుభవించాడు కూడా. అఫ్ కోర్స్ నేను చేరదీయడంతో ఆ తరువాత నేరాలు చేయలేదనుకోండి."
అతని మాటలు విన్న ఇన్ స్పెక్టర్ ధీరజ్ ముఖం మ్లానమయింది. ఆ మాటలు ఎక్కడో తగిలాయతనికి.
ఎన్నో సంవత్సరాల క్రితం మరుగునపడిపోయిన సంఘటనలను తట్టి లేపాయి.
"ఏమిటి ఇన్ స్పెక్టర్ ఎక్కడో ఆలోచిస్తున్నట్టున్నారు!"
"ఏమీ లేదు....మీరన్న మాటల్లో నిజం ఎంతవుందో ఆలోచిస్తున్నాను."
భావగర్భితంగా చెప్పి సర్దుకున్నాడు ఇన్ స్పెక్టర్ ధీరజ్.
"పిల్లలు పెద్దయిన తరువాత కోపిష్టులుగా, పోట్లాటలకు తయారయ్యేవారుగా, రౌడీలుగా మారే చిహ్నాలను వారి పసితనపు చేష్టలనుబట్టే గ్రహించవచ్చు. బాల్యదశలోనే దూకుడుగా ఎగ్రెసివ్ గా తిరుగుబాటు ధోరణిని ప్రదర్శించేవారు మాత్రం పెద్దయిన తరువాత పశ్నార్ధకంగా మిగిలేపోగలరు. చిన్నప్పుడు ప్రతి చిన్న విషయానికీ ఉద్రేకం చెందుతూనో లేక ఏదో పోగొట్టుకున్నట్టు ఎప్పుడూ దిగులుగానో ఉండే పిల్లలు కాలక్రమేణా మార్పుచెంది సౌమ్యులుగా మారే అవకాశాలు వున్నాయి. కానీ....చిన్నప్పటినుంచీ తిరుగుబాటు ధోరణిని ప్రదర్శించేవారు మాత్రం పెద్దయిన తరువాత సమస్యలను సృస్టించకమానరు.
"పిల్లలు దూకుడుగా నేరస్వభావాన్ని ప్రదర్శించినట్టయితే, అలా వారెందుకు చేస్తున్నారో, ఆ కారణాలను తెలుసుకునేందుకు తల్లిదండ్రుల ప్రయత్నించాలి. నేర ధోరణిని మొగ్గలోనే త్రుంచివేయగలిగితే వారికి ఉపశమనం కలుగుతుంది. అదెందువల్ల వారికి కలిగిందో మనం గ్రహించడంమీదనే వారిలో మార్పు రావడమనేది ఆధారపడి వుంటుంది. వీలైనంత వరకూ సౌమ్యంగా పిల్లల మనసు గాయపడకుండా మన మాట వినేట్టు చేసుకోవాలి."

 Previous Page Next Page