ప్రశ్నార్ధకంగా నావైపు చూస్తూ నన్ను కూర్చోవలసిందిగా సంజ్ఞ చేశారు. కూర్చున్నాను. మెల్లిగా సంభాషణ ప్రారంభించాను. 'డాక్టరు గారూ....! మీ ఋణం ఎన్ని జన్మల కైనా తీర్చుకోలేను.. మీ ఔదర్యానికి హద్దులు లేవు. ఎవరినో అనామకుణ్ణి అయిన నన్ను రోడ్డు పై స్పృహ తప్పి పడి ఉన్న సమయంలో , దయతో మీరు మీ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. శ్రద్దగా మందులిస్తూ నాకు పూర్తీ ఆరోగ్యాన్ని ప్రసాదించారు.... నేను జీవితంలో ఏకాకిని. నన్ను రేపు వెళ్ళిపోవలసిందిగా ఆదేశించారుట!'
'అవును....ఇక నీవు యింటికి వెళ్ళవచ్చు. పూర్తిగా ఆరోగ్య వంతుడవయ్యావు. రెండు నెలల తర్వాత ఒక్కసారి వచ్చి చూపించుకొని వెళ్ళు.'
'మీరు నాకు తండ్రితో సమానులు. మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని వచ్చాను. దయచేసి వినవలసిందిగాచేతులు జోడించి ప్రార్ధిస్తూ ఉన్నాను. వంటరిగా ఆ విషయాలు మీతో మనవి చేసుకోవాలని ఉంది.'
'అలాగా...! నా రూముకు వెడదాం పద!
డాక్టరు గారిని అనుసరించాను. వారి గదిలో క్రింద కూర్చో బోయాను...నన్ను వారిస్తూ తమకు ఎదురుగా ఉన్న కుర్చీ చూపించారు. ఆ కుర్చీలో కూర్చొని వారి ముఖంలోకి చూసే ధైర్యం లేక నేల చూపులు చూస్తూ ఎలా ప్రారంభించాలో తెలియక తికమక పడసాగాను ---
'అధైర్య పడకు....చెప్పతలచుకున్న దేదో భయపడకుండా చెప్పు.'
'చెబుతాను నా హృదయ భారం తగ్గించుకుంటాను....' అని ప్రారంభించాను.
* * * *
మా గ్రామం యిక్కడికి పదిహేను మైళ్ళు ఉంటుంది. అవి నన్ను క్రొత్తగా బడిలో వేసిన రోజులు. మా అన్నయ్య అంతకు ముందే బడికి వెడుతున్నాడు. నేను అన్నయ్యతో కలిసి బడికి వెడుతూ ఉండే వాడిని. అన్నయ్య నన్ను ఎంతో ప్రేమతో చూసేవాడు. నన్ను ఒక్క క్షణం కూడా వదిలి పెట్టి ఉండేవాడు కాదు. ఆవిధంగా రెండు సంవత్సరాలు గడిచాయి. అన్నయ్య నా కన్న ఐదారు సంవత్సరాలు పెద్ద. అమ్మ మాత్రం అన్నయ్యను ఎప్పుడూ ద్వేషిస్తూ ఉండేది. అమ్మ ఎంత ద్వేషిస్తూ ఉన్నా అన్నయ్య మాత్రం నన్ను అమ్మను ఎంతో ప్రేమతో చూసేవాడు. అన్నయ్య ను అమ్మ ఎందుకు ద్వేషంతో చూసేదో ఆ తర్వాత తెలిసింది నాకు; అన్నయ్య అమ్మకు సవితి కొడుకని. నేను అన్నయ్య కలిసి తిరగడం , ఒకే కంచం లో తినడం, ఒక దగ్గరే పడుకోవడం, ఒకే దగ్గర కూర్చుని చదువుకోవడం. యివన్నీ సహించేది కాదు. మెల్లిగా మా యిద్దరి మధ్య ఏవేవో కలహాలు రేపుతూ విడతీయడానికి ప్రయత్నించేది. కాని ఆమె ప్రయత్నం చాలాకాలం వరకు కొనసాగలేదు. మమ్మల్ని విడతీసేందుకు చేసిన అమ్మ ప్రయత్నం చివరకు ఫలించింది. అన్నయ్య మంచివాడు కాదని, అన్నీ దొంగబుద్దులున్నాయనీ వాడి స్నేహం చేస్తే నీవు కూడా చెడి పోతావని ఊరికె నా చెవిలో ఊదర పెడుతూ ఉండేది. పిన్న వయసులో ఉన్న నేను చెబుతున్నది అమ్మ కదా అనే భావంతో నమ్మాను. ఆవిధంగా మా యిద్దరినీ ఎంతో ప్రయత్నం మీద విడదీయ గలిగింది.
ఆనాడు పిన్న వయసులో ఏర్పడిన ఆ భేద భావం నాతొ పాటే పెరిగి పెద్దదై వ్రేళ్లు నాటుకొని అన్నయ్య ను గాని, అతని స్నేహితులను గాని వోర్వ లేని పరిస్థితి కి తీసుకు వచ్చింది. అమ్మ, నేను యిద్దరమూ కలిసి అన్నయ్య కు యింట్లో మనశ్శాంతి లేకుండా చేసేవాళ్ళం. రాను,రాను అన్నయ్య ఉనికే మాకు ఎంతో కష్టాన్ని కలిగించ నారంభించింది. ఆ విధంగా రోజులు గడిచి పోసాగాయి. అన్నయ్య మల్టీ పర్సస్ హైస్కూల్లో 12 వతరగతి పరీక్ష వ్రాశాడు. మా ఊరిలో హైస్కూలు లేక అక్కడికి దగ్గరలో ఉన్న చిన్న బస్తీకి రోజూ వెళ్ళి వస్తూ ఉండేవాడు. నేను మాత్రం ఊరిలో ఉన్న బడికే వెడుతూ ఉండేవాడిని. నేను అన్నయ్య లాగా చదువులో చురుకుగా ఉండే వాణ్ణి కాదు. అందరూ అన్నయ్య ని మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. నాన్నగారు కూడా ...! అమ్మ, నేను అన్నయ్య ను ఎంతగా ద్వేషించే వాళ్ళమో అంతగా నాన్నగారు అన్నయ్య ను తల్లి లేని పిల్లవాడని ప్రేమిస్తూ ఉండేవారు. నాన్నగారు అంతగా అన్నయ్య ను ప్రేమతో ఆదరిస్తూ ఉండడం మాకు ఎంతో ఈర్ష్య ను కలిగించేది. అందుకు అమ్మ ఏవేవో కుయుక్తులు పన్ని నాన్నగారు కూడా అన్నయ్యను ద్వేషించే విధంగా చేయగలిగింది. నాచేత చిన్నచిన్ని దొంగతనాలు చేయించుతూ , ఆ దొంగతనాలను అన్నయ్య కు అంటగడుతూ అన్నయ్య కు నాన్నగారితో తిట్లు దెబ్బలు తినిపిస్తూ ఉండేది. అసలు విషయం చెప్పి యింట్లో కలతలు రేపడం యిష్టం లేక అన్నయ్యా ఆ తిట్లను దెబ్బ లను సహనంతో సహిస్తూ ఉండేవాడు. అన్నయ్య మంచితనాన్ని గుర్తించ లేని అమ్మ అతనిని చాతకాని వాడి క్రింద జమ కట్టి మరింత రెచ్చిపోతూ ఎలాగైనా అన్నయ్య పీడ విరగడ చేసుకోవాలనే ఉద్దేశంతో సమయం కోసం ఎదురు చూడసాగింది. ఒకరోజు నాన్నగారు బీరువా లో వంద రూపాయల నోటొకటి ఉంచి పని మీద ఏదో ఊరు వెళ్లారు. అమ్మ అవిషయం పసికట్టి ఆ నోటు తీసి దాచేసింది. అన్నయ్య వాళ్ళ స్నేహితులు హైదరాబాదు ఎక్స్ కర్షన్ గా వెడుతున్నారని తెలిసి, లేని ప్రేమ నటిస్తూ పది రూపాయలు యిచ్చి పంపింది. శత్రువులను కూడా స్నేహ భావంతో చూసే అన్నయ్య అమ్మ మోసాన్ని గ్రహించలేక పోయాడు. ఆ క్షణం లో నాకు కూడా అమ్మ దురాలోచనకు ఆశ్చర్యం కలిగింది. అన్నయ్య హైదరాబాదు వెళ్లిన మరునాడు నాన్నగారు ఊరి నుండి వచ్చారు డబ్బు పోయిన విషయం గుర్తించారు. ఇల్లు ఎగిరి పోయేట్లు కేకలు వేశారు? ఆ కోపంలో ....వళ్లు తెలియని ఆవేశం లో ....నన్ను పిలిచి రెండు దెబ్బలు వేశారు. అమ్మను తిట్టడం ప్రారంభించారు. అమ్మేనా తక్కువ....? రెచ్చిపోయింది. ఇద్దరూ బాగా ఘర్షణ పడ్డారు. ఆ కోపంలో బయటికి వెళ్ళిపోయారు నాన్నగారు. నాన్నగారు వెళ్ళిపోయినా తర్వాత అమ్మ తన ఎత్తుగడ ప్రకారం మా కుటుంబానికి పరిచితమైన వ్యక్తితో అన్నయ్య ఆ వ్యక్తికీ హైదరాబాదు లో కనుపించినట్లు, చూసి కూడా చూడనట్లు, గుర్తించనట్లు నటించి నట్లు, జల్సాగా ఖర్చు చేస్తున్నాడనీ ...యితర దుర్వసనాలకు కూడా లోనయ్యాడని చెప్పించింది; నడి వీధిలో నలుగురి ముందు ఈ విషయం విన్న నాన్నగారు నిజానిజాలు తెలుసుకోవాలనే ఆలోచన లేకుండా తోక త్రొక్కిన త్రాచులా విజ్రుంభించారు బుసలు కొడుతూ. ఇంటికి వచ్చి అమ్మను కేకలేశారు. ఎందుకు వెళ్ళనిచ్చావని? నాకు అసలు ఆ సంగతే తెలియదని అమ్మ తప్పుకుంది. నాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది అయినా మనసులోనే ఆ విషయాన్ని దిగామ్రింగాను. నా క్షేమం కోరి ఆస్తినంతా నాకు కట్టబెట్టాలనే ఉద్దేశ్యంతో అమ్మ యిటువంటి కాని పనులు చేస్తున్నదని చూచాయగా గ్రహించాను. నన్ను కూడా పిలిచారు. అన్నయ్య సంగతి నీకు తెలుసా?' అని నిప్పులు చేరుగుతూన్న కళ్ళతో ప్రశ్నించారు. భయం వల్ల వణికి పోయాను. నాకు ఏం చెప్పాలో తోచలేదు. నాన్నగారి వెనక నిలబడి అమ్మ సైగ చేసింది. అమ్మ ఆసరాతో నాకేమీ తెలియదని చెప్పాను. అమ్మ కూడా నన్ను సమర్ధించింది. పసివాడు. వాడికేం తెలుసనీ?' వీధిలో విన్న మాటలను బట్టి నాన్నగారు విషయాన్నీ అర్ధం చేసుకున్నారు. అన్నయ్యే ఆ వందరూపాయలు దొంగిలించి హైదరాబాదు వెళ్ళాడని ఊహించారు . వచ్చాక భరతం పడతానంటూ అన్నయ్య మీద మండి పడ్డారు. అమ్మ సంతోష పడింది. ఆమె సంతోషం నాకూ సంతోషాన్ని కలిగించింది. ఎక్స్ కర్షను పూర్తవగానే అన్నయ్య సంతోషంతో యింటికి తిరిగి వచ్చాడు. అమ్మ యిచ్చిన పదిరూపాయలలోనే నాకు ఒక మంచి పెన్ను, అమ్మకు పూలు తీసుకు వచ్చాడు. నేను ఆ పెన్ను చూసి సంతోషంతో గంతులు వేశాను. ఆ క్షణం లో నాకు అన్నయ్య మీద ఎంతో జాలి, ప్రేమ కలిగాయి. అమ్మ కూడా తనకు పూలు తెచ్చినందుకు కృత్రిమ సంతోషాన్ని ప్రకటించింది. అంతలో నాన్నగారు వచ్చారు.... అన్నయ్యను చూశారు.... అగ్గి బుగై పోయారు, 'ఒరేయ్ ...ఇలారా...' అంటూ తన గదిలోపలికి తీసుకు వెళ్ళారు; చిలక్కొయ్యకు ఉన్న చండ్ర కొలను తీసుకొన్నారు. జరగబోయే విషయం ఊహించాను నాన్నగారు కొట్టబోతున్నది నన్నే అన్నట్టుగా భయపడ్డాను. అనుకున్నదాని కన్న ఎక్కువే జరిగింది. అన్నయ్య ను చావ చితకకొట్టి 'ఇక జన్మ లో నాకు నీ ముఖం చూపించకు ' అంటూ యింటి నుండి వెళ్ళగొట్టారు. అన్నయ్య మామూలుగానే మౌనం వహించాడు. అన్నయ్య మౌనం నాన్నగారి ఆగ్రహాన్ని మరీ రెచ్చగొట్టింది అనుమానాన్ని పెంచింది. ఆ పరిస్థితిలో నాన్నగారు తను ఏది చెప్పినా వినిపించు కోడనే ఉద్దేశంతో బిక్క ముఖం వేసుకొని బయటికి వెళ్ళిపోయాడు. నాన్నగారు అమ్మతో, నాతొ అన్నయ్య ను యింటికి రానివ్వదని ఖచ్చితంగా చెప్పారు. మేమిద్దరమూ తలలూపాము. అమ్మ ఎంతగానో ఆనంద పడింది. అన్నయ్య ఆరాత్రి పెద్ద పాలేరు రామయ్య ఇంట్లో గడిపినట్లు ఆ తర్వాత తెలిసింది. మరునాడు రామయ్య నాన్నగారితో చాలాసేపు మాట్లాడాడు. రామయ్య ఎంత బతిమాలినా అన్నయ్య ను యింటికి తీసుకు రావడానికి ఒప్పుకోలేదు నాన్నగారు. 'రత్నం లాంటి కొడుకుని చేజేతులా దూరం చేసుకుంటున్నావు అందుకు అనుభవిస్తావు లే!' అని నిష్టూర పడుతూ వెళ్ళిపోయాడు రామయ్య. నాన్నగారు స్వతహాగా మంచివారే! కాని అమ్మ దీక్షతో చేసిన ప్రయత్నం వల్ల అన్నయ్య పై ఎక్కడ లేని ద్వేషాన్ని పెంచుకున్నారు. నాన్నగారిది అదోరకమైన మనస్తత్వం....! ఏ విషయాన్ని అంతగా పట్టించుకోరు. మనసుకు పట్టిందంటే వెనక, ముందు ఆలోచించకుండా ప్రవర్తిస్తారు. అమ్మ మొదటి నుండి తీసుకున్న జాగ్రత్తల వల్ల ప్లాను ఆమె అంచనాల ప్రాకారం విజయ వంతమైంది. అన్నయ్య నాన్న కొట్టిన దెబ్బలకు వారం రోజులు జ్వరాన పడ్డాడు. అన్నయ్య యిక యింటి చాయలకు కూడా తాలేదు. ఎమాలోచించుకున్నాడో ఏమో....? పరీక్ష డిస్టింక్షన్ లో ప్యాసయ్యాడు. పరీక్ష ఫలితాలు తెలిసిన తర్వాత వారం రోజులలో హైదారాబాదు వెళ్ళినట్లు తెలిసింది. ఆ సంగతి అమ్మకు ఎంతో హాయిని కలిగించింది. నేను మాత్రం మనసులో దిగులు పడ్డాను. కాని అమ్మ కోప్పడుతుందనే భయంతో సంతోషాన్ని నటించాను. అరుమసాలలో అమ్మ , నేను అన్నయ్య ను పూర్తిగా మరిచిపోయాం. నాన్నగారు మాత్రం అప్పుడప్పుడు ఏవో ఆలోచనలతో బాధపడుతూ ఉండేవారు. ఆ విషయాన్ని గమనించినప్పుడల్లా అమ్మ నాన్నగారి మనస్సును ఉల్లాస పరిచే ప్రయత్నం చేస్తూ ఉండేది. అమ్మ ఎంతగా ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ నాన్నగారి విచారం మాత్రం ఎక్కడో కొద్దిగా వారి చర్యల వల్ల తెలుస్తూ ఉండేది. మరొక అరుమసాలు గడిచిపోయాయి. అన్నయ్య సంగతి మా కుటుంబం లోనే గాక మా గ్రామ వాసులందరూ మరిచి పోయారు.
నాకు మాత్రం రోజులు ఎంతో ఉల్లాసంగా నడవానారంభించాయి. ఒక్కడినే కావడం వల్ల అమ్మ, నాన్ననన్ను గారభం చేశారు. ఆ గారాబం ఫలితమే యిప్పటి నా ఈ పరిస్థితి అన్నయ్య ఉన్నంత కాలం నన్ను ఎటువంటి చెడు పనిని చెయ్యనివ్వలేదు. వద్దని వారించే వాడు, మెల్లిగా నచ్చ జెప్పేవాడు...అలిగితే బుజ్జగించే వాడు. అన్నయ్య లేడు నన్నడ్డు కోనేవారూ ఎవ్వరూ లేకపోయారు. ఆ పిన్న వయస్సులో కాలు జారాను. ఆవిధంగా కాలు జారిన నేను యిప్పటికి నిద్రోక్కు కోలేక పోతున్నాను.